Updated : 15 May 2021 04:44 IST

కరోనా కష్టంలో.. ఆత్మీయ నేస్తాలు

అందరి పంతం.. కరోనాని తరిమికొట్టాలనే... అందరి ప్రార్థన.. బాధితులు బాగుపడాలనే... అందరి ఆరాటం.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే... అందరి తపన.. ఆప్తుల్ని కోల్పోయినవారి కన్నీరు తుడవాలనే... కానీ ఆచరణలో చూపేది అతికొద్దిమందే! అలాంటివారే తమదైన రీతిలో స్పందిస్తున్నారు.. బాధితులకు అండగా నిలుస్తున్నారు... వెలకట్టలేని సాయం అందిస్తున్న ఆ కరోనా వీరుల పరిచయం.
కొవిడ్‌ కర్కశత్వానికి కుటుంబాలే ఛిద్రమైపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి బాధితుల కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘అయ్యో పాపం’ అనకుండా నడుం బిగించి చేతనైన సాయం చేయడానికి యువత ముందుకొస్తున్నారు. ఐసోలేషన్‌లో ఉన్నవారికి భోజనాలు అందిస్తూ, అత్యవసర ఔషధాలు చేరవేస్తూ, ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేస్తూ, ఆక్సిజన్‌ ఇచ్చి ప్రాణాలను నిలుపుతూ,  మృతదేహాలను శ్మశానాలకు తరలిస్తూ.. సేవా సైనికుల్లా చేయూతనందిస్తూనే ఉన్నారు. అందులో కొందరి పరిచయం.

గౌరవంగా చివరి మజిలీ

అందరూ ఉన్నా, అనాథల్లా ఆఖరి మజిలీ ముగిస్తున్న దైన్యం ఎన్నో కుటుంబాలను కుంగదీస్తోంది. ఈ నిస్సహాయ పరిస్థితుల్లో అలాంటి వారికి అండగా నిలుస్తూ, ఆఖరి ప్రయాణాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తోంది తిరుపతిలోని యునైటెడ్‌ ముస్లిం అసోసియేషన్‌ యువబృందం.
కొవిడ్‌ కారణంగా చనిపోతున్న వారి అంత్యక్రియలకు అయినవాళ్లే ముందుకురాలేని పరిస్థితి. దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు యూఎంఏ సభ్యులు. అందరూ ఉన్నా అనాథ శవాల్లా మిగిలిపోతున్న వారికి కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే సంకల్పంగా 2014లో ఈ సేవా బృందం ఏర్పాటైంది. కేరళ, ఉత్తరాఖండ్‌ వరదలు సహా ఎన్నో ప్రకృతి విపత్తుల్లో బాధితులకు అండగా నిలిచింది. గతేడాది కొవిడ్‌తో పోరాడుతూ మృతి చెందిన వారిని ఖననం చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో ఈ సంస్థలోని యువకులే ముందడుగు వేశారు. తొలుత ముస్లిం పార్థివదేహాల ఖననం కోసం ప్రారంభమైంది కొవిడ్‌-19జేఏసీ. క్రమంగా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని మతాల వారి మృతదేహాలకూ వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చి తిరుపతి, చిత్తూరుల్లో చనిపోయిన వారి మృతదేహాలనూ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 450 పార్థివదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

రిలీఫ్‌నిచ్చే రైడర్స్‌..

ఈ కష్టకాలంలో ఎన్నో చేతులు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారికి అండగా మేమున్నామంటున్నారు ‘రిలీఫ్‌ రైడర్స్‌’.
గరాల్లో సైకిల్‌ వాడకాన్ని ప్రోత్సహించి.. కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘బీవైసీఎస్‌’ అనే సంస్థ కృషి చేస్తోంది. దానికి అనుబంధంగా చాలా దేశాల్లో రిలీఫ్‌ రైడర్స్‌ పేరుతో సైక్లిస్టు గ్రూపులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగి సెల్వన్‌ దీనికి నాయకుడు. మిగతా సైక్లిస్టుల సాయంతో ఇంటి గడప దాటలేని పరిస్థితుల్లో ఉన్న వారికి అండగా నిలవాలనుకున్నాడు. ఔషధాలు, ఆహారం అవసరం ఉన్న ఒంటరి వృద్ధులు సహాయం కోసం తనను సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఎవరైనా సెల్వన్‌కు ఫోన్‌ చేస్తే వాటిని రిలీఫ్‌ రైడర్స్‌ వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేస్తాడు. అక్కడికి దగ్గర్లోని వలంటీర్‌ స్పందించి బాధితులకు కావాల్సినవి అందిస్తాడు. వలంటీర్ల సంఖ్య పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువులు కూడా అందించాలనే ఆలోచనలో ఉన్నామంటున్నాడు. వందమంది సభ్యులున్న ఈ బృందం రోజుకి 70వరకు ఫోన్‌ కాల్స్‌ అందుకుంటోంది.

అన్ని సమయాల్లో అండగా..

‘రోగికి వైద్యుడు ఇచ్చే భరోసాతోనే సగం రోగం నయమవుతుంది’ అంటాడు యువ డాక్టరు పెంటాగౌడ్‌. ఊపిరి సలపనంత పనిలోనూ అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కరోనా బాధితులకు ఫోన్‌ ద్వారా ఉచితంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాడు.
న్‌లైన్‌ కౌన్సెలింగ్‌ పేరుతో గంటకి వందల రూపాయల ఫీజులు తీసుకుంటున్న ఈరోజుల్లో రోజుకి పదుల ఫోన్లు అటెండ్‌ చేస్తూ బాధితులకు సూచనలిస్తూ ధైర్యం నూరిపోస్తున్నాడు పెంటాగౌడ్‌. అంతేకాదు ఫోన్‌ ద్వారా సంతృప్తి చెందకపోతే సొంత క్లినిక్‌కి ఆహ్వానిస్తున్నాడు. గతంలో కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడిస్తున్నాడు. ‘నాకు వస్తున్న ఫోన్లలో విపరీతంగా భయపడుతున్నవాళ్లు, అతిగా ఊహించుకుంటున్న వాళ్లే ఎక్కువ. నాకు హార్ట్‌ఎటాక్‌ వస్తుందా? రక్తం గడ్డ కడుతుందా? ఊపిరితిత్తులు పాడవుతాయా? అనే సందేహాలే ఎక్కువ. దీన్ని బట్టి అత్యధికులకు అవగాహనా లోపం ఉందని అర్థమవుతోంది. ఇలాంటివాళ్లకి కొంచెం ధైర్యం ఇవ్వగలిగితే చాలు మహమ్మారి నుంచి త్వరగా కోలుకుంటారు’ అంటాడు పెంటాగౌడ్‌. గాంధీలో మెడిసిన్‌ పూర్తి చేసిన తనకి కరోనాలాంటి గడ్డు పరిస్థితుల్లో అక్కడి వైద్యులు, ప్రొఫెసర్లు ఎంత కష్టపడి పని చేస్తారో తెలుసు. వాళ్లతో పోలిస్తే నేను చేసే సాయం చిన్నది అంటాడు. అందుకే మహమ్మారి కనుమరుగయ్యేవరకూ ఎంతమందికైనా విసుగు లేకుండా సాయం చేయడానికి సిద్ధమంటున్నాడు.

ఔషధాలు అందేలా..

ఓ యువతి తండ్రి, సోదరుడు కరోనా బారినపడ్డారు. ఆక్సిజన్‌, మందులు అత్యవసరమయ్యాయి. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సభ్యులను ఆశ్రయించిందామె. వలంటీర్లు నిమిషాల్లో సాయం అందించారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి మొదలైన సంస్థ ఇలా అవసరాల్లో ఉన్న ఎందరినో ఆదుకుంటోంది.
కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పెట్టాయి. ఈ సమయంలో అత్యవసరాలు, ఔషధాలు సంపాదించుకోవడం వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు చాలా కష్టంగా ఉంది. అలాంటి వారికి అండగా నిలుస్తోందీ సంస్థ. గతేడాది లాక్‌డౌన్‌లో దాదాపు 1600 మందికి మందులు సరఫరా చేశారు. ఈసారి సెకండ్‌వేవ్‌ ఉద్ధృతం కావడంతో మళ్లీ సేవలు ప్రారంభించారు. దాదాపు 60 మంది వలంటీర్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లి మందులు, అత్యవసరాలు అందిస్తున్నారు. బాధితులు తమకు కావాల్సిన మందులు చెప్పి, వాట్సాప్‌లో లొకేషన్‌ పంపితే చాలు.. ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. పేదవాళ్లైతే మందులు సైతం కొనిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలుండి ఔషధాల మీదే ఆధారపడేవాళ్లు, అశక్తులను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యం అంటున్నాడు వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి.
* ఔషధాలు, ఇతర సాయం అవసరం ఉన్న వారు 8499031234, 7799553385 నెంబర్లలో సంప్రదించవచ్చు.

- తేరాల రంజిత్‌ కుమార్‌, శ్రీహర్ష నెక్కంటి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని