దుమ్ము ర్యాప్‌తారు

డిస్కో లైట్‌లు అలంకరించిన వేదికలు అక్కర్లేదు.. సందడిగా ఉన్న రోడ్డు మీదే ‘ర్యాప్‌’ఆడించేస్తారీ కుర్రాళ్లు! హెచ్‌డీ కెమెరాలు.. ఫోకస్‌ లైట్‌లతో పని లేదు.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతోనే యూట్యూబ్‌లో సందడి చేస్తున్నారీ పాటగాళ్లు! తెలుగు ర్యాప్‌ని లోకల్‌గా రుచి చూపిస్తూ.. వారిదైన కొత్త బంగారులోకం వైపు అడుగులు వేస్తున్నారు.. ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి గురించి ర్యాప్‌ సాంగ్‌ పాడి ఔరా!! అనిపించారు.. ‘రావోయ్‌ రావోయ్‌ కథ చెబుతా’ అంటూ విజయ్‌ దేవరకొండ పాడిన ‘మీకు మాత్రమే చెబుతా’ పాటలోనూ తమ ర్యాప్‌ని జత చేసి హంగామా చేశారు కూడా.. ‘నవాబ్‌ గ్యాంగ్‌’ పేరుతో హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ మిలీనియల్‌ నవాబ్‌లను పలకరిస్తే..

Published : 02 Nov 2019 00:54 IST

ఆగయా..  నవాబ్‌ గ్యాంగ్‌!

డిస్కో లైట్‌లు అలంకరించిన వేదికలు అక్కర్లేదు.. సందడిగా ఉన్న రోడ్డు మీదే ‘ర్యాప్‌’ఆడించేస్తారీ కుర్రాళ్లు! హెచ్‌డీ కెమెరాలు.. ఫోకస్‌ లైట్‌లతో పని లేదు.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతోనే యూట్యూబ్‌లో సందడి చేస్తున్నారీ పాటగాళ్లు! తెలుగు ర్యాప్‌ని లోకల్‌గా రుచి చూపిస్తూ.. వారిదైన కొత్త బంగారులోకం వైపు అడుగులు వేస్తున్నారు.. ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి గురించి ర్యాప్‌ సాంగ్‌ పాడి ఔరా!! అనిపించారు.. ‘రావోయ్‌ రావోయ్‌ కథ చెబుతా’ అంటూ విజయ్‌ దేవరకొండ పాడిన ‘మీకు మాత్రమే చెబుతా’ పాటలోనూ తమ ర్యాప్‌ని జత చేసి హంగామా చేశారు కూడా.. ‘నవాబ్‌ గ్యాంగ్‌’ పేరుతో హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ మిలీనియల్‌ నవాబ్‌లను పలకరిస్తే.. ఈతరంతో వారి ర్యాప్‌ సంగతుల్ని పంచుకున్నారిలా...

వీళ్లో 18 మంది గ్యాంగ్‌. అంతా ర్యాప్‌ కోసం ఒక్కటయ్యారు. అండా దండా ఎవ్వరూ లేరు. గుండెల్లో కొండంత బలముంది. రిఫరెన్సులూ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏమీ లేవు. ఎవరూ తెలీదని ఆగిపోలేదు. తమ సత్తా ఏంటో చూపిద్దామనుకున్నారంతే. ఓ బ్లూటూత్‌ స్పీకర్‌, బీట్‌ బాక్సర్స్‌, రికార్డింగ్‌ ప్రొడ్యూసర్స్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌ మీదకెళ్లారు. ‘లవ్‌ హైదరాబాద్‌’ లోగో దగ్గర ర్యాప్‌ పాడితే జనాలు ఫిదా అయ్యారు. ‘మా ప్రతిభే మా ధైర్యం. జనాలే మాకు అసలైన అండ. హైదరాబాద్‌లో హిప్‌హాప్‌ కల్చర్‌ ఉందని చాటిచెప్పాలన్నదే మా ఆశ. అందుకే అలా చేశామ’ంటాడు నవాబ్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ అడుసుమల్లి ప్రమోద్‌ శశిరాయ్‌.

మొదటి అడుగు...

‘మా అందరినీ ర్యాప్‌ అనే దారం ఒక్కటిగా కలిపింది. ర్యాపర్స్‌లో ఒకబ్బాయి ఎంబీఏ, మరో అబ్బాయి ఉద్యోగం చేస్తాడు. అందరూ స్నేహితుల సర్కిల్‌తోనే పరిచయమయ్యాం. ఇంత పెద్ద గ్యాంగ్‌ దేశంలో మరెక్కడా లేదు’ అంటాడు మరో ర్యాపర్‌ అభి. ‘మేం ఎవరికివారు బైక్స్‌మీద వెళ్లలేదు. ఎద్దులబండిలో కూర్చుని హాయిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా మధ్య గొడవలు, ఇగోలు లేవు. ఎవరి కథల్ని వాళ్లు రాస్తారు. ఎవరి ర్యాప్‌ వారే పాడతారు. మా గ్యాంగ్‌లో అందరికంటే చిన్నోడు అషైల్‌ జున్ను(దివ్యాంగుడు). మాతో పాటు నిలబడలేకపోయినా.. ‘నవాబ్‌ గ్యాంగ్‌’ పేరును నిలబట్టే దమ్మున్న ర్యాపర్‌ తను’ అంటాడు ప్రమోద్‌.

ప్రమోద్‌ కుటుంబీకులది ఒంగోలు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచీ హిప్‌హాప్‌ అంటే పిచ్ఛి ముఖ్యంగా ర్యాప్‌ సాంగ్స్‌లో ఉండే విప్లవాత్మక సాహిత్యాన్ని విని స్ఫూర్తి పొందాడు. హిప్‌హాప్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు బీటెక్‌ చదవమన్నారు. అయితే, తను మాత్రం ఇంజినీరింగ్‌ మధ్యలోనే తనకిష్టమైన ర్యాప్‌ కళలోనే భవిష్యత్తు చూశాడు. యూట్యూబే తన సాధనకు వేదికయ్యింది. తెలుగు మాండలికాలు, పదాల అర్థాలు తెలుసుకున్నాడు. ప్రాసలతో కవిత్వాన్ని రాశాడు. ఎంతమంది వద్దన్నా వినలేదు. నాలుగేళ్లపాటు శోధన చేశాడు. తేట తెలుగులోనూ పక్కా ర్యాప్‌ బ్యాండ్‌ ఉండాలని కలగన్నాడు. ఎవరెన్ని అన్నా ఆగిపోలేదు. స్నేహితుడి ఐఫోన్‌ తీసుకుని తను రాసుకున్న ‘నీకేం కావాలి?’ అంటూ ర్యాప్‌ సాంగ్‌ పాడాడు. సంగీతం తెలిసిన తన స్నేహితుడితో కలిసి ‘నవాబ్‌ గ్యాంగ్‌’ పేరుతో గత ఏడాది తననో ఫ్రొఫెషనల్‌ ర్యాపర్‌గా పరిచయం చేసుకున్నాడు.

ఆ గూటి పక్షులమే..

ర్యాప్‌ కళ ఇందరిని ఎలా ఒకటి చేసిందని అడిగితే.. ‘హైదరాబాద్‌ అంటేనే ఎవరికైనా నవాబ్‌లు గుర్తొస్తారు. అందుకే మేమూ నవాబ్‌లు అవ్వాలనుకున్నాం. అయితే, మాకున్న బలం, ఆస్తి ర్యాప్‌ కళే. దాన్ని నమ్ముకునే మాకు మేము ‘నవాబ్‌ గ్యాంగ్‌’గా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాం. ఒక్కొక్కరిగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలిశాం. మేం పన్నెండు మంది ర్యాపర్స్‌. ఆరుగురు టెక్నికల్‌ విభాగం. ప్రతి ఒక్కరూ ర్యాప్‌ ప్రేమిస్తారు.. రాస్తారు.. పాడతారు. మేమంతా మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లం. సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలు మాకు బాగా తెలుసు. మా తోటి స్నేహితులు లక్షలు సంపాదిస్తోంటే.. ర్యాప్‌కోసం పనిచేస్తూ ఇబ్బందులు పడినా మాకెవ్వరిలోనూ దిగులు లేదు. తెలుగు ర్యాప్‌ మాకున్న ఏకైక ధైర్యం, లక్ష్యం’ అంటున్నాడు ప్రమోద్‌. ‘ఏదైనా చేసి చూపించటమే మేలు అని భావించి.. అడుగులేశాం. ‘విముక్తి, కావ్యం, ఫస్ట్‌ విత్‌ హైదరాబాద్‌..’ వీడియోలను వారానికి ఒకటి విడుదల చేశాం. ‘విముక్తి’ ర్యాప్‌కి మంచి పేరొచ్చింది. మన హక్కుల గురించి చాటే ర్యాప్‌ అది. తర్వాత సాంగ్‌ అండ్‌ స్కిట్స్‌(స్టోరీ)తో ఎనిమిది పాటలుండే ఓ ఆల్బమ్‌ చేశాం. అది హిట్టు. ఆ సమయంలో విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో వస్తోన్న సినిమాకు ర్యాప్‌ చేసే అవకాశం వచ్చింది. ఒకసారి ట్యాంక్‌బండ్‌పై జనాల మధ్యలో ర్యాప్‌ పాడాం. అది వీడియో తీసి యూట్యూబ్‌లో విడుదల చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు 25 వీడియోలు చేశాం. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలొస్తున్నాయి. మా దగ్గర కంటెంట్‌ ఉంది..ప్ల్లాట్‌ఫామ్‌ కావాలంతే. మాబలం ఐకమత్యం. నడిపించే శక్తి హిప్‌హాప్‌, జనాలు మాత్రమే. మేం సామాజిక చైతన్యం కోసమే పాటల్ని చేస్తాం. తెలుగు ర్యాపర్స్‌ సత్తా చూపించాలన్నదే మా కల’ అంటూ ర్యాపర్లు తమ హిప్‌హాప్‌ కలని పంచుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని