కోలంబస్‌.. కోలంబస్‌..

వారం మొత్తం పనిలో ఒకటే అలసట. దానికి రీఛార్జ్‌.. వీకెండ్‌ మస్తీనే. అలాంటి వారాంతాన్ని ఇలా వచ్ఛి. అలా వెళ్లిపోనిస్తే ఎలా? సండేని సాంతం ఆస్వాదించాలిగా.. అందుకు మీ ప్లానింగ్‌ ఏంటి? సరైన ప్రణాళికతో వీకాఫ్‌ని హుషారుగా గడపొచ్ఛు

Published : 05 Oct 2019 00:23 IST

‘హ్యాపీ’డేస్‌

వచ్చిందీ సెలవూ!

వారం మొత్తం పనిలో ఒకటే అలసట. దానికి రీఛార్జ్‌.. వీకెండ్‌ మస్తీనే. అలాంటి వారాంతాన్ని ఇలా వచ్ఛి. అలా వెళ్లిపోనిస్తే ఎలా? సండేని సాంతం ఆస్వాదించాలిగా.. అందుకు మీ ప్లానింగ్‌ ఏంటి? సరైన ప్రణాళికతో వీకాఫ్‌ని హుషారుగా గడపొచ్ఛు అప్పుడేగా మరో ఆరు రోజులు అలుపెరుగకుండా పని చేసేది.. ఏమంటారు? ఒకవేళ మీరు విద్యార్థులైతే ఈ దసరా సెలవుల్ని స్పెషల్‌గా గడిపేయండి!!

సూర్యోదయాన్ని చూసిందెప్పుడు?

పని ఒత్తిడిలో, మార్కుల వేటలో పడి ఎప్పుడు పడుకుంటున్నామో... ఎన్నింటికి లేస్తున్నామో పట్టించుకోం. సూర్యోదయాన్ని చూసిందెప్పుడు? గుర్తుందా? వీకెండ్‌ని సూర్యోదయ సందర్శనంతోనే మొదలు పెట్టండి. అప్పుడే మీ వారాంతపు రోజులో 24 గంటల కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీరేదైనా పల్లెకి టూర్‌ వెళ్తే అలారం పెట్టడం మానేసి కోడి కూతని వినే ప్రయత్నం చేయండి. ఇలా కాకుండా కొందరు ‘మా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేస్తాం’ అనే వారూ ఉంటారు. వాళ్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నిద్రలేచి బ్రష్‌ చేసే సరికి సగం రోజు ఆవిరైపోతుంది. ఇక మిగిలేది సగం రోజే.

‘ఫ్యామిలీ ప్యాక్‌’ చేయండి..

పని దినాల్లో ఎవరి హడావిడి వాళ్లది. కుటుంబంతో గడిపే వీలుండకపోవచ్ఛు అమ్మ బాక్స్‌లో ఏం వండి పెట్టిందో చూడరు... వెళ్తూ వెనక్కి తిరిగి ‘బాయ్‌!!’ అని కూడా చెప్పరు. అందుకే.. వీకెండ్‌లో వారికోసం కొంత సమయం కేటాయించండి. ‘ఫ్యామిలీ ప్యాక్‌’లా అందరినీ ఒక చోట చేర్చండి. వారంలో నచ్చిన సంఘటనల్ని పేరెంట్స్‌తో పంచుకోండి. ఓ కప్పు కాఫీతో.. కేరింగ్‌గా నాలుగు మాటలు పంచుకుంటే మంచిదేగా!!

వ్యాయామానికి బదులు..

రోజూలా జిమ్‌కి వెళ్లి చేసే వ్యాయామాలకు విరామం ఇవ్వొచ్ఛు పేరెంట్స్‌తో సరదాగా వాకింగ్‌కి వెళ్లండి. గార్డెనింగ్‌తో మొక్కల మధ్య గడపండి. గదిని మీకు నచ్చేట్టుగా సర్దండి. ఇవి కూడా కొన్ని రకాల వ్యాయామాలే. శరీరంతో పాటు మనసూ తేలిక అవుతుంది.

మీదైన ‘మెనూ’..

టైమ్‌కి తినడం కుదరదు.. ఒకవేళ కుదిరితే.. జొమాటో.. స్విగ్గీలపై వాలిపోతాం. పని ఒత్తిడిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కుదరదు. ఇక ఇష్టమైన మెనూ గురించి ఏం ఆలోచిస్తారు? అందుకే వీకాఫ్‌ అంటే.. ఇంట్లో స్టౌ ఆన్‌ చేయాల్సిందే. మీకు నచ్చిన పదార్థాలను స్వయంగా వండివార్చి కుటుంబంతో కలిసి తినండి. వీలుంటే.. ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి రుచి చూపించండి. హ్యాష్‌టాగ్‌తో ఛాలెంజ్‌ విసరండి.

వారితో విహారం..

లాంగ్‌ డ్రైవ్‌లు, ట్రిప్‌లంటే ప్లానింగ్‌, ప్రోగ్రామ్‌లు ముందే అనుకోవాలి. అందుకు స్నేహితులు, సహోద్యోగులు ఉండనే ఉంటారు. మరి, ఇంట్లో వాళ్లతో ఏం ప్లాన్‌ చేస్తున్నారు? ఎలాంటి ప్లానింగ్‌ లేకుండా కుటుంబసభ్యులతో దగ్గర్లో ఉన్న ప్రాంతాల్ని ఎంచుకుని వెళ్లి రండి.

‘అవుట్‌డోర్‌’ తెరవండి

నింపాదిగా ట్విటర్‌ వాల్‌ని స్క్రోల్‌ చేయడం.. ఇన్‌స్టాగ్రామ్‌ని చూడడం.. ఎఫ్‌బీలో కామెంట్‌లు పెట్టడం... వాటికి కాస్త బ్రేక్‌ ఇవ్వండి. వారాంతంలోనైనా స్మార్ట్‌ఫోన్‌ని అన్‌లాక్‌ చేయడం మానేసి అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడొచ్ఛు అక్క పిల్లలతోనో.. పక్కింటి ఫ్లాట్‌ పోరగాళ్లతోనో కాసేపు గల్లీ క్రికెట్‌ ఆడండి. వాళ్లతో గెంతండి.. అరవండి. అంతేకాదు.. ఏదైన కొత్త హాబీని ఏర్పరుచుకునే ప్రయత్నం చేయండి.

ప్రకృతి ఒడిలో..

పని దినాల్లో ఎలాగూ కాంక్రీట్‌ జంగిల్లోనే తిరగాలిగా. దాన్ని తప్పించుకోవడానికి ఛాన్స్‌ లేదు. అందుకే వారాంతంలోనైనా.. పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో సేదతీరేలా ప్లాన్‌ చేసుకోండి. ఇంట్లోని ప్యూరిఫయర్ల గాలిని కాకుండా పచ్చని చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చి చూడండి. మనసుకు హాయి కలుగుతుంది.

పెందలాడే నిద్ర..

రీఫ్రెష్‌ అయ్యాక.. క్యాలెండర్‌లో తర్వాతి తేదీల్ని చూడండి. వచ్చే వారం రోజుల్లో ఏమేం చేయాలి? సెలవుల తర్వాత చదువుల్లో చలాకీతనం కోసం.. ప్రణాళిక వేయండి. ఉరిమే ఉత్సాహంతో రేపటికి సిద్ధం అయ్యేందుకు పెందలాడే నిద్రపోండి.

మీదైన కళ కోసం..

పనిలో రోజులు గడిచిపోతుంటాయ్‌.. ప్రాజెక్టులు ఫినిష్‌ అయిపోతుంటాయ్‌. ప్రమోషన్లు.. పనికి తగట్టుగా ప్రణాళికలు.. వీటి హడావిడిలో మీవైన కళలు కరిగిపోకుండా చూసుకోండి. మీలో ఓ నటుడు ఉంటే.. వారాంతాల్లో, సెలవుల్లో సాన పెట్టండి. షార్ట్‌ఫిల్మ్‌లు తీయండి. డ్యాన్స్‌ ఇష్టమైతే మనసు అలిసేలా నర్తించండి... మీకు ఆసక్తి కలిగించేవి, మనసుని శాంత పరిచే అలవాటు ఏదైనా క్రమం తప్పకుండా సాధన చేయండి. ఆయా కళల్లో భవిష్యత్తు చూడండి. ఉద్యోగంలో ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్లినా.. విరమణ తర్వాత మీతో మీరు గడపడానికి ఓ వ్యాపకం తోడుండాలి.

పంచుకుందాం!

ప్రకృతి.. ఓ నా ప్రకృతి..

నీడనివ్వడానికి చెట్టునిచ్చావ్‌..

ఆక్సిజన్‌ ఇవ్వడానికి అదే చెట్టునిచ్చావ్‌..

వాసన చూడ్డానికి ఆ చెట్టు పువ్వునిచ్చావ్‌.

ఆకలేస్తే ఆ చెట్టు పండునిచ్చావ్‌..

నిద్రొస్తే

ఆ చెట్టుకు ఊయల వేసుకోనిచ్చావ్‌.

ఉదయాన్నే లేపడానికి ఆ చెట్టుపై పక్షినిచ్చావ్‌..

కానీ.. ఎందుకమ్మా నాకింత బద్ధకాన్నిచ్చావ్‌..

అయినా సరే నువ్వు నాకు నచ్చావ్‌.. నచ్చావ్‌

- వీఎస్‌.కళ్యాణి

సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌!

నీ జ్ఞాపకాలు

గతం కాదు

వర్తమానం, భవిష్యత్తు కూడా!

- శ్రీ

శిల్పంలాంటి ఆమెను

శిలలా మార్చాయి..

చేదు అనుభవాలు

- మేఘన

నీడలా వెంటాడే జ్ఞాపకాలకి..

వెలుగంటే ఎంత భయమో?

- రాఘవ

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని