అతని భవిత ఆమె కథ

థింక్‌ డిఫరెంట్‌ రాత్రి.. కరెంటు పోతే! అర నిమిషానికే అతలాకుతలమైపోతాం..ఛార్జింగ్‌ లైట్లు వెతికేస్తాం.. ఫోన్‌లో టార్చ్‌ ఆన్‌ చేస్తాం..ఓ పది నిమిషాలు కరెంటు రాకపోతే.. ఎవరెవరికో ఫోన్లు చేసి కనుక్కుంటాం. కానీ, ఓ మహిళకి 79 ఏళ్లుగా కరెంటు ఊసే లేదు! స్విచ్‌ ఆన్‌ చేసిన అనుభవం లేదు.. నిరుపేదేమో? అనుకునేరు! ఏం కాదు...

Published : 08 Feb 2020 01:33 IST

థింక్‌ డిఫరెంట్‌ రాత్రి.. కరెంటు పోతే! అర నిమిషానికే అతలాకుతలమైపోతాం..ఛార్జింగ్‌ లైట్లు వెతికేస్తాం.. ఫోన్‌లో టార్చ్‌ ఆన్‌ చేస్తాం..ఓ పది నిమిషాలు కరెంటు రాకపోతే.. ఎవరెవరికో ఫోన్లు చేసి కనుక్కుంటాం. కానీ, ఓ మహిళకి 79 ఏళ్లుగా కరెంటు ఊసే లేదు! స్విచ్‌ ఆన్‌ చేసిన అనుభవం లేదు.. నిరుపేదేమో? అనుకునేరు! ఏం కాదు.. ఆవిడో ప్రొఫెసర్‌.. తలుచుకుంటే సకల సౌకర్యాలు సమకూర్చుకోగలరు. కానీ, ప్రకృతిపై తనకున్న ప్రేమతో నేచర్‌కి నేస్తంగా మారిపోయారు. భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్‌) తగ్గించేందుకు సహజ వెలుతురుతోనే గడిపేస్తోంది!!
... ఇలాంటి వ్యక్తి గురించి తెలిస్తే ఏం చేస్తాం? సలామ్‌.. అంటాం.. ఎలా సాధ్యం అని ఆరా తీస్తాం? కొన్ని రోజులకు మర్చిపోతాం. కానీ, ఓ కుర్రాడు మాత్రం ఆమెని కలిశాడు.. పర్యావరణ ప్రేమికురాలి మనసు తెలుసుకున్నాడు.. ఓ డాక్యుమెంటరీ తీశాడు.. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్నాడు.. ఆస్కార్‌ దాకా వెళ్లాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు. మన తెలుగోడే.. రమణ దుంపల. తనకీ డాక్యుమెంటరీ ఆలోచన ఎలా వచ్చింది? పర్యావరణ ప్రేమికురాలితో తన ప్రయాణాన్ని ‘ఈతరం’తో పంచుకున్నాడిలా...

‘‘మాది శ్రీకాకుళం.. నాన్న సీఐఎస్‌ఎఫ్‌లో పని చేయడం వల్ల ఎప్పుడూ బదిలీలు. అందుకే నేను చాలా ఊర్లు తిరిగా. ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. చిన్నప్పటి నుంచీ సినిమాయే ప్రపంచం. బీటెక్‌లో ఉండగా కాలేజీ ఫెస్ట్‌లో షార్ట్‌ఫిల్మ్‌లు చేశాం. ఉన్న పరిమిత వనరులతోనే షూట్‌ చేసేవాళ్లం. అప్పటి పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్‌ నేను తీసిన షార్ట్‌ఫిల్మ్‌లు చూసి భవిష్యత్తులో సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే వచ్చి కలువు అని ప్రోత్సహించారు. అలా బీటెక్‌ తర్వాత    వేణు శ్రీరామ్‌ దగ్గర రైటర్‌గా పనిచేశా. తర్వాత డైరెక్టర్‌ సుజిత్‌తో కలిసి సాహో చిత్రానికి కొన్నిరోజులు పనిచేశా. ఆ చిత్రం కొనసాగుతుండగానే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ)లో సీటు వచ్చింది. నిజానికి ఎఫ్‌టీఐఐలో సీటు సంపాదించడం నా కల. వేరే ఆలోచనే లేకుండా ఎడిటింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యా. తర్వాత అదే ఇనిస్టిట్యూట్‌లో మళ్లీ సీటు సంపాదించి ఏడాది పాటు దర్శకత్వ కోర్సులో శిక్షణ పొందా. ఆ కోర్సు ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా రెండు షార్ట్‌ఫిల్మ్‌లు, ఒక డాక్యుమెంటరీ తీయాల్సి ఉంటుంది. అలా నేను చేసిన డాక్యుమెంటరీనే ‘గ్లో వామ్‌ ఇన్‌ ఎ జంగిల్‌’. దానికి ప్రేరణే 79 ఏళ్ల హేమ సానే..

ఆమెకి స్విచ్‌ ఆన్‌ చేయడమే తెలీదు...
ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా పలు ఆలోచనలు ఉన్నాయి. కానీ, నా దృష్టంతా పర్యావరణ ప్రేమికురాలైన పెద్దావిడ కథ చుట్టూనే తిరిగాయి. పుణెకి చెందిన హేమ సానే  79 సంవత్సరాలుగా కరెంటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. మిత్రుడి సహాయంతో ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు రెండు నెలలు కష్టపడ్డా. చివరికి అడ్రస్‌ తెలుసుకుని ఆమెని చేరాం. ఆవిడో రిటైర్డ్‌ బోటనీ ప్రొఫెసర్‌. ఆమెకి డాక్యుమెంటరీ విషయం చెప్పకుండా ప్రకృతి ప్రేమికుడిగా దగ్గరయ్యా. ఓ విద్యార్థిలా నెలన్నర పాటు రోజూ ఆమెతో కలిసి ముచ్చటించేవాడిని. పర్యావరణ పరిరక్షణపై ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు. అలా కొన్ని రోజులకు నా ప్రాజెక్టు పనిలో  సహకరించాలని కోరా. అలా      ‘గ్లో వామ్‌ ఇన్‌ ఎ జంగిల్‌’ ప్రారంభించా. రోజుకు 12గంటల చొప్పున రెండు రోజులు షూట్‌ చేశాం. 14 గంటల ఫుటేజ్‌ తయారు చేశాం. ఇనిస్టిట్యూట్‌ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీని 12 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అది కొంచెం కష్టమైన పనే. అయినా.. ఆవిడ జీవన శైలి, లక్ష్యం, ప్రకృతిపై తనకున్న ప్రేమ. తన వంతు బాధ్యతగా నిబద్ధతతో ఓ జీవిత కాలాన్ని సహజ వెలుతురులో గడుపుతున్న విధానాన్ని నిర్దేశిత నిడివిలోనే చూపించా. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించింది. అందుకే త్వరలో ఓ గంటన్నర పాటు పూర్తి వివరాలతో డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నా.
అవార్డు వచ్చిందలా
ఫ్రాన్స్‌, స్పెయిన్‌, రొమేనియాలతో పాటు అనేక దేశాల్లోని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో నా డాక్యుమెంటరీ ప్రదర్శితం అయ్యింది. హాంకాంగ్‌లో బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ అవార్డు, ఇటలీలో జ్యూరీ అవార్డు, రష్యాలో ప్రతిష్ఠాత్మక సైలెక్ట్‌ (కాపా)అవార్డు గెలుపొందింది. స్పెషల్‌ కేటగిరీ డైరెక్షన్‌లో నాన్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌గా మన గడ్డపైన నేషనల్‌ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది ఆమెకి దక్కిన గౌరవం అనుకుంటున్నా. గత ఏడాది డిసెంబరులో ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నా. 2018లో మన దేశం నుంచి ఆస్కార్‌కి రెండు డాక్యుమెంటరీలను ఎంపిక చేశారు. వాటిల్లో గ్లో వామ్‌ ఇన్‌ ఎ జంగిల్‌ ఒకటి.
అదే నా కల
తెలుగులో మంచి సినిమా చేయాలనుంది. అయితే, అది పూర్తి  కమర్షియల్‌ సినిమా మాత్రం కాదు. ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపుతా. దీంతో నేను చేసే సినిమాలు థియేటర్లకు రావడానికి సమయం పట్టొచ్చు. అంతేకాదు.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్ట్‌లో నా సినిమా ఉండాలన్నది నా కల. ఆ స్థాయిలో కచ్చితంగా సినిమా చేస్తా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని