తెర కలల సాధకులు

వెండితెరపై కనిపించాలి.. సినీ ప్రపంచాన్ని ఏలాలనే ప్యాషన్‌ ఓ మత్తు లాంటిది... కష్టాల్ని ఇష్టంగా భరించేలా చేస్తుంది.... హోదాల్ని పక్కన పెట్టేయమంటుంది... చేతి నిండా డబ్బున్నా లెక్క చేయక ముందుకెళ్లమంటుంది... ఒక్కసారి ఆశల కలను అందుకున్నామా... శిఖరాగ్రం చేరినట్టే! అప్పటికే తమ తమ రంగాల్లో ముందున్నా, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డా.. వాటిని పక్కనపెట్టి తెర బాట పట్టారు ముగ్గురు ఔత్సాహికులు. దర్శకత్వంతో, నటనతో మెప్పించి ప్రశంసలూ అందుకుంటున్నారు.

Updated : 21 Dec 2022 16:53 IST

వెండితెరపై కనిపించాలి.. సినీ ప్రపంచాన్ని ఏలాలనే ప్యాషన్‌ ఓ మత్తు లాంటిది... కష్టాల్ని ఇష్టంగా భరించేలా చేస్తుంది.... హోదాల్ని పక్కన పెట్టేయమంటుంది... చేతి నిండా డబ్బున్నా లెక్క చేయక ముందుకెళ్లమంటుంది... ఒక్కసారి ఆశల కలను అందుకున్నామా... శిఖరాగ్రం చేరినట్టే! అప్పటికే తమ తమ రంగాల్లో ముందున్నా, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డా.. వాటిని పక్కనపెట్టి తెర బాట పట్టారు ముగ్గురు ఔత్సాహికులు. దర్శకత్వంతో, నటనతో మెప్పించి ప్రశంసలూ అందుకుంటున్నారు. వారితో మాట కలిపింది ఈతరం.

ఛానెల్‌ హెడ్‌ నుంచి..

ఈటీవీలో ప్రసారమైన నేరాలు-ఘోరాలు, యువభారత్‌లకు ప్రోగ్రాం హెడ్‌గా పని చేశాడు. ఓ ఛానెల్‌కి హెడ్‌గా వెళ్లాడు. మంచి హోదా, అంతకుమించిన పేరు. అయినా పవన్‌కుమార్‌ ఎస్పీకి సంతృప్తి లేదు. ‘రిస్క్‌’ చేసి సినిమా బాట పట్టాడు. తొలిసారే హిట్‌ కొట్టాడు.
కథాంశం: మారుమూల ప్రాంతాల్లో.. ఆదివాసీ పల్లెల్లో కొన్ని బడా కంపెనీలు అక్కడి చిన్నారులు, అమాయకుల మీద అనైతికంగా ఔషధ ప్రయోగాలు చేస్తారు. వాళ్లలో వచ్చే మార్పులు చూసి వాక్సిన్లు తయారు చేసి కోట్లు పోగేసుకుంటారు. వాస్తవంగా జరుగుతున్నదిదే. దీన్ని ఓ క్రైం రిపోర్టర్‌ ఎలా ఛేదించింది అనేది కథాంశం. రిస్క్‌ అన్ని ఓటీటీ వేదికలపై విడుదలైంది.
పవన్‌కుమార్‌ పక్కా హైదరాబాదీ. చదువులో స్టేట్‌ ర్యాంకర్‌. తల్లిదండ్రులు ఐఏఎస్‌ అవుతాడనుకుంటే జర్నలిజంవైపు వచ్చాడు. కొన్ని ప్రైవేటు ఛానెళ్లలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, ఛానెల్‌ క్రియేటివ్‌ హెడ్‌గా పని చేశాడు. ఎంత మంచి హోదాలో ఉన్నా.. ఎప్పటికైనా అత్యధిక గుర్తింపునిచ్చే సినిమా వేదికపైనే నన్ను నేను నిరూపించుకోవాలి అనుకున్నాడు తను. ఛానెళ్లలో ఉన్నప్పుడే సినిమా కథలు రాసుకున్నాడు. పరిజ్ఞానం పెంచుకోసాగాడు. దానికితోడు నువ్వు ఏ రంగం ఎంచుకున్నా నెంబర్‌వన్‌గా నిలవాలి అనే అమ్మానాన్నల ప్రోత్సాహం తోడైంది. పాత్రికేయ రంగంలో అనుభవం, సినిమాపై అమితమైన ఇష్టంతో తనే సొంతంగా రిస్క్‌ సినిమా తీశాడు. పేపరుపై పక్కాగా స్క్రిప్టు రాసుకొని షూటింగ్‌ మొదలుపెట్టాడు. 47 లొకేషన్లలో షూటింగ్‌, ఆర్టిస్టుల ఎంపిక, సీన్లలో రాజీ పడకపోవడం.... మొత్తానికి చాలానే కష్టపడి ఏడు నెలల్లో సినిమా ముగించాడు. తన కలను సాకారం చేసుకున్నాడు. ఈ కథకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అమెరికాలోని వైట్‌హౌజ్‌లో పని చేసే ఓ తెలుగావిడ ‘ప్రజలకు ఉపయోగపడే.. ప్రజలు ఆలోచించగలిగించేలా మంచి సినిమా తీశారు’ అని మెసేజ్‌ పెట్టారంటున్నాడు పవన్‌. అన్నట్టు పవన్‌ గతంలో ‘సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌’ ప్రాజెక్టు ప్రోమోల మీద యునిసెఫ్‌ నుంచి అవార్డు అందుకున్నాడు. జాతీయ న్యూస్‌ టెలివిజన్‌ అవార్డుల విభాగంలో బెస్ట్‌ ప్రోమో విభాగంలో పురస్కారం దక్కించుకున్నాడు.

ఐదున్నర కోట్ల మందికి నచ్చింది

కూచిపూడి కళాకారిణిగా, విద్యార్థినిగా, నృత్య శిక్షకురాలిగా త్రిపాత్రాభినయం చేస్తోంది నల్లగొండ అమ్మాయి నాగదుర్గ. అయినా తెరపై కనిపిస్తేనే ప్రతిభకు అత్యధిక మార్కులు అనుకుంది. జానపద పాటల్లోంచి యూట్యూబ్‌ తెరపై వాలిపోయింది. ‘తిన్నా తిరం పడుతలే’ పాటతో యువత మనసుల్లో స్థానం దక్కించుకుంది. సినిమా అవకాశాలకు బాట వేసుకుంది.
నాగదుర్గ ఇంటి దగ్గరుండే రామాలయంలో రోజూ నృత్య కార్యక్రమాలు నిర్వహించేవాళ్లు. వాటిని చూసి కూచిపూడి పట్ల మక్కువ పెంచుకుంది. కూతురు ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఓ గురువు దగ్గర చేర్పించారు. యూకేజీలోనే కూచిపూడి శిక్షణ ప్రారంభించిన ఆమె పదోతరగతి వరకు అక్కడే చదువుకొని ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ చేరింది. నృత్యంలో సర్టిఫికెట్‌, డిప్లమో పూర్తి చేసింది. ప్రముఖ నటి, నర్తకి మంజుభార్గవి నిర్వహించిన కూచిపూడి డ్యాన్స్‌ కార్యశాలల్లో పాల్లొంది. అదే వర్క్‌షాప్‌లో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా సన్మానం అందుకుంది. డిప్లమో పూర్తయ్యాక తన పేరుమీద నృత్యాలయం ప్రారంభించింది. వారాంతాల్లో నల్లగొండకు వెళ్లి శిక్షణ ఇస్తోంది. తనకిష్టమైన డాన్స్‌పై పట్టు సాధించి, ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నా.. తెరపై కనిపించాలనే కోరిక బలీయంగా ఉండేది నాగదుర్గలో. ఈ క్రమంలోనే చరణ్‌ అర్జున్‌ దర్శకత్వంలో పలు జానపద పాటల్లో నటించేది. లాక్‌డౌన్‌లో వాటిని తన యూట్యూబ్‌ ఛానెల్లో పెట్టేది. వాటిని చూసిన దర్శకుడు కిషోర్‌ ‘తిన్నా తిరం పడుతలే..’ పాటలో నటించే అవకాశం ఇచ్చాడు. కొద్దిరోజుల్లోనే ఆ పాట సెన్సేషన్‌గా మారింది. నాగదుర్గ అభినయానికి యూత్‌ ఫిదా అయిపోయింది. ఈ పాటని యూట్యూబ్‌లో ఇప్పటికి 5.23కోట్ల మంది వీక్షించారు. దీంతో సినిమాలు, సీరియల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. తల్లిదండ్రుల మార్గనిర్దేశంలోనే ఈ స్థాయికి ఎదిగానంటోంది నాగదుర్గ. తను ప్రస్తుతం శ్రీత్యాగరాయ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.

- జ్యోతికిరణ్‌, ఈటీవీ బ్యూరో

ఐటీ ఉద్యోగం వదిలి..

ఎనిమిదేళ్ల కిందటే నెలకు రూ.60వేల జీతం. కుటుంబ బాధ్యతలున్నాయి. కానీ సినిమా కోసం అన్నీ వదులుకున్నాడు వంగా జయశంకర్‌. ‘పేపర్‌బాయ్‌’తో తనను తాను నిరూపించుకొని, విటమిన్‌ షితో అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు.
కథాంశం: సెల్‌ఫోన్‌ని మనం వాడుతున్నాం అనుకుంటున్నాం. నిజానికి కొన్నేళ్ల నుంచి మొబైల్‌ ఫోనే మనల్ని వాడుకుంటోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. ఫోన్‌లోని వాయిస్‌ అసిస్టెంట్‌ తిరగబడి మన మనసుని అదుపులోకి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే విటమిన్‌ షి కథాంశం. ఆకట్టుకునేలా చెప్పాడు.  
జయశంకర్‌ సొంతూరు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు. చిన్నప్పట్నుంచీ పుస్తకాల పురుగు. నవలలు బాగా చదివేవాడు. ఎప్పటికైనా రచయిత లేదా డైరెక్టర్‌ కావాలనేది ఆశ. బీటెక్‌ చదవడానికి హైదరాబాద్‌ వచ్చాడు. అప్పట్నుంచే మొదలయ్యాయి సినిమా ప్రయత్నాలు. కుటుంబ బాధ్యతలు ఉండటంతో ఇంజినీరింగ్‌ అయ్యాక ఏడాది ఉద్యోగం చేశాడు. ఎమ్మెన్సీ కంపెనీలో మంచి జీతం. అయినా సినిమా పురుగు తొలుస్తుంటే కుదురుగా ఉండలేడుగా! ఉద్యోగం మానేయాలనుకున్నాడు. ‘గో ఎహెడ్‌.. నేను చూసుకుంటా’ అన్నాడు అన్నయ్య. ప్రయత్నాలతోపాటు సినిమా కష్టాలూ మొదలయ్యాయి. నాలుగేళ్లు ఎదురుచూసి సొంతంగా షార్ట్‌ఫిల్మ్‌లు తీయసాగాడు. హాఫ్‌ గాళ్‌ఫ్రెండ్‌, రామాయణంలో తుపాకుల వేట, హ్యాపీ ఎండింగ్‌.. అన్నీ హిట్టే. అంతా మెచ్చుకుంటున్నారు కదా అని క్రౌడ్‌ ఫండింగ్‌తో ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ తీద్దామనుకున్నాడు. అవకాశం ఇస్తామన్నవాళ్లే హ్యాండిచ్చారు. ఒత్తిడికి గురయ్యాడు. ఆ సమయంలో దర్శకుడు సంపత్‌ నంది నుంచి పిలుపొచ్చింది. ఆయన నిర్మాతగా ‘పేపర్‌ బాయ్‌’ తెరకెక్కింది. తెరపై పేరు చూసుకోవాలనే జయశంకర్‌ సంకల్పం నెరవేరింది. తర్వాత తనకిష్టమైన రచయిత కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్‌ నవలను సినిమాగా తీయాలనుకున్నాడు. ఈలోపు లాక్‌డౌన్‌ మొదలైంది. దాన్ని పక్కనపెట్టి చిన్న బడ్జెట్‌లో విటమిన్‌ షి తీశాడు. ఓటీటీ వేదికపై విడుదలైంది. సినిమా వ్యంగ్యంగా, సూటిగా, ఆకట్టుకునేలా ఉందని డైరెక్టర్‌ సుకుమార్‌, మాటల రచయిత సత్యానంద్‌, రచయిత మల్లాది సహా పలువురు మెచ్చుకున్నారు. జయశంకర్‌ ‘హ్యాపీ ఎండింగ్‌’ అనే ఇండిపెండెంట్‌ సినిమాకి సైమాలో ఉత్తమ దర్శకుడిగా నామినేట్‌ కూడా అయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని