కావద్దోయ్‌.. బెట్టింగ్‌ బంగార్రాజులు

వినోదం పంచాల్సిన క్రికెట్‌ను విషాదానికి వేదికగా మార్చేస్తున్నారు... సిక్స్‌ కొట్టినా, ఫోర్‌ బాదినా చిందులేయాల్సింది పోయి.. తీవ్ర ఒత్తిడితో చిత్తైపోతున్నారు... బంతి బంతికీ ఆస్వాదించాల్సింది పోయి పందాలు కాసి ఆర్థికంగా చితికిపోతున్నారు... రాత్రికి రాత్రే లక్షలు పోగేసుకోవాలనే అత్యాశతో  అప్పుల పాలవుతున్నారు... బెట్టింగ్‌ ఊబిలో సర్వం కోల్పోయి చివరికి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు కొందరు...

Published : 24 Apr 2021 00:34 IST

వినోదం పంచాల్సిన క్రికెట్‌ను విషాదానికి వేదికగా మార్చేస్తున్నారు... సిక్స్‌ కొట్టినా, ఫోర్‌ బాదినా చిందులేయాల్సింది పోయి.. తీవ్ర ఒత్తిడితో చిత్తైపోతున్నారు... బంతి బంతికీ ఆస్వాదించాల్సింది పోయి పందాలు కాసి ఆర్థికంగా చితికిపోతున్నారు... రాత్రికి రాత్రే లక్షలు పోగేసుకోవాలనే అత్యాశతో  అప్పుల పాలవుతున్నారు... బెట్టింగ్‌ ఊబిలో సర్వం కోల్పోయి చివరికి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు కొందరు... ఐపీఎల్‌ జోరు మీదున్న ఈ సమయంలో యువత ఈ మత్తులోంచి బయట పడే మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు.


ఐపీఎల్‌ పందాల్లో తీవ్రంగా నష్టపోయామని పురుగులమందు తాగిన అన్నదమ్ములు. అన్న మృతి.
- గుంటూరులో దారుణం.
క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.4లక్షలు పోగొట్టుకొని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య
- కరీంనగర్‌లో ఘటన

లాంటి సంఘటనలు ఈమధ్యకాలంలో తరచూ చూస్తున్నాం. డ్రగ్స్‌, ఆల్కహాల్‌, పేకాటలాగే క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనంలో సర్వం కోల్పోతున్న యువత ఎందరో. గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఈ పాడు సంస్కృతి పల్లెటూళ్లకీ పాకుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా యువతను నిండా ముంచేస్తోంది. ముఖ్యంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొదలయ్యాక బెట్టింగ్‌ కుర్రకారు సెల్‌ఫోన్లను కమ్మేస్తోంది. ముందు సరదాగా.. కాలక్షేపంగా మొదలై ఓ వ్యసనంలా మారుతోంది. వీళ్ల బలహీనతను క్యాష్‌ చేసుకోవడానికి బెట్‌వే, బెట్‌ 365, 22 బెట్‌లాంటి బోలెడన్ని యాప్‌లు బయల్దేరాయి. బంతి బంతికీ, ఓవర్‌కి, వికెట్‌కి, రన్స్‌ తేడాకీ.. ప్రతి సందర్భంలోనూ కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందాలను ఆహ్వానిస్తూ కోట్లు దండుకుంటున్నాయి.
ఈ వ్యసనానికి ఎక్కువగా బలవుతోంది కాలేజీ విద్యార్థులు, చిరుద్యోగులే. ఇందులో మునిగినవారు ఆర్థికంగా నష్టపోవడమే కాదు.. చదువు, ఉద్యోగాలపై మనసు పెట్టలేకపోతున్నారు. ఈ అలవాటు వ్యసనంగా మారడానికి మన శరీరంలో జరిగే ఓ రసాయన క్రియ సైతం కారణమే అంటారు మానసిక నిపుణులు. బెట్టింగ్‌లో నష్టపోయినప్పుడు మెదడులో ‘ఇన్సులా’ అనే భాగం అతిగా స్పందిస్తుంది. కోల్పోయిన మొత్తం ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలి అనే కాంక్షను రగిలిస్తుంది. ఆ సమయంలో సాధ్యాసాధ్యాలు మర్చిపోతారు. పోయిన రూపాయి తిరిగి రాదనే నిజం తెలుసుకోలేరు. వైఫల్యాలు ఎక్కువ అవుతున్నకొద్దీ డిప్రెషన్‌కి గురవుతుంటారు. మరింత తెగింపుతో తాహతుకు మించి పందెం కాస్తారు. అప్పులు చేస్తారు. డబ్బులు కావాలని ఇంట్లోవాళ్లనీ బెదిరిస్తారు. సర్వం కోల్పోయాక తాగుడు, ధూమపానం, డ్రగ్స్‌కి సైతం బానిసలవుతారు. డబ్బుతోపాటు విలువైన సమయం, ఆరోగ్యం కోల్పోతారు. కుటుంబం, సన్నిహితులను నిర్లక్ష్యం చేస్తారు. బాధ్యతలు పట్టించుకోరు. బంధువులు, స్నేహితుల్లో చులకన అయిపోతారు. అంతా అయిపోయాక తమదైన లోకంలో ఉండిపోతారు. చివరికి ఆత్మహత్యే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్లిపోతారు.

పెద్దల పాత్ర ముఖ్యం
కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ఎక్కువయ్యాయి. బోలెడంత సమయం చిక్కడంతో ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్‌లోకి దిగుతున్నారు. ఐపీఎల్‌లాంటి దీర్ఘకాలిక టోర్నీలు సైతం వారిని ఆకర్షిస్తున్నాయి. మొదట్లో కొద్దిమొత్తంలో డబ్బులు రాగానే సంపాదించడం ఇంత తేలికా? అనే భావనలోకి వెళ్లిపోతుంటారు. తర్వాత తమ తాహతుకు మించి పందెం కాస్తారు. అది ఒక ఊబి అని తెలుసుకునేసరికే అన్నిరకాలుగా నష్టపోతారు. ఈ వ్యసనం బారినపడుతున్న వాళ్లలో ఎక్కువమంది యువతే. వాళ్లను కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులు, సన్నిహితులే. వాళ్లేం చేస్తున్నారో ఎప్పుడూ గమనిస్తుండాలి. తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారని గమనిస్తే వెంటనే మందలించాలి. చెడు స్నేహాలు కత్తిరించాలి. బెట్టింగ్‌తో ఎన్నిరకాలుగా నష్టపోతారో విడమరిచి చెప్పాలి. వాళ్లలో ఎలాంటి మార్పు లేకపోతే మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ముందే గుర్తించాలి
ప్రతి క్షణం క్రికెట్‌, బెట్టింగ్‌ గురించే ఆలోచిస్తారు. చర్చిస్తుంటారు.
ముఖ్యమైన పనులు సైతం వాయిదా వేస్తుంటారు.
మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరినీ దరిదాపుల్లోకి రానివ్వరు.
ఇంట్లోని ఖరీదైన వస్తువులు తీసుకెళ్లడానికి, దొంగిలించడానికి సైతం వెనకాడరు.
అంతా అయిపోయాక పశ్చాత్తాపం ప్రకటిస్తారు. జీవితం వ్యర్థం అని బాధ పడుతుంటారు.
బయట పడాలిలా
ఖాళీగా ఉంటేనే బెట్టింగ్‌ ఆలోచన వస్తుంది. ప్రతి క్షణం తీరిక లేకుండా ఉండేలా చూసుకోవాలి.
గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌ జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. జనం ఉండే ప్రదేశాల్లోనే ఉండాలి.
ఈ వ్యసనం నుంచి బయట పడాలి అనుకునే వారు, సర్వం కోల్పోయిన వారికి టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. వాటిలో చేరితే ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు.
తమని తాము నియంత్రించుకోలేని వారికి మానసిక నిపుణులు సైకో థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తారు.
నిరాశ, నిస్పృహలో కూరుకుపోయినప్పుడు, అన్ని దారులు మూసుకుపోయాయి అని భావించినప్పుడు ఆదుకోవడానికి హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఉన్నాయి. వాటిని సంప్రదించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని