నేతన్నకు నచ్చేలా..దేశం మెచ్చేలా!

ముగ్గురు మిత్రులు... కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి ప్రశంసలు అందుకున్నారు... ఎన్‌ఐటీ స్నాతకోత్సవంలో అందరి మెచ్చుకోలు పొందారు... వాళ్లే ‘పిక్‌ మై క్లాత్‌’ అంకురసంస్థ వ్యవస్థాపకులు. దళారుల బారిన పడకుండా నేతన్నల నుంచి నేరుగా వినియోగదారులకే పట్టుచీరలు అందేలా చేస్తున్నారు...అలా దేశవ్యాప్తంగా వేయిమందిని ఒక్కచోటికి తీసుకొచ్చారు.... ఆ మిత్రబృందం దినేశ్‌, రామ్‌కళ్యాణ్‌, అభిషేక్‌లతో ఈతరం ముఖాముఖి.

Published : 24 Oct 2020 01:24 IST

ముగ్గురు మిత్రులు... కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి ప్రశంసలు అందుకున్నారు... ఎన్‌ఐటీ స్నాతకోత్సవంలో అందరి మెచ్చుకోలు పొందారు... వాళ్లే ‘పిక్‌ మై క్లాత్‌’ అంకురసంస్థ వ్యవస్థాపకులు. దళారుల బారిన పడకుండా నేతన్నల నుంచి నేరుగా వినియోగదారులకే పట్టుచీరలు అందేలా చేస్తున్నారు...అలా దేశవ్యాప్తంగా వేయిమందిని ఒక్కచోటికి తీసుకొచ్చారు.... ఆ మిత్రబృందం దినేశ్‌, రామ్‌కళ్యాణ్‌, అభిషేక్‌లతో ఈతరం ముఖాముఖి.
మహిళలు ఓ దుకాణానికి చీర కొనడానికెళ్తే కంచి, ధర్మవరం, బనారస్‌, పోచంపల్లి.. ఇలా బోలెడు రకాలు ముందు వేస్తారు. ధర అదిరిపోయేలా ఉంటుంది. కానీ ఆ చీర నేసిన నేతన్నకు అందులో దక్కేదెంత? కష్టం చేనేతలది, లాభం మధ్యవర్తులు, దుకాణదారులది. వినియోగదారులే నేతన్నల నుంచి నేరుగా కొనగలిగితే? కష్టపడ్డ వారికే లాభం, నాణ్యమైన చీరలు వినియోగదారుల సొంతం అవుతాయి కదా అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ‘పిక్‌ మై క్లాత్‌’ అంకుర సంస్థ. ఈ వేదిక దేశవ్యాప్తంగా వేయికిపైగా చేనేత కార్మికులు తమ చీరలు, చేనేత వస్త్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. 25వేలకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

*చేనేత కార్మికులు ఎప్పుడూ కొన్నిరకాల డిజైన్లే నేస్తుంటారు. అందుకే యాప్‌లో ప్రముఖ డిజైనర్లను కూడా నేతన్నలతో అనుసంధానిస్తున్నారు. దీంతో వారు కొత్త ప్రయోగాలు చేయడానికి వీలవుతుందని, వినియోగదారులు మరింత   ఇష్టపడి కొంటారని ఈ కొత్త ఆలోచన చేశారు.

* ఈ మిత్రులు అనేక ప్రాంతాల్లో పరిశీలిస్తే అక్కడ నేతన్నలకు దుకాణదారులు ఆర్డర్లు ఇచ్చాక డబ్బులు చెల్లించేందుకు నెలల తరబడి జాప్యం జరుగుతోందట. అందుకే పిక్‌ మై క్లాత్‌ ద్వారా వినియోగదారులు ఆర్డర్‌ ఇచ్చిన వెంటనే చేనేతలకు డబ్బులు అందేలా చేస్తున్నారు.

* అనేక ప్రాంతాలను సందర్శించే సరికి చేనేతల గొప్పతనమేంటో తెలిసిందని ముగ్గురు స్నేహితులు అంటున్నారు. కొన్ని చీరలు నేసేందుకు ఏడాది సమయం కూడా పడుతుందిట. అందులో పనితనం అలా ఉంటుంది మరి. ఇటీవలే వీరి యాప్‌ ద్వారా      ఓ వినియోగదారుడు పైతానీ నేతన్నకు ఒక పట్టు చీరకు గానూ రూ. 1.72 లక్షల ఆర్డర్‌ వచ్చింది.
అవాంతరాలు దాటి
వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ) పూర్వ విద్యార్థులే ఈ ముగ్గురు. దినేశ్‌ది వరంగల్‌. ఖమ్మం కుర్రాడు రామ్‌కళ్యాణ్‌, హైదరాబాద్‌ వాసి పి.వి.అభిషేక్‌ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలనే ఆలోచన ముగ్గురిని కలిపింది. వరంగల్‌లోని కొత్తవాడలో అద్భుతమైన తివాచీలు నేస్తారు. కానీ తగినంత గిరాకీ లేక అమ్ముడవవు. ఇక్కడి నేతన్నల దుర్భర స్థితి చూశాక వారి కోసం ఓ ఆన్‌లైన్‌ వేదిక కల్పించాలనుకొని పిక్‌ మై క్లాత్‌ ప్రారంభించారు. మొదట్లో స్పందన తక్కువగానే ఉన్నా 2017 నుంచి ఈ వేదికను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ స్టార్టప్‌ ప్రారంభించడానికి వీళ్లు పడ్డ కష్టం తక్కువేం కాదు. దేశంలో రకరకాల చేనేత క్లస్టర్లున్నాయి. ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడానికి దేశమంతా తిరిగారు. ఆ చీరలు వెబ్‌సైట్‌, యాప్‌లలో అప్‌లోడ్‌ చేసేలా కష్టపడి సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. మొదట్లో ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అమెరికా నుంచి ఆర్డర్‌
పిక్‌ మై క్లాత్‌ కోసం రెండు యాప్‌లు రూపొందించారు. సెల్లర్‌ యాప్‌ని వీవర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, రిజిస్టర్‌ అయిన తర్వాత డిజైన్లు అప్‌లోడ్‌ చేస్తే చాలు. చదువు రాని వారు సైతం తేలికగా అర్థం చేసుకునేలా ఈ యాప్‌ రూపొందించాం అంటాడు కళ్యాణ్‌.  రెండో దాంట్లో వినియోగదారులు ఆర్డర్లు ఇస్తారు. తొలి ఆర్డర్‌ అమెరికా నుంచి ఓ మహిళ ఇచ్చారు. ఆమె నేరుగా కంచి చేనేతకారుడి నుంచి చీర కొన్నారు. దీంతోపాటు ముగ్గురు మిత్రులూ తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ, గొల్లభామ, నారాయణ్‌పేట, కలంకారీ, మంగళగిరి తదితర రకాలు నేసే నేతన్నలను కలిశారు. ముంబయి దగ్గరి పైతాన్‌, భాగల్‌పూర్‌, కోట, పటోల లాంటి ప్రాంతాల్లోని నేతన్నలను కూడా సంప్రదిస్తే తొలుత కాస్త భయపడ్డారు. ఇలా తాము ఆన్‌లైన్‌లో అమ్మితే వ్యాపారులు తమకు ఆర్డర్‌ ఇవ్వరని వెనక్కి తగ్గినా, తర్వాత వీరి చీరలకు మంచి ఆదరణ ఉండడంతో ముందుకొచ్చారు. అలా ఇప్పటి వరకు వెయ్యి మంది చేనేతదారులు పిక్‌ మై క్లాత్‌తో భాగస్వాములయ్యారు. చేనేతల వద్ద మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తే ధర తక్కువ చెల్లించి, వారి దుకాణాల్లో మాత్రం 30 నుంచి 40 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని, కానీ నేతన్నలు పడ్డ కష్టానికి వారే ప్రతిఫలం పొందుతారు. పైగా వినియోగదారులకు తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో ఇరువురికీ లాభదాయకం అంటున్నారు మిత్రత్రయం. నామమాత్రమైన లాభం తీసుకొని ఇరువైపులా లాభం చేకూర్చడమే మా లక్ష్యం అంటున్నారు. పిక్‌ మై క్లాత్‌ జీరో ఇన్వెంటరీ మోడల్‌. అంటే ఎక్కడా స్టాకును నిల్వ చేయరు. చేనేత కళాకారులే నేరుగా ఈ పిక్‌ మై క్లాత్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఆర్డర్‌ ఇస్తే వినియోగదారులకు కొరియర్‌ ద్వారా అందిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని