నువ్వు.. నేను.. మీమ్స్‌

నవ్వించాలంటే కామెడీ సీన్లూ, స్కిట్లే చూడాలా? తాజా సమాచారం తెలియాలంటే పుస్తకాలు బట్టీ పట్టాలా?  లేదు బ్రో! ఈతరం ఆలోచనలు మారాయి.. కుర్రాళ్లు మీమ్స్‌తోనే అన్నీ తేల్చేస్తున్నారు... సీరియస్‌ విషయాన్ని సరదాగా చెబుతున్నారు... మంచి సందేశాన్నైనా కామెడీగా చెప్పి నవ్విస్తున్నారు... ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.. సాయానికీ ముందుంటున్నారు... వీటి వెనకున్న కథేంటి? చేసే కసరత్తులేంటి? తెలుసుకోవడానికి కొందరు మీమర్స్‌తో మాట కలిపింది ఈతరం.

Published : 16 Jan 2021 01:10 IST

నవ్వించాలంటే కామెడీ సీన్లూ, స్కిట్లే చూడాలా? తాజా సమాచారం తెలియాలంటే పుస్తకాలు బట్టీ పట్టాలా?  లేదు బ్రో! ఈతరం ఆలోచనలు మారాయి.. కుర్రాళ్లు మీమ్స్‌తోనే అన్నీ తేల్చేస్తున్నారు... సీరియస్‌ విషయాన్ని సరదాగా చెబుతున్నారు... మంచి సందేశాన్నైనా కామెడీగా చెప్పి నవ్విస్తున్నారు... ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.. సాయానికీ ముందుంటున్నారు... వీటి వెనకున్న కథేంటి? చేసే కసరత్తులేంటి? తెలుసుకోవడానికి కొందరు మీమర్స్‌తో మాట కలిపింది ఈతరం.
* స్వామీ నదికి పోలేదా? - లేదు.. నదే ఇక్కడికొచ్చింది...
హైదరాబాద్‌ రోడ్లు జలమయం అయినప్పుడు పేలిన పంచ్‌
* లవ్‌ యూ ఐ నా?? ఐలవ్యూ అని కదా రాయాలి. - మన ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా.
కొత్త సినిమాలో తాజాగా హిట్‌ అయిన డైలాగ్‌
ఇవి మచ్చుకే. యువత స్మార్ట్‌ఫోన్లలో తర్జుమా అయ్యే ఇలాంటి మీమ్స్‌ కోట్లలోనే ఉంటాయి. ఒక హావభావాల ఫొటో. దానిపై సరదా క్యాప్షన్‌. నిమిషం వీడియో. ఫన్నీ  స్టైల్లో జోడించిన వ్యాఖ్యానం.. ఏదైనా ముడిసరుకే. పంచ్‌ ఫన్నీగా ఉంటే కరోనా వైరస్‌ కన్నా త్వరగా వైరల్‌ అవుతాయి. వీడియో కత్తిలా ఉంటే లైక్‌లు, షేర్‌లు.. పోటెత్తుతాయి. కడుపారా నవ్విస్తూ అందరి ముఖాల్లో నవ్వులు పూయించడమే మీమ్స్‌ ఉద్దేశం. కానీ వీటిని సృష్టించడం ఆషామాషీ విషయమేం కాదు. మేధోమథనం చేయాలి. సృజనాత్మకత చూపించాలి. ఫొటోలో ఎంచుకున్న పాత్ర హావభావాలకు సింక్‌ అయ్యేలా డైలాగులు పడాలి. బాగుంటే పొగడ్తలు. లేదంటే తిట్లు బోనస్‌. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.


సమకాలీన అంశాలతోనే..

పేజీ: సీఏపీడీటీ (కామెడీ అండ్‌ పంచ్‌ డైలాగ్స్‌ తెలుగు)
నిర్వాహకుడు: శరత్‌ అంకిత్‌ ఎన్‌.                      
ఫేస్‌బుక్‌ ఫాలోయర్లు: 10లక్షలు, ఇన్‌స్టా: 4.75 లక్షలు, ట్విటర్‌: 40 వేలు.
మా సొంతూరు వైజాగ్‌. ఎనిమిదేళ్ల కిందట సీఏపీడీటీ ప్రారంభించా. అప్పటికి తెలుగులో మీమ్స్‌ మొదలవలేదు. ఓ విదేశీ పేజీ చూసి నేర్చుకున్నా. కానీ సినిమా ఒరవడిలో చెప్పాలనేది నా సొంత ఆలోచన. మొదట్లో ఒక మీమ్‌ రూపొందించడానికి రోజు పట్టేది. ఎం.ఎస్‌. పెయింట్‌లో కసరత్తు చేసి వాటిని స్క్రీన్‌షాట్‌ తీసేవాళ్లం. జీవితంలో జరిగిన సంఘటనలు సినిమాకు జోడించి పేరడీ చేసేవాళ్లం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లోని సరదా విషయాలు ప్రస్తావించేవాళ్లం. కాలేజీ విద్యార్థులతో పాటు    అందరి జీవితాలనూ ముడిపెడుతూ మీమ్స్‌ చేయడం ప్రారంభించాం. మొదట్లో జనాల్ని ఆకట్టుకోవడం కష్టంగా ఉండేది. రానురాను వాళ్ల నాడి పట్టేశాం. విజయవంతంగా ముందుకెళ్తున్నాం.


ఇంట్లో ఇప్పటికీ తెలియదు

పేజీ: మనం తోపులు ఎహే 

ఫౌండర్‌: శ్రీకర్‌ ఎస్‌.కె.
ఫేస్‌బుక్‌ ఫాలోయర్లు: 5.36లక్షలు,
ఇన్‌స్ట్గాగ్రాం: 4.79లక్షలు
2013లో ప్రారంభించా. మొదట్లో ఇంజినీరింగ్‌ పాఠాలు, సినిమాలే మీమ్స్‌కి పెట్టుబడి. నా ఒక్కడితో మొదలై ఇప్పుడు 8 మంది ఉన్నాం. ఒక్కొక్కరం ఒక్కో టాపిక్‌ ఎంచుకుంటాం. సినిమాలు, కాలేజీ, స్నేహితుల సరదా సంభాషణ, ఐపీఎల్‌లాంటి ట్రెండింగ్‌ అంశాలపైనే మీమ్స్‌ చేస్తుంటాం. రామ్‌, కార్తీక్‌, వివేక్‌, మణిదీప్‌, ప్రశాంత్‌, రాజు రవితేజ, శ్రీకాంత్‌, స్వామి వినీత్‌.. మా బృందం. మంచి ఆలోచన వచ్చినప్పుడే మా పని మొదలవుతుంది. కామెడీతోపాటు సందేశాత్మకమైనవి చేశాం. పిల్లల ఆపరేషన్లు, రక్తదానం, ప్లాస్మా దానం.. ఇలాంటి సమయాల్లోనూ సృజనాత్మకంగా మీమ్స్‌ చేసి జనాల్లోకి తీసుకెళ్లాం. మొదట్లో 10 మీమ్స్‌ పేజీలు ఉండేవి. ఇప్పుడవి 200 దాటాయి. బ్రహ్మానందం, సునీల్‌, ఎంఎస్‌ నారాయణ, వేణుమాధవ్‌, వెన్నెల కిశోర్‌, సప్తగిరిలాంటి హాస్య నటులందరి ఫొటోలతో మీమ్స్‌ చేశాం. వాళ్లంతా మమ్మల్ని అభినందించడం మర్చిపోలేని అనుభూతి.


అన్ని భాషల్లోనూ..

పేజీ: థై వ్యూ ప్రారంభించింది: సాయినాథ్‌ వై.
ఫేస్‌బుక్‌ ఫాలోయర్లు: 10.05లక్షలు ఇన్‌స్టాగ్రాం: 4.07లక్షలు, ట్విటర్‌: 98వేలు
పుట్టింది రాజమండ్రి. పెరిగింది విజయవాడ. బీటెక్‌లో ఉన్నప్పుడే ‘థై వ్యూ’ పేజీ, వెబ్‌సైట్‌ తీసుకొచ్చా. సినిమా సమాచారం ఇస్తూ మూణ్నెళ్లు బాగానే నడిపించాం. తర్వాత ఎలా ముందుకెళ్లాలో తెలియలేదు. ఇంతలో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లా. ఆ సమయంలోనే బాహుబలి సినిమా మీమ్స్‌ పేజీలు చూసి నేనూ అదే బాటలో వెళ్లాలనుకున్నా. మూవీ కంటెంట్‌ని ట్రోల్‌ చేయకుండా సినిమాల గురించి మంచి మాట్లాడుకోవాలన్న సంకల్పంతో ఇది ప్రారంభించాం. విజయం వెంటనే రాలేదు. అయినా పట్టు వదల్లేదు. అసభ్యతకు తావు లేకుండా కేవలం మంచి కంటెంట్‌ను ఎంచుకొని దాన్నే ప్రజలలోకి చేరువ చేయడం మా ఎదుగుదలకు కారణం. ఈలోపు సినిమాలంటే ఆసక్తి ఉన్న వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కొందరు తోడయ్యారు. అప్పట్నుంచి తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలపైనా మీమ్స్‌ చేస్తున్నాం. మొదటి రెండేళ్లు నేను ఒక్కడినే పనిచేసేవాడిని. తరవాత ఒక్కొక్కరూ మెల్లగా రావడం ప్రారంభించారు. ప్రస్తుతం మా జట్టు 35 మంది.


ఇవి పాటిస్తే హిట్‌

* ఫొటోలు, వీడియోలు, సినిమా క్లిప్పింగ్‌లు కొన్నింటికి కాపీరైట్స్‌ ఉంటాయి. క్షుణ్నంగా పరిశీలించాకే వాటిని వాడుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతాం.
* సినిమాల్లోని హిట్‌ సీన్లు, డైలాగులు, క్రీడలు, ట్విటర్‌ ట్వీట్లు, రాజకీయాలు, వార్తల్లోని వ్యక్తులు, రియాలిటీ షోలు, వెబ్‌సిరీస్‌లు, తాజా సందర్భాలు.. ఆకట్టుకుంటాయి. వీటిపై పట్టుండాలి.
* మీమ్స్‌ ఒక్కసారి బయటికొస్తే ప్రపంచం ముందుకు వెళ్లిపోతుంది. దోషాలు, ఫాక్చువల్‌ ఎర్రర్స్‌ ఏమీ లేకుండా చూసుకోవాలి. తప్పులుంటే అభాసుపాలవుతాం.
* విడుదలైన ప్రతి సినిమా చూడాలి. రచయితలు, దర్శకులు సమకాలీనత జోడించే తీస్తారు. అందులోని డైలాగుల్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి.
* మీమ్స్‌కి ఎంచుకున్న నటులు, పాత్రలు, వృత్తుల ద్వారా హాస్యం పండించే ప్రయత్నం చేయాలే తప్ప వాళ్లని కించపరిచేలా ఉండకూడదు.
* ఫొటో, వీడియో.. మీమ్స్‌ ఏదైనా క్యాప్షన్స్‌ నిడివి తక్కువగా ఉంటే మంచిది. సూటిగా, సుత్తి లేకుండా ఆకట్టుకోవాలి.


- తమ్మా తేజస్విని మణిమాల, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని