ఉఫ్‌.. అని ఊదేయండి!

ఫోన్‌ అన్‌లాక్‌ కాగానే వేళ్లెలా ఊరుకోవో.. అద్దంలో చూసేప్పుడూ అంతే... వెంట్రుకలపై వాలిపోతాయి.. ఒత్తైన జుట్టుని స్టైలింగ్‌ చేసుకోవడానికైతే ఫర్వాలేదుగానీ.. ఉన్న కాసిని వెంట్రుకల్ని అటూ ఇటూ సెట్‌ చేసుకోవాల్సివస్తేనే.. చెప్పుకోలేని బాధ.. తీరని వ్యథ..

Published : 23 Nov 2019 00:56 IST

అప్పుడే హీరో

ఫోన్‌ అన్‌లాక్‌ కాగానే వేళ్లెలా ఊరుకోవో.. అద్దంలో చూసేప్పుడూ అంతే... వెంట్రుకలపై వాలిపోతాయి.. ఒత్తైన జుట్టుని స్టైలింగ్‌ చేసుకోవడానికైతే ఫర్వాలేదుగానీ.. ఉన్న కాసిని వెంట్రుకల్ని అటూ ఇటూ సెట్‌ చేసుకోవాల్సివస్తేనే.. చెప్పుకోలేని బాధ.. తీరని వ్యథ.. వయసులో ఉన్న కుర్రకారుకి అదో ఫోబియా కూడా.. దాన్ని అధిగమించకుంటే కెరీర్‌లో ఎదిగే క్రమంలోనే కాదు.. లైఫ్‌కీ అదో పెద్ద శత్రువు!

బాలాకి మామూలు ఫాలోయింగ్‌ కాదు. హెయిర్‌ స్టైల్‌లో షారూఖ్‌నే. క్లాస్‌మేట్స్‌ అంతా తననో బాద్‌షాలా చూస్తారు. గాలి వాలుకు కదులుతున్న జుట్టుని సరిచేసుకుంటూ బాలా ఇచ్చే స్టైల్స్‌కి అమ్మాయిలంతా ఫిదానే. జుట్టు అంతంత మాత్రం ఉన్నవారిని ఆట పట్టిస్తూ తను చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

టీనేజ్‌ దాటి డిగ్రీ పట్టా పుచ్చుకునేటప్పటికి ముకుంద్‌లో ఆనందమే లేదు. ఏదో దిగులు. నిస్సారంగా స్టేజ్‌ దిగుతూ జుట్టు సరి చేసుకుంటున్నాడు. పల్చగా వేళ్లకు తగిలే వెంట్రుకలు.. పోగొట్టుకోవడంలో ఉన్న బాధేంటో తనకే తెలుసు. అద్దంలో ముఖం చూసుకోవడమే మానేశాడు.

మొదటి నుంచీ శుక్లా స్టేజ్‌ షోలంటే ముందుండే వాడు.. మాటకారి. వృత్తి కూడా మార్కెటింగ్‌. కంపెనీ ఉత్పత్తుల్ని అమ్మాలంటే నలుగురిలోకి వెళ్లాలి. తలపై టోపీ లేనిదే ఫీల్డ్‌కి వెళ్లే వాడు కాదు. ఎండకి భయపడేమో అనుకునేరు. కాదు.. తన బట్టతల కనిపించకుండా ఉండేందుకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు. చివరికి ప్రేమించిన అమ్మాయి కోసం విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది. దాన్ని మేనేజ్‌ చేయడానికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

బాలా, ముకుంద్‌, శుక్లాని వేరువేరుగా చూస్తే మనలో చాలా మంది ఎవరో ఒకరికి కనెక్ట్‌ అవుతాం కదా. ‘ఎందుకు అవ్వం.. ఇదో యూనివర్సల్‌ సమస్య. ఎవరికీ చెప్పుకోలేక.. కక్కలేక, మింగలేక ఏదో అలా బతికేస్తున్నాం’ అనే వాళ్లందరూ ధైర్యం చేసి థియేటర్లలో సందడి చేస్తున్న బాలా సినిమా చూడాల్సిందే. ఎక్కడ నా బట్టతల విషయం అందరికీ తెలిసిపోతుందో అని దిగాలు... ఎవరు నవ్వినా, ఎవరైనా మనవైపు చూసి మాట్లాడుకున్నా తమ గురించే అనే దిగులు. ఇతరులతో పోల్చుకుంటూ కుంగిపోవడం. నన్ను తక్కువగా చూస్తారేమోననే న్యూనతా భావం. చేస్తున్న పని మీద, ఏర్పరుచుకున్న లక్ష్యాల మీద దృష్టి పెట్టలేకపోవడం.. ఇలా తరాలు మారినా.. నేటి మిలీనియల్స్‌కీ ముచ్చెమటలు పట్టించే సమస్యని ఎలా అధిగమించాలో తెలుసుకోవడం అనివార్యం. తెలుసుకుని ఆచరించాలి.

ఇలా చేయండి

● ఇప్పుడిక మనమే అప్‌డేట్‌ అవ్వాలి.. అంటే మనలో లోపాలను ఇతరులు మర్చిపోయేట్టు చేయాలి.. బట్టతల ఉంటే దాన్నే స్టైల్‌గా గుండు చేయించి గడ్డం పెంచండి. తీరైన శరీర సౌష్ఠవంతో మీ స్టైల్‌ని సరికొత్త ట్రెండ్‌లా సెట్‌ చేయండి.

● కొందరికి జుట్టు పలచబడుతుంది లేదా ముందు నుంచి వెనక్కి ఊడుతూ వెలుతుంటుంది. అలాంటి వారు తమ హెయిర్‌ కట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న జుట్టునే స్టైల్‌గా సెట్‌ చేసుకుంటూ, మీకు తగిన హెయిర్‌ స్టైల్‌కే ప్రాధాన్యం ఇవ్వండి.

మీకు మీరే నకిలీనా?

అందంగా కనిపించడం అంటే... ఎదుటి వారికి నచ్చేలా ఉండడం కాదు. మనకి నచ్చేలా ఉండడం. మీలా ఉండడం. అప్పుడే ప్రపంచం మనల్ని వాస్తవ దృక్పథంతో చూస్తుంది. వెల్‌కమ్‌ చెబుతుంది. అదే మొటిమలున్నాయని.. ముసుగేసుకుంటే? రంగు తక్కువని మేకప్‌ వేసుకుంటే? జుట్టు లేదని టోపీ పెట్టుకుంటే? నకిలీ అయిపోతారు. ఎప్పుడో ఒకప్పుడు నకిలీ కరెన్సీలా మనమూ దొరికిపోతాం. అందుకే.. తలపై టోపీని ఓసారి తీయండి. విగ్గయితే విసిరేయండి. ఒక్కసారి ఆత్మవిశ్వాసాన్ని ధరించండి. ప్రపంచానికి మిమ్మల్ని మీలానే పరిచయం చేసుకోండి. ఇక మీదగ్గరకు షేమింగ్‌ సమస్యే రాదు. ఎవరైనా కామెంట్‌ చేసినా ఓ చిరునవ్వుతో సమాధానం చెబుతారు.

ఇవి తెలుసుకోండి

* మొదట మిమ్మల్ని మీరు మీలాగే అంగీకరించాలి. ఎక్కడా తక్కువ చేసుకోవద్ధు అలాగే, ఎక్కువగా ఊహించుకోవద్ధు వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి.

* ఇతరులకు మన గురించి ఆలోచించేంత తీరిక ఉండదు. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచించినా.. వాళ్లు మీ లైఫ్‌ని మార్చలేరనే విషయంపై స్పష్టత రావాలి.

* బట్టతల, పొట్టి, పొడుగు.. ఇవి ముఖ్యం కాదు. ప్రవర్తనే ముఖ్యం. ప్రతిభే మనల్ని మరో మెట్టు ఎక్కిస్తుంది. ఉన్నతంగా చూపుతుంది.

* ఎదుటి వారు మనలో చూసేది లోపాల్ని కాదు. నైపుణ్యాన్ని.. అనే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి.

* తాత్కాలికంగా ప్రభావితం చూపేవి ఏవీ శాశ్వత పరిష్కారాలు కాదు. వాటినే నిజంగా భావించొద్ధు

* ఎప్పుడూ మీలోని లోపం గురించే ఆలోచించకుండా... మీ బలం ఏమిటో తెలుసుకోండి.

* బట్టతల, రంగు, ఒడ్డూ పొడుగు.. ఇవేవి మన చేతిలో ఉండవు. కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. వాటిని మార్చలేం. అతిగా ఆలోచించి కొత్త సమస్యల్ని తెచ్చుకోవద్ధు

పోయింది వెంట్రుకలే!

డబ్బు పోతే సంపాదించుకోవచ్ఛు. కానీ జుట్టు పోతే తిరిగి తెచ్చుకోలేం అనే నిజాన్ని అంగీకరించాల్సిందే. ఎవరెలాంటి చిట్కాలు చెప్పినా, ఎన్ని మందులు వాడినా.. శస్త్రచికిత్సలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సాధారణ స్థితికి జుట్టు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. కాస్త బాధించే సమస్యే కానీ.. భయపడాల్సినంత అవసరం లేదని గ్రహించాలి. చిన్నప్పటి నుంచి పెరిగేది ఒక్క జుట్టే కాదు. దాని లోపల ఉండే బుర్ర కూడా. దానికో స్టైల్‌ ఉంటుంది. అదెప్పటికీ పోదు. ప్రపంచంలో గొప్పవారుగా పరిగణించబడుతున్న ఎందరో మేధావులు, కళాకారులు ఈ సమస్య ఉన్నవారే.. దాన్నో అవరోధంగా భావిస్తే వాళ్లూ అందరిలో ఒకరిగా మిగిలిపోయేవారు.

మీరే రివర్స్‌ స్వింగ్‌ వేయాలి..

మనలోని లోపాల గురించి ఇతరులు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి. మీ గురించి మీరే మాట్లాడాలి. మీకు ఎదురైన ఫన్నీ సంఘటనల్ని మీరే ఇతరులతో పంచుకోవాలి. మీ వాస్తవిక దృక్పథానికి సమాజం సలామ్‌ చేస్తుంది. అంత పెద్ద స్టార్‌ అయిన రజినీకాంత్‌ రోబో.. విడుదలయ్యే సమయంలో జుట్టు ఊడిపోయిన తనతో ఐశ్వర్యారాయ్‌ నటించడం ఏంటి? అని ఓ అభిమాని స్పందించిన తీరుని విలేకర్ల సమావేశంలో పంచుకున్నాడు. ఇలా రజినీయే ధైర్యంగా తనపై తనే రివర్స్‌ స్వింగ్‌ వేసుకున్నాడు. ఇది నవ్వు పుట్టించేలా ఉన్నప్పటికీ దీని వెనకున్న అంతరార్థం వేరు. వాస్తవాన్ని అంగీకరిస్తూ మనని మనమే ఒప్పుకోవడం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని