Published : 21 Nov 2020 00:53 IST

దాతలు.. గ్రహీతల వారధి!

అమెరికన్‌ ప్రభుత్వం టచ్‌ ఏ లైఫ్‌ను గుర్తించి, ఆ సంస్థకు అందే విరాళాల మీద పన్ను మినహాయింపు ఇస్తోంది.
ఆపన్నులు ఒకవైపు.. ఆదుకునే మనసున్నవాళ్లు మరోవైపు... అయినా కాలే కడుపుతో రోజు గడిపేవాళ్లు ఎందరో... సాయం అందక జీవితంలో ఎదగని వాళ్లు మరెందరో... అందుకే.. దాతలు, గ్రహీతలకు మధ్య వారధిలా ఉండాలనుకున్నాడు తేజ్‌ గుండవల్లి... టచ్‌ ఏ లైఫ్‌ స్వచ్ఛందసంస్థతో అమెరికాలో మరువలేని సేవలు అందిస్తున్నాడు...సొంతగడ్డపై మమకారంతో  భారత్‌కీ విస్తరిస్తున్నాడు.  అతడితో మాట కలిపింది ఈతరం.
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తేజ్‌ కుటుంబం స్థిరపడింది. ఇది భిన్న పార్శ్వాల ప్రాంతం. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ కేంద్రంగా మారిన సిలికాన్‌ వ్యాలీ ఓ పక్క. కనీస సౌకర్యాల్లేక పేదరికంతో అలమటించే జనం మరోపక్క. తేజ్‌ అక్కడే చదువుకునేవాడు. ఓ శీతకాలం స్కూల్‌లో చాలామంది విద్యార్థులకు చలి కాచుకోవడానికి సరైన దుస్తులు లేవని గ్రహించాడు. చలించిపోయి వెంటనే వాళ్ల కోసం విరాళాలు సేకరించే ప్రయత్నం చేశాడు. ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు పోగయ్యాయి. ఆ డబ్బుతో డెబ్భైమంది పిల్లలకి దుస్తులు, దుప్పట్లు, స్వెట్టర్లు, షూస్‌ కొన్నాడు. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఎలా? అని అతడిలో అంతర్మథనం మొదలైంది. అమ్మానాన్నలు వీణ, సాయిలతో చర్చించాడు. దాతలకీ, గ్రహీతలకీ మధ్య వారధిలా ఉండాలనే నిర్ణయానికొచ్చాడు. ఫలితమే ‘టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌’ 2014లో మొదలైంది.
ఆచరణలో వేగం
ఆలోచనని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాడు. అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో ‘టాల్‌ స్కౌట్‌’ ప్రోగ్రాం ప్రారంభించారు. దీనికింద ఒక్కో స్కూళ్లో ఒక్కో అంబాసిడర్‌ని నియమించాడు. వీళ్లు సేవాభావం ఉన్నవారిని కూడగడతారు. అవసరాల్లో ఉన్నవారిని గుర్తిస్తారు. సంస్థ గురించి ప్రచారం చేస్తారు. ఆపై స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయడం ప్రారంభించాడు తేజ్‌. అవసరాల్లో ఉన్నవారెవరో గుర్తించి వారికి టచ్‌
ఏ లైఫ్‌ తరపున దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు..
కొని ఇస్తున్నాడు. ఇలా ఇప్పటిదాకా 600 మంది విద్యార్థులకు సాయపడ్డారు. ఇదికాక ప్రతి స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లో ప్రభుత్వం తరపున ఒక సామాజిక కార్యకర్త ఇంఛార్జిగా ఉంటాడు. వీళ్లు ఇల్లులేని పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు. తేజ్‌ వీళ్లతో కూడా కలిసి పని చేస్తున్నాడు. అమెరికాలో సేవల్ని పరుగులు పెట్టిస్తూనే మాతృగడ్డపై మమకారం చాటుకుంటున్నాడు. ఇండియాలోని కొన్ని అంధుల పాఠశాలలకు సంస్థ తరపున సాయం చేస్తున్నారు. స్థానిక ఎన్జీవోలతో కలిసి రక్తదానం, ప్లాస్మా డొనేషన్లపై పని చేస్తున్నారు. అవయవదానం ఆవశ్యకతపై ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ గాయకులు చిత్ర, సునీతలు సంస్థ తరపున భారత్‌లో బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారు. ప్రస్తుతం టచ్‌ ఏ లైఫ్‌లో 30మంది పూర్తిస్థాయిలో స్వచ్ఛందంగా పని చేస్తున్నారు.

సాంకేతికత దన్నుగా
ముందునుంచీ దాతలు, గ్రహీతలను కలపడమే తేజ్‌ లక్ష్యం. తను కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి. అందులోని బ్లాక్‌చైన్‌ అనే సాంకేతికత అతడికెంతో ఇష్టం. ఈ టెక్నాలజీని తన ఫౌండేషన్‌కు అన్వయిస్తే విరాళాలలో పారదర్శకత ఉంటుందని గ్రహించాడు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థల సాయంతో వెబ్‌సైట్‌, గితిలి TAL Giving అనే యాప్‌ రూపొందించాడు. ఇది సాయం చేసేవాళ్లు, పొందేవాళ్లకు మధ్య ఒక బ్రిడ్జ్‌లా ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి నాకు సాయం కావాలని ఇందులో అర్థిస్తే టాల్‌స్కౌట్స్‌ ఆ అభ్యర్థనను పరిశీలిస్తారు. అది నిజమని నిర్ధారించిన తర్వాత దాతల నుంచి నేరుగా సాయం అందుతుంది. సాయం చేసే మనసున్నవాళ్లు సైతం ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. మరోవైపు క్రౌడ్‌సోర్సింగ్‌తో సేవా మనస్తత్వం ఉన్న వాళ్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాడు. ఆర్థిక  సాయంతోపాటు సమయం వెచ్చించి పిల్లలకు పాఠాలు చెప్పడం, వాళ్ల బాగోగులు చూడటంపై ఆసక్తి ఉన్నవారు సైతం టచ్‌ ఏ లైఫ్‌తో చేతులు కలుపుతున్నారు.

ఇతర మార్గాల్లో..

టచ్‌ ఏ లైఫ్‌ ఉద్దేశాలను మరింతగా విస్తరించే ప్రణాళికలో భాగంగా తేజ్‌ వార్షిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా ప్రముఖులతో ప్రదర్శనలు ఇప్పించి విరాళాలు సేకరిస్తున్నాడు. ఈ ఏడాది నవంబరు 13న ప్రపంచ కారుణ్య దినోత్సవం (world kindness day) సందర్భంగా వర్చువల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ప్రముఖ గాయని చిత్ర సంగీతవిభావరితో పాటు, ప్రపంచాన్ని పీడిస్తున్న అనేక సమస్యల మీద చర్చలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువాళ్లతోపాటు ఇక్కడి ప్రముఖులు అభిప్రాయాలు పంచుకున్నారు. వీటన్నింటితోపాటు దాతృత్వంతో పెద్దమనసు చాటుకుంటున్న మానవతా మూర్తులకు గితిలి TAL Hero అనే అవార్డు అందిస్తోంది టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, దివ్యాంగులకు బాడ్మింటన్‌ శిక్షకునిగా ద్రోణాచార్య అవార్డును అందుకున్న గౌరవ్‌ ఖన్నా, పర్యావరణ పరిరక్షకుడు ఎమ్‌. విజయ్‌రామ్‌లకు ఈ పురస్కారం అందించారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని