Published : 02 Jan 2021 00:58 IST

ఆశయాలకు.. కొత్త రెక్కలిద్దాం

కళ్లు మూసి తెరిచేలోగా కొత్త ఏడాది వచ్చేసింది... న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌.. ఇప్పుడో బజ్‌వర్డ్‌! లావు తగ్గాలి.. సివిల్స్‌ జాబ్‌ కొట్టాలి.. పొగ మానేయాలి.. యువతకు ఎన్ని కొత్త లక్ష్యాలో! సంవత్సరాంతంలో మొదలవుతుందీ ఆశల పల్లకి...  జనవరిలో జోరు మీదుంటాం..  ఫిబ్రవరిలో డీలా పడిపోతాం.. మార్చిలో ఆ సంగతే మర్చిపోతాం... మరో ఏడాది కనుమరుగవుతుంది. టార్గెట్లకు దూరంగా ఉండిపోతాం... మరెలా? పట్టిన పట్టు విడవకుండా ఉండేదెలా? నిర్ణయాలను నిక్కచ్చిగా పాటించేదెలా?
కొత్త ఏడాది రానీ, పోనీ.. ఐ డోన్ట్‌కేర్‌ అనుకునేవాళ్లే ఎక్కువ. అయినా భారత్‌లోని యువతలో 28శాతం మంది న్యూ ఇయర్‌లో ఏదైనా కొత్తగా చేయాలి, కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి అనుకుంటున్నారని ఒక మేగజైన్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బరువు తగ్గడం, మంచి డైట్‌ ప్లాన్‌ పాటించడం, మందు మానేయడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం.. ఇలాంటి నిర్ణయాలే ఎక్కువ. రిజల్యూషన్స్‌ పక్కాగా పాటించారా? లక్ష్యాలు చేరారా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే.. ఆ ఆలోచన రావడమే సానుకూల సంకేతం అంటారు సామాజిక అధ్యయనకారులు. ఈ లక్ష్యాలతోపాటు మంచి మనిషిగా, నలుగురూ ఇష్టపడే వ్యక్తిలా ఉండాలనుకునే అదనపు లక్ష్యాన్ని జోడిస్తే యంగిస్థాన్‌ సంతోషాల భారత్‌ అవుతుందంటున్నారు. ఈ కొత్త ఏడాదిని అలాగే ప్రారంభిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్‌.

ఒకదానిపైనే పట్టు

‘బరువు తగ్గాలి’, ‘టోన్డ్‌ బాడీ రప్పించాలి’, ‘పొగ తాగడం మానేయాలి’, ‘సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలి’.. కొత్త ఏడాది రాగానే కుర్రకారుకి లక్ష్యాలు రెడీ అయిపోతాయి. ఒక్కొక్కరైతే నాలుగైదు రకాల టార్గెట్లు పెట్టుకుంటారు. ఆఖరికి ఏదీ సాధించలేక చతికిలబడిపోతారు. అందుకే ఆచరణసాధ్యం కాని అధిక లక్ష్యాలు మానాలి. ఒక్క దానిపైనే దృష్టిపెట్టాలి. ఉదాహరణకు ఓ కుర్రాడికి ఈ ఏడాదిలో క్రికెట్‌లో కనీసం రంజీకైనా ఆడాలి, క్లాసులో టాపర్‌గా నిలవాలి అని ఉంటుంది. ఈ రెండూ సాధించడం దాదాపు అసాధ్యం. రెండింటికీ ఎంతో సమయం వెచ్చించాలి. ఏకాగ్రత పెట్టాలి.  అందుకే అందులో  ఏది ముఖ్యమో ముందు తేల్చుకోవాలి. దానిపైనే మనసు పెట్టాలి. ఐదారు టార్గెట్లు ఉంటే దేన్నీ చేరుకోలేం.

ఆచరణ ముఖ్యం

అంతా ‘మోటూ’ అని పిలుస్తుంటే బాధగా ఉంది. ఆరోగ్యపరంగా నాకూ ఇబ్బందిగానే ఉంది. ఇదీ ఓ కాలేజీ అమ్మాయి ఆవేదన. ఈ ఏడాది కనీసం 15 కేజీలైనా తగ్గాలనుకుంది. కానీ ఆచరణ ముఖ్యమేగా! బరువు తగ్గడానికి ఎలాంటి కసరత్తులు చేయాలి? ఏ ఆహారం తీసుకోవాలి? వ్యాయామానికి ఎంత సమయం కేటాయించాలి? ఈ ప్రణాళిక సిద్ధమైపోవాలి. దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. మధ్యలో అవాంతరాలు వస్తాయి. వాతావరణం అనుకూలించదు. తీసుకునే డైట్‌ నచ్చకపోవచ్చు. సమయం అడ్జస్ట్‌ కాదు. ఇవన్నీ ముందే ఊహించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు, చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఒక కాగితంపై రాసుకోవాలి.

నిజాయతీగా ఉండాలి

నీ లక్ష్యాలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి అంటారు ఎవరైనా. కానీ దాన్ని సాధించే సత్తా మనకుందా? ఆ టార్గెట్‌కి మనం అర్హులమా? ఓసారి నిజాయతీగా రివ్యూ చేసుకోవాలి. పుస్తకం తెరవడం బద్ధకం అయిన కుర్రాడు సివిల్స్‌ సాధించాలనుకోవడం అత్యాశే. బరువులెత్తడం కష్టం అనుకునేవాడు సిక్స్‌ప్యాక్‌ కావాలనుకోవడం నేరమే. మన నిర్ణయం, లక్ష్యం.. ఎప్పుడూ నిజాయతీగా ఉండాలి. అది మన ఎదుగుదలకు తోడ్పడాలి. ఇతరుల మెప్పు కోసం, సొంత గొప్పల కోసం పెట్టుకునే లక్ష్యాలు చేరుకోవడం కష్టమే.

వైఫల్యాల పాఠం

తప్పుల నుంచి నేర్చుకున్నప్పుడే ఏదైనా సాధించగలం. సాధించగలం అని మనని మనం నమ్మినప్పుడే లక్ష్యం చేరతాం. అపజయం ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి. ఓటమి చెందినప్పుడు వ్యూహం మార్చాలి. మరో దారిలో ప్రయత్నించాలి. ఏది సమర్థంగా పని చేస్తోంది? ఏది అసలు ప్రభావం చూపించడం లేదో బేరీజు వేసుకోవాలి. అపజయం ఎదురైతే మళ్లీ మొదట్నుంచి ప్రారంభించడానికి అన్నివేళలా సిద్ధంగా ఉండాలి.

ఒక్కో మెట్టూ ఎక్కుతూ

ఏడాది మొదట్లో తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలికమైనదే అయి ఉంటుంది. చేరడానికి దగ్గరి దారులుండవు. కష్టపడాల్సిందే. మారథాన్‌లో పోటీ పడి పూర్తి చేయాలనుకున్న అబ్బాయి సాధన లేకుండా ఒకేసారి 42 కిలోమీటర్లు పరుగెత్తలేడు. ముందు కొద్దిదూరం పరుగెత్తాలి. దూరం పెంచుకుంటూ వెళ్లాలి. కఠోర సాధన చేసినప్పుడే సిద్ధమవుతాడు.అన్ని లక్ష్యాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. చిన్నచిన్న గోల్స్‌తో అంతిమ లక్ష్యం చేరుకోవాలి.

ఏదైనా సాధ్యమే

ఇతరుల ప్రభావంతోనే యువత ఎక్కువ కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. సంకల్పం సొంతంగా ఉంటే మంచిది. రిజల్యూషన్‌ కొత్త ఏడాదిలోనే మొదలుపెట్టాలనేం లేదు. ఈ సందర్భం ఒక చోదకశక్తిగా ఉండాలి. ఎవరైనా శక్తికి మించిన లక్ష్యాలు పెట్టుకోవద్దు ఫలానా సమయంలోనే పూర్తి చేయాలనే డెడ్‌లైన్‌ పెట్టుకోవాలి. ఇతరుల నుంచి స్ఫూర్తి పొందవచ్చు కానీ ఇతరుల ప్రోద్బలంతో నిర్ణయం తీసుకోకూడదు.

- గీతా చల్లా, సైకాలజిస్ట్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని