యూట్యూబ్‌లోవిక్రమార్క్‌

నేను యూట్యూబర్‌గా.. నా తెలివిని జనాలపై రుద్దటానికి రాలేదు. నాకు నచ్చిన విషయాల్ని ఆసక్తికరంగా చెప్పాలనే యూట్యూబర్‌గా అవతారం ఎత్తా. నా అసలు పేరు విక్రమ్‌ పోతుల. పుట్టింది రాజమండ్రి దగ్గర జగ్గంపేటలో. చదువులో మొదట్నుంచీ చురుకే. కానీ సిగ్గరిని. స్కూల్‌లో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్‌ తర్వాత నాలో మార్పొచ్చింది. కలుపుగోలుతనంతో పాటు లాజిక్‌ పెరిగింది....

Updated : 12 Oct 2019 00:46 IST

ఇన్ఫోటైన్‌మెంట్‌ వీడియోలు చేసిన తొలి తెలుగు యూట్యూబర్‌.. అతడు! నాలుగేళ్లలో ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలు కేవలం 213. సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 12.50 లక్షలు. ఆ ఛానెల్‌ పేరు, యూట్యూబర్‌ పేరు ఒక్కటే.. విక్రమ్‌ ఆదిత్య. ‘ఎక్కడో పేరు విన్నానే.. ఎఫ్‌బీలోనో.. వాట్సాప్‌లోనో ఎక్కడో చూశానే..’ అనుకుంటున్నారు కదూ! కరక్టే.. రామాయణం, మహాభారతాల్లోని ఉపకథల్ని ఆసక్తికరంగా చెప్పిన తీరు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమా?.. అంటూ చేసిన విశ్లేషణ.. 2070లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతోంది?.. అని అబ్బురపరిచిన యూట్యూబ్‌ స్టార్‌ విక్రమ్‌ ఆదిత్య ఈతరంతో తన జర్నీని పంచుకున్నాడిలా..

నేను యూట్యూబర్‌గా.. నా తెలివిని జనాలపై రుద్దటానికి రాలేదు. నాకు నచ్చిన విషయాల్ని ఆసక్తికరంగా చెప్పాలనే యూట్యూబర్‌గా అవతారం ఎత్తా. నా అసలు పేరు విక్రమ్‌ పోతుల. పుట్టింది రాజమండ్రి దగ్గర జగ్గంపేటలో. చదువులో మొదట్నుంచీ చురుకే. కానీ సిగ్గరిని. స్కూల్‌లో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్‌ తర్వాత నాలో మార్పొచ్చింది. కలుపుగోలుతనంతో పాటు లాజిక్‌ పెరిగింది. కాలేజీడేస్‌లో ఎవరైనా.. చర్చకు దిగితే ‘నువ్వు చెప్పిందే కరెక్ట్‌ విక్రమ్‌’ అని వెళ్లాల్సిందే. అంతలా పోటీ పడేవాడ్ని. లవర్స్‌ అయితే వారి సమస్యల్ని నాతో చెప్పుకొని సలహా తీసుకునేవారు. ఈ క్రమంలో ఒత్తిడిలో ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న ఎంతోమందిని మోటివేట్‌ చేసి ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశా.

నా తెలివికి చాలదనుకున్నా..

బీ ఫార్మసీ చదివాక ఎన్‌ఐపీఈఆర్‌ (నైపర్‌) పరీక్షలో ఆల్‌ ఇండియా 54వ ర్యాంకు సాధించా. అప్పటికే (బీ ఫార్మసీ రెండో సంవత్సరం) క్యాన్సర్‌కు మందు కనిపెట్టే ఓ ప్రాజెక్ట్‌లో పనిచేశా. మేం కనిపెట్టిన కాంపౌండ్స్‌ గురించి ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో రాశారు. ప్రతిభ చూసి ఓ సంస్థ సంవత్సరానికి రెండున్నరలక్షల జీతంతో ఉద్యోగమిచ్చింది. నాకున్న తెలివికి.. ఆ చిన్న ఉద్యోగం సరిపోదనుకున్నా. ఇష్టంలేదని ఇంట్లో చెప్పి తక్కువ పెట్టుబడితో ఎమ్‌ ఫార్మసీ పరీక్షకు శిక్షణ ఇచ్చే ‘ఫార్ములా అకాడమీ’ ఇన్‌స్టిట్యూట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించా. మా సంస్థ పాపులరవ్వటంతో మూడేళ్లలో కోటిన్నర సంపాదించా. ప్రభుత్య ఉద్యోగం చేయాలనే నాన్న కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే.. ఎస్‌.బి.ఐలో ఉద్యోగం సంపాదించా. ప్రస్తుతం నల్లగొండలో ఎస్‌బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నా..

ఒకేసారి రెండు లక్షలు..

నాకు మొదట్నుంచీ కథలు ఆసక్తికరంగా చెప్పడం ఇష్టం. ఆ నమ్మకంతోనే యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు చేద్దాం అని నిర్ణయించుకుని కెమెరా కొన్నా. గదిలో గోడకి థీమ్‌ ఫ్లెక్సీ అతికించి.. కెమెరా ఆన్‌చేసి ఫ్లెక్సీ ముందు నిలబడి మాట్లాడేవాణ్ణి. పొరబాట్లను సరిదిద్దుకుంటూ నెల రోజులపాటు సాధన చేశా. తర్వాత ‘13 ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌’ టైటిల్‌తో తొలి వీడియో అప్‌లోడ్‌ చేశా. 240 మంది వీక్షించారంతే. తర్వాత నెలకు రెండో, మూడో వీడియోలు చేసేవాణ్ణి. నా పదిహేనో వీడియో ‘అనంతపద్మనాభస్వామి’పై చేశా. అదే.. ఛానల్‌ని ఓ మలుపు తిప్పింది. ఆ ఒక్క వీడియోతో రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ వచ్చారు. ఇప్పటికీ ఇదే నా లైఫ్‌టైమ్‌ బెస్ట్‌ పాపులర్‌ వీడియో. దీనికి రెండు లక్షల రూపాయల్ని యూట్యూబ్‌నుంచి తొలిసారి అందుకున్నా. అందరికీ తెలిసిన రామాయణ, మహాభారతాలతో పాటు గ్రీకు, రోమన్‌, చైనా మైథాలజీల్నీ చెప్ఫా ఓ కథలో రెండు పాత్రలుంటే వారిద్దరి కోణాలే కాకుండా మూడోకోణం కూడా బలంగా చెప్పి మెప్పించా. రైతుల కష్టాలు, విద్యా వ్యవస్థ, కుల నిర్మూలనపై నా అభిప్రాయాలు చెప్ఫా.

అదే నా లక్ష్యం..

నెలకో కథ చొప్పున ఇప్పటికి మహాభారతం సిరీస్‌లో 24 వీడియోలు చేశా. ఓ కథ చెబితే.. నాలుగు లక్షల మంది చూస్తున్నారు. మొన్నీమధ్య ఓ పెద్దాయన ఫోన్‌ చేసి ‘మీ వీడియోల్లో విలువలుంటాయి. వీటిని మహిళలు చూడాలి. ఎందుకంటే.. విలువల్ని వచ్చే తరానికి అందించేది వారే కదా!’ అన్నారాయన. అది నాకు బాగా కిక్‌ ఇచ్చిన కామెంట్‌. డబ్బుల కోసమైతే నెలకు పదో, ఇరవయ్యో వీడియోలు చేసేసేవాణ్ణి. నా లక్ష్యం డబ్బు కాదు.. అన్వేషణ. నిజాలపై అన్వేషణ... వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలనే తపన అంతే. ఏడాది కిందట ‘పరహిత’అనే సేవాట్రస్టు ప్రారంభించా. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారానే విరాళాలు సేకరించి.. అంధులకూ, వృద్ధులకూ సాయం చేస్తున్నా. పారదర్శకత కోసం ఆ వీడియోలనూ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశా. నేను కథ చెప్పే విధానం చూసి.. సినిమా అవకాశాలొచ్చినా.. వద్దనుకున్నా. భవిష్యత్తులో ట్రస్టు తరఫున విరివిగా సేవచేయాలన్నదే నా లక్ష్యం.

యూట్యూబర్‌గా మీరూ ఎదగాలంటే..

ఖాళీగా ఉన్నామనీ, లాటరీ పద్ధతిలో జాక్‌పాట్‌ కొట్టొచ్చని మాత్రం ఇటు రావొద్ధు

కొంత బడ్జెట్‌తో ఏడాది పాటు సమయం కచ్చితంగా పెట్టుకునే దిగండి. సహనం తప్పనిసరి.

మీ ప్రతిభను మీరే అంచనా వేసుకోవాలి. ప్రత్యేకమైన జోనర్‌లో కంటెంట్‌ని అందించే ప్రయత్నం చేయండి. జనాలకు ప్రయోజనకరమైంది అయితే ఇంకా మంచిది.

ఫుల్‌టైమ్‌ కాకుండా ఫ్రీలాన్స్‌గానే యూట్యూబ్‌ నడపండి. ఇదొక్కటే సోర్స్‌ అనుకోవద్ధు

సబ్‌స్క్రైబర్స్‌ పెరుగుతున్నట్లయితే.. కాస్త పెట్టుబడి పెట్టి కొంత ఎక్కువ సమయం కేటాయించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని