ఆన్‌లైన్‌ గురూలు.. అన్నీ నేర్పిస్తారు!

కరోనా పుణ్యమాని విద్యార్థులంతా ఆన్‌లైన్‌ బాట పట్టారు... పాఠాలు ఆన్‌లైన్‌.. కోర్సులు నేర్చుకోవడం ఆన్‌లైన్‌... పని చేయడం ఆన్‌లైన్‌.. కోచింగ్‌లు, ట్యూషన్లూ ఆన్‌లైన్‌... ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకునే కోర్సులు నేర్చుకోవాలనుకునే ఔత్హాహికులు.. పాఠాలు చెప్పే గురువులకు మధ్య వారధిలా మారాడు సాయిరమేష్‌. పేద పిల్లలు బాగు పడే ఉద్దేశంతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు కాకర్ల జగదీశ్‌. ఆ ఇద్దరి ప్రస్థానం...

Updated : 20 Feb 2021 05:31 IST

కరోనా పుణ్యమాని విద్యార్థులంతా ఆన్‌లైన్‌ బాట పట్టారు... పాఠాలు ఆన్‌లైన్‌.. కోర్సులు నేర్చుకోవడం ఆన్‌లైన్‌... పని చేయడం ఆన్‌లైన్‌.. కోచింగ్‌లు, ట్యూషన్లూ ఆన్‌లైన్‌... ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకునే కోర్సులు నేర్చుకోవాలనుకునే ఔత్హాహికులు.. పాఠాలు చెప్పే గురువులకు మధ్య వారధిలా మారాడు సాయిరమేష్‌. పేద పిల్లలు బాగు పడే ఉద్దేశంతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు కాకర్ల జగదీశ్‌. ఆ ఇద్దరి ప్రస్థానం...

పర్ణిక ట్యుటోరియల్స్‌ ఒక యూట్యూబ్‌ ఛానెల్‌. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, డిగ్రీ, ఎంఎస్సీ, గేట్‌, యూజీసీ, డీఆర్‌డీవో, ఇస్రో, ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ వీడియోల్లో ఉంటుంది. డిగ్రీ, బీటెక్‌, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి ఇవెంతో ఉపయోగం.
చాలామందికి రకరకాల నైపుణ్యాలు ఉంటాయి. కొందరికి టెక్నాలజీపై పట్టుంటే.. మరికొందరికి డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియాపై అవగాహన ఉంటుంది. ఇలాంటి వాళ్లు.. తమకు తెలిసిన నైపుణ్యాన్ని మరికొందరికి నేర్పించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది కోర్స్‌ దునియా. ఈ ఆన్‌లైన్‌ వేదిక తొమ్మిది నెలల కిందట మొదలైంది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సాయిరమేష్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈవో, ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ అవకాశాలపై సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. హైదరాబాద్‌, విజయవాడల్లో వేలమందికి బోధించాడు. తర్వాత విజయవాడ కేంద్రంగా తనే ఈ సంస్థ ప్రారంభించాడు. నేర్పించే వారికి ఆదాయం, నేర్చుకునేవారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే
Coursedunia.com లక్ష్యం.

అందరికీ అనుకూలం

తమకు తెలిసిన విద్యను నేర్పించాలనుకునే వారు ఎవరైనా ఇందులో పేరు నమోదు చేసుకోవచ్చు. అన్ని కోర్సులూ తెలుగులోనే ఉంటాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌, బ్లాగింగ్‌, యూట్యూబ్‌, సోషల్‌మీడియా మేనేజర్‌, సోషల్‌మీడియా ఇన్‌ఫ్ల్లూయెన్సర్‌, స్టాక్‌ ఫొటోగ్రఫీ, ఆన్‌లైన్‌ టీచింగ్‌, ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు, వర్డ్‌ప్రెస్‌, అఫ్లియేట్‌ మార్కెటింగ్‌, ఆడియో బుక్స్‌, ఈబుక్స్‌, డిజిటల్‌ పెయింటింగ్‌, బగ్‌ బౌంటీ.. ఇలా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన సమాచారం, కోర్సులన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో పది నుంచి 30 వరకు తరగతులుంటాయి. కనీస అవగాహన లేనివారు సైతం ఎంచుకున్న కోర్సులో పూర్తి పట్టు సాధించేలా రూపొందించాం అంటున్నాడు రమేష్‌. ఇందులో కొన్ని కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. కోర్స్‌ దునియా ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే తెలుగు రాష్ట్రాల్లోని 11వేల మంది పాఠాలు నేర్చుకున్నారు. కొన్ని కోర్సులు గురువులకు ఆదాయం వచ్చేలా.. మొత్తం కోర్సుకు కలిపి నామమాత్ర రుసుంతో అందిస్తున్నారు. అదికూడా భరించలేని వారికోసం ఓటీటీ ప్లాట్‌ఫాం మాదిరిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వందకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రూ.99 చెల్లిస్తే.. ఏ కోర్సు అయినా, ఎవరైనా నేర్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు మద్దతుగా 2021 నాటికి కనీసం లక్ష మందికి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అంటున్నాడు రమేష్‌.

పేదలకు.. చేదోడుగా...

లాక్‌డౌన్‌లో స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. అదేసమయంలో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టాయి. కానీ ఆ సమయంలో చాలామందికి ఆన్‌లైన్‌ క్లాసులు అర్థమయ్యేవి కాదు. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు కొనలేక పేరెంట్స్‌ చాలా ఇబ్బందులు పడ్డారు. ఫోన్‌ కొనలేక ప్రాణాలు తీసుకున్న ఒకట్రెండు సంఘటనలూ చూశాం. చలించిపోయిన కాకర్ల జగదీశ్‌ పేద పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ‘పర్ణిక ట్యుటోరియల్స్‌’ ప్రారంభించాడు.

నిద్రను త్యాగం చేసి మరీ..
మంచి ఉద్దేశంతో ఛానెల్‌ ప్రారంభించిన జగదీశ్‌ దీనికోసం పడుతున్న కష్టం తక్కువేం కాదు. వీడియో మంచి నాణ్యతతో రావడానికి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము ఐదులోపే లేచి పని మొదలు పెడతాడు. ఇంట్లోని ఓ గదిలోనే బోర్డు, సోఫా ట్రైపాడ్‌, కెమెరా సెట్‌ చేసుకుంటాడు. ఏదైనా సబ్జెక్టు ఎంచుకొని పది నుంచి 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో రూపొందిస్తాడు. దీనికోసం అంతకుముందే రెండు, మూడు గంటలు ప్రిపేర్‌ అవుతాడు. ఆ వీడియో 3 జీబీ దాకా వస్తుంది. దాన్ని ఒక హార్డ్‌డిస్క్‌లో పెట్టడం, ఎడిటింగ్‌ చేయడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌.. దాదాపు మూణ్నాలుగు గంటలు పడుతుంది. అలా ఇప్పటివరకు 650కు పైగా వీడియోలు రూపొందించాడు. దాదాపు రెండులక్షల మంది వీటిని వీక్షించారు. ఇండియాతోపాటు అమెరికా, పాకిస్థాన్‌, శ్రీలంక, బ్రిటన్‌ సహా ఇరవై దేశాల్లో రెగ్యులర్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జగదీశ్‌ కేంద్రీయ విద్యాసంస్థలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. చెన్నైలో స్థిరపడ్డ శ్రీకాకుళం యువకుడు. వైజాగ్‌లో బీటెక్‌, పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్‌, ఎన్‌ఐటీ రూర్కేలాలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. అజ్‌మేర్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌లో ఏడాదిన్నర ఉద్యోగం చేసి ప్రస్తుతం చెన్నైకి మారాడు. ‘నేను ఒక్కో వీడియో రూపొందించడానికి రోజుకి ఐదారు గంటలు పడుతుంది. కానీ ఇదంతా ఇష్టంగానే చేస్తున్నా. ఈ సమాచారం అందించే కోర్సుకి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అది భరించలేని పేద పిల్లలకు సాయపడటమే నా లక్ష్యం. నా వీడియోలు చూసి కొందరైనా సబ్జెక్టులో పరిజ్ఞానం సంపాదించి.. ఉద్యోగాలు సాధిస్తే నాకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు’ అంటున్నాడు జగదీశ్‌.

- మరిశర్ల జగదీష్‌ కుమార్‌, విజయవాడ

అనుసంధానకర్త

నేర్పించేవాళ్లు ఓ వైపు.. నేర్చుకుందాం అనుకునేవాళ్లు మరోవైపు. ఈ ఇద్దరిని కలిపే సరైన వేదికే లేదు. ‘కోర్స్‌ దునియా’తో ఆ కొరత తీర్చాడు గుంటూరు కుర్రాడు పి.సాయిరమేష్‌. దీంతో విద్యార్థులకు విస్తృత సమాచారం అందుతుంటే.. బోధించేవారు మంచి ఆదాయం పొందుతున్నారు.

డిజిటల్‌దే భవిష్యత్తు

డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించేందుకు 2017లో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించా. ఈ సమయంలో ఎక్కువమంది ప్రాంతీయ భాషలో నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం గమనించా. ఇలాంటి ఆన్‌లైన్‌ కోర్సులు స్థానిక భాషల్లో అరుదు. తెలుగులోనూ ఇదే పరిస్థితి ఉంది. రెండేళ్లు అధ్యయనం చేసి మన భాషలో కోర్సులు రూపొందించాం. నామమాత్రపు ఫీజులతో, శిక్షకులకు ఆదాయం వచ్చేలా వీటిని డిజైన్‌ చేశాం. ఊహించని స్పందన వస్తోంది.

- సాయి రమేష్‌.పి కోర్స్‌దునియా వ్యవస్థాపకుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని