చదువులు.. సరదాలు.. శాటిలైట్‌ రూపకర్తలు!

అంతా ఇంటర్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు... అంతరిక్షంపై ఆసక్తి అందరినీ ఒక్కచోటికి చేర్చింది... సరదాలు పక్కనపెట్టి శాటిలైట్‌ రూపొందించే పనిలో పడ్డారు... రేయింబవళ్లు కష్టపడి బుల్లి ఉపగ్రహం తయారు చేశారు... పీఎస్‌ఎల్‌వీ- సీ51 వాహకనౌక ద్వారా అది రేపే నింగిలోకి ఎగరబోతోంది... గతంలోనూ గఘన విజయాలు అందుకున్న ఆ కుర్రాళ్లతో ఈతరం మాట కలిపింది.

Published : 27 Feb 2021 01:00 IST

అంతా ఇంటర్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు... అంతరిక్షంపై ఆసక్తి అందరినీ ఒక్కచోటికి చేర్చింది... సరదాలు పక్కనపెట్టి శాటిలైట్‌ రూపొందించే పనిలో పడ్డారు... రేయింబవళ్లు కష్టపడి బుల్లి ఉపగ్రహం తయారు చేశారు... పీఎస్‌ఎల్‌వీ- సీ51 వాహకనౌక ద్వారా అది రేపే నింగిలోకి ఎగరబోతోంది... గతంలోనూ గఘన విజయాలు అందుకున్న ఆ కుర్రాళ్లతో ఈతరం మాట కలిపింది.
ఇంటర్‌, బీటెక్‌ కుర్రాళ్లంటే పుస్తకాలతో కుస్తీ పడతారు. ఏమాత్రం ఖాళీ దొరికినా సినిమాలు, ఔటింగ్‌లు, చాటింగ్‌లతో చెలరేగిపోతారు. వీళ్లు మాత్రం కొంచెం భిన్నం. తామేంటే నిరూపించుకోవాలనే తపన ఎక్కువ. అందుకే నాలుగు నెలల పాటు కష్టపడి చిన్న శాటిలైట్‌ తయారు చేశారు. రూపకర్తలు ఏడుగురిలో నలుగురు తెలుగువారే.

గతం స్ఫూర్తిగా

చెన్నైలో ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం చేసుకొని అంతరిక్ష ఔత్సాహికులకు వివిధ అంశాలపై శిక్షణనిస్తుంటోంది. రాకెట్‌ ప్రయోగాలపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ ప్రోద్బలంతోనే 2017లో ‘కలాంశాట్‌’ తయారు చేసి నాసా ద్వారా అంతరిక్షంలోకి పంపారు ఈ యువ బృందంలోని కొందరు. అది విజయవంతం కావడంతో స్వదేశంలోనూ సత్తా చూపించి శెభాష్‌ అనిపించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా 2018లో చెన్నైకు వచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు. వారితో తమ ఆలోచనలు పంచుకున్నారు. వారి సలహాలు, సూచనలతో కలాంశాట్‌-వి2 తయారు చేసి శ్రీహరికోటలో జెండా ఎగరేశారు. తాజాగా ఇస్రో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌ ధవన్‌ పేరు మీదుగా ‘సతీశ్‌ ధవన్‌ శాట్‌’ ఉపగ్రహం రూపకల్పన చేశారు. ఇది 530 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రనస్‌ కక్ష్యలోకి వెళ్లబోతోంది.

తెలుగు కుర్రాళ్ల హవా

ఈ బుల్లి ఉపగ్రహం రూపకల్పనలో ఏడుగురు విద్యార్థులున్నారు. ఇందులో నలుగురు తెలుగువాళ్లే. సతీశ్‌ ధవన్‌ శాట్‌ మిషన్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కేసెన్‌, లీడ్‌ శాస్త్రవేత్తగా రిఫాత్‌ షారూక్‌ ముందుండి నడిపించారు. యజ్ఞసాయి (తిరుపతి), రఘుపతి (తిరుపతి), కీర్తన్‌చంద్‌ (హైదరాబాద్‌), మహ్మద్‌ అబ్దుల్‌ కషిఫ్‌ (నల్గొండ), టి.గోబినాథ్‌ (చెన్నై), క్లింటన్‌, దురై, లోకేషేశ్వరన్‌ మిగతా బృందం.

సవాళ్లు అధిగమించి

ఇస్రో అభయమివ్వడం ఆలస్యం.. పనిలోకి దిగిపోయారు. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎంబెడెడ్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, రిసెర్చ్‌ క్రూ, ప్రొపల్షన్‌ ఇంజినీర్‌.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకొని పరిశోధన మొదలుపెట్టారు. 2020 జూన్‌లో డిజైన్‌ సిద్ధమైంది. స్పేస్‌కిడ్జ్‌ శాటిలైట్‌ తయారీకి కావాల్సిన పరికరాలు అందించింది. చెన్నైలోని వారి ల్యాబ్‌నే ప్రయోగశాలగా ఉపయోగించుకోవడానికి అనుమతించింది. గతేడాది నవంబరు వరకు పరికరాలు సేకరించారు కుర్రాళ్లు. డిసెంబరు నుంచి తయారీ మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రాజెక్ట్‌ పూర్తైంది. విద్యార్థులందరూ దీనికోసం నాలుగు నెలలు రేయింబళ్లు కష్టపడ్డారు. కరోనాతో మధ్యలో కొందరు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో వీడియోకాల్స్‌తో సమన్వయం చేసుకున్నారు. దీనికితోడు సాంకేతికంగా ఎదురైన సవాళ్లు ఎన్నో. రాకెట్‌ భూమిని వదిలి, నింగిలోకి దూసుకెళ్లేటప్పుడు బుల్లి ఉపగ్రహం భారీ వైబ్రేషన్స్‌ తట్టుకునే సామర్థ్యం సాధించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. సోలార్‌ ప్యానెళ్లు అతికించడం చాలా కష్టమైంది. వీటన్నింటినీ అధిగమించిన తర్వాత 1.9కేజీల శాటిలైట్‌ సిద్ధమైంది. అన్నింట్లోనూ మెరుగు అనిపించుకున్న తర్వాత శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి తరలించారు. ఇది పూర్తిస్థాయి కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. తక్కువ పవర్‌తో ఎక్కువ డేటాను ఎలా సమర్థంగా ఎలా ఉపయోగించాలో పరీక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. దీని తయారీకి రూ.35లక్షలు ఖర్చైంది. 2020 ఆగస్టులో ఇస్రోకు ప్రతిపాదనలు పంపగా, నవంబరులో అనుమతులు వచ్చాయి. 2021 ఫిబ్రవరి 2 నాటికి ప్రాజెక్టు పూర్తైంది. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో కూడ వివిధ పరీక్షలు నిర్వహించారు. స్పేస్‌ కిడ్జ్‌ నింగిలోకి తొలిసారిగా ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపనుండటంతో ఓ ప్రత్యేకత ఉండాలని భావించింది. దీనిపై మోదీ పేరు, చిత్రపటం, ఆత్మనిర్భర్‌ మిషన్‌ అనే పదాలతో పాటు భగవద్గీత కాపీ, 25వేల మంది సంతకాలతో కూడిన పేర్లను పంపిస్తున్నారు.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, న్యూస్‌టుడే, శ్రీహరికోట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని