సమర్థతకు..క్లిక్‌లాగ్‌ ఇన్‌

ఒకప్పుడు మెకానిక్‌. ఇప్పుడు వెబ్‌సైట్ల రూపకర్త...డిగ్రీ ఫెయిలైన కుర్రాడు.. యాప్‌లు రూపొందించడంలో దిట్ట... అవకాశం రావాలేగానీ విద్యార్హతతో సంబంధం లేకుండా సత్తా చూపే ఇలాంటి ప్రతిభావంతులు ఎందరో...అలాంటివాళ్లకు వెతికిమరీ ఉద్యోగాలిస్తున్నాడు హైదరాబాదీ టి.సంతోష్‌. ‘క్లిక్‌లాగ్‌’ వ్యవస్థాపకుడు. ఎందుకంటే..తనూ బీఎస్సీ చదివిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ మరి.

Published : 23 Jan 2021 01:35 IST

ఒకప్పుడు మెకానిక్‌. ఇప్పుడు వెబ్‌సైట్ల రూపకర్త...డిగ్రీ ఫెయిలైన కుర్రాడు.. యాప్‌లు రూపొందించడంలో దిట్ట... అవకాశం రావాలేగానీ విద్యార్హతతో సంబంధం లేకుండా సత్తా చూపే ఇలాంటి ప్రతిభావంతులు ఎందరో...అలాంటివాళ్లకు వెతికిమరీ ఉద్యోగాలిస్తున్నాడు హైదరాబాదీ టి.సంతోష్‌. ‘క్లిక్‌లాగ్‌’ వ్యవస్థాపకుడు. ఎందుకంటే..తనూ బీఎస్సీ చదివిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ మరి.
ప్రోగ్రామర్‌ కావాలంటే సాంకేతిక డిగ్రీ ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం దొరకాలంటే బీటెక్‌ చదవాలి. ఏ ఉద్యోగానికెళ్లినా ముందు చూసేది విద్యార్హతలే. ఏదైనా కారణంతో డిగ్రీ పూర్తి చేయలేకపోతే ఎంత ప్రతిభావంతుడికైనా కొలువు దక్కడం గగనమే. ఈ ట్రెండ్‌ని బద్ధలు కొట్టాడు సంతోష్‌. వెబ్‌ డిజైనింగ్‌, యాప్స్‌ తయారీ, కోడింగ్‌ రాయడం.. వీటిలో ప్రతిభ ఉంటే చాలు. ఇంటర్వ్యూకి పిలుస్తాడు. ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేకపోయారో ఆరా తీస్తాడు. చివరగా వాళ్లకో టాస్క్‌ ఇస్తాడు. అభ్యర్థి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు? దాన్ని ఎలా ముగించాడు? అని పరిశీలించి సత్తా ఉంటే ఉద్యోగంలోకి తీసుకుంటాడు. ఇతర సంస్థలకు రికమెండ్‌ చేస్తాడు.

కష్టాలు దాటి
క్లిక్‌లాగ్‌ ఓ స్టార్టప్‌ కంపెనీ. ఎన్నో బాలారిష్టాలు దాటి దూసుకెళ్తున్న అంకుర సంస్థ. వెబ్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌, యాప్స్‌ తయారు చేయడం, డిజిటల్‌ మార్కెటింగ్‌, సాఫ్ట్‌వేర్‌ రూపొందించడం, కంపెనీలకు బ్రాండింగ్‌.. ఇలా ఎన్నో చేస్తోంది. ఆ సంస్థను ఈ స్థాయికి చేర్చడానికి సంతోష్‌ పడ్డ కష్టం తక్కువేం కాదు. నిజానికి తను చదివింది సైన్స్‌ డిగ్రీ. కానీ చిన్నప్పట్నుంచి కంప్యూటర్‌ అంటే ఇష్టం. సొంతంగా కోడింగ్‌ రాసేవాడు. ‘ఎప్పటికైనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనిపించుకోవాలి’ అని తహతహలాడేవాడు. అదే ఉత్సాహంతో కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ‘సైన్స్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఎలా అవుదామనుకుంటున్నావ్‌?’ అనేవాళ్లు. సీవీ చూడగానే వెళ్లిపొమ్మనేవారు. ఎవరూ తన ఆసక్తి, ప్రతిభను గుర్తించేవారు కాదు. ఇక లాభం లేదనుకొని సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించి తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. కానీ ఆర్థికంగా అంత స్థితిమంతుడేం కాదు. ‘ఒక్క అవకాశం ఇవ్వు. నన్ను నేను నిరూపించుకుంటా’ అని కజిన్‌ని బతిమాలాడు. ఆయన నమ్మి పెట్టుబడి పెట్టాడు. చిన్న గదిలో ఒక్కడితో మొదలైన సంస్థ రెండేళ్లలో పెద్దపెద్ద కస్టమర్లున్న కంపెనీగా ఎదిగింది. తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు వేరొకరికి ఎదురుకావొద్దనే ఉద్దేశంతో ప్రతిభ ఉన్నవారిని విద్యార్హతతో సంబంధం లేకుండా ప్రోత్సహిస్తున్నాడు.
వారికే అవకాశం
క్లిక్‌లాగ్‌ లాక్‌డౌన్‌కి ముందు మొదలైంది. ‘ఐటీ కంపెనీనా?’, ‘నీకేం అనుభవం ఉంది?’, ‘కరోనా సమయంలో కొత్త స్టార్టప్‌ సక్సెస్‌ కాదేమో?’ ఇలాంటి మాటలెన్నో విన్నాడు. అయినా ముందుకెళ్లాడు. ఆకట్టుకునేలా చెప్పడం, చెప్పింది చేసి చూపించడంతో త్వరలోనే కంపెనీల నమ్మకం సంపాదించాడు. దీంతోపాటు కొందరు సెలెబ్రెటీలకు పేజీలు రూపొందించి డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తున్నాడు. ఆహా, వీఐయూ, హాట్‌స్టార్‌ ఛానెళ్లలో వచ్చే వెబ్‌సిరీస్‌లకు గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌, ప్రోడక్ట్‌ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌.. కార్యక్రమాలు ఫ్రీలాన్సింగ్‌ చేస్తున్నాడు. ‘నేను సృజనాత్మకత ఉన్న ఉద్యోగులనే ఎంచుకుంటా. నా కంపెనీ, నా పని అనుకునే వాళ్లనే ప్రోత్సహిస్తా. వాళ్లకి సబ్జెక్టు ఉంటే చాలు’ అని తన విజయ రహస్యం చెబుతాడు సంతోష్‌.

 

లక్షలు తగలేయొద్దు
బీటెక్‌ అయిపోగానే చాలామంది అప్పులు చేసి, లక్షల ఫీజులు చెల్లించి సాఫ్ట్‌వేర్‌, ఇతర కోర్సుల్లో చేరతారు. నేను వీఎఫ్‌ఎక్స్‌ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఫీజులు భరించే పరిస్థితిలో లేను. అప్పుడే గూగుల్‌ని ఆశ్రయించా. యూట్యూబ్‌నే గురువుగా భావించా. వీడియోలు చూసే వీఎఫ్‌ఎక్స్‌పై పట్టు సాధించా. అదొక్కటే కాదు.. యాప్‌, లోగో డిజైనింగ్‌, బ్రోచర్‌ డిజైనింగ్‌, బ్రాండింగ్‌, యూఐ, 2డీ, త్రీడీ యానిమేషన్‌, ఎస్‌ఈవో, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎడిటింగ్‌.. ఇలా ప్రతీదీ ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నాను. పెద్దపెద్ద ఇనిస్టిట్యూట్‌లలో భారీగా ఫీజులు కట్టి కోర్సులు పూర్తి చేసినవాళ్లు సైతం నా దగ్గరికొచ్చి నేర్చుకునేవాళ్లు. నేను చెప్పేదేంటంటే అంతర్జాలంలోనే అపారమైన సమాచారం ఉంది. ఆసక్తి, పట్టుదల ఉంటే దాన్నే గురువుగా ఎంచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని