ఫిట్‌నెస్‌కి రాజుమార్గం

నాజూకుగా, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేసేవారు కొందరైతే.. దాన్నే వృత్తిగా ఎంచుకుని బాడీ బిల్డింగ్‌ చేసేవారు మరికొందరు.. అలా ఫిట్‌నెస్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు నగరానికి చెందిన కేఎస్‌ఎన్‌ రాజు. కొన్నేళ్లుగా కసితో కసరత్తులు చేస్తూ ఏషియన్‌, వరల్డ్‌ బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో భారత్‌ తరఫున కాంస్య, వెండి పతకాలు అందుకున్నాడు. అంతేకాదు.. మన తెలుగు హీరోల్లో కొందరికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేశాడు....

Updated : 14 Dec 2019 00:45 IST

నాజూకుగా, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేసేవారు కొందరైతే.. దాన్నే వృత్తిగా ఎంచుకుని బాడీ బిల్డింగ్‌ చేసేవారు మరికొందరు.. అలా ఫిట్‌నెస్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు నగరానికి చెందిన కేఎస్‌ఎన్‌ రాజు. కొన్నేళ్లుగా కసితో కసరత్తులు చేస్తూ ఏషియన్‌, వరల్డ్‌ బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో భారత్‌ తరఫున కాంస్య, వెండి పతకాలు అందుకున్నాడు. అంతేకాదు.. మన తెలుగు హీరోల్లో కొందరికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేశాడు. బాడీబిల్డింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యం అంటూనే.. యువత ఫిట్‌గా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల్ని చెబుతున్నాడిలా...

చిన్నప్పటి నుంచీ ఫిట్‌గా ఉండాలనుకునే వాడిని. కొన్నేళ్లకు అదే ధ్యాసగా మారింది. దానికి తోడు నేను ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ అభిమానిని. తను నటించిన టెర్మినేటర్‌ సినిమా చూసినప్పుడే బలంగా నిర్ణయించుకున్నా. కచ్చితంగా బాడీ బిల్డర్‌ కావాల్సిందేనని. రోజుకి ఎనిమిది గంటలు కసరత్తులు చేసేవాడిని. జిమ్‌ చేస్తూనే డిగ్రీ వరకూ చదివా. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. అయినా దీంట్లోనే రాణించాలనుకున్నా. ఆలస్యం చేయకుండా బాడీ బిల్డింగ్‌నే కెరీర్‌గా మలుచుకున్నా. నా నిర్ణయానికి అమ్మ సహకారం మరువలేనిది. మా సొంతూరు భీమవరంలోనే కొన్నేళ్లు జిమ్‌ నడిపా. తర్వాత నగరానికి వచ్చి స్నేహితుల సాయంతో ప్రముఖులకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా శిక్షణనిచ్ఛా తెలుగు హీరోలు రవితేజ, మంచు విష్ణు, సునీల్‌, నవదీప్‌, దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇలా మరికొందరికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా మెళకువలు నేర్ఫా ప్రపంచ స్థాయిలో బంగారు పతకం సాధనే నా లక్ష్యం. ఆ ప్రయత్నంలోనే గత సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం అందుకున్నా. మొత్తం 35 దేశాలు పాల్గొన్నాయి. తర్వాత దక్షిణ కొరియాలో 75 దేశాలు పాల్గొన్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం దక్కింది. వచ్చే ఏడాది వరల్డ్‌, ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లలో తప్పక బంగారు పతకం సాధిస్తా. అంతేకాదు.. ‘ఫిట్‌ ఇండియా’ కోసం నాదైన శైలిలో యువతకి అవగాహన కల్పిస్తున్నా. ఎందుకంటే.. నేటి యువత జీవనశైలిలో వ్యాయామం ఓ భాగమవ్వాలి. అందుకు కావాల్సిన ప్రేరణ కలిగించాలి.

ఇదే సరైన సమయం..

శీతాకాలం వ్యాయామానికి తగిన కాలం. చెమట చిందేందుకు సమయం పడుతుంది. దీంతో వర్కవుట్స్‌ చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోరు. సిక్స్‌ప్యాక్‌లు అక్కర్లేకున్నా. కనీసం ఫిట్‌గా ఉందాం అనుకునేవారంతా తక్షణం వ్యాయామం ప్రారంభించండి. ఉదయాన్నే పది నిమిషాలు స్కిప్పింగ్‌ చేయండి చాలు. నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ అరగంట పాటు స్కిప్పింగ్‌ చేయొచ్ఛు దీంతో పాటు గుంజీలు తీయండి. స్కూల్‌లో చిన్నప్పుడు టీచర్లు చేయించిన వ్యాయామమే! రోజుకో 50 గుంజీలు తీస్తే మీరు ఫిట్‌ అయినట్టే! ఇక పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుని కరిగించేందుకు ఉదర సంబంధిత వ్యాయామాలు చేయండి. సూర్యనమస్కారాలు మొత్తం శరీరానికి ఎంతో మేలు. ఒకవేళ జిమ్‌కి వెళ్లి కండలు పెంచుదాం అనుకుంటే.. నేరుగా కసరత్తులు చేయడం అంత శ్రేయస్కరం కాదు. ముందు ఓ నెలపాటు రోజూ నడక, జాగింగ్‌ లాంటివి చేయాలి. 20 నిమిషాలతో మొదలుపెట్టి గంట పాటు వ్యాయామం చేయండి. దీంతో శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. అప్పుడు జిమ్‌లో కసరత్తులు చేసేందుకు శరీరం సిద్ధం అవుతుంది.

ఆ కండలు వద్ధు.

నేటి తరం ఫిట్‌నెస్‌నీ షార్ట్‌కట్‌లో కోరుకుంటోంది. కేవలం రెండు, మూడు నెలల్లోనే సిక్స్‌ప్యాక్‌ వచ్చేయాలంటున్నారు. అందుకు ఏవేవో స్టెరాయిడ్స్‌ తీసుకుని పెరిగిన కండల్ని చూసి పొంగిపోతున్నారు. వారికి తెలియని నిజం ఏంటంటే.. అవి ఎక్కువ కాలం ఉండకపోవడమే కాదు, ఆరోగ్యంపై దుష్ఫ్రభావం చూపిస్తాయి. వర్కవుట్స్‌ ఎప్పుడూ నిదానంగా ప్రారంభించాలి. దాన్నో దినచర్యలా మార్చుకోవాలి. క్రమశిక్షణ, మంచి శిక్షకుడు, సరైన డైట్‌ లేనిదే ఆశించిన స్థాయిలో శరీరంలో మార్పు సాధ్యం కాదు.

సమతూకంగా ఉన్నాయా?

తిన్నామా? కూర్చున్నామా? కోడింగ్‌ రాశామా?.. ఇలానే రోజులు గడిచిపోతాయ్‌. ఎప్పుడో అనిపిస్తుంది. లావైపోతున్నామని. అప్పుడు ఆలోచిస్తారు.. ఏం చేయాలా? అని. ఇలాంటి సమస్య రాకముందే ఓ ప్రాథమిక సూత్రాన్ని పాటించాలి. ఎన్ని కేలరీల ఆహారాన్ని తీసుకుంటున్నాం? ఎంత సమయం పాటు శారీరక శ్రమ చేస్తున్నాం?.. ఈ రెండూ సమతూకంగా లేకుంటే శరీరంలో అనవసర కొవ్వు శాతం పెరుగుతుంది. అందుకే.. తీసుకునే కేలరీలకు చేస్తున్న వర్కవుట్స్‌ సరితూగాలి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే.. దానికి సమానమైన వర్కవుట్స్‌ చేయాలి. రోజులో కనీసం గంట పాటైనా తప్పక వ్యాయామం చేయండి. గంటల పాటు ఆదమరిచి ఒకేచోట కూర్చోకుండా.. మధ్యలో విరామం తీసుకోవాలి. ఆఫీసుల్లో మీకు ఉన్న వెసులుబాటుతో కొంత సమయం నడవండి.

ఏం తింటున్నారు?

యువతలో ఎక్కువగా ‘నాకు ఇవంటేనే ఇష్టం.. అవి తినడం చాలా కష్టం’.. వంటి మాటలు వినిపిస్తాయ్‌. కానీ, తినేది సమతుల ఆహారం అయ్యుండాలి. పాలు, కూరగాయలు, పప్పు దినుసులు తప్పని సరి. రోజుని బ్లాక్‌ కాఫీ లేదా గ్రీన్‌ టీతో మొదలెట్టండి. అల్పాహారంలో నూనె శాతం తక్కువగా ఉన్నవి.. ఇడ్లీ, రాగి సంగటి, ఓట్స్‌.. లాంటివి ప్రయత్నించొచ్ఛు లంచ్‌లో బ్రౌన్‌ రైస్‌, కూరగాయలు, సోయాబీన్స్‌, పప్పు దినుసులు, చికెన్‌, చేపలు, గుడ్లు.. వీటిలో ఏవైనా ఎంచుకోవచ్ఛు రాత్రి వీలైనంత తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని