తానూ.. నేను..ఓ డేట్‌!

ఒక టేబుల్‌..రెండు కుర్చీలు.. పొగలుగక్కే కాఫీ..ఇంకేంటి... అనుకున్న ‘డేట్‌’ వచ్చేసింది..ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? కాఫీతో కబుర్లు చెప్పుకొనే వేళ కాస్త జాగ్రత్త..అందుకో కమ్యూనికేషన్‌ ఉంది.. కచ్చితంగా  ఫాలో అవ్వాలి....

Published : 21 Dec 2019 01:12 IST

ఆర్ట్‌ ఆఫ్‌ లవింగ్‌

ఒక టేబుల్‌..రెండు కుర్చీలు.. పొగలుగక్కే కాఫీ..ఇంకేంటి... అనుకున్న ‘డేట్‌’ వచ్చేసింది..ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? కాఫీతో కబుర్లు చెప్పుకొనే వేళ కాస్త జాగ్రత్త..అందుకో కమ్యూనికేషన్‌ ఉంది.. కచ్చితంగా  ఫాలో అవ్వాలి..
కళ్లకో భాష ఉంది.. నేర్చుకోండి
ఫోన్‌లో ఎలాగైనా మాట్లాడొచ్చు. ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. అలాగని మింగేసేలా చూడొద్దు.. వంకర చూపులు అసలే వద్దు. గుర్తుంచుకోండి.. అమ్మాయిల కళ్లు ‘చూపులు.. వాటి వెనకున్న బాసలపై’ పీహెచ్‌డీ చేసుంటాయ్‌. తేడా వస్తే.. ‘డేట్‌’కి మధ్యలోనే గేటు పడుతుంది.
రాణికి మాటల కోటలేల!
భారీ డైలాగ్‌లు.. ఎత్తుకొచ్చిన సూక్తులతో మాటల కోటలు కట్టొద్దు. రాణి కోటని వీడే ప్రయత్నం చేస్తుంది  జస్ట్‌.. మాట కలపండి. కాఫీ సిప్‌ చేస్తూ కబుర్లు చెప్పండి అంతే! ఇరువురి స్పందనలకు టేబుల్‌పై స్పేస్‌ క్రియేట్‌ అవుతుంది. నేర్చుకోండి.. సంభాషణ సీ ప్రోగ్రామింగ్‌ లాంటిది. లాజిక్‌ మిస్‌ అయితే కంపైల్‌ అవ్వదు.
ఆటో పంచ్‌లు వద్దు
ఫన్‌ కోసం.. మీపై మీరు జోకులేసుకుంటే ఫర్వాలేదు. మోతాదు ఎక్కువై టేబుల్‌ అటువైపు వెళ్లొద్దు. అమ్మాయిలు జోకులేస్తే నవ్వుతారు. కానీ, వాళ్లపై వేస్తేనే లేచి వెళ్లిపోతారు. ఏదో సరదాకి అంటూ..
వారిలోని లోపాలపై ఆటో పంచ్‌లు వేయొద్దు. టైర్‌ పంక్చర్‌ అవుతుంది.
లైక్‌లతో హద్దులు దాటొద్దు
మాటలు కలిశాయో.. లేదో.. వెంటనే తన సోషల్‌ లైఫ్‌ని అతిగా ఫాలో అయ్యే ప్రయత్నం చెయ్యొద్దు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌... ఇలా అన్నింటికీ ఒకేసారి రిక్వెస్ట్‌లు పంపొద్దు. కొన్నేళ్ల ముందు పోస్ట్‌ చేసిన వాటికి లైక్‌లు కొడుతూ స్పందించొద్దు. మీరేదో అతిగా ఆశిస్తున్న భావన తనకి ఇబ్బంది కలిగించొచ్చు. అన్‌ఫ్రెండ్‌ చేయొచ్చు.
బిల్డప్‌లు ఎందుకు?
మీరు కనిపించాలేగానీ.. ధరించిన బ్రాండ్‌లు కాదు. ఖరీదైన వాటితో షో చేయడానికి చూస్తే.. పరిచయం ఫ్లాప్‌ అవుతుంది. మీ స్కిల్స్‌ గురించి మీరు కొట్టే డప్పుకి.. కచ్చితంగా తనకి తలనొప్పే వస్తుంది. కాఫీ మాత్రమే తాగి వెళ్లిపోతుంది. బిల్లు సింగిల్‌గా కట్టాల్సిందే.
గీత దాటొద్దు
టేబుల్‌ దాకా వచ్చామని.. చనువుతో సున్నితమైన గీతల్ని చెరపొద్దు. భుజంపై చేతులేయడం.. ఏదో ఒక రకంగా తాకేందుకు   ప్రయత్నించడం చేయొద్దు. మీ మనసులో చెడు ఉద్దేశం లేకపోయినా.. తను మరోలా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
తర్కించడం ఎందుకు?
హాయ్‌ అంటూ ముఖంలో చిరు నవ్వు. అంతే.. మాటలు తన పెదవి దాటకుంటే. మీరే మాట కలపండి. వినడం తనకి ఇష్టమైతే మీరే ఎక్కువగా ఛాన్స్‌ తీసుకోండి. అంతేగానీ.. ఏదైనా చెప్పొచ్చుగా అని పదే పదే తర్కించొద్దు. ఒకవేళ మీరు, మీ డేట్‌ నచ్చకుంటే..     ఓ చిన్న చిరునవ్వుతో బై చెప్పండి.
ఇరువురి మధ్య ఇంకెవరు?
నా క్లోజ్‌ ఫ్రెండ్‌ అనో.. గైడ్‌ అనో.. మూడో వ్యక్తిని టేబుల్‌కి ఆహ్వానించొద్దు. అవసరమైతే తప్ప. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పటికైనా ఇరువురే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని