దూస్రా.. గోప్యతకు భరోసా!

షాపింగ్‌ మాల్‌, బ్యాంకు, మెడికల్‌ స్టోర్‌... ఎక్కడో ఒకచోట ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేస్తుంటాం. తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ప్లాటు కొనమంటూ, పాలసీ తీసుకోవాలంటూ, బ్యాంకు రుణం ఇస్తామంటూ విసిగిస్తూ కాల్స్‌ చేస్తూనే ఉంటారు. అమ్మాయిలనైతే అసభ్యకరమైన మాటలతో వేధించే పోకిరీలుంటారు. మన నెంబర్‌ ఆధారంగా బ్యాంకుల్లోని డబ్బు లూటీ చేసే కేటుగాళ్లూ తక్కువేం కాదు.

Published : 22 May 2021 00:26 IST

మా అమ్మకి సీరియస్‌.. అర్జెంటుగా ఓ నెగెటివ్‌ రక్తం కావాలని ఫేస్‌బుక్‌లో నెంబర్‌ పెట్టిందో అమ్మాయి... సాయం మాట దేవుడెరుగు. కొన్నాళ్లపాటు ఆకతాయిల వేధింపులు తట్టుకోలేకపోయింది. లక్కీడిప్‌ అంటే షాపింగ్‌ మాల్‌లో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు వినయ్‌.. రెండ్రోజులయ్యాక ఓటీపీ వచ్చింది. అవతలి వ్యక్తికి చెబితే రూ.58వేలు కాజేశాడు. ఫోన్‌ నెంబర్‌ పరుల చేతిలో పడ్డాక ఇలా డబ్బులు నష్టపోతూ, మానసిక ప్రశాంతత కరువై పోతున్నవాళ్లు ఎందరో! దీనికి చెక్‌ పెట్టేలా ‘దూస్రా’ ప్రారంభించాడు వూచి ఆదిత్య... దీంతోపాటు మరో రెండు స్టార్టప్‌లతో 1200మందికి ఉపాధి కల్పిస్తున్నాడు... ఈ సరికొత్త ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపూ దక్కించుకున్నాడు.
షాపింగ్‌ మాల్‌, బ్యాంకు, మెడికల్‌ స్టోర్‌... ఎక్కడో ఒకచోట ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేస్తుంటాం. తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ప్లాటు కొనమంటూ, పాలసీ తీసుకోవాలంటూ, బ్యాంకు రుణం ఇస్తామంటూ విసిగిస్తూ కాల్స్‌ చేస్తూనే ఉంటారు. అమ్మాయిలనైతే అసభ్యకరమైన మాటలతో వేధించే పోకిరీలుంటారు. మన నెంబర్‌ ఆధారంగా బ్యాంకుల్లోని డబ్బు లూటీ చేసే కేటుగాళ్లూ తక్కువేం కాదు. ఈ వేధింపులు, మోసాలు ఆపుతూ.. ‘దూస్రా’ మీ గోప్యతకు భంగం కలగకుండా చూస్తుందంటాడు ఆదిత్య.
 పని చేస్తుందిలా?
దూస్రా ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం.
www.doosra.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే ఒక వర్చువల్‌ నెంబర్‌ ఇస్తారు. దీంతోపాటు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తాత్కాలిక అవసరాలకు, మన ప్రైమరీ నెంబర్‌ ఇవ్వడం శ్రేయస్కరం కాదు అనుకున్న చోట ఈ వర్చువల్‌ నెంబర్‌ ఇవ్వాలి. సాధారణంగా అపరిచితులు, బాగా విసిగించే వాళ్ల నెంబర్లు బ్లాక్‌ లిస్టులో పెడతాం. కానీ వాళ్లు వేరొక నెంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తారు. దూస్రాతో అయితే ప్రతి నెంబర్‌ని బ్లాక్‌ చేసి, అవసరం అనుకున్నవి మాత్రమే అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందులో ట్రస్టెడ్‌ నంబర్స్‌, ట్రస్టెడ్‌ కంపెనీస్‌, ట్రస్టెడ్‌ సర్వీసెస్‌ అనే విభాగాలుంటాయి. మనకు నమ్మకం కలిగిన నెంబర్లను వాటిలోకి మార్చుకోవచ్చు. మహిళలు, తమ గోప్యతకు భంగం కలగొద్దు అని భావించేవాళ్లకు ఈ సర్వీసు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంటాడు ఆదిత్య.  ఈ వర్చువల్‌ నెంబర్‌తో టెలిగ్రామ్‌, వాట్సాప్‌లాంటి సామాజిక మాధ్యమాలనూ వాడుకోవచ్చు. ఒకేసారి ఫోన్‌, ట్యాబ్లెట్‌ సహా మూడు గ్యాడ్జెట్ల నుంచి లాగిన్‌ కావొచ్చు. ‘ప్రస్తుతం ఫోన్‌ నెంబర్‌ అనేది ఒక డిజిటల్‌ ఐడెంటిటీగా మారిపోయింది. కానీ వ్యక్తిగత నెంబర్‌ అనేది వ్యక్తిగత అవసరాలకే ఉండాలి. ఏ ఇబ్బందులూ రాకుండా ఇతర అవసరాలు తీరాలి అనే ఉద్దేశంతోనే దూస్రా ప్రారంభించాం’ అంటాడు ఆదిత్య. ఈ సర్వీసుని దాదాపు ముప్ఫైవేల మంది ఉపయోగిస్తున్నారు.
ఉపాధి కల్పిస్తూ..
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆదిత్యకు దూస్రా మూడో స్టార్టప్‌. బీటెక్‌ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్కాలర్‌షిప్‌తో ఎం.ఎస్‌.చేశాడు. పరిశోధనలతో కొత్త సాఫ్ట్‌వేర్లు ఆవిష్కరించాడు. అక్కడే ఒక ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్‌ స్టార్టప్‌లో కెరీర్‌ ప్రారంభించి దాని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు బిజినెస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా ఉండేవాడు. మంచి స్థానంలో ఉన్నా సొంతంగా కంపెనీ ప్రారంభించాలి.. కొందరికైనా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో పదేళ్ల కిందట హైదరాబాద్‌ తిరిగొచ్చాడు. భార్య నీలిమతో కలిసి రెస్టరెంట్‌ స్టార్టప్‌ ప్రారంభించాడు. అది అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. డబ్బులు, సమయం పోయాయి. అయినా అధైర్య పడకుండా ఇద్దరు ఉద్యోగులతో ‘మీడియా మింట్‌’ అనే డిజిటల్‌ మీడియా మార్కెటింగ్‌, టెక్నాలజీ అంకుర సంస్థ మొదలుపెట్టాడు. అది సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. 2013లో ‘జిప్పర్‌’ అనే మరో స్టార్టప్‌, ఇప్పుడు దూస్రా. మంచి హోదా వదిలేసి ఇండియా వచ్చినప్పుడు కొందరికైనా ఉపాధి కల్పించాలి అనుకున్న ఆదిత్య సంస్థల్లో ఇప్పుడు 1200 మంది ఉండటం ఒకింత గర్వంగా ఉందంటాడు. సరికొత్త ఆలోచనలు, స్టార్టప్‌లతో ముందుకెళ్తున్న ఆదిత్య ‘అమేజింగ్‌ స్టోరీస్‌ ఆఫ్‌ 25 స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌’లో ఒకరిగా నిలిచాడు. యువర్‌స్టోరీ, సీఎన్‌ఎన్‌, ఫోర్బ్స్‌, ఎన్‌డీటీవీలాంటి ప్రింట్‌, టీవీ మీడియాల్లోనూ అతడి గురించి స్ఫూర్తిదాయక కథనాలు వచ్చాయి. మీడియా మింట్‌ 2016లో ఐబీఎం ‘బెస్ట్‌ స్టార్టప్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని