జీవితాన్ని.. హత్తుకో!

... ఒక్కటే కారణం. సున్నితత్వం. దాన్ని ఏదో ఒక దశలో గెలవాల్సిందే. లేకుంటే.. మీలోని సున్నితత్వం మిమ్మల్ని అత్యంత క్రూరంగా మింగేస్తుంది. మిమ్మల్నే కాదు.. వెనుకున్న అమ్మానాన్నల కలల్ని కూడా!! జరసోచో ఫ్రెండ్స్‌.. మీరు మరీ అంత సున్నిత మనస్కులా?.....

Published : 09 Nov 2019 00:49 IST

... ఒక్కటే కారణం. సున్నితత్వం. దాన్ని ఏదో ఒక దశలో గెలవాల్సిందే. లేకుంటే.. మీలోని సున్నితత్వం మిమ్మల్ని అత్యంత క్రూరంగా మింగేస్తుంది. మిమ్మల్నే కాదు.. వెనుకున్న అమ్మానాన్నల కలల్ని కూడా!! జరసోచో ఫ్రెండ్స్‌.. మీరు మరీ అంత సున్నిత మనస్కులా?

జీవించడానికి, బతకడానికి మధ్య చిన్న తేడానే. ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తూ కొందరు ఆనందంగా గడిపేస్తారు. వీళ్లంతా వచ్చిన ర్యాంకుని చూసి ‘ఓకే..!’ అనుకుంటారు. ముందున్న లైఫ్‌కి మంచి హగ్‌ ఇచ్చి సాగిపోతుంటారు. ఇంకొందరు.. ప్రతి నిమిషంలోనూ ఇంకో నిమిషాన్ని చూస్తుంటారు. వీళ్లంతా వచ్చిన ర్యాంకుని కాకుండా వారు కోరుకున్న ర్యాంకుని వెతుకుతారు. ‘నాట్‌ ఓకే’ అని చింతిస్తారు. ముందుకెళ్తున్న లైఫ్‌ని వెనక్కి తిప్పలేక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలా నిస్సార స్థితికి రాకూడదు. అప్పుడే జీవితాన్ని ప్రేమిస్తూ హ్యాపీగా సాగిపోవచ్ఛు.

జరసోచో

కేజీ చదువుల నుంచీ మంచి మార్కులే! కానీ, పీజీ చదువులకు దగ్గరయ్యే వేళ ఒత్తిడంటూ ఒరిగిపోతున్నారు.. బతకలేనంటూ తనువు చాలిస్తున్నారు.. కారణం?

ఫ్రెండ్స్‌ అవుతారు.. ప్రేమంటారు.. బతుకు పంచుకునే సమయంలో బ్రేకప్‌ చెప్పడం. తట్టుకోలేక ఈ బతుకే వ్యర్థం అనుకుంటున్నారు.. ఎందుకు?

మంచి ఉద్యోగం.. సెటిల్‌ అయ్యాం అనుకుంటారు. అంతా హ్యాపీ అనుకుంటూనే.. సుపీరియర్స్‌ ఒత్తిళ్లంటూ సూసైడ్‌ చేసుకుంటారు.. ఏం?

బిందాస్‌గా బతకడానికి..

చదువు ఒక్కటే కాదు..

మీ ఇష్టాలు, అభిరుచుల్ని వదలొద్ధు చదువు, ఉద్యోగం ఏం చేస్తున్నా.. కాస్త టైమ్‌ దొరికితే మీకిష్టమైన పుస్తకాలను చదవండి. వాటిలోని స్ఫూర్తిదాయక వాక్యాలను ఒకచోట రాసుకోండి. సమయం దొరికినప్పుడు వాటిని మళ్లీ మళ్లీ చదువుకోండి. శూన్యం మీ దరిచేరదు.

* రాయండి.. కవితలో, కథలో. ఆయా పాత్రల్లో ఎన్నో కోణాల్ని చూసే వీలుంటుంది. అప్పుడే మీ కథలో మీరో హీరో అవుతారు.

* మ్యూజిక్‌ ఇష్టమైతే ఫేవరెట్‌ పాటల్ని ప్లేలిస్ట్‌గా పెట్టుకోండి. మనసు బాగోనప్పుడు.. లెట్స్‌ ప్లే.

* స్నేహం.. ఓ వరం. అప్పుడప్పుడు హ్యాంగ్‌అవుట్స్‌ చేయండి. అక్కడే మీకు ఎదురయ్యే ఎన్నో హ్యాంగోవర్‌ ప్రశ్నలకు జవాబు దక్కుతుంది.- సినిమాలు చూడండి. చూసిన పాత్రల్ని విశ్లేషించండి. అప్పుడే మీదైన సినిమాలో మీరు సరైన పాత్రల్ని ఎంపిక చేసుకోగలగుతారు.

మీతో మీరు మాత్రమే..

ఏకాంతంలో మీరొక్కరే ఉంటారు. మిమ్మల్ని మీరే ప్రేమిస్తారు. ఎవరు కాదన్నా, వద్దన్నా. మిమ్మల్ని మీరు ఇష్టపడటం ఓ రొమాన్స్‌. దాంట్లోకి మరెవ్వరినీ రానివ్వొద్ధు అప్పుడే.. మీ ఆరోగ్యం, అభిరుచులు, ఆనందం కోసం ఇంకా ఏమేం చేయవచ్చో తెలుసుకోవడం వీలవుతుంది. దీంతో మీపై చెడు ప్రభావం చూపే వాళ్లుగానీ.. సంఘటనలు గానీ ఎదురయ్యే అవకాశం ఉండదు.

పని ఒత్తిడేలా?

క్రికెట్‌నీ.. విరాట్‌నీ, సంగీతాన్ని.. రెహమాన్‌నీ వేర్వేరుగా చూడలేం. ఎందుకంటే.. వాళ్లు ఎంపిక చేసుకున్న పనిలో ఎన్నడూ ఒత్తిడిని చూడకపోవడమే. అలాగే, మీరు బోధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడైతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుంగిపోరు. పోరాడి ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలు పొందుతారు. వృత్తే ప్రవృత్తి అయినప్పుడు విమర్శలు, ప్రశంసలను ఏ మాత్రం పట్టించుకోరు. బహుమానాలు, బిరుదులు వరించినా వాటిని తలకు ఎక్కించుకోరు. పనిలో కేవలం కిక్‌నే వెతుక్కుంటారు. అప్పుడు అలసిపోతామన్న ఆలోచనే రాదు.

ప్రకృతిని ప్రేమించండి

గ్యాడ్జెట్‌లపై ఉన్న ఇష్టాన్ని కాసేపు ప్రకృతి వైపు మళ్లించండి. పొడుచుకొచ్చే సూర్య కిరణాల్లో మీ కలల్ని కలపండి. ప్రకాశిస్తాయి. కురిసే వానలో తనువునే కాదు.. మనసునూ తడవనివ్వండి. కాస్త తేలికవుతుంది. మొలకెత్తే మొక్కను, విచ్చుకునే మొగ్గను నిశితంగా పరిశీలించండి. ఎన్ని సార్లయినా పుట్టాలనిపిస్తుంది. జంతువులు, పక్షులతో ఆడండి. మాటలకందని మరో ప్రేమ రుచి తెలుస్తుంది.

వ్యసనం పరిష్కారం కాదు

పెగ్గు పట్టినోడికల్లా పరిష్కారం దొరికితే.. ప్రపంచం మొత్తం మత్తుకి ఎప్పుడో బానిసైపోయేదే. అందుకే.. ఒత్తిళ్లు ఎదురైతే మీ అభిరుచులకు దగ్గరవ్వాలి. అంతేగానీ.. వ్యసనాలకు కాదు. క్షణం తీరికలేని ప్రముఖులు కూడా ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు వారి అభిరుచులకే ఓటేస్తారు. మీకు చదివి.. చదివి బోర్‌ అనిపిస్తే.. పుస్తకాలు పక్కన పెట్టి గరిటె చేతపట్టండి. మీకు ఇష్టమైన వంట మీరే చేసుకుని తినండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని