పల్లెటూరి పిల్లగాడు ఆవిష్కరణల మొనగాడు!

అవసరాల నుంచే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయంటారు అనుభవజ్ఞులు. వరంగల్‌ గ్రామీణ జిల్లా గోపాలపురానికి చెందిన రాజుని చూస్తే ఆ మాట ఒప్పుకోక తప్పదు. అతడి నాన్న టీవీ మెకానిక్‌. తండ్రి టెలివిజన్లు మరమ్మతు చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు.

Published : 13 Mar 2021 00:18 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి...
- విద్యుత్తు, సౌరశక్తితో దూసుకెళ్లే సైకిల్‌ తయారు చేశాడు!
  కూలీలు దొరక్క రైతులు పొలాల్లో కలుపు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారు...
- బ్యాటరీతో పని చేసే గ్రాస్‌ కటర్‌ ఆవిష్కరించాడు...
ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేలా సరికొత్త ఆవిష్కరణలు చేసిన ఆ కుర్రాడు ముప్పారపు రాజు. ఈ రూరల్‌ ఇన్నోవేటర్‌ కేంద్రమంత్రి చేతుల మీదుగా పురస్కారం, నగదు బహుమతి అందుకున్నాడు.
అవసరాల నుంచే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయంటారు అనుభవజ్ఞులు. వరంగల్‌ గ్రామీణ జిల్లా గోపాలపురానికి చెందిన రాజుని చూస్తే ఆ మాట ఒప్పుకోక తప్పదు. అతడి నాన్న టీవీ మెకానిక్‌. తండ్రి టెలివిజన్లు మరమ్మతు చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు. తనూ ఓ చేయి వేసేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆసక్తి ఎక్కువైంది. చదివింది మామూలు బీఎస్సీనే. అది పూర్తి కాగానే చిన్నచిన్న పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత జనం సమస్యలపై దృష్టి పెట్టి వాటికి పరిష్కారం చూపే ఆవిష్కరణలు చేయసాగాడు.
* చల్‌చల్‌ సైకిల్‌: రాజు ఈమధ్యే ఓ సైకిల్‌ తయారు చేశాడు. ఇది సామాన్యుల కష్టాలు తీర్చే సాధనం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైకిల్‌ను విద్యుత్తుతో ఛార్జింగ్‌ చేస్తే తొక్కాల్సిన పని లేకుండా బైకులా పరుగులు తీస్తుంది. కరెంటు ఖర్చూ వద్దనుకుంటే సౌరశక్తితో ఛార్జింగ్‌ చేసుకొని రయ్‌మని దూసుకెెళ్లిపోవచ్చు. ఇవేం వద్దు.. కేలరీలు కరిగేలా, ఆరోగ్యానికి మేలు చేకూర్చేలా ఉండాలనుకుంటే పెడల్‌ తొక్కుతూ సాధారణంగానూ వాడుకోవచ్చు.
* మొబైల్‌ ఛార్జర్‌: మూడేళ్ల క్రితం సోలార్‌ మొబైల్‌ ఛార్జర్‌ను రూపొందించాడు. జనం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, ఆసుపత్రులు, పార్కుల్లో వీటిని అందుబాటులో ఉంచాడు. మామూలు ఛార్జర్‌లాగే సెల్‌ఫోన్లను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణ గురించి తెలిసిన అప్పటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి కలెక్టరేట్లో వీటిని ఏర్పాటు చేయించారు.

* టచ్‌ఫ్రీ శానిటైజర్‌: కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో శానిటైజర్‌ బాటిల్‌ ముట్టుకోనవసరం లేకుండా టచ్‌ఫ్రీ శానిటైజర్‌ రూపొందించాడు రాజు. ఇది సెన్సర్ల సాయంతో పని చేస్తుంది. దాని దగ్గర చేతులు పెడితే చాలు.. బాటిల్‌లోని శానిటైజర్‌ చేతుల్లో పడుతుంది.
* ఆటోమేటిక్‌ వీధి దీపాలు: సరైన నిర్వహణ లేక రాజు సొంతూరిలో మధ్యాహ్నం సైతం వీధి దీపాలు వెలుగుతుండేవి. విద్యుత్తు వృథాని అరికట్టాలనే ఉద్దేశంతో ఆటోమెటిక్‌ స్ట్రీట్ లైట్ రూపొందించాడు. దీంట్లో ఎల్‌డీఆర్‌ సెన్సర్‌ ఏర్పాటు చేయడంతో చీకటి పడగానే వాటంతట అవే వెలుగుతాయి. ఉదయం ఆరిపోతాయి.  ఇలాంటివి మూడు జిల్లాల పరిధిలో సుమారు 500 గ్రామాల్లో అమర్చాడు.
* కలుపు యంత్రం: ఈమధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కూలీల కొరత. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే యంత్రాలున్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ సమస్య తీర్చేలా బ్యాటరీతో నడిచే గ్రాస్‌ కట్టర్‌ చేశాడు. ఇది బ్యాటరీ, డీసీˆ మోటార్‌తో పని చేస్తుంది.
గ్రామీణ ప్రాంతాల అవసరాలు, సమస్యలు తీర్చేలా  రాజు తమ ఊరికి దగ్గర్లోని గిర్నిబావిలో ఒక ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని