మించిపోకముందే పంచుకుందాం!

క్యాంపస్‌ కబుర్లు.. పిట్టగోడ ఊసులు.. హ్యాంగ్‌ అవుట్‌లు.. ఫెస్ట్‌లు.. ఇవేం లేవు.. నెలల తరబడి ఇంటికే పరిమితం.. దీంతో ఏదో తెలియని ఒత్తిడి.. ఇలాంటి సమయంలో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అప్పుడు పరిష్కారం కోసం ఒంటరిపోరాటం చేయక్కర్లేదు.. అలసి, అయోమయంతో ఆందోళన చెందక్కర్లేదు..

Published : 14 Nov 2020 00:14 IST

లైఫ్‌కోచ్‌

క్యాంపస్‌ కబుర్లు.. పిట్టగోడ ఊసులు.. హ్యాంగ్‌ అవుట్‌లు.. ఫెస్ట్‌లు.. ఇవేం లేవు.. నెలల తరబడి ఇంటికే పరిమితం.. దీంతో ఏదో తెలియని ఒత్తిడి.. ఇలాంటి సమయంలో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అప్పుడు పరిష్కారం కోసం ఒంటరిపోరాటం చేయక్కర్లేదు.. అలసి, అయోమయంతో ఆందోళన చెందక్కర్లేదు.. ప్రపంచానికి దూరంగా పారిపోయి పిచ్చోళ్లు అవ్వక్కర్లేదు.. ఆయువు తీసుకుని అందనంత దూరం వెళ్లిపోదామనే ఆలోచన రానివ్వక్కర్లేదు.. తరచి చూడండి చాలు.. చుట్టూనే ఉన్నారు.. వాళ్లు ఎవరో కాదు.. ఎప్పుడూ మీతో ఉండేవాళ్లే.. మీకు బాగా తెలిసినవాళ్లే! మీ వయసుని దాటెళ్లినవాళ్లే.. గుర్తుకు రావడం లేదా? ఉన్నచోటుని వదిలేసి వర్చువల్‌ లోకాల్లో విహరించడానికి అలవాటు పడ్డారుగా.. అంగుళాల తెరకే అంకితమైపోయారుగా.. అక్కడ ఏం దొరుకుతుంది. కాసిన్ని కామెంట్‌లు..  లైక్‌లు తప్ప. వాస్తవ ప్రపంచంలోకి రండి. తరచి చూడండి కనిపిస్తారు. మీ మనసు మాట వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అప్పుడు మీకొచ్చిన సమస్య మిమ్మల్ని బలహీనుల్ని చేయలేక భయపడి పారిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. పండగ పూటే ప్రేమతో పంచుకునేందుకు సిద్ధమైపోండి..
వినేందుకు వారెప్పుడూ సిద్ధమే!
ఐదేళ్లప్పుడు నాన్న చేతిని వదలకుండా తిరిగిన పార్కు... అమ్మ పక్కనే  కూర్చుని ఆడుకున్న బెంచీ. ఎక్కడుందో వెతకండి. ఇప్పుడూ కలిసి వెళ్లి  కూర్చోండి. ఎప్పటి నుంచో మీరు షేర్‌ చేసుకోవాలనుకునేవి పంచుకోండి.  మీకు ఇష్టమైన కోర్సు గురించో.. మీరు కలలుగనే కెరీర్‌ గురించో.. మీరు  ప్రేమిస్తున్న అమ్మాయి గురించో.. విషయం ఏదైనా. ఓ ఫ్రెండులా పంచుకోండి. ఎలా రియాక్ట్‌ అవుతారో అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. వాళ్లూ ఒకప్పటి వినయ.. విధేయ మిలీనియల్సే! అర్థం చేసుకుంటారు.. విడమరచి చెబుతారు.
అన్నీ పంచుకునే అన్న..
ముందెళ్లి అన్ని రిస్కుల్ని ఎదుర్కొనేది వాడే. ‘రేయ్‌.. పోరా.. ఏరా..’  అంటాడు. ఏదైనా తప్పు చేస్తే ఒక్కటిస్తాడు. కొన్ని సార్లు తమ్ముడి తప్పుల్ని ఒక్కడే మీదేసుకుంటాడు. అంతకంటే ఏం కావాలి? ఎంతైనా జిందగీలోకి  మీకంటే ముందొచ్చిన సీనియర్‌ కదా! మీరెళ్లే దారి తనకి అర్థమైపోతుంది. వద్దని వారిస్తే వినండి. నాన్నకి తప్పు చేశాకే తెలుస్తుంది. అదే అన్నకైతే చేయకముందే తెలిసిపోతుంది. బాధ, సంతోషంతో ఏదైనా కలిసి పంచుకోవడానికి ఇంతకంటే మంచి ఫ్రెండు ఎవరుంటారు? అన్నో.. అక్కో.. ఎవరున్నా ఓపెన్‌ అయిపోండి. వారి స్వచ్ఛమైన మనసు లోతుల్లో.. విలువైన సూచన దొరుకుతుంది.
జ్ఞానాన్ని అందించే మాస్టారు
ఆయన ముందు బ్లాక్‌బోర్డు.. వెనకేమో మీరంతా. వెనక్కి తిరిగిన మాస్టారు బ్లాక్‌ బోర్డులో మీరు అందుకోబోయే ఉన్నతమైన రంగుల ప్రపంచాన్ని చూస్తుంటే.. మీరేమో అల్లరి చేష్టలతో ఆటపట్టిస్తుంటారు. అయినా, ఆయన ఆపకుండా బోధిస్తుంటారు. ఎందుకంటే.. మీరు చెసే అల్లరి మాస్టారుకి తెలియకా కాదు. కట్టడి చేయలేకా కాదు. అదంతా ఆయన చేసిందే.. చూసిందే. మరెందుకు భయం. కెరీర్‌లో మీకే కష్టం వచ్చినా.. కల్మషం లేకుండా పంచుకునేందుకు నిత్యం సిద్ధంగా ఉండండి. అమ్మ, నాన్న తర్వాత ఆచార్యుల అండని గుర్తెరగాలి. కాళ్లకి నమస్కారం చేయకపోయినా.. సంస్కారంతో వారిని గౌరవించడం అలవాటు చేసుకోండి.

 

- శోభన్‌ కుమార్‌ పాకలపాటి
NIHWN.Co

ప్రియ మిత్రులు
కాలేజీ గేటులో మొదలైన పరిచయం ఒకటే మంచం.. ఒకటే కంచం వరకూ సాగుతుంది. కోర్సు ముగిసి క్యాంపస్‌ దాటగానే ఆ స్నేహం కాస్తా పాసింగ్‌ క్లౌడ్‌లా మాయం అయిపోతే ఎలా? నింగినంటేద్దాం!! అంటూ  సాగే ప్రయాణంలో ఏ క్షణాన నల్లమబ్బులు కమ్ముకుంటాయో చెప్పలేం.  మెరుపులొస్తాయ్‌.. ఉరుములు భయపెడతాయ్‌. అప్పుడు కన్నెత్తి చూస్తూ మబ్బుల్ని కరిగించి వర్షంలా మార్చే స్నేహితులు కొందరైనా కనిపించాలి. అప్పుడే.. ఇంద్రధనుస్సులాంటి రంగుల ప్రపంచాన్ని అందుకుంటారు. మెరుగైన ర్యాంకుని సాధించేందుకు.. మార్కుల్లో శాతాన్ని పెంచుకునేందుకే కాదు. బరువెక్కిన మనసుని తేలిక పరిచేందుకు.. కలల్ని పంచుకునేందుకు స్నేహాన్ని కోరండి. కలిసి కాసేపు గడపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని