అలకి కాదు.. సంద్రానికే సవాల్‌!

ఉన్నత చదువు తర్వాత వికాస్‌ మార్కెట్‌ ట్రెండుని ఫాలో అవ్వాలనుకున్నాడు. మరుక్షణం మదిలో ఆలోచన.. స్టార్టప్‌. అంతే వేగంగా బృందాన్ని సమీకరించాడు. అభిరుచికి తగిన ఉత్పత్తితో మార్కెట్‌లోకి వెళ్లాలనుకున్నాడు. రాత్రీపగలూ కష్టం. పెట్టుబడులకై పరుగులు. మెప్పించేందుకు తిప్పలు. దిగాకగానీ లోతెంతో తెలియలేదు.

Published : 11 Jan 2020 00:27 IST

నరేంద్రుని సాక్షిగా..

యువకులేరి.. యువత ఎక్కడ?

గెలుపు ఓటముల మధ్య.. వికాస్‌ ఆత్మవిశ్వాసాన్ని వెతుక్కుంటున్నాడు!!

ఉన్నత చదువు తర్వాత వికాస్‌ మార్కెట్‌ ట్రెండుని ఫాలో అవ్వాలనుకున్నాడు. మరుక్షణం మదిలో ఆలోచన.. స్టార్టప్‌. అంతే వేగంగా బృందాన్ని సమీకరించాడు. అభిరుచికి తగిన ఉత్పత్తితో మార్కెట్‌లోకి వెళ్లాలనుకున్నాడు. రాత్రీపగలూ కష్టం. పెట్టుబడులకై పరుగులు. మెప్పించేందుకు తిప్పలు. దిగాకగానీ లోతెంతో తెలియలేదు. బలాలు, బలహీనతలు బ్యాలెన్స్‌ కాలేదు.. బృందాన్ని నడపలేకపోయాడు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. రెండే ఆప్షన్లు.. గెలుపు, ఓటమి.. రెండోది స్వీకరించలేడు. మొదటిది అందేలా లేదు. అయోమయం.. అగమ్యగోచరం..●

సమస్యలు, మానసిక సంఘర్షణలతో దోస్తీనా యువతంటే?

ప్రశాంతత, ఒత్తిడిల మధ్య రాధిక... లక్ష్య సాధనకై పరిగెడుతోంది!!

● ర్యాంకు సాధిస్తానని ఎంతో నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతోంది రాధిక. ఒక్కో పోస్టుకు వందలమంది పోటీ. ఏమైనా ఆ ఒక్కటీ తనదే కావాలని కోరిక. పరీక్ష సమీపిస్తున్నకొద్దీ ప్రశాంతత కోల్పోయింది. మదిలో ఒత్తిడి, అలజడి మొదలు. తిండి సహించదు. నిద్ర రాదు. చదివిందే చదువుతూ.. లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అనే అయోమయంతో లక్ష్యం వైపు పరుగెడుతోంది. అస్థిరత.. స్థిమితత్వలేమి..●

అదుపులేని ఆలోచనలు, గమ్యం తెలీని ప్రయాణాలు చేయడమేనా యువతంటే?

నమ్మకం, నిరుత్సాహం మధ్య స్మరేంద్ర... విజయం కోసం ఆరాటపడుతున్నాడు.

● స్మరేంద్ర శాస్త్రవేత్తగా ఎదగాలనుకున్నాడు. చిన్న వయసులోనే డాక్టరేట్‌ అందుకున్నాడు. కొత్త ఆవిష్కరణే అతని లక్ష్యం. ప్రజల అవసరాల్ని నిశితంగా పరిశీలిస్తూ ఎన్నో ఆలోచనలు. చిట్టా పెద్దదే. ఒకటి మొదలెట్టిన కొద్ది రోజులకే ధ్యాస మరో ప్రయోగంపై మళ్లడం.. ఫలితాలపై నమ్మకం లేక తిరిగి ఇంకోదానిపైకి.. ఇలా నమ్మకాన్ని నీరుగార్చుకుంటూ నిరుత్సాహంతోనే తన గమనం. అసంతృప్తి.. అసంపూర్ణత..

... ఇదేనా యువతంటే? ఆకర్షణతో దగ్గరై ఆలోచన ఎరుగని ప్రేమతో ఇంకొంత మంది.. అనుక్షణం కోపం, వేటిపైనో ద్వేషం.. ఇష్టం.. ఇగో.. అంతేనా యువతంటే? ఇంకేం కావాలి? స్థిరమైన గమ్యం, కచ్చితమైన మార్గం, రాజీలేనీ ప్రయత్నం.. నేటి తరానికి గమనంపై క్లారిటీ ఉందిగానీ కన్‌ఫ్యూజన్‌.. 4జీని దాటుకుని 5జీ వేగంతో జిందగీని జయించాలనుకుంటున్నారు. అయితే, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లా సుదూరంగా ఉండి దాగుడుమూతలాడే విజయాన్ని అందుకోవాలంటే? లక్ష్యంపై గురి పెట్టి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. అందుకు వివేకానందుడి సక్సెస్‌ ఫార్ములాలతో ఎక్స్‌ విలువని వెలికి తీయాల్సిందే. అదీ ఇప్పుడే. ఎందుకంటే.. రేపు వివేకానందుడి జయంతి. ‘ఆత్మవిశ్వాసం, లక్ష్యం, ప్రపంచ విజయం’. ఈ మూడింటినీ మూడు కళ్లల్లా చేసుకుని విజ్ఞాన గనిలా.. మునిలా.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వివేకానందుడి జ్ఞాన సారాన్ని గ్రహించాల్సిందే. దేశ వ్యాప్తంగా జరుపుకొనే జాతీయ యువజనోత్సవంలో విజయాన్ని హాట్‌స్పాట్‌లా మీ వెంటే తిప్పుకునేలా మైండ్‌ ప్రోగ్రామింగ్‌కి రీరైట్‌ చేయాల్సిందే. అప్పుడే ఆయన కోరినట్టుగా.. దేశ యువత అలకి తలొంచక సంద్రానికి సవాల్‌ విసురుతుంది!

యవ్వనం జోడెడ్ల బండవ్వాలి..

పదహారు ప్రాయానికి పరుగెత్తే సత్తువ ఉంటుంది కానీ.. దారిలో ఎదురయ్యే ఎత్తు పల్లాలు కనిపించవు. అదే.. అరవయ్యో వయసుకి ఉరకలేసే ఉత్సాహం ఉండదుగానీ.. వివేకంతో నడిచే ఓపిక ఉంటుంది.. ఈ రెండు ప్రాయాల్ని జోడెడ్లుగా చేసి యవ్వనమనే ఇరుసుని బలంగా బిగించి కంచా కర్రని విదిలిస్తే నువ్వు మరో ప్రపంచపు ద్వారాల్ని తెరిచినట్టే!!

వేళ్లు వెలుతురుని ఆపలేవు..

గదిలో ఓ మూల.. తల మోకాళ్లలో పెట్టుకుని.. చేతులతో కళ్లు మూసుకుని నా చుట్టూ చీకటే అనుకోవద్ధు ఈ విశాల విశ్వంలో నీ పుట్టుకకో కారణం ఉంది. నీకెన్నో శక్తులిచ్చి భూమికి పంపిందనే నిజాన్ని నువ్వెప్పుడు తెలుసుకునేది? పిడికిలెప్పుడు గుప్పెడు ధైర్యాన్ని ఇవ్వాలేగానీ.. దోసెడు చీకటిని కాదు. మూసిన కళ్లు తెరువు.. మసక చీకట్లను చీల్చేయ్‌.. మొదటి అడుగు వెయ్‌!

ఆలోచనే మూలం..

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడంటే.. ఆ ఐడియానే జీవితం అనుకున్నప్పుడు. అంతేగానీ... ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఎదురొచ్చిన ఆలోచనలతో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే.. ఎప్పుడో అప్పుడు ట్రెండు మారుతుంది. రెండో ఆలోచన మొదలవుతుంది. అందుకే.. మీవైన ఆలోచనలు, ఆశలు, కలలతో ఓ ఆవిష్కరణకి బీజం పడితే.. దానికి ఎలాగైనా రూపం ఇవ్వండి. కలలో.. ఇలలో.. దాంట్లోనే జీవిస్తూ మరో ప్రస్థానానికి నాంది పలకండి.

లైక్‌.. అన్‌లైక్‌ అయినా..

సోషల్‌ లైఫ్‌లో ఎప్పుడూ లైక్‌లు కొట్టేస్తూ.. అసలు అన్‌లైక్‌ ఒకటి ఉందన్న విషయాన్నే మర్చిపోతారు. కానీ, జీవితంలో అలా కాదు. లైక్‌లు, అన్‌లైక్‌లు రెండూ ఎదురవుతాయి. ఇష్టంపై ప్రేమనీ.. ద్వేషంపై కసినీ పెంచుకుంటే మీలోని హీరో కాస్త విలన్‌ అవుతాడు. అందుకే లైక్‌, హేట్‌.. రెండిటినీ ఒకేలా స్వీకరించాలి. ఇష్టపడితే ప్రేమించిన వారి గుండెల్లో ఉంటారు.. ద్వేషిస్తే వారి మనసులో ఓ ప్రశ్నగా మిగులుతారు. ఏదైనా మంచికే. మరో ఆరంభానికే!

ఇనుప కండలు.. ఉక్కు నరాల కోసం..

ఆత్మవిశ్వాసం సడలకుండా బలంగా నిలబడాలంటే.. ఇనుప కండలు, ఉక్కు నరాలున్న యువకుడు కావాలి. అది మీరే అయితే! ప్రపంచం మొత్తం ఓ కుటుంబంలా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. స్వీకరిస్తుంది. మీ మాటలు వింటుంది.. ఆగకుండా చప్పట్లు కొడుతుంది.. అచ్చం వివేకానందుడిలానే.. షికాగోలో ఆయన మాట్లాడింది ఇంచుమించు నాలుగు నిమిషాలే అయినా తర్వాత రెండు నిమిషాలు సభా ప్రాంగణం మొత్తం నిలబడి చప్పట్లు కొట్టినట్టు!!

నీలో నువ్వు.. నీతో నువ్వు..

నిత్యం నీతో ఉంటూ.. నిన్నే చూస్తూ.. వయసు వాసనలు రాని మరో నువ్వు నీలోనే ఉన్నాడని గమనించావా? నువ్వు ఓడినప్పుడు.. ఒంటరిగా ఉన్నప్పుడు.. ఎన్నో వేల సార్లు అరిచి. అరిచి.. పిలిచి గొంతెండిపోయి. నువ్వు నడిచొచ్చిన జాడల్లో అలసిపోయి ఉన్నాడు చూశావా? చూడు.. మాట్లాడు. నీతో పాటే సాన పెట్టుకున్న స్కిల్స్‌ని నేర్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇతరులెవ్వరూ నేర్పని పాఠాలు.. నీ సోల్‌మేట్‌ నీకు నేర్పుతాడు. తను నీలోనే దాగున్న నువ్వెరుగని ఆధ్యాత్మిక గురువు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు