సోషల్‌ పోస్ట్‌మార్టం

హలోనాథ్‌.. (పేర్లు మార్చాం) ఇలా పలు చిత్రమైన పేర్లతో కొందరు వైరల్‌ అవ్వడం చూశాం. కొందర్ని సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు కూడా. ‘దిశ’ దుర్ఘటనపై వారు చేసిన ఫేస్‌బుక్‌ కామెంట్‌లే అందుకు కారణం. వీళ్లంతా ఎవరు? సోషల్‌ మీడియాలో పురుడు పోసుకుని ఓ గ్రూపుగా ఏర్పడిన వారు. సమాజంపై అసభ్యకర కామెంట్‌లు పెడుతూ, లైక్‌లు కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నవారు. వాస్తవ ప్రపంచంలో వీరి పేర్లు వేరు. వీళ్లుండే తీరు వేరు. ముఖ్యంగా టీనేజర్లే ‘సోషల్‌’ వేదికలపై అమానవీయ మాస్క్‌ తొడుక్కుంటున్నారు. ముసుగేసుకుని మృగంలా మారేందుకు సోషల్‌ మీడియా వేదికల్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ...

Published : 07 Dec 2019 00:49 IST

జరసోచో!

యువతా.. నీ పేరేంటి?

జవాబు: బొడ్డు కోసి అమ్మానాన్నలు పెట్టిందా? ఎఫ్‌బీలో అకౌంట్‌ క్రియేట్‌ చేసి నేను పెట్టుకున్నదా?

ఈతరమా.. నీ వయసెంత?

జవాబు: పదో తరగతిలోదా? ఫేస్‌బుక్‌లోదా?

టీనేజర్లూ.. మీరేం చేస్తున్నారు?

జవాబు: బాహ్య ప్రపంచంలోనా? సోషల్‌ లైఫ్‌లోనా?

ఐ జనరేషన్స్‌.. మీ లక్ష్యం ఏంటి?

జవాబు: వాస్తవంగానా? వర్చువల్‌గానా?

... ఇలా నేటి తరం నాణేనికి రెండు వైపులా అన్నట్టుగా.. నిజ జీవితంలో ఒకరు. సోషల్‌లైఫ్‌లో మరొకరు కనిపిస్తున్నారు. స్పందిస్తున్నారు. నిజం అనడానికి మొన్న జరిగిన ‘దిశ’ దుర్ఘటనలో వెలుగు చూసిన సంఘటనలే సాక్ష్యం...

* స్మైలీ రాజా

మిచెల్‌ వేలాయుధం

హలోనాథ్‌.. (పేర్లు మార్చాం) ఇలా పలు చిత్రమైన పేర్లతో కొందరు వైరల్‌ అవ్వడం చూశాం. కొందర్ని సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు కూడా. ‘దిశ’ దుర్ఘటనపై వారు చేసిన ఫేస్‌బుక్‌ కామెంట్‌లే అందుకు కారణం. వీళ్లంతా ఎవరు? సోషల్‌ మీడియాలో పురుడు పోసుకుని ఓ గ్రూపుగా ఏర్పడిన వారు. సమాజంపై అసభ్యకర కామెంట్‌లు పెడుతూ, లైక్‌లు కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నవారు. వాస్తవ ప్రపంచంలో వీరి పేర్లు వేరు. వీళ్లుండే తీరు వేరు. ముఖ్యంగా టీనేజర్లే ‘సోషల్‌’ వేదికలపై అమానవీయ మాస్క్‌ తొడుక్కుంటున్నారు. ముసుగేసుకుని మృగంలా మారేందుకు సోషల్‌ మీడియా వేదికల్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆకతాయితనంతో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ బంగారు భవిష్యత్తుని చేజేతులా అంధకారం చేసుకుంటున్నారు.

అకౌంటేగా.. అనుకోవద్దు!

నేనే క్రియేట్‌ చేసుకున్నా.. నేనే పేరు పెట్టుకున్నా. తేడా వస్తే చిటికెలో అకౌంట్‌ డిలీట్‌ చేసేస్తా! అనుకుంటే.. పొరపాటే. ప్రపంచంలో జనాభా కంటే.. సోషల్‌ మీడియాలో ఉన్న జనాభా సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అక్కడ పొరపాటున లైకు కొట్టినా.. కామెంట్‌ జారినా క్షణాల్లో నెటిజన్లందరికీ తెలిసిపోతుంది. మీరు డిలీట్‌ చేసేలోపే వైరల్‌ అయిపోతుంది. తొలగించే లోపే మీ వ్యక్తిత్వం సోషల్‌ మీడియా వేదికగా మంట కలిసిపోతుంది. అప్పుడు మీరేం చేసినా పోయిన పరువుని తిరిగి తెచ్చుకోలేరు.

కెరీర్‌కి అవరోధం

కాలేజీ, ఆఫీసుల్లో మీతో ఎప్పుడూ ముఖాముఖీ మాట్లాడని వారు కూడా మీ సోషల్‌ మీడియా సర్కిల్‌లో ఉంటారు. ఉదాహరణకు మీ ఆఫీస్‌లో పని చేస్తున్న వాళ్లు మీతో ఎప్పుడూ ఎదురుపడి మాట్లాడి ఉండరు. పెద్దగా పరిచయం కూడా ఉండదు. అయినప్పటికీ మా ఆఫీసే కదా అని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. మీ అప్‌డేట్స్‌ అన్నీ ఎప్పుటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. లైకో.. కామెంటో చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఆకతాయిగా.. అవగాహనలేమీతో మీరు చేసే పోస్టింగ్‌లు, కామెంట్‌లు మీ కెరీర్‌కి అవరోధంగా మారతాయి. ఉద్యోగులైతే పింక్‌ స్లిప్‌లు అందుకోవాల్సివస్తుంది. విద్యార్థులైతే టీసీతో గుట్టుచప్పుడు కాకుండా మరో క్యాంపస్‌కి వెళ్లాల్సి వస్తుంది. మరీ హద్దు మీరి నడుచుకుంటే కొన్నిసార్లు జైలుకీ వెళ్లాల్సిరావచ్ఛు

నిరంతర నిఘా..

మనం చేసేది నెట్టింట్లోనే కదా.. చిక్కుముళ్లు ఎక్కువ ఉంటాయ్‌. పైగా.. లెక్కకు మిక్కిలి అప్‌డేట్స్‌లో మనం పెట్టేవి ఎవరు పట్టించుకుంటారు? అనుకుంటే ఆర్కుట్‌ జమానాలోనే మీరు ఆగిపోయినట్టు. సైబర్‌ సెక్యూరిటీపై పోలీసు యంత్రాంగం నిత్యం నిఘా వేస్తోంది. ఎకౌంట్‌ క్రియేట్‌ చేసేటప్పుడు మీరు ఎంటర్‌ చేసిన వ్యక్తిగత వివరాలతో క్షణాల్లో మీరు ఎవరో? ఎక్కడున్నారో కనిపెట్టేస్తారు. మీరున్న చోట వాలిపోతారు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే.

నెటిజన్‌గా మీ బాధ్యత!

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం.. ఇలా నెట్టింట్లో అందుబాటులో ఉన్న సోషల్‌ మీడియా వేదికల్లో చురుకుగా ఉండడం తప్పేం కాదు. అయితే, అక్కడా స్పృహతో వ్యవహరించాలి. ఎందుకంటే.. స్కూల్‌, కాలేజీల్లో ఇచ్చే కాండాక్డ్‌ సర్టిఫికెట్‌ మాదిరిగానే.. మీ సోషల్‌ లైఫ్‌ని అంచనా వేసేందుకు మీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వాల్స్‌ని కాండాక్ట్‌ సర్టిఫికెట్‌లా చూస్తున్నాయి అన్ని కంపెనీలు. దీన్ని ‘పబ్లిక్‌ సోషల్‌ ఆడిట్‌’ అని పిలుస్తున్నారు. మీరు చేస్తున్న పోస్టింగ్‌లు, రాస్తున్న కామెంట్ల ఆధారంగానే మీ ప్రవర్తనపై ఓ అంచనాకి వస్తున్నాయి. ఇంకా పలు రకాలుగా జల్లెడపడుతున్నాయ్‌. చేతిలో ఫోన్‌ ఉందనో.. దండిగా డేటా ఉందనో అనిపించిందల్లా పోస్ట్‌ చేయొద్ధు కామెంట్‌లు, లైక్‌లు చేయొద్ధు ఓ మాట జారితే అదే మనకు యజమానై కూర్చుంటుంది. దాన్ని కచ్చితంగా నెరవేర్చి తీరాలి. ఇదే మాదిరిగా ఓ చెడు మాట జారితే అదే విలన్‌ అవుతుంది. వెంటాడుతుంది. అందుకే.. వాల్‌పై జారిన కామెంట్‌ మీకు విలన్‌ అవ్వకుండా చూసుకోవాలి. ●

వాల్‌పై గాసిప్స్‌ని షేర్‌ చేయడం మానుకోండి.

లింగ భేదాన్ని చూపేలా పోస్టింగ్‌లు చేయడం మంచిది కాదు.

ఏదైనా విషయాన్ని పేపర్‌పై రాసేటప్పుడు ఎంత జాగ్రత్త పడతామో.. ఫేస్‌బుక్‌ వాల్‌పై కామెంట్‌ పెట్టేటప్పుడూ అంతే జాగ్రత్త వహించాలి.

వ్యక్తిగత అభిప్రాయాల్ని మీరు పని చేస్తున్న సంస్థ అభిప్రాయంగా చూపొద్ధు

నెటిజన్‌గా మారిన ప్రతి సిటిజన్‌ ఒకటి గుర్తుంచుకోవాలి. సోషల్‌ మీడియాలో కోపం, ద్వేషం, ఇష్టం, ప్రేమ.. ఇలా పంచుకునేది ఏదైనా.. మీ అంతట మీరే ఓ ప్రామిసరీ నోటుపై రాసి సంతకం పెట్టి షేర్‌ చేసినట్టే. క్లిక్‌ కొట్టేముందే ఒక్కసారి ఆలోచించండి.

ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?

తల్లిదండ్రులతో సరైన సత్సంబంధాలు లేకపోవడం.. సమాజానికి దూరమై, చెడు అలవాట్లకు దగ్గరైన వారే ఎక్కువగా ‘దిశ’ సంఘటనలో చూసిన మాదిరి కామెంట్‌లు చేస్తుంటారు. అవకాశం వస్తే వీళ్లూ క్రైమ్‌ చేయడానికి వెనకాడరు. అమ్మాయిల పట్ల వీరికో చులకన భావన ఉంటుంది. వారినో ఆట బొమ్మలా చూస్తారు. అందుకు వీరి గత జీవితంలో ఎదురైన సంఘటనలు బలాన్ని ఇస్తాయి. ఎలాగంటే.. మీరో అమ్మాయికి ఆకర్షితులు అవుతారు. దాన్ని ప్రేమ అనుకుని ప్రపోజ్‌ చేస్తారు. తిరస్కరిస్తే తట్టుకోలేక వారిపై ద్వేషం పెంచుకుంటారు. దాన్ని అవకాశం చిక్కినప్పుల్లా ప్రదర్శిస్తారు. అందుకు సోషల్‌ మీడియాని వేదిక చేసుకుని మారు పేర్లతో గ్రూపుగా ఏర్పడి వారి భావజాలాన్ని సభ్య సమాజంపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారిని బాధించడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి వారు మానసికంగా స్థిమితంగా ఉండలేరు. భిన్నంగా స్పందిస్తుంటారు. పాజిటివ్‌ దృక్పథం వెతికినా వీరిలో కనిపించదు. నేను ఒక్కడినే కాదు. చాలామందే నాలా ఆలోచిస్తున్నారు అనే ధైర్యంతోనే ట్రోలింగ్‌ పోస్ట్‌లు చేయడం.. వాటికొచ్చే స్పందనల్ని చూస్తూ తృప్తి చెందుతారు. వీరికి నైతిక విలువలు అంటే తెలియదు. వినయంగా మాట్లాడరు. ‘యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిసార్డర్‌’తో విచ్చలవిడిగా తోచిందల్లా చేస్తుంటారు. మద్యం మత్తు వీరిని మరింత రాక్షసంగా మార్చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని