నీదీనాదీ ఒకే కథ!

ఒక్కొక్కరిదీ ఒక్కో కథ..దాని వెనక ఓ కళ! వాటిని పంచుకునేందుకు, ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే..ఒంట్లో భయం పోతుంది.. గుండెల్లో ధైర్యం నిండుతుంది.. బతుకుపై ఆశ చిగురిస్తుంది.. ఇలాంటి సామాజిక చైతన్యం కోసం..  ఓ ఫ్యాక్టరీనే తెరుచుకుంది. అదే ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’. ఈ ఫ్యాక్టరీ కథ.. దాని వెనక విజన్‌ని సంస్థ వ్యవస్థాపకుడు రఘు దత్‌ ‘ఈతరం’తో చెప్పుకొచ్చాడిలా..

Published : 04 Jan 2020 01:00 IST

పంచుకోవాలనుందా?

ఒక్కొక్కరిదీ ఒక్కో కథ..దాని వెనక ఓ కళ! వాటిని పంచుకునేందుకు, ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే..ఒంట్లో భయం పోతుంది.. గుండెల్లో ధైర్యం నిండుతుంది.. బతుకుపై ఆశ చిగురిస్తుంది.. ఇలాంటి సామాజిక చైతన్యం కోసం..  ఓ ఫ్యాక్టరీనే తెరుచుకుంది. అదే ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’. ఈ ఫ్యాక్టరీ కథ.. దాని వెనక విజన్‌ని సంస్థ వ్యవస్థాపకుడు రఘు దత్‌ ‘ఈతరం’తో చెప్పుకొచ్చాడిలా..
హైదరాబాద్‌లో సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షకుడిగా లక్షల విద్యార్థుల్ని చూశా..  తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌ క్యాంపులు నిర్వహించా.. ప్రైవేటు సంస్థలో ప్రాజెక్ట్‌ హెడ్‌గా ఉన్నా.. కార్పొరేట్‌ ట్రైనర్‌ అవ్వాలనుకున్నా. నా వైకల్యం కార్పొరేట్‌కి అడ్డయ్యింది.. ఈ మొత్తం ప్రయాణంలో నా కథని ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేశా. కానీ, నేను సామాన్యుణ్ని, సెలబ్రిటీని కాదు. అందుకే నా కథగానీ.. నా ఆలోచనల్నిగానీ వినరని బాధపడ్డా. నాలా మథనపడే వాళ్లు ఎంతోమంది ఉంటారని ఆలోచనలోపడ్డా. వాళ్లలో దాగున్న నైపుణ్యం చీకట్లోనే ఉండిపోతుందని అర్థమయ్యింది. అదో న్యూనతాభావంగా మారకూడదనుకున్నా. ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, శిష్యులతో చర్చించా. ఓ సామాన్యుడి కథకి.. దాంట్లో దాగున్న టాలెంట్‌కి ఆడియన్స్‌ అవ్వాలనుకున్నాం. పది మంది స్నేహితులతో కలిసి ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’ని 2018 డిసెంబరులో స్థాపించా.

అదే నా కల..
నేను స్పోర్ట్స్‌ సైకాలజీ చేశా. ప్రస్తుతం హైదరాబాద్‌ టీమ్‌తో పాటు ఛత్తీస్‌గడ్‌ క్రికెట్‌ టీమ్‌కి సైకాలజీ కోచ్‌గా వ్యవహరిస్తున్నా. భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు, ప్రతి పల్లెకూ ‘ది గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ’ చేరువ కావాలన్నదే నా కల. మాది వరంగల్‌. చరిత్ర నాకిష్టమైన సబ్జెక్ట్‌. చరిత్ర అంటే డేట్స్‌ కాదు పునాది అని నా అభిప్రాయం. ఎమ్‌.ఎ. హిస్టరీ చదివా. చరిత్రను బోధించే లెక్చరర్‌ అవ్వాలనే కల ఉండేది. కుదరలేదు.  రాష్ట్రస్థాయిలో ఫుట్‌బాల్‌ ఆటగాణ్ణి. అయితే అక్కడి రాజకీయాలు నచ్చక బయటికొచ్చేశా. అమెరికాలో 11 వేల ఎత్తులో స్కైడైవింగ్‌ చేశా. చదువు చెప్పిన అధ్యాపకులు, కష్టాల్లో ఆదుకున్న స్నేహితుల్ని సెలబ్రిటీలుగా చూడడం అలవాటు చేసుకోవాలి. జవాన్లు, సామాజిక సేవకులు.. నిజమైన హీరోలని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది.

*చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి.. చదువుపై ఇష్టం చంపుకోలేక.. మగ దిక్కులేని అమ్మ, అక్కతో జీవనం సాగించే 12 ఏళ్ల అమ్మాయి చెప్పే కథ ఎప్పుడైనా విన్నారా?
* పాత చీరలు.. దుస్తులతో లక్షల బ్యాగులు కుట్టిన పెద్దావిడ. మార్కెటింగ్‌ తెలీదు... ఆన్‌లైన్‌ అంగళ్లు ఎరగదు. తెలిసింది ఒక్కటే.. కళాత్మకంగా బ్యాగులు కుట్టడం.. తెలిసిన వారికి పదికో, ఇరవైకో అమ్మడం.. ఎన్నడూ గడప దాటని, లక్షల బ్యాగులు కుడుతూ ప్రపంచీకరణకు దూరంగా గడుపుతున్న ఆమె కథలో కష్టం మీకు తెలుసా?
* 30 ఏళ్ల కుర్రాడు. ఎన్నో ఆశలు, ఆశయాలతో దూసుకెళ్తుండగా ప్రమాదం. రెండు కాళ్లూ పోయాయి. ఇక ఎప్పటికీ నడవ లేడు. అప్పుడు తన బాధ ఎలా ఉంటుందో తెలుసా? పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లి తనలా మరొకరికి ప్రమాదం వాటిల్లకూడదనే సంకల్పానికి బలం ఎంతో ఊహించగలరా?
.. ఇలాంటి కథలు వినేందుకు సభ్య సమాజానికి తీరిక ఉందా? ఒకవేళ ఉన్నా.. అందుకు ఏదైనా ప్రత్యేక వేదిక ఉందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరకడానికి నాకు కొన్నేళ్లు పట్టింది. నేను దాటొచ్చిన కథలోనే ఎంతో మంది సామాన్యుల కథల్ని దగ్గరగా చూశా. అప్పుడు పుట్టిన ఆలోచనే ఈ గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీ..

మేం ప్రతి మనిషి కథనూ వింటాం...
ఎనిమిదో తరగతి చదివే అఫియాతో మా సంస్థను ప్రారంభించా. ఆమె నాకు రెండో తరగతి నుంచే తెలుసు. తన చదువుకు ఆర్థిక సాయం నేనే చేస్తున్నా. ఏడో తరగతి చదివేప్పుడు అఫియా తన తండ్రిని కోల్పోయింది. అమ్మ, అక్కతో ఉంటూ చదువుతోంది. చిన్నతనంలోనే ఎత్తు పల్లాల్ని చూస్తున్న తన కథే ‘గుడ్‌ ఫ్యాక్టరీ’లో మొదటి టాక్‌. ఆమె చెప్పిన కథ.. తన మాటలు.. తనకున్న కలల్ని విని అక్కడున్న వారంతా ఎమోషన్‌ అయ్యారు. ఇలా నెలకోసారి మ్యూజింగ్స్‌, అన్‌ సంగ్‌ హ్యూమన్‌, విశ్వాసి, ప్రేరణ.. ఇలా పలు థీమ్స్‌తో ఇప్పటివరకూ పన్నెండు ఈవెంట్లు చేశాం. థీమ్‌కి తగినట్లు నలుగురు స్పీకర్లను ఎంచుకుంటాం. మరుగునపడిన ప్రతి మనిషి కథనూ వింటాం, గౌరవిస్తాం. మేం పెట్టుకున్న నియమం ఒక్కటే.. ఎవ్వరి కథని మేం జడ్జ్‌ చేయకూడదని. ఇప్పటి వరకూ మేం వందకిపైగా కథలు విన్నాం. వారి మనసులకు ఊరట కలిగించాం. ఎంతో మంది కళల్ని చూశాం. వారికి ప్రోత్సాహం అయ్యాం. ఇటీవలే ‘తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌’తో కలిసి ‘సంకల్ప్‌’ అనే థీమ్‌తో ఓ ఈవెంట్‌ చేశాం. సమాజానికి ఉపయోగపడేవాళ్లే మా హీరోలు. ఈవెంట్‌లో మాట్లాడేవాళ్ల పర్మిషన్‌ లేకుండా ఫొటోలు, వీడియోలు తీయం. ఎవరైనా సరే.. గుడ్‌ టాక్‌ ఫ్యాక్టరీకి స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. ఈవెంట్‌కి వచ్చిన ప్రేక్షకులు ఫోన్‌ పక్కనబెట్టి అందరి కథలనూ వినాలనేదే మా నియమం. వాళ్ల కథలని మేం వింటాం. ఈవెంట్‌లో   ఓపెన్‌ మైక్‌ ఉంటుంది. కామెడీ, కవిత్వం, సంగీతం, పాటలు పాడొచ్చు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్మైల్‌ ఇచ్చే ప్రతి సామాన్యుడూ సెలబ్రిటీనే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని