దూరం.. దూరం.. జరగండి!

కరోనా కారణంగా సామాజిక దూరం పాటిస్తున్నాం.. జీవనశైలిలో దాన్ని భాగం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాం.. దీంతో పాటు ఇప్పుడు మరో ట్రెండు నెట్టింట్లో పుట్టుకొస్తోంది.. అదేంటో

Published : 06 Jun 2020 01:04 IST

సోషల్‌ మీడియా డిస్టెన్సింగ్‌

కరోనా కారణంగా సామాజిక దూరం పాటిస్తున్నాం.. జీవనశైలిలో దాన్ని భాగం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాం.. దీంతో పాటు ఇప్పుడు మరో ట్రెండు నెట్టింట్లో పుట్టుకొస్తోంది.. అదేంటో తెలుసా? ‘సోషల్‌ మీడియా డిస్టెన్సింగ్‌’ (ఎస్‌ఎండీ). మిలీనియల్స్‌ మదిలో పుట్టుకొచ్చిన ఆలోచన ఇది.. రోజులో కొంత సమయం పాటు అన్ని సోషల్‌ మీడియా ఎకౌంట్‌లను లాగ్‌ అవుట్‌ చేస్తున్నారు. దీని ఉద్దేశం ఒక్కటే.. వర్చువల్‌ ప్రపంచం నుంచి వాస్తవికతకు దగ్గరవడం.. లాక్‌డౌన్‌ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుని ‘జెన్‌-జీ’లూ ఆహ్వానిస్తూ సోషల్‌ మీడియా నుంచి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధం అవుతున్నారు..

పెరుగుట విరుగుటకే..

ఖాళీ దొరికితే చాలు. కాసేపు ఇన్‌స్టాలో.. తర్వాత ఎఫ్‌బీ.. అక్కడి నుంచి ట్విటర్‌ కళ్లు, మునివేళ్లు అన్నీ అంగుళాల తెరపైనే. ఎంతలా అంటే.. రోజులో 3 నుంచి 4 గంటలు ‘సోషల్‌ లైఫ్‌’లోనే చక్కర్లు కొట్టారు. ఇక లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైతే.. వేరే చెప్పాలా? నెట్టింటి తలుపులు తెరిచేసి నిత్యం సోషల్‌ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇంచుమించు రోజులో 6 నుంచి 7 గంటలు. లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదటి వారంలో అయితే దేశంలో 87 శాతం సోషల్‌ మీడియా వాడకం పెరిగిందట. ఇది ఓ రకంగా యువతలో ఎక్కువగా మానసిక సమస్యలకు దారితీస్తోంది. నిత్యం ఏదో ఒకటి అప్‌లోడ్‌ చేయడానికి ప్రయత్నించడం. ఇంట్లో అందుకు తగిన వాతావరణం లేకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు. సమస్యని అధిగమించేందుకు కొందరు యువత ఈ సోషల్‌ మీడియా డిస్టెన్సింగ్‌ని పాటిస్తూ కొత్త అలవాట్లకు దగ్గరవుతున్నామని చెబుతున్నారు.

కొన్ని నిమిషాలతో మొదలు..

‘లాక్‌డౌన్‌ మొదలయ్యింది మొదలు కొన్ని రోజుల్లోనే సోషల్‌ మీడియా నుంచి మెల్లగా దూరం జరగాలనుకున్నా. అందుకు కారణం ఇంట్లో వాతావరణమే. పేరెంట్స్‌, కజిన్స్‌.. చుట్టూ ఇంతమందిని పెట్టుకుని నేను ఒక్కడినే సోషల్‌ మీడియాలో గంటలు గంటలు.. ఏం చేస్తున్నా? అనే ఆలోచన వచ్చిన నాటి నుంచి రోజులో కొంత సమయం పాటు అన్ని ఎకౌంట్‌ల నుంచి సైన్‌ ఆఫ్‌ అవ్వడం కాస్త రిలీఫ్‌గా అనిపించింది. సమయాన్ని వేరే వాటిపై వెచ్చిస్తూ సోషల్‌ మీడియా నుంచి రోజులో కొన్ని గంటలే కాదు. రోజుల పాటు దూరంగా జరిగా. నాలో నేను ఊహించని కొత్త మార్పులు గమనిస్తున్నా. అప్పుడే నాకు ఇలా అనిపించింది. కరోనా నుంచి ‘సామాజిక దూరం’తో ఎలాగైతే జాగ్రత్త పడుతున్నామో.. సోషల్‌ మీడియా లైఫ్‌ నుంచి కాస్త పక్కకు జరిగేందుకు ‘సోషల్‌ మీడియా డిస్టెన్సింగ్‌’ని పాటించాలని నిర్ణయించుకున్నా’ అని గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేస్తున్న రత్న చెబుతున్నాడు.

అపోహలు మరో కారణం..

‘ఇన్‌స్టాలో స్క్రోల్‌ చేసినా.. ట్విటర్‌ ఓపెన్‌ చేసినా.. కనిపించే అప్‌డేట్స్‌ అన్నీ ఇప్పుడున్న భయాందోళనల్ని మరింత పెంచేవే. ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి. అందుకేనేమో.. నాకు బ్రేక్‌ తీసుకోవాలి అనిపించింది. నాకు తెలియకుండానే ఎకౌంట్‌లలో సైన్‌ఇన్‌ అవ్వడం తగ్గించేశా. అమ్మతో ఎక్కువ సమయం గడిపా. గార్డెనింగ్‌పై ఆసక్తి పెంచుకున్నా. గత నెల రోజుల్లో మా అమ్మతో కలిసి నా గదిని మొక్కలతో అలంకరించేశా. గతంలో ఎప్పుడూ నా గదిని ఇలా చూడలేదు. బహుశా.. దీన్ని సోషల్‌ మీడియా డిస్టెన్సింగ్‌ అనడం కరెక్టేనేమో..’ అంటోంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వర్షిణి.

మీరూ పాటిస్తారా?

ఎవరేమి చెప్పినా.. అలవాటు ఏదైనా.. పరిధి దాటితేనే ఇబ్బంది. అందుకే సామాజిక దూరాన్ని అలవాటు చేసుకున్నట్టుగానే ‘ఎస్‌ఎండీ’ని పాటిస్తే మంచిది. మీరు ఎంచుకున్న నిర్ణీత సమయాల్లో అన్ని ఎకౌంట్‌లను లాగ్‌ ఆఫ్‌ చేయండి. మళ్లీ మీకు అనిపించినప్పుడే లాగిన్‌ అవ్వండి. లాగ్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడు కొత్త అలవాట్లపై ఫోకస్‌ చేయండి. మీకు ఇష్టమైంది ఏదైనా సరే. దీంతో మీ జీవన శైలిలో ‘స్క్రీన్‌ టైమ్‌’ తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని