ప్రపంచమా..ఉలికిపడు!

163 దేశాలు... నలభైలక్షలమంది యువత...గల్లీలు, కూడళ్లని యువరక్తంతో ఉరకలెత్తించారు.  మా కలలని దోచుకోవడానికి మీరెవ్వరు? అంటూ ప్రభుత్వాలని నిలదీశారు.  ప్రపంచంలోనే అతిపెద్ద క్లైమేట్‌ స్ట్రైక్‌కి పిలుపునిచ్చి ప్రభుత్వాలని ఆలోచనలో పడేశారు! ప్రభుత్వాలు సరే... పర్యావరణ పరిరక్షణ కోసం  మన బాధ్యత ఏంటని మీరెప్పుడయినా ఆలోచించారా?

Published : 28 Sep 2019 01:14 IST

యువతరం పర్యావరణం

163 దేశాలు... నలభైలక్షలమంది యువత...గల్లీలు, కూడళ్లని యువరక్తంతో ఉరకలెత్తించారు.  మా కలలని దోచుకోవడానికి మీరెవ్వరు? అంటూ ప్రభుత్వాలని నిలదీశారు.  ప్రపంచంలోనే అతిపెద్ద క్లైమేట్‌ స్ట్రైక్‌కి పిలుపునిచ్చి ప్రభుత్వాలని ఆలోచనలో పడేశారు! ప్రభుత్వాలు సరే... పర్యావరణ పరిరక్షణ కోసం  మన బాధ్యత ఏంటని మీరెప్పుడయినా ఆలోచించారా?
 

మనమంతా ఓ మహావినాశనం ముందున్నాం. దాన్నుంచి బయటపడాలంటే ఏడాదిలో ఒక్కసారి కాదు... ఏడాది పొడవునా పర్యావరణ దినోత్సవాలు చేసుకోవాల్సిందే అంటోంది ఈ మహా ఉద్యమానికి నాయకత్వం వహించిన 16 ఏళ్ల స్వీడన్‌ అమ్మాయి గ్రెటాతంబర్గ్‌. ప్లాస్టిక్‌కి దూరంగా ఉండటం, మొక్కలు నాటడం, నీటి వినియోగం పట్ల అవగాహన ఉండటంతోపాటు ఈతరం బాధ్యతలేంటో చూద్దాం.  


 

ట్రావెల్‌ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్నారా..?
‘ఓవర్‌ టూరిజం’ అనేది ఇప్పుడు పర్యాటక రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. విమానాల్లో పర్యటించడం, ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యటకులు వెల్లువెత్తడం వంటి కారణాల వల్ల... హరితవాయువులు పెరగడం, ఆయా ప్రాంతాల్లో కాలుష్యస్థాయిలు పెరగడం ఎక్కువవుతోంది. ఇంధన కాలుష్యాన్ని తక్కువగా వెలువరించే వాహనాలని ఎంచుకోవడం..రీయూజబుల్‌ బ్యాగులు, సీసాలని ఉపయోగించడం, కొత్త ప్రాంతాలని ఎంచుకోవడం వల్ల కాలుష్యాన్ని కొంతవరకూ తగ్గించుకోగలుగుతాం.


ఈ- వాహనాలు అయితే మేలు
కార్లు, బైకులు కొనేముందు కాస్త ఆలోచించండి. శిలాజ ఇంధనాలు వాడే బైకులు, కార్ల కన్నా... కాలుష్యాన్ని వెలువరించని ఈ వాహనాల గురించి ఆరా తీయండి.



 

‘ప్లాగింగ్‌’ చేస్తున్నారా?
ఫిట్‌నెస్‌ని ప్రేమించే ఈతరం యువత తేలిగ్గా చేయదగిన వ్యాయామమే ఇది. రోడ్డుమీద వాకింగ్‌ చేస్తున్నారు. దారిలో చెత్త కనబడితే ఆ..మనకెందుకులే అనుకోకుండా కాస్త వంగి ఆ చెత్తను తీసి చెత్తకుప్పలో పారేయండి. వంగడం వల్ల శరీరం స్ట్రెచ్‌ అవుతుంది. దాంతో తగిన వ్యాయామం అవుతుంది. మరో పక్క పరిసరాలూ పరిశుభ్రమవుతాయి. దీన్నే ‘ప్లాగింగ్‌’ అంటారు. జాగింగ్‌, ‘పికింగ్‌ అప్‌ లిట్టర్‌’ అనే పదాల మేళవింపుతో వచ్చిన పదమే ప్లాగింగ్‌. నాలుగేళ్ల క్రితం స్వీడన్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం అనేక దేశాలకు విస్తరించింది.


జీరోవేస్ట్‌ సభ్యులుగా మారండి
మనం వాడే షాంపూలు, టూత్‌బ్రష్‌లు, దువ్వెనలు, పేస్ట్‌, సర్ఫ్‌, వంటింటి చెత్త ఏదైనా సరే... తిరిగి భూమిలో పూర్తిగా కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారిపోవాలి. వీటినే జీరోవేస్ట్‌ ఉత్పత్తులని అంటారు. కానీ ప్రస్తుతం మనం వాడే ప్లాస్టిక్‌ బ్రష్‌లు, దువ్వెనలు... ప్లాస్టిక్‌ కవర్లలో నింపిన వంటింటి చెత్త భూమిలో కలవకుండా మైక్రోప్లాస్టిక్‌గా మారి మనకే ఇబ్బందులు కొని తెస్తోంది. ఈ ఇబ్బంది రాకుండా వెదురుతో చేసిన టూత్‌ బ్రష్‌లు, షేవింగ్‌ బ్రష్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో షాంపూలు, సబ్బులు, డిష్‌వాషర్లు వంటివి జీరోవేస్ట్‌ విధానంలో ఎలా తయారుచేసుకోవాలో వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. ఆయా కమ్యూనిటీల్లో చేరి ఆసక్తికరమైన విషయాలని తెలుసుకోవచ్చు.


ఈట్‌ లోకల్‌...
నాన్‌వెజ్‌ లేకపోతే ముద్ద దిగదు. బరువు తగ్గడానికి రకరకాల డైట్లు. అందులో కూడా మనకు తెలియని విదేశీ ఆహారాలే ఎక్కువ. మీదీ ఈ పద్ధతే అయితే కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. ఎందుకంటే... మనం తినే ఆహారం కూడా భూతాపానికీ, పర్యావరణ విపత్తులకు కారణం కాబట్టి. కేవలం మన ఆహారపు అలవాట్ల వల్లనే భూమ్మీద నుంచి 60 శాతం జీవవైవిధ్యం మాయమయిపోతోంది అంటే నమ్ముతారా? రోజుకి 200 రకాల జీవులు భూమ్మీద నుంచి కనుమరుగవుతున్నాయి. కారణం... మాంసాహారం కోసం మనం ఉపయోగిస్తున్న నీటినిల్వలు చాలా ఎక్కువ. అలాగే పశువుల పెంపకానికీ, వాటికి కావాల్సిన ఆహారం కోసం అడవులని పెద్ద ఎత్తున నరికి సాగు చేయాల్సి వస్తోంది. దాంతో జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పప్పుధాన్యాలు, కాయగూరల పంటలతో ఇంత సమస్య ఉండదు. భోజనంలో మాంసాహారాన్ని పరిమితం చేయడం, కాయగూర భోజనం...వేగాన్‌ తరహా ఆహారపద్ధతులు పర్యావరణానికి దోహదం చేస్తాయి.  


ప్రత్యామ్నాయం చూడండి
ఒక్క మనదేశంలోనే ఏడాదికి 12 మిలియన్ల శానిటరీ నాప్‌కిన్ల వృథా తయారవుతోంది. ఇవి భూమిలో కలవడానికి ఐదొందల సంవత్సరాలు పడితే... వీటిని పూడ్చిపెట్టడానికి 24 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని ఒక అంచనా. అందుకే మళ్లీమళ్లీ వాడుకునే రీ యూజబుల్‌ నాప్కిన్లతోపాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం.
కొనేముందు ఒక్కమాట: చిన్నవయసు.. పెద్ద జీతాలు.. డబ్బుంది కదా అని ఏదైనా కొనేయొచ్చు అనుకోవద్దు. డబ్బుతో గాలి,నీరు వంటి సహజవనరులని కొనలేం కదా! అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొని ఇంటిని అవసరం లేని వస్తువులతో నింపేయొద్దు. కొనడం తప్పనిసరి అనుకుంటే పర్యావరణానికి హాని చేయని జీరోవేస్ట్‌ ఉత్పత్తులనే కొనండి.


*కాలేజ్‌కీ, ఆఫీస్‌కీ వెళ్లేటప్పుడు పర్సనల్‌ కట్లరీ కిట్‌ని వెంట పెట్టుకుని వెళ్లండి. ప్లాస్టిక్‌ స్ట్రాలు, ఫోర్క్‌ల వినియోగం తగ్గి సముద్రజీవులు హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. చైనా రెస్టారంట్లలో కన్నా... స్థానికంగా దొరికే ఆహారం తినడం వల్ల కొంత కాలుష్యాన్ని అరికట్టగలుగుతాం.
* నీళ్ల సీసాని ఇంటి నుంచే పట్టుకెళ్లండి.. దారిలో కొనే సింగిల్‌ యూజ్‌ బాటిళ్ల వాడకం బాధ తప్పుతుంది.
* షాపింగ్‌కెళ్లేటప్పుడు ఒక బ్యాగు వెంట పెట్టుకుని వెళ్తే సరి.. ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకం గణనీయంగా తగ్గుతుంది.
* మీ ఇంట్లోని కిచెన్‌ వేస్ట్‌ని.. శుద్ధమైన ఆర్గానిక్‌ ఎరువుగా మార్చండి. దాంతో మీ ఇంటిపంటని పండించుకోండి. రసాయనాలు లేని ఆహారం తినొచ్చు.
డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ వంటి సంస్థల సాయంతో అరుదైన, అంతరించిపోతున్న జంతువులని దత్తత తీసుకోవచ్చు. వాటి సంరక్షణ కోసం చేతనైనంత సాయం చేయొచ్చు.

- శ్రీసత్యవాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని