భరత్‌ అనే నేను..రోబోలు చేస్తున్నాను!

మొన్న మోదీని, ఇవాంకను అన్నయ్య మెప్పించాడు.. నిన్న షాపింగ్‌మాల్స్‌, బ్యాంకుల్లో తమ్ముడు సందడి చేశాడు.. నేడు మరో చెల్లితో కలిసి కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారెవ్వా! ఇన్ని గొప్ప పనులు చేసే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఎవరికుండదు? అయితే వీళ్లంతా మన మనుషులు కాదు.. మర మనుషులు అంటే ఆశ్చర్యమేగా! ఆ రోబోల కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో యువకుడు దండు భరత్‌కుమార్‌ కృషి ఎంతో ఉంది. భరత్‌ రోబోల గురించి చెప్పిన విశేషాలు చదివేయండి మరి!...

Published : 16 May 2020 01:05 IST

థింక్‌ డిఫరెంట్‌

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రోబోలు..

లాక్‌డౌన్‌లో ఇంటి నుంచే ఇంజినీరింగ్‌ చదువులకు యాప్‌ చెప్పే పాఠాలు..

అందుబాటులోకి తెచ్చింది ఎవరో కాదు. మన తెలుగు కుర్రాళ్లే.. ‘ఈతరం’ వారిని పలకరించింది..

మొన్న మోదీని, ఇవాంకను అన్నయ్య మెప్పించాడు.. నిన్న షాపింగ్‌మాల్స్‌, బ్యాంకుల్లో తమ్ముడు సందడి చేశాడు.. నేడు మరో చెల్లితో కలిసి కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారెవ్వా! ఇన్ని గొప్ప పనులు చేసే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఎవరికుండదు? అయితే వీళ్లంతా మన మనుషులు కాదు.. మర మనుషులు అంటే ఆశ్చర్యమేగా! ఆ రోబోల కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో యువకుడు దండు భరత్‌కుమార్‌ కృషి ఎంతో ఉంది. భరత్‌ రోబోల గురించి చెప్పిన విశేషాలు చదివేయండి మరి!

ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల రోగులకు చికిత్స అందించే క్రమంలో కొందరు వైద్యులకు కూడా కొవిడ్‌-19 సోకింది. అందుకే అనుమానితులను నేరుగా ముట్టుకోకుండా మర మనుషుల సాయం తీసుకుంటున్నారు. వాళ్లే మిత్ర, మిత్రి. బెంగళూరులోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో ఇవి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నాయి. గత మూడు వారాల నుంచి వేలాది మందికి పరీక్షలు చేసి కరోనా వ్యాప్తిని నివారిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిన వారు మిత్ర ముందు భౌతిక దూరం పాటిస్తూ నిలబడాలి. రోగి పేరు, చరవాణి నంబరు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటుంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేసుకొని వారికి పాసు ఇస్తుంది. తరవాత మిత్ర చెల్లి మిత్రి రోబో వద్దకు వెళ్లాలి. మిత్రి రోబోపై ఉండే తెర ద్వారా డాక్టర్లు, రోగితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకుంటారు. కరోనా లక్షణాలు ఉంటే నేరుగా కొవిడ్‌ వార్డుకు పంపుతారు. లేదంటే మిత్రి సాధారణ వైద్య సేవలకు వెళ్లేందుకు పాస్‌ ఇచ్చి పంపుతుంది.

చిన్నప్పటి నుంచే

వరంగల్‌కు చెందిన దండు భరత్‌కుమార్‌, తన స్నేహితులు కలిసి 2016లో ఇన్వెంటో అనే అంకుర సంస్థను స్థాపించారు. ఈ కంపెనీలో భరత్‌ ముఖ్య సాంకేతిక అధికారి (సీటీఓ)గా పనిచేస్తున్నారు. ఇక బాలాజీ విశ్వనాథన్‌ సీఈఓగా, మహాలక్ష్మి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. భరత్‌ 2009లో కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం మద్రాసు ఐఐటీలో ఎంటెక్‌ చేశాడు. వీళ్ల నాన్న విమానయాన రంగంలో మెకానికల్‌ వింగ్‌లో పనిచేసేవారట. దాంతో ఇంట్లో ఉన్న రకరకాల పరికరాలతో భరత్‌ ఆడుకునేవాడట. అలా నాలుగో తరగతిలోనే తన సైకిల్‌ను తాను రిపేర్‌ చేసుకోవడం అలవాటైంది. అలా అలా ఆసక్తి కాస్తా రోబోలను రూపకల్పన చేసే వరకూ వెళ్లింది. ఎంటెక్‌ పూర్తి చేశాక ఓ కంపెనీలో అయిదంకెల జీతంతో మంచి కొలువే వచ్చింది. కానీ ఎప్పటికైనా సొంత కంపెనీ స్థాపించాలనే తన లక్ష్యం కోసం ఉద్యోగం వదిలేశాడు. అప్పుడు అమెరికాలో ఉంటున్న బాలాజీతో పరిచయం ఏర్పడి, చివరకు ఇన్వెంటో అనే రోబో అంకుర సంస్థను 2016లో స్థాపించారు. భరత్‌, విశ్వనాథన్‌, మహాలక్ష్మి ముగ్గురు కలిసి నెలకొల్పిన ఈ సంస్థలో ఇప్పుడు 30 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

వందకు పైనే రోబోలు..

మిత్ర సిరీస్‌లో భాగంగా భరత్‌ బృందం ఇప్పటి వరకు 6 రకాల రోబోలను రూపొందించింది. మొత్తంగా వందకుపైగా రోబోలను వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. వీళ్ల రోబో మొదట్లోనే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ప్రధాన మంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాంకేతికతతో కూడుకున్న ఈ సదస్సును భిన్నంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో మిత్ర రోబోను వినియోగించారు. అది వేదికపై అందరికీ నమస్కరించి సదస్సును విజయవంతంగా ప్రారంభించింది. ఆ తర్వాత బ్యాంకులు, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లలో వారి వారి అవసరాలకు తగ్గట్టు కస్టమర్లతో మాట్లాడడానికి, ఇతర సేవలు అందించడానికి భరత్‌ బృందం రోబోలను తయారుచేస్తోంది. ఇప్పటి వరకు దుబాయ్‌, అమెరికా, న్యూజిలాండ్‌, ఫిన్‌లాండ్‌ వంటి దేశాలకు రోబోలను ఎగుమతి చేశారు. భవిష్యత్తులో రోబో పరిజ్ఞానం ఎంతో కీలకం అవుతుందని, చాలా మంది రోబోల వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారని, కానీ వీటి వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని భరత్‌ చెబుతున్నాడు.

ఎన్నో ప్రత్యేకతలు

అటానమస్‌ నావిగేషన్‌ ద్వారా ఆసుపత్రి, షాపింగ్‌ మాల్స్‌, బ్యాంకులు.. ఎక్కడైనా ఇవి సొంతంగా తిరుగుతూ వినియోగదారులతో మాట్లాడగలవు.

క్లౌడ్‌ కంట్రోల్‌ పరిజ్ఞానంతో రోబోలు కనెక్ట్‌ అయ్యి ఉంటాయి. అంటే ఒకే సంస్థ హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరులలో ఈ రోబోలను వినియోగిస్తే ఈ మూడూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. హైదరాబాద్‌లో ఉన్న రోబో ఓ వ్యక్తి ఫేస్‌ రీడింగ్‌ చేస్తే బెంగళూరులో ఉన్న రోబో అతని పూర్తి వివరాలు చెప్పగలదు.

రోబోలకు పైలట్లు కూడా ఉంటారు. వీరికి శిక్షణ ఇస్తారు.

మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా.. ఇవి అవసరాలకు తగ్గట్టు పనులు చేయగలవు. ఉదాహరణకు కరోనా సమయంలో ఎక్కువ మంది పారాసిటమల్‌ టాబ్లెట్‌ను అడిగితే.. నేరుగా మాత్ర వేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతుంది. పలు భాషల్ని అర్థం చేసుకోగలవు.

ఒకే పని కాకుండా అవసరాలకు తగ్గట్టు కృత్రిమ మేధను ఉపయోగించగలవు. ఉదాహరణకు ఇప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న రోబోలు భవిష్యత్తులో మరో పనిని కూడా చేయగలవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని