గెలుపు బాటకి.. స్ఫూర్తి సూత్రాలివి!

జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు... అమెజాన్‌ని ఇంటింటికీ చేరువ చేసిన కార్యసాధకుడు... ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వేదికలతో లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యాపారవేత్త... 57 ఏళ్లకే రిటైర్‌మెంట్‌ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు...

Updated : 06 Mar 2021 05:01 IST

జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు... అమెజాన్‌ని ఇంటింటికీ చేరువ చేసిన కార్యసాధకుడు... ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వేదికలతో లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యాపారవేత్త... 57 ఏళ్లకే రిటైర్‌మెంట్‌ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు... ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలకు జెఫ్‌ మాట ఓ స్ఫూర్తిమంత్రం... కోట్ల టర్నోవరు కళ్ల చూడాలనే ప్రతి కుర్రాడికి బెజోస్‌ ప్రతి అడుగూ ఆచరణీయం... తక్కువ సమయంలోనే అంత గొప్ప సక్సెస్‌ ఎలా సాధ్యమైంది? స్టార్టప్‌ ప్రారంభించాలి అనుకునే ఔత్సాహికులు అతడి నుంచి ఏం నేర్చుకోవచ్చు?

చాలామంది కుర్రాళ్లు మహా స్వాప్నికులు. తరగతి గదుల్లోనే తమ తలరాతలు మారాలని కలలు కంటుంటారు. క్యాంపస్‌ దాటగానే వడివడిగా స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తుంటారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌లా టెక్నాలజీ విప్లవం సృష్టించాలనుకుంటారు. రతన్‌టాటాలా దేశ గతిని మార్చే వ్యాపారాలు చేయాలనుకుంటారు. కానీ ఆ విజేతలు నడిచిన దారులన్నీ పూలపాన్పులేం కాదు. ఎన్నో ముళ్ల కంచెలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ ఏడాది అమెజాన్‌ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించిన జెఫ్‌ బెజోస్‌ జీవితంలోనూ ముళ్లున్నాయి. సవాళ్లున్నాయి. వివిధ సందర్భాల్లో తను చెప్పిన, ఆచరించిన పాఠాలు ఇవి.

సంస్థ ఉద్యోగులదే...
‘ఉద్యోగులు సంస్థని సొంత కంపెనీలా భావిస్తే సగం విజయం సాధించినట్టే’

అమెజాన్‌లో 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అత్యధికులు అది తమ సొంత సంస్థలా భావిస్తుంటారు. దీనికోసం ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉండేలా చూసుకుంటాడు జెఫ్‌. వ్యక్తిగతంగా లేఖలు రాస్తాడు. తరచూ హార్థిక సమావేశాలు జరుగుతుంటాయి. బాధ్యతగా, కష్టపడి పనిచేసేవాళ్లకు అందలాలు, నజరానాలు దక్కుతాయి. ‘నా విజయం నా ఒక్కడిది కాదు. నా ఉద్యోగులందరిదీ’ అని  పదేపదే చెబుతుంటాడు బెజోస్‌.

ఎదిగినా ఒదగడం
‘నెంబర్‌వన్‌ కిరీటం నా తలపై ఉండాలనే కోరిక నాకేం లేదు. ధనికుడిగా కాకుండా సంపద సృష్టించే వ్యక్తిగా, ఉపాధి కల్పించే యజమానిగా, మంచి తండ్రిగా పిలిపించుకోవడం నాకు ఇష్టం’

ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం జెఫ్‌ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ కాబోతున్నాడు. ఈ విజయంపై మీ స్పందన ఏంటని ఓ విలేకరి అడిగినప్పుడు చెప్పిన మాటలివి. కేవలం మాటలే కాదు.. జెఫ్‌ ఆచరణ అలాగే ఉంటుంది. డబ్బు, పేరుతో వచ్చే గర్వాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. కిందిస్థాయి ఉద్యోగుల భుజంపై చేయి వేసి మాట్లాడతాడు. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు.

లక్ష్యం గురిచూసి కొట్టాలి
‘మన వ్యాపారంలో పోటీదారుడికన్నా మిన్నగా ఎలా ఉండాలి అని ఆలోచించవద్దు. మన లక్ష్యం వినియోగదారుడిని ఎలా ఆకట్టుకోవాలి అన్నదానిపైనే ఉండాలి’

వ్యాపారంలో పోటీదారులు సహజం. ముందుకెళ్లడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. అమెజాన్‌ మొదలైనప్పుడు చిన్న స్టార్టప్‌నే. కానీ అప్పటికే ఆ రంగంలో వాల్‌మార్ట్‌లాంటి దిగ్గజ సంస్థలున్నాయి. బెజోస్‌ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. వినియోగదారుడి మనసు మెచ్చే ప్రయోగాలు చేశాడు.  కస్టమర్‌ మిస్‌కాల్‌ ఇస్తే తిరిగి చేయడం, ప్రోడక్ట్‌ నచ్చకపోతే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వెనక్కి తీసుకోవడం.. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో తీసుకొచ్చాడు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసులూ ప్రారంభించాడు.

నిరంతర శ్రమ
‘విజయం ఒక్కోసారి సులువు, మరోసారి కష్టం కావొచ్చు. కానీ దక్కిన విజయాన్ని నిలుపుకోవడం మరింత కష్టం’

వ్యాపారం విస్తరించడానికి, ముందుకెళ్లడానికి రెండు మార్గాలుంటాయి అంటాడు జెఫ్‌. విజయవంతంగా కొనసాగుతున్న వ్యాపారాన్ని కొనసాగించడం. మరింత అభివృద్ధి చెందడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతకడం. ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మడంతో మొదలైంది అమెజాన్‌. తర్వాత దాన్ని అన్ని రంగాలకు విస్తరించాడు. ఉప్పు, పప్పులతో సహా ఇప్పుడు అమెజాన్‌లో ప్రతీదీ అందుబాటులో ఉంటుంది. ఈ సామ్రాజ్య విస్తరణ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఎక్కడెక్కడ అనుకూలం? ఎలాంటి ఉత్పత్తులు అమ్ముకోవచ్చు.. అని విశ్లేషించడానికి అమెజాన్‌లో పెద్ద బృందమే నిరంతరం పని చేస్తోంది.

వ్యాపార ఆచరణ
‘ప్రపంచంలో కార్యాచరణ లేని ఆలోచనలు వ్యర్థం. కొన్నిసార్లు నిర్ణయాల్లో అంతులేని వేగం ఉండాలి. ఒక్క సెకనులోనే మంచి ఆలోచన పుట్టొచ్చు. ఆచరణ ఒక్కోసారి జీవిత కాలం పట్టొచ్చు. వెనుకడుగేయొద్దు’

ఈ ప్రపంచంలో సమర్థులు, అత్యంత తెలివైనవాళ్లకు కొదవలేదు. వాళ్ల మెదళ్లలో కోట్లకొద్దీ సరికొత్త ఆలోచనలు మెదులుతుంటాయి. కానీ ఒక మంచి ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఈమధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటాలి. 1994లో బెజోస్‌ ఉద్యోగం మానేసి ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ మొదలు పెట్టాలనుకున్నాడు. ఇది కొత్త ప్రయోగాలకు నాంది అని అంచనా వేశాడు. అప్పుడు అతడి వార్షిక వేతనం లక్షల్లోనే. కొనసాగితే రెండింతల జీతం ఇస్తానన్నాడు బాస్‌. అయినా అతడు నిర్ణయం మార్చుకోలేదు. తర్వాత చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

కాసులు కురిపించే నిర్ణయాలు
‘వినియోగదారులకు వస్తువులు అమ్మినప్పుడు కాదు.. వాళ్లు నచ్చిన వస్తువు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే మేం డబ్బు సంపాదిస్తాం’

వస్తువుల కొనుగోలు, అమ్మకంతోనే వ్యాపారం చేయాలనుకుంటే అది మన పరిధిని తగ్గించుకోవడమే అంటాడు. వినియోగదారులతో కొత్త నిర్ణయాలు తీసుకునేలా ఒప్పించడం వ్యాపారంలో అత్యంత ముఖ్యమైందంటాడు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల మధ్య అనుసంధానకర్తలా ఉండటం పెద్ద అవకాశమంటాడు. ఉత్పత్తుల్ని అందంగా ముస్తాబు చేసి ప్రదర్శించడం, సమయాన్ని, సర్వీసుల్ని అమ్మడం కూడా వ్యాపారం కిందకే వస్తుందంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని