అడుగులు అందుకుంటే.. మనదే అందలం!

జెఫ్‌ బెజోస్‌.. అమెజాన్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌.. యాపిల్‌ సృష్టికర్త.ఎలన్‌ మస్క్‌.. టెస్లాకి యజమాని.  వీళ్లంతా అపర కుబేరులు..వ్యాపార సామ్రాజ్యాధిపతులు!  కానీ ఒకప్పుడు?జెఫ్‌.. బర్గర్లు తిరగేసేవాడు. స్టీవ్‌.. నట్లు, బోల్టులు బిగించేవాడు. ఎలన్‌.. బాస్‌కి కొత్త ఆలోచనలు చెప్పేవాడు.ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వాళ్లు ఆ పనులు చేసేవారు

Updated : 29 May 2021 19:06 IST

జెఫ్‌ బెజోస్‌.. అమెజాన్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌.. యాపిల్‌ సృష్టికర్త.ఎలన్‌ మస్క్‌.. టెస్లాకి యజమాని.  వీళ్లంతా అపర కుబేరులు..వ్యాపార సామ్రాజ్యాధిపతులు!  కానీ ఒకప్పుడు?జెఫ్‌.. బర్గర్లు తిరగేసేవాడు. స్టీవ్‌.. నట్లు, బోల్టులు బిగించేవాడు. ఎలన్‌.. బాస్‌కి కొత్త ఆలోచనలు చెప్పేవాడు.ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వాళ్లు ఆ పనులు చేసేవారు. కానీ ఆ సమయమే తమ జీవితంలో కీలక మలుపు అంటూ ఎన్నో వేదికలపై చెప్పారు. ఇక్కడ అడుగులు జాగ్రత్తగా పడితే కెరీర్‌లో దూసుకుపోవచ్చు. ఈ దశలోని కొద్దిపాటి అనుభవంతో స్టార్టప్‌లకు బాటలు వేసుకోవచ్చు. ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుంటే యువత అందలం అందుకోవడం తేలికే.

పుణె కుర్రాడు ప్రణయ్‌ పాతోలే మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌. సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, స్టార్టప్‌ల స్ఫూర్తి ఎలన్‌ మస్క్‌ ప్రణయ్‌ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు. తొలి రోజుల్లో చేసిన ఇంటర్న్‌షిప్‌ తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చిందో వివరించాడు. ఒక్క ఎలన్‌ అనే కాదు.. అసాధారణ విజయాలు సాధించిన గొప్పగొప్ప విజేతలంతా ఇంటర్న్‌షిప్‌లతో తమ జీవితాన్ని కీలక మలుపు తిప్పుకున్నవారే. వారి అనుభవ పాఠాలు మనకు ఆచరణీయాలు.


జెఫ్‌ బెజోస్‌- బర్గర్లు చేసిన చేతులతో..

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మెక్‌డొనాల్డ్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. పదహారేళ్లకే అందులో చేరాడు. పెనం మీద బర్గర్లు తిరగేయడం, అక్కడంతా శుభ్రం చేయడం అతడి పని. అప్పుడు అతడు అందుకున్న మొత్తం 2.69 డాలర్లు. అంటే దాదాపు రెండు వందల రూపాయలు. అది చేస్తూనే రోజుకి ఎన్ని బర్గర్లు అమ్ముడవుతున్నాయి, ఎంత వ్యాపారం జరుగుతుందో లెక్కలు వేసేవాడు. తర్వాత డిగ్రీ పట్టా అందుకోగానే ఫిటెల్‌ అనే టెలీ కమ్యూనికేషన్‌ కంపెనీలో చేరాడు. అక్కడా ఇంటర్న్‌గానే. ఆ సమయంలోనే వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందిస్తే సగం విజయం సాధించినట్టే అనే విషయం అర్థమైందని ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మాలి అనే ఆలోచనకు బీజం పడిందీ అక్కడే అన్నాడు జెఫ్‌.
విద్యార్థిగా ఉన్నప్పుడు ఉద్యోగం సంపాదించడం, సంపద సృష్టించడం తేలిక అనే భ్రమలో ఉండేవాణ్ని. కానీ నేను ఇంటర్న్‌ అయిన తర్వాతే వాస్తవం తెలిసొచ్చింది. ఈ సమయంలోనే ఒక మనిషి రాయిలా ఉండిపోతాడా? శిల్పంలా మారిపోతాడా? అనేది తేలిపోతుంది.


ఎలన్‌ మస్క్‌: బీజాలు అక్కడే

స్పేస్‌ ఎక్స్‌తో నింగికి నిచ్చెనలేస్తున్న అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌. కెనడాలోని క్వీన్స్‌ యూనివర్సిటీలో భౌతికశాస్త్రం చదువుతుండగానే అతడి మస్తిష్కంలో రకరకాల ఆవిష్కరణల ఆలోచనలు, వ్యాపార విస్తరణ అవకాశాలు మెదిలేవి. ఆ సమయంలో ప్రఖ్యాత బ్యాంకర్‌ పీటర్‌ నికోల్సన్‌ని ఒక్కసారైనా కలవాలని తాపత్రయపడేవాడు. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. ఎలాగోలా నెంబర్‌ సంపాదించి ఫోన్‌ కలిపాడు. ఇచ్చిన కొద్దిసమయంలోనే మాటలతో కనికట్టు చేశాడు. దాంతో నికోల్సన్‌ తన ‘బ్యాంక్‌ ఆఫ్‌ నోవా స్కోటియా’లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అనుమతించాడు. బాస్‌కి కొత్తకొత్త ఆలోచనలు ఇవ్వడమే అతడి పని. ఆ సమయంలోనే ‘బాండ్‌ ట్రేడ్‌’ గురించి వివరించాడు. భవిష్యత్తులో ఇది బ్యాంకులకు అతిపెద్ద వ్యాపారం కాబోతోందని చెప్పాడు. ఎందుకనో అతడి ఆలోచనను పీటర్‌ తేలికగా కొట్టిపడేశాడు. కానీ తర్వాత కాలంలో మస్క్‌ చెప్పిందే నిజమైంది. 1994లో మస్క్‌ ఎనర్జీ స్టోరేజీ, రాకెట్‌ సైన్స్‌ గేమ్స్‌ స్టార్టప్‌లలో పని చేసేవాడు. పగలు ఒకదాంట్లో, సాయంత్రం మరోదాంట్లో. అవి పూర్తయ్యేసరికే పదుల సంఖ్యలో వ్యాపార ఆలోచనలు మొదలయ్యాయి. తర్వాత స్టాన్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ అవకాశాన్ని వదులుకొని ‘జిప్‌2’ అనే ఆన్‌లైన్‌ డైరెక్టరీ ప్రారంభించాడు. ఐదేళ్ల తర్వాత ‘కాంపాక్‌’ సంస్థకి 160 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌లతో.. తర్వాత తను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
నేను పీహెచ్‌డీ పూర్తి చేస్తే మహా అయితే ఓ డాక్టరేట్‌ నా చేతికొచ్చేది. ఏదో సంస్థలో మంచి హోదాలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ బయట ఎదగడానికి ఉన్న అపారమైన అవకాశాల గురించీ, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ గురించీ ఇంటర్న్‌షిప్‌లోనే తెలిసింది. ఆ సమయంలోనే నేను ఏమైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలిగింది.


స్టీవ్‌ జాబ్స్‌: ఆలోచనల పుట్ట

యాపిల్‌ని శిఖర సంస్థగా తీర్చిదిద్దిన స్టీవ్‌జాబ్స్‌ గురించి తెలియని వారుండరు. స్టీవ్‌ తన ఇంటర్న్‌షిప్‌ని ప్రముఖ సంస్థ హ్యూలెట్‌-ప్యాకర్డ్‌ నుంచి పూర్తి చేశాడు. తను స్కూల్లో ఉన్నప్పుడే సరదాగా ఆ సంస్థకి ఫోన్‌ చేశాడు. అక్కడ మిగిలిపోయిన, పనికిరాని ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏమైనా ఉంటే ఇప్పించాలనే ఉద్దేశంతో. లక్కీగా ఆ ఫోన్‌ని హెచ్‌పీ సహ వ్యవస్థాపకుడు బిల్‌ హ్యూలెట్‌ ఎత్తారు. ఈ కుర్రాడి ఆసక్తి, ఉత్సుకత చూసిన బిల్‌ అతడికి తర్వాత కాలంలో తమ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించారు. ఫ్రీక్వెన్సీ కౌంటర్‌లో నట్లు, బోల్టులు బిగించే పని అప్పగించారు. స్టీవ్‌ ఆ ఒక్క పనితోనే ఆగిపోలేదు. కంప్యూటర్‌లోని ప్రతి పార్ట్‌నీ అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడే కంప్యూటర్లకు ఉన్న అపారమైన భవిష్యత్తుని అంచనా వేశాడు. అక్కడ గడించిన అనుభవంతోనే కంప్యూటర్‌ సంస్థను నెలకొల్పాలని ప్రయత్నించాడు. తర్వాత మిత్రుడు స్టీవ్‌ వోజ్నియాక్‌తో కలిసి యాపిల్‌ ప్రారంభించి పెద్ద విప్లవాన్నే సృష్టించాడు.
హెచ్‌పీలో ఇంటర్న్‌గా ఎన్నో రకాల ప్రయోగాలు చేశా. నిరంతరం కంప్యూటర్లతోనే గడిపా. చాలాసార్లు నేను పనిలో వైఫల్యం చెందా. కానీ ఎప్పుడూ నిరాశ పడలేదు. ఆ ఇంటర్న్‌షిప్‌లోనే గొప్పగొప్ప నిపుణుల సాహచర్యం దొరికింది. నాకో వాస్తవిక ప్రపంచం కనపడింది. కంప్యూటర్లు భవిష్యత్తుని శాసిస్తాయని అప్పుడే అర్థమైంది.


ఎందుకు ముఖ్యమంటే..
*చాలా కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ చేసేవాళ్లకు వేతనం కూడా చెల్లిస్తున్నాయి. చెప్పుకోతగ్గ మొత్తం కాకపోయినా కాలేజీ ఫీజులు, ఇతర అవసరాలకు ఆ మొత్తం పనికొస్తుంది.
* ఇంటర్న్‌షిప్‌ బాహ్య ప్రపంచానికి ఒక దారి లాంటిది. అప్పటిదాకా పుస్తకాల్లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ఎలా వాడుకలోకి తీసుకురావాలో తెలియజేస్తుంది. అనుభవజ్ఞుల అనుభవాలను పాఠాలుగా స్వీకరించవచ్చు.
* ఉద్యోగంలో చేరకుండానే ఎంతో కొంత అనుభవం గడించడానికి ఇదో మంచి వేదిక. ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలు కావడానికి దారి చూపుతుంది.
* ఎంచుకున్న రంగంలోని ఎత్తుపల్లాలు, లోతు అర్థమవుతుంది. మన బలాలు, బలహీనతలు తెలుసుకోగలుగుతాం. కంఫర్ట్‌జోన్‌ దాటి బయటికి వచ్చేస్తాం. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
* నేర్చుకుంటున్నప్పుడు మనకెవరూ పోటీ కాదు. ఇంటర్న్‌షిప్‌ పేరుతో ఒక్కసారి బయటికొస్తే ఉద్యోగం, స్టార్టప్‌, వ్యాపారం... అన్నింట్లో పోటీ మొదలవుతుంది. ది బెస్ట్‌ ఇవ్వాలనే తపన పెరుగుతుంది.
* ఇంటర్న్‌ అయిన ఫీల్డులో అనుభవజ్ఞులు, నిపుణులు ఎందరో తారసపడతారు. వాళ్ల నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకోవచ్చు. నైపుణ్యాలను సానబెట్టుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని