మరాఠీ తెరపై.. తెలుగు జయకేతనం

సినిమా పిచ్చితో ఇంట్లోంచి పారిపోయిన కుర్రాడు... ఒంటిపూట తింటూ.. స్టూడియోల్లో ఉంటూ పాఠాలు నేర్చుకున్నాడు. పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి దర్శకత్వంపై పట్టు సాధించాడు. సీన్‌ కట్‌ చేస్తే... పదేళ్ల తర్వాత అరవై ఏళ్ల బామ్మ

Published : 27 Mar 2021 01:11 IST

సినిమా పిచ్చితో ఇంట్లోంచి పారిపోయిన కుర్రాడు... ఒంటిపూట తింటూ.. స్టూడియోల్లో ఉంటూ పాఠాలు నేర్చుకున్నాడు. పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి దర్శకత్వంపై పట్టు సాధించాడు. సీన్‌ కట్‌ చేస్తే... పదేళ్ల తర్వాత అరవై ఏళ్ల బామ్మ స్ఫూర్తిదాయక జీవిత కథతో సినిమా చేశాడు... దానికి అంతర్జాతీయంగా మెచ్చుకోలు దక్కాయి... తాజాగా జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో అవార్డు దక్కింది... మరాఠీ తెరపై మాయ చేసిన ఆ దర్శకుడు నవీన్‌ దేశబోయిన మన తెలుగు తేజమే.

సినిమా కలలున్న కుర్రాళ్లు వీధికో నలుగురైనా ఉంటారు. కల నిజం కావాలంటే సినిమా కష్టాలు భరించాల్సిందే.  అప్పుడే అవకాశం అందుతుంది. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్‌లాంటి దర్శకుల స్ఫూర్తితో సినిమాలపై ప్రేమ పెంచుకున్న నవీన్‌ లక్ష్యం చేరడానికి ఎన్నో అవాంతరాలు దాటాడు.
పరిచయం: నవీన్‌ సొంతూరు కరీంనగర్‌ జిల్లా మానకొండూరు. చిన్నప్పట్నుంచీ పుస్తకాల పురుగు. కరీంనగర్‌లోని కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ (కఫిసో) అతడికి సినిమాపై ప్రేమ పెంచింది. అక్కడ ప్రముఖ దర్శకుల సినిమాల్ని వారంవారం ప్రదర్శించే వాళ్లు. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్‌, అకీరా కురసోవా, విట్టోరియో డి సికాలాంటి గొప్ప దర్శకులందరూ నవీన్‌కి అక్కడే పరిచయం అయ్యారు. వాళ్ల సినిమాల్లోని వాస్తవికత, సహజత్వం నవీన్‌పై పెను ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే ‘పథేర్‌ పాంచాలి’, ‘బైస్కిల్‌ థీవ్స్‌’, ‘అపూర్వ్‌ సంసార్‌’, ‘అగంతక్‌’ వంటి సినిమాలు చూసి ఎప్పటికైనా దర్శకుడు కావాలనుకున్నాడు. ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగానే ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌ వచ్చేశాడు.

ఒకేపూట తింటూ: హైదరాబాద్‌ రాగానే ఘోస్ట్‌ రైటర్‌గా పని చేసే బాలకృష్ణ అనే మిత్రుడ్ని కలిశాడు. స్క్రిప్ట్‌ ఎలా రాయాలో తన దగ్గరే నేర్చుకున్నాడు. అక్కడే ఉంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. మరోవైపు చిన్నచిన్న పనులు చేయడం ద్వారా వచ్చే అరకొర సంపాదనతో రోజు గడపడం కష్టమయ్యేది. చాలాసార్లు ఒక్కపూట తిండితో సరిపెట్టుకునేవాడు. గది అద్దె కట్టలేక కొన్నాళ్లు సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి స్టూడియోలో ఉన్నాడు. అప్పుడే అల్లాణి శ్రీధర్‌ ఆఫీసులో పని దొరికింది. అక్కడ సీరియల్‌ షూటింగ్‌లు, డబ్బింగ్‌, ఎడిటింగ్‌ చేసేవాళ్లు. అవన్నీ గమనిస్తూ సినిమా మేకింగ్‌ పట్ల అవగాహన పెంచుకున్నాడు. ఆ అనుభవంతో ఒక డాక్యుమెంటరీ, ఓ సీరియల్‌కి ఐదు ఎపిసోడ్‌లు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. అవి విడుదల కాకపోయినా సినిమా తీయగలననే నమ్మకం కలిగింది. ఇక పెద్ద దర్శకుల దగ్గర చేరితే కమర్షియల్‌ బాటలో పడిపోతాననీ, సహజత్వం కోల్పోతాననే భయంతో ఆ ప్రయత్నం చేయలేదు. మిత్రుడు గోపాల్‌ సాయంతో పుణె ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చేరి దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నాడు.
కదిలించిన కథనం: 2013 డిసెంబరులో లతా భగవాన్‌ అనే మహిళ రూ.3 వేల కోసం మూడు కిలోమీటర్ల శరత్‌ మారథాన్‌ పోటీల్లో పాల్గొని గెలిచింది. అదీ అరవై ఏళ్ల వయసులో. భర్త ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అంతటి సాహసం చేసింది. ఈనాడులో వచ్చిన కథనం చదివి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు నవీన్‌. మిత్రుడి దగ్గర ఇరవై వేలు అప్పు తీసుకొని ఆమెను వెతుక్కుంటూ ముంబయి, అక్కడ్నుంచి బారామతి వెళ్లాడు. ఒప్పించి ఆమెతోనే సినిమా తీయాలనుకున్నాడు. కానీ, ఓ ముసలావిడితో సినిమా చేస్తే డబ్బులు రావనే ఉద్దేశంతో ఏ నిర్మాతా ముందుకు రాలేదు. స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నా మూడేళ్లు నిర్మాతల కోసమే వెతుక్కోవలసి వచ్చింది. ఈలోపు లతా రెండోసారి శరత్‌ మారథాన్‌ పోటీలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. నవీన్‌కి కథపై మరింత నమ్మకం కుదిరింది. అదేసమయంలో మిత్రుడు యర్రబోతు కృష్ణ నిర్మాతగా ముందుకొచ్చాడు. సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.

వీడియోగ్రాఫర్లతో: ముందే అనుకున్నట్టు సినిమాని వాస్తవికంగా, సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించాలనుకున్నాడు. లతా భగవాన్‌తో పాటు ఆమె భర్త, పిల్లలు, చుట్టు పక్కల వాళ్లు.. అందరూ ఆమె నిజ జీవితంలో ఉన్నవాళ్లనే ఎంచుకున్నాడు. వాళ్లందరికీ నెలపాటు నటనలో శిక్షణనిచ్చాడు. దీనికోసం తెలుగు, హిందీ, మరాఠీల్లో స్క్రిప్ట్‌లు రాసుకున్నాడు. ఆ ఊరిలోనే పెళ్లి వీడియోలు తీసే ఆదిత్య, కమలేష్‌ సంగారేలను కెమెరామెన్‌లుగా తీసుకున్నాడు. రెండేళ్లు కష్టపడి తక్కువ బడ్జెట్‌లో చిత్రీకరణ పూర్తి చేశాడు. ఈ చిత్రం కోసం లత చాలా కష్టపడ్డారు. దాదాపు 200 కిలోమీటర్లు పరుగెత్తారు. ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌లో పైనుంచి కిందపడితే ఆర్నెళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అన్ని కష్టాలు దాటుకొని సినిమా 2020 జనవరిలో మరాఠీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకులతోపాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. బీబీసీ వాళ్ల దృష్టికి వెళ్లడంతో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరొచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయి పురస్కారం వరిచింది.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని