వయసు 29... అవార్డులు 127

2012లో మలక్‌పేట్‌లోని ఓ అంధుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ మూడు కంప్యూటర్లున్నాయి. వాటిని పక్కనపడేశారు. ఎందుకని అడిగితే.. కరెంటులేదు, మదర్‌బోర్డు పోయిందని అక్కడి ప్రిన్సిపల్‌ చెప్పారు. దీంతో వెంటనే ‘బ్లైండ్‌ స్కూల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను ఫోన్‌తో తీశా. సోషల్‌మీడియాలో షేర్‌ చేశా. మంచి స్పందన వచ్చింది. మూడునెలల్లో దాతలు ఆ స్కూల్‌కి పన్నెండు కంప్యూటర్లు ఇచ్చారు. దీంతో వీడియో రూపంలో చెబితే ప్రభావం ఉంటుందనుకున్నా. ఆ తర్వాత అనాథ శరణాలయానికి వెళ్లి ఓ వీడియో తీస్తే..

Updated : 22 Jun 2019 01:13 IST

లఘుచిత్రమే.. గురుతర బాధ్యత

వయసు 29..
ఏడేళ్లలో తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ సంఖ్య 85
అందుకున్న నేషనల్‌, ఇంటర్నేషనల్‌ అవార్డులు 127
ఇదంతా ఎవరి గురించీ అంటారా? దర్శకుడు అన్షుల్‌ సిన్హా ప్రస్థానమిది. తీసిన లఘుచిత్రాలన్నీ సమాజ హితం కోరేవే కావడం... ఈ యువకుడిలోని సామాజిక బాధ్యతకు నిదర్శనం. ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద బాధ్యత ఎందుకు ఎత్తుకున్నారని అడిగితే...  ‘ఈతరం’తో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు.

అన్షుల్‌ సిన్హా తెరకెక్కించిన ‘వాటర్‌మెన్‌’ చిత్రం నిడివి ఒక్క నిమిషమే. ఇందులో నీటిని కాపాడుకోవాలనే చక్కని మెసేజ్‌ ఉంది. జలం ఎలా వృథా చేస్తున్నామో కళ్లకు కట్టినట్లు చూపుతుందీ చిత్రం. ఒక మనిషి కుళాయిని నోట్లో పెట్టుకొని ఇంటికి వచ్చి నీళ్లు అందిస్తుంటాడు. ఎంతో దూరం నుంచి నీళ్లు మన ఇంటికి చేరుతున్న విషయాన్ని చెప్పడానికి అతను ఎక్కడో నదీ తీరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంట్లో పాత్రలు కడిగేటప్పుడు.. షేవింగ్‌ చేసుకొనేటప్పుడు నీటిని వదిలేసి... మనుషుల చేస్తున్న వృథాను కళ్లకు కడతాడు. ఆ తర్వాత రోజు వాటర్‌మెన్‌ ఇంటికి రాడు. దీంతో వాళ్లు ఇబ్బంది పడతారు. దీన్ని క్లుప్తంగా చూపించడంలో సిన్హా విజయం సాధించాడు. అమెరికాలో నిర్వహించిన పోటీలో పబ్లిక్‌ సర్వీస్‌ అనౌన్స్‌మెంట్‌ కేటగిరీలో వాటర్‌మాన్‌కి రెండో బహుమతి వచ్చింది. ఈ లఘుచిత్రానికి మొత్తం 8 ఇంటర్నేషనల్‌ ఆవార్డులు వచ్చాయి.

గతేడాది మిట్టి.. బ్యాక్‌ టు రూట్స్‌ అనే రెండుగంటల సినిమా హిందీలో రూపొందించాడు. రైతుల ఆత్మహత్యలకు కారణాలేంటి? అనే విషయాలను ప్రాతలతో చెప్పించాడు. టెడెక్స్‌ హైదరాబాద్‌వాళ్లు సినిమా మేకింగ్‌కు సపోర్టు ఇచ్చారు. ఇది క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ. వ్యవసాయ శాస్త్రవేత్త జి.వి.రామాంజనేయులు ఈ సినిమాకు మార్గదర్శకుడు. అమెరికా, జర్మనీ, గ్రీసులతో పాటు తెలంగాణ, పంజాబ్‌, మహారాష్ట్రతో కలిపి 110 చోట్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. శేఖర్‌కమ్ముల లాంటి దర్శకులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. దీనికి వచ్చిన సొమ్మును ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పంచారు.

2012లో మలక్‌పేట్‌లోని ఓ అంధుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ మూడు కంప్యూటర్లున్నాయి. వాటిని పక్కనపడేశారు. ఎందుకని అడిగితే.. కరెంటులేదు, మదర్‌బోర్డు పోయిందని అక్కడి ప్రిన్సిపల్‌ చెప్పారు. దీంతో వెంటనే ‘బ్లైండ్‌ స్కూల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను ఫోన్‌తో తీశా. సోషల్‌మీడియాలో షేర్‌ చేశా. మంచి స్పందన వచ్చింది. మూడునెలల్లో దాతలు ఆ స్కూల్‌కి పన్నెండు కంప్యూటర్లు ఇచ్చారు. దీంతో వీడియో రూపంలో చెబితే ప్రభావం ఉంటుందనుకున్నా. ఆ తర్వాత అనాథ శరణాలయానికి వెళ్లి ఓ వీడియో తీస్తే.. అక్కడ తప్పిపోయిన పిల్లవాడు వాళ్ల తల్లిదండ్రులకు దొరికాడు. అనాథపిల్లలపై చిత్రం చేస్తే వాళ్ల బాగోగులు చూడటానికి దాతలు వచ్చారు. వీడియోలను మంచి దారిలో ఉపయోగించి అద్భుతాలు సృష్టించొచ్చు అనిపించింది. అప్పటి నుంచి అదే బాటలో సాగుతున్నా.

నా చిత్రాలన్నీ రోడ్‌షోలే
మొదటిసారిగా ‘మై చాకొలేట్‌ కవర్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌కి 21 అవార్డులొచ్చాయి. పనిచేస్తోంటే టెక్నికల్‌గా కాస్త మెరుగయ్యా. మత సామరస్యంపై ‘లపెట్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను 2013లో తీస్తే దానికి కాలిఫోర్నియోలో ఇంటర్నేషనల్‌ అవార్డు వచ్చింది. మెయిల్‌ వస్తే.. అది అబద్ధమేమోనని ఐదురోజులు పట్టించుకోలేదు. తర్వాత వాళ్లు ఫోన్‌ చేశారు. డబ్బు పంపారు. అవార్డును కొరియర్‌ చేశారు(నవ్వులు). నాకు ఇలా వచ్చిన అవార్డు డబ్బులను తదుపరి సినిమాకే ఉపయోగిస్తాను. అనాథ శవాలకు అంతిమ దహనం చేసిన సామాజిక కార్యకర్త, సత్యహరిచ్చంద్ర ఫౌండేషన్‌ స్థాపకుడు రాజేశ్వరరావు జీవితంపై ‘ద గేట్‌ వే టు హెవన్‌’ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించా. ఈ చిత్రానికి 11 ఇంటర్నేషనల్‌ నామినేషన్లు వచ్చాయి. 65 దేశాలు పాల్గొన్న యూకే ఫెస్టివల్‌లో మూడో బహుమతి సాధించింది. 50 అవార్డులు వచ్చాక అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌మీడియా నన్ను పిలిచి ఉచితంగా శిక్షణ ఇచ్చింది. కుంటలు కాపాడాలి, ఫ్యాక్టరీల వ్యర్థాలు, బయోమెడికల్‌ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, మహిళా సాధికారత, మతతత్వంపై లఘుచిత్రాలు రూపొందించా. వాటర్‌మ్యాన్‌, మిట్టి.. బ్యాక్‌ టు రూట్స్‌ దాకా అన్నీ సామాజిక చిత్రాలే చేశా. ఇప్పటివరకూ వీటిని రిలీజ్‌ చేయలేదు. రోడ్‌షోల్లో ప్రదర్శించి, అవార్డులకు పంపా.

భారత క్రికెట్‌ జట్టులో ఆడాలనుకున్నా...
ముంబైలో పుట్టిపెరిగాను. పదిహేనేళ్ల తర్వాత మానాన్న హైదరాబాద్‌కి రావటంతో మేం ఇక్కడి వచ్చేశాం. క్రికెట్‌లో బాగా ఆడి రాష్ట్రస్థాయి క్రికెట్‌ ఆటగాడినయ్యా. క్రికెట్‌ ఆడటానికి వెళ్లినపుడు ఓ సంఘటన జరిగింది. నా స్నేహితుడిని కొడుతుంటే అతన్ని ఆపటానికి వెళ్లా. అక్కడ పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండే కుర్రోడు.. నువ్వెందుకొచ్చావని అడిగాడు. స్నేహితుడ్ని అని చెప్పా. రాజకీయబలంతో నన్ను స్టేషన్‌లో రెండు రోజులు ఉంచారు. పోలీసులు కొడితే ఎనిమిది రోజులు బెడ్‌మీద ఉన్నా. ముంబై లీగ్‌ క్రికెట్‌ కార్డును క్యాన్సిల్‌ చేశారు. నా కల క్రికెట్‌ ప్లేయర్‌ కావటం.. అదీ దేశానికి ఆడటం. అది దూరం కావటంతో ఆర్నెళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లా. మానాన్న నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఆయన బ్యాంక్‌ ఉద్యోగంతో పాటు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేసేవారు. రాత్రిపూట నొప్పులకు తట్టుకోలేకుంటే మానాన్న నాకు కాళ్లు పట్టేవారు. స్ఫూర్తివంతమైన కథలు చెబుతూ.. నాలో చైతన్యం నింపేవారు. ఇలా ఉంటే కుదరదని హైదరాబాద్‌లో ఉండే అమ్మ(అధ్యాపకురాలు), అన్నయ్య దగ్గరికి పంపించి.. ఎంబీఏలో చేరమన్నారు. అలా ఎంబీఏ చేశా. ఆ తర్వాత షార్ట్‌ఫిల్మ్‌ దర్శకుడిగా యూటర్న్‌ తీసుకున్నా. ‘మెక్‌గఫిన్‌ ఫ్రేమ్స్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించా. మేం సామాజిక చిత్రాలే చేస్తాం. దేశం తరఫున క్రికెట్‌ ఆడి జెర్సీ వేసుకోవాలనే ఆశ.. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఇండియా తరఫున అవార్డు అందుకోవటంతో అది తీరుతోంది.

చంపేస్తామన్నారు
‘‘అవయవాలను అమ్ముకునే మాఫియాపై ‘ద గేట్‌ వే ఆఫ్‌ హెవెన్‌’ లో చూపించాను. మాఫియా నుంచి ఫోన్లు వచ్చాయి. చంపేస్తామన్నారు. మూడుకోట్లు ఇస్తాం.. సినిమా మాకు ఇచ్చేయమన్నారు. నేను భయపడలేదు. మీడియాలో నా ఫొటోలు రావటంతో వాళ్లు తగ్గారు. ఈ సమయంలో అమ్మా, నాన్న ఎంతో ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. సామాజిక కార్యకర్త రాజేశ్వరరావును నా లఘుచిత్రంతో తెలంగాణ రాష్ట్రం గుర్తించింది. ఇటీవల తీసిన మిట్టి.. సినిమా చూసి రైతులెంతో ఆనందపడ్డారు. ఇలాంటివే నన్ను నడిపిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని