గ్రాఫిక్స్‌ ధీరుడు!

చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ప్రాణం... పెద్దయ్యాక ఆ కలల రంగంలో స్థిరపడాలనుకున్నాడు... కానీ ఇంజినీరింగ్‌లో చేరాల్సి వచ్చింది... మనసుకు నచ్చని పని చేస్తే అందులో సక్సెస్‌ కాలేనని అతడికర్థమైంది... బీటెక్‌ వదిలి గ్రాఫిక్స్‌ బాట పట్టాడు... యానిమేషన్‌ లోతులు చూశాడు... హాలీవుడ్‌ సినిమాలు, మేటి గేమింగ్‌ కంపెనీలకు పని చేశాడు... త్రీడీ తళుకులద్ది హాలీవుడ్‌కి తగ్గకుండా తెనాలి రామకృష్ణుడి కథతో చిత్రం తీశాడు...

Updated : 19 Dec 2020 07:00 IST

చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ప్రాణం... పెద్దయ్యాక ఆ కలల రంగంలో స్థిరపడాలనుకున్నాడు... కానీ ఇంజినీరింగ్‌లో చేరాల్సి వచ్చింది... మనసుకు నచ్చని పని చేస్తే అందులో సక్సెస్‌ కాలేనని అతడికర్థమైంది... బీటెక్‌ వదిలి గ్రాఫిక్స్‌ బాట పట్టాడు... యానిమేషన్‌ లోతులు చూశాడు... హాలీవుడ్‌ సినిమాలు, మేటి గేమింగ్‌ కంపెనీలకు పని చేశాడు... త్రీడీ తళుకులద్ది హాలీవుడ్‌కి తగ్గకుండా తెనాలి రామకృష్ణుడి కథతో చిత్రం తీశాడు... అత్యధికంగా 12 భారతీయ భాషల్లో విడుదలైన దేశీయ యానిమేషన్‌ ఫిల్మ్‌గా ఘనత సాధించిందది... అతడే అరుణ్‌కుమార్‌ రాపోలు.
‘అన్నం తింటే సినిమా చూపిస్తా’ అంటూ అరుణ్‌ని గారాబం చేస్తూ గోరుముద్దలు తినిపించేది వాళ్లమ్మ. అలా మొదలైన ఇష్టం వయసుతోపాటే విపరీతంగా పెరిగింది. వాళ్లది దిగువ మధ్యతరగతి కుటుంబం. పిల్లల చదువుల కోసం వరంగల్‌కు మారారు. మంచి విద్యాసంస్థల్లో చేర్పించారు. అరుణ్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావాలని అమ్మానాన్నల ఆశ. దాంతో సీఎస్‌ఈలో చేరాడు. కానీ అతడి మనసంతా సినిమాలే. కొత్త టెక్నాలజీ, గ్రాఫిక్స్‌, యానిమేషన్‌లపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండేవాడు. బీటెక్‌లో ఉన్నప్పుడే సొంతంగా గ్రాఫిక్స్‌, ఎడిటింగ్‌ చేస్తుండేవాడు.

ఇంజినీరింగ్‌ వదిలేసి..

ఓవైపు చదువు.. మరోవైపు తనకిష్టమైన సినిమా, త్రీడీ యానిమేషన్లు. రెండింట్లో ఒకదాన్ని వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో చదువునే కాదనుకున్నాడు. ఇష్టపడ్డ రంగంలోనే భవిష్యత్తు వెతుక్కోవాలనుకున్నాడు. బీటెక్‌ మానేసి హైదరాబాద్‌కు వచ్చి త్రీడీ యానిమేషన్‌ కోర్సులో చేరాడు. కోర్సు పూర్తి కాకముందే ఓ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈఏ, టీహెచ్‌క్యూ, హౌజ్‌ ఆఫ్‌ మూవీస్‌, యుబీసాఫ్ట్‌ స్టూడియోస్‌, రాక్‌స్టార్‌ స్టూడియోస్‌లాంటి పెద్దపెద్ద అంతర్జాతీయ గేమింగ్‌ కంపెనీలకు పని చేశాడు. ఇమ్మోర్టల్‌, మిర్రర్‌మిర్రర్‌ అనే హాలీవుడ్‌ సినిమాలకూ మోషన్‌ క్యాప్చర్‌ యానిమేషన్స్‌ రూపొందించాడు.

సొంత సంస్థతో..

పదేళ్ల అనుభవం ఉంది. యానిమేషన్‌పై పట్టుంది. తానేంటో నిరూపించుకోవాలనే తాపత్రయం ఎక్కువైంది. 2017లో హైదరాబాద్‌లో సొంతంగా ‘ఏ థీరం’ యానిమేషన్‌ స్టూడియో ప్రారంభించాడు అరుణ్‌. మొదట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అతడి ప్రతిభపై నమ్మకంతో మిత్రులు చేతులు కలిపారు. ప్రస్తుతం అందులో 50 మంది పని చేస్తున్నారు. ఇతర ప్రాజెక్టులు చేస్తూనే భారతీయ సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా సొంత సృజనాత్మకతతో ఓ యానిమేషన్‌ చిత్రం రూపొందించాలనుకున్నాడు. బాగా ఆలోచించాక తెనాలి రామకృష్ణుడి కథాంశంతో ‘ధీర’ ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం హంపి వెళ్లి అక్కడి ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించాడు. శ్రీకృష్ణ దేవరాయలు, అష్ట దిగ్గజాలు సహా 200 పాత్రలు సృష్టించాడు. 2800 షాట్్స, 40కి పైగా సెట్్సతో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మూడున్నరేళ్లలో పూర్తైన ఈ చిత్రానికి 70మంది రాత్రింబవళ్లు కష్టపడ్డారు. కథ, దర్శకత్వం, మోషన్‌ క్యాప్చర్‌ యానిమేషన్‌ అరుణ్‌వే. ఇది 12 భారతీయ భాషల్లో రూపొందింది. ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌ హీరో ముఖ్య పాత్రకు గాత్రం ఇచ్చాడు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌, తమిళంలో విజయ్‌ సేతుపతి, హిందీలో వివేక్‌ ఒబెరాయ్‌, కన్నడంలో ధ్రువ సర్జా.. ఇలా. బెంగాలీ కథానాయకుడు జీత్‌ ‘మేం కలగనడానికి కూడా సాహసించనిది నువ్వు నిజం చేసి చూపావ’ంటూ మెచ్చుకున్నాడు. థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నా.. కరోనాతో అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేశారు. రోజూ దాదాపు 30 లక్షలమంది వీక్షిస్తున్నారు. ధీర అమెజాన్‌ ప్రైమ్‌ అత్యుత్తమ చిత్రంగా మన్ననలు పొందింది.

యానిమేషన్‌ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తే గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగాలు పెరుగుతాయి. వరంగల్‌ నిట్లో స్నాతకోత్సవం వర్చువల్‌గా చేశారు. విద్యార్థులు ఎవరి ఇళ్లలో వారే ఉన్నారు. వారందరూ ఉత్సవానికి హాజరై పతకాలు తీసుకున్నట్టుగా మేమే వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీలో చేసి చూపాం. త్వరలో త్రిపుల్‌ ఐటీ కర్నూలు, ఎన్‌ఐటీ గోవా విద్యాసంస్థల్లో కూడా వీఆర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కాన్వకేషన్‌ జరిపేందుకు సిద్ధమవుతున్నాం. భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన పోతన పుట్టిన బమ్మెరలో జన్మించాను. అందుకేనేమో మన భాష, కళలంటే ఇష్టం. భారతీయ సంస్కృతికి యానిమేషన్‌ పట్టం కట్టి మన గొప్పతనాన్ని చాటాలనేది నా తపన! 

- జి. పాండురంగ శర్మ ఈనాడు, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని