మీరు సిద్ధమా?

అవును. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కబుర్లే. ఎవరి నోట విన్నా అవే ముచ్చట్లు. అంతలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ మహమ్మారి. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. మరైతే, ఈ సమయాన్ని ఖాళీగా వృథా చేసుకోకుండా ఎలా గడపాలి? పొదుపుగా ఎలా వాడుకోవాలి?..అనే ఆలోచనలు మీలో మొదలైతే.. ఈ ఛాలెంజ్‌లను ఆచరించండి!! సమయం ఇట్టే గడిచిపోతుంది. కాదు కాదు.. గడిపేయొచ్చు...

Published : 04 Apr 2020 00:47 IST

లాక్‌డౌన్‌ ఛాలెంజ్‌

తప్పదు.. ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. ఎన్ని రోజులు టీవీ చూస్తాం. ఎంత కాలం ఈ సోషల్‌ మీడియా! ఏదైనా కొత్తగా చేయాలి. ఇప్పటి వరకూ టైమ్‌ చిక్కక వదిలేసినవో.. ఓపిక లేక పక్కన పెట్టినవో.. ఇక స్టార్ట్‌ చేయాలి. అని ఆలోచనలో పడింది శ్రావ్య సుబ్రమణ్యం..

గత కొన్ని రోజుల లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైనందుకో ఏమో.. ఏవేవో అనవసరపు ఆలోచనలు.. పనికిరాని విషయాలతో నా బుర్ర పాడైపోయింది. ఇంకా వారంపైనే ఇంట్లో గడపాలి. బాబోయ్‌!! ఎలా గడుస్తాయో!!.. అనుకుంటూ తెగ హైరానా పడిపోతున్నాడు విక్రమ్‌..

అవును. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కబుర్లే. ఎవరి నోట విన్నా అవే ముచ్చట్లు. అంతలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ మహమ్మారి. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. మరైతే, ఈ సమయాన్ని ఖాళీగా వృథా చేసుకోకుండా ఎలా గడపాలి? పొదుపుగా ఎలా వాడుకోవాలి?..అనే ఆలోచనలు మీలో మొదలైతే.. ఈ ఛాలెంజ్‌లను ఆచరించండి!! సమయం ఇట్టే గడిచిపోతుంది. కాదు కాదు.. గడిపేయొచ్చు.

జరసోచో

వ్యాయామం తప్పనిసరి

అన్ని జిమ్‌లు, వర్కవుట్‌ సెంటర్‌లు తెరుచుకోవు. అందుకే ఇంట్లోనే వర్కవుట్స్‌ మొదలెట్టండి. అదీ క్రమం తప్పకుండా.. అందుకు ‘హోమ్‌ వర్కవుట్స్‌ ఛాలెంజ్‌’ ని ప్రయత్నించండి. పుష్‌ అప్స్‌, చిన్‌ అప్స్‌, చెయిర్‌ డిప్స్‌.. లాంటివి రోజుకు ఒక రకం ఎంచుకోండి. మీరు చేయడమే కాదు.. స్నేహితులకు ఛాలెంజ్‌ చేయండి. ఎలా వర్కవుట్స్‌ చేయాలో వీడియో క్లిప్‌లు పంపండి.

కథలు, కవితలు రాద్దాం..

కాలేజీల్లో రాసిన కవితలు.. పాడిన పాటలు.. అన్నీ గుర్తు తెచ్చుకోండి. ఎక్కడో మూల ఓ రచయిత మీలో ఉండే ఉంటాడు. పెన్ను, పేపర్‌ తీసుకుని ‘షార్ట్‌ స్టోరీస్‌’ రాయండి. లాక్‌డౌన్‌ ముగిసేలోపు ఓ కథల సంపుటే తయారవ్వొచ్ఛు ఇలా మీదైన శైలిలో ఏవైనా రాస్తే ‘కీప్‌ ఎ జర్నల్‌ ఛాలెంజ్‌’ విసరండి. మీకంటూ ఓ బ్లాగుని తెరవండి. దాంట్లో రాసిన వాటిని అందరితో పంచుకోండి. ఇతరుల్నీ రాసేలా ప్రేరేపించండి.

పరిశోధకులైపోదాం..

నాలుగు గోడలకే పరిమితం అవ్వడం అంటే.. ఓ సైంటిస్ట్‌లా మారిపోవడమే. మీకు ఇష్టమైన అంశాన్ని ఎంపిక చేసుకుని దానిపై పరిశోధించండి. ఉదాహరణకు మీకు సైన్స్‌ ఇష్టమైతే రానున్న కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో విశ్లేషించండి. దానిపై ఓ వ్యాసం రాయండి. ఎలాగూ.. అంతర్జాలం సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయి. వెబ్‌ విహారం చేయండి.. ప్రియ మిత్రులకు ‘రీసెర్చ్‌ ఛాలెంజ్‌’ని విసరండి.

‘ డిజిటల్‌ అక్షరాస్యత పెంచండి..

రానున్న కాలం మొత్తం డిజిటల్‌ యుగమే. మరైతే, మీ ఇంట్లో ఎంత మంది డిజిటల్‌ ఇండియాకి దగ్గరయ్యారు. గమనించి వారికి అంతర్జాలంపై అవగాహన కల్పించండి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో తీసుకోవాల్సిన రక్షణ చిట్కాల్ని వివరించండి. సైబర్‌ క్రైమ్‌లోని చీకటి కోణాల్ని వివరించండి. సోషల్‌ మీడియాలోని నకిలీ మనుషులు, వారి నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కళ్లకు కట్టినట్లు చెప్పండి. చుట్టూ ఉన్నవారికి కూడా ‘డిజిటల్‌ అక్షరాస్యత ఛాలెంజ్‌’ని విసరండి.

గరిటె తిప్పేయొచ్చు..

ఎన్నడూ వంట గది ముఖం చూడకుంటే.. వెళ్లి స్టౌ వెలిగించండి. ‘మేక్‌ ఎ ఫుడ్‌’ ఛాలెంజ్‌ విసరండి. యూట్యూబ్‌లో అనేక వంటల ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. చూస్తూ రోజుకో వంట చేస్తూ ఇంటిల్లిపాదికీ రుచి చూపించండి. మీరే ఓ కొత్త రెసిపీని కనిపెట్టి గ్రూపుల్లో వైరల్‌ చేయండి.

కొత్త భాషని నేర్చుకుందాం

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. కానీ, హిందీలో ఒక్క వాక్యం కూడా మాట్లాడలేరు. అర్థం చేసుకోలేరు. దీన్ని ఎలాగైనా అధిగమించాలి అనుకుంటే అనుకోని ఈ కరోనా సెలవుల్ని వాడుకోండి. అందుకు ‘లెర్న్‌ న్యూ లాంగ్వేజ్‌ ఛాలెంజ్‌’ని ఎంచుకోండి. బేసిక్స్‌తో మొదలెట్టి భాషపై పట్టు సంపాదించండి. అందుకు ప్లే స్టోర్‌లో అనేక రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టాల్‌ చేసి ప్రయత్నించండి. హిందీ సినిమాలు స్ట్రీమింగ్‌ మాధ్యమాల్లో చాలానే ఉన్నాయి. చూస్తూ నేర్చుకోవచ్ఛు ఇలా ఏదైనా కొత్త భాషని నేర్చుకుని మాట్లాడుతూ ఇతరులకు ఛాలెంజ్‌ చేయండి.

నైపుణ్యానికి సాన

మార్కులు వేరు.. నేర్చుకున్న స్కిల్‌ వేరు. అందుకే మీరు వెనకబడిన ఏదైనా స్కిల్‌కి సాన పెట్టండి. ఉదాహరణకు మీకు వేదికపై మాట్లాడడం అంటే భయం. అదో మంచి స్కిల్‌. దాన్ని కచ్చితంగా పెంపొందించుకోవాలి అనుకుంటే.. ఇదే సరైన సమయం. ఇంట్లో వాళ్లందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం సాధన చేయొచ్ఛు ఇలా మీరు ఉన్న రంగానికి సరిపడే స్కిల్స్‌ని తెలుసుకొని వాటిని మెరుగు పరుచుకోండి. మీరు సాధన చేస్తూనే ‘లెర్న్‌ న్యూ స్కిల్స్‌’ ఛాలెంజ్‌ విసరండి.

పుస్తక పఠనం చేసేయ్‌

గది కిటికీ నుంచి మరో ప్రపంచానికి తీసుకెళ్లే శక్తి పుస్తకాలకే ఉంది. అందుకే మీకు ఇష్టమైన పుస్తకాల్ని తీసి చదవండి. వాటిలో మీకు నచ్చిన అంశాన్ని పోస్ట్‌ చేయండి. ఇంట్లో వాళ్లతో చర్చించండి. లాక్‌డౌన్‌ ముగిసే నాటికి కొన్ని పుస్తకాలు మీకు మరపురాని స్నేహితులవుతాయి. అంతేకాదు.. పుస్తక పఠనం ఓ అలవాటుగా మారిపోతుంది. అందుకే.. చదివిన పుస్తకాలతో సెల్ఫీ తీసుకుని దోస్త్‌లకు ‘రీడ్‌ ఎ బుక్‌ ఛాలెంజ్‌’ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని