మన వెదర్‌మ్యాన్‌కి అంతర్జాతీయ గుర్తింపు

ప్రణీత్‌కి చిన్నప్పట్నుంచీ కొండలు, మేఘాలు చూస్తూ ఉండటం, వాతావరణ సమాచారం తెలుసుకోవడం అంటే ఇష్టం. కాలేజీకొచ్చాక అమ్మానాన్నలు సెల్‌ఫోన్‌ కొనిచ్చారు. అందులోని వెదర్‌ యాప్స్‌ అతడిని ఆకట్టుకున్నాయి అవెలా పని చేస్తాయి? సమాచారం ఎక్కడి నుంచి సేకరిస్తారు?లాంటివన్నీ తెలుసుకోసాగాడు. పరిశోధక వ్యాసాలు చదివాడు. చివరికి తనలాగే ఆసక్తి ఉన్న కొందరితో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేశాడు.

Published : 26 Jun 2021 00:41 IST

గతేడాది అక్టోబరులో తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ ప్రమాదం పొంచి ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌కి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఓ బ్లాగర్‌ ముందే హెచ్చరించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశాడు. అతడి ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను చాలామంది షేర్‌ చేసుకున్నారు. జాగ్రత్తపడ్డారు. తర్వాత నివర్‌ తుపాను సందర్భంలోనూ అతడి అంచనాలు నిజమయ్యాయి. ఈ రెండు సందర్భాల్లోనే కాదు.. ‘ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’ పేరుతో ఏడాదిన్నరగా అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉన్న ఆ తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌. అతడి కృషికి గుర్తింపుగా జెనీవాలో జరగబోయే ప్రపంచ పర్యావరణ సదస్సుకు ఆహ్వానం అందింది.

మనం ప్రకృతి విపత్తులను నిలువరించలేం. కానీ కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. భారీ నష్టం అరికట్టవచ్చు. ఇదే సూత్రంపై ఆధారపడి వాతావరణశాఖ అధికారులు పని చేస్తుంటారు. రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు సైతం వాతావరణ మార్పులపై కొంచెం అవగాహన తెచ్చుకుంటే చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. ఈ సమాచారం అందించడానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నావంతు సాయం చేయాలనుకుంటున్నా. నా వెదర్‌ అప్‌డేట్స్‌తో జాగ్రత్తపడ్డామనీ, నష్టం నివారించగలిగామనీ ఎంతో మంది నాకు చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణ అంచనాలు మాకూ ఇవ్వమంటూ కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. త్వరలో అక్కడా ప్రారంభించబోతున్నా. ఇంకా భారీస్థాయిలో జనాలకు ఉపయోగపడేలా, తాజా సమాచారం అందించేలా ఒక యాప్‌ రూపొందించి మరింత సమర్థంగా సేవలు అందించాలనుకుంటున్నా.

ప్రణీత్‌కి చిన్నప్పట్నుంచీ కొండలు, మేఘాలు చూస్తూ ఉండటం, వాతావరణ సమాచారం తెలుసుకోవడం అంటే ఇష్టం. కాలేజీకొచ్చాక అమ్మానాన్నలు సెల్‌ఫోన్‌ కొనిచ్చారు. అందులోని వెదర్‌ యాప్స్‌ అతడిని ఆకట్టుకున్నాయి అవెలా పని చేస్తాయి? సమాచారం ఎక్కడి నుంచి సేకరిస్తారు?లాంటివన్నీ తెలుసుకోసాగాడు. పరిశోధక వ్యాసాలు చదివాడు. చివరికి తనలాగే ఆసక్తి ఉన్న కొందరితో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తుండేవాడు. ఇదే తరహా విషయాలపై అప్పటికే పరిశోధనలు ప్రారంభించిన ‘తమిళనాడు వెదర్‌మ్యాన్‌’ ప్రదీప్‌ జాన్‌ పరిచయం కావడం అతడికో లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసింది. ఏడేళ్ల కృషితో చివరికి ఒక బ్లాగ్‌ ప్రారంభించాడు. జనాలకు ఉపయోగపడేలా వాతావరణ అప్‌డేట్స్‌ ఇవ్వసాగాడు.

ఇలా సేకరిస్తాడు

ఈరోజు ఎండ కాస్తుంది? ఫలానా చోట వర్షం పడుతుంది.. అని చెప్పడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో పరిజ్ఞానం కావాలి. సాధారణంగా అంతరిక్షంలోని ఉపగ్రహాలు పంపే ఫొటోలు, సమాచారం ఆధారంగా భారత వాతావరణశాఖ నిపుణులు అంచనాలు రూపొందించి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చెబుతారు. ప్రణీత్‌ ముందు ఈ ఇన్‌పుట్స్‌ తీసుకుంటాడు. దీనికి అదనంగా కచ్చితత్వం కోసం నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలాంటి విదేశీ సంస్థల సమాచారం సేకరిస్తాడు. దీనికోసం డబ్బులు వెచ్చించి మరీ ఆయా వెబ్‌సైట్ల నుంచి నమ్మదగిన సమాచారాన్ని కొనుగోలు చేస్తున్నాడు. వీటన్నింటినీ క్రోడీకరించి, తన విశ్లేషణ జోడించి జనాలకు ఉపయోగపడేలా వాతావరణ అంచనాలు రూపొందిస్తాడు. ఎండ, వర్షపాతం, ఉరుములు, తుపాను, ఉష్ణోగ్రతల వివరాలు.. నెల, వారం, రోజువారీగా అప్‌డేట్‌ చేస్తున్నాడు. తుపాన్లు, ఉరుముల్లాంటి వచ్చే అవకాశం ఉంటే అప్పటికప్పుడు స్పందించి తాజా సమాచారం బ్లాగులో పెడతాడు. ప్రణీత్‌ బ్లాగు లక్షమంది, ఫేస్‌బుక్‌ పేజీని 23వేలు, ట్విటర్‌ని 7వేల మంది ఫాలో అవుతున్నారు.

గుర్తింపు

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూనే ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతడు చేస్తున్న కృషికి గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ‘హాబిట్యాట్‌’ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ‘ఛేంజింగ్‌ వెదర్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఏపీˆ అండ్‌ తెలంగాణ’ ప్యానల్‌ చర్చకి వాతావరణశాఖ అధికారులతోపాటు సాయి ప్రణీత్‌ను ఆహ్వానించింది. అందులో తను చేస్తున్న సేవలతోపాటు విపత్తులు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తం కావాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? అనేదానిపై అభిప్రాయాలు పంచుకున్నాడు. అతడి పరిజ్ఞానానికి మంత్రముగ్ధులైన అధికారులు యూఎన్‌ వెబ్‌సైట్‌లో సాయిప్రణీత్‌ గురించి వివరాలు పొందుపరిచారు. జెనీవాలో జులైలో నిర్వహించే సమావేశానికి ప్రతినిధిగా రమ్మని పిలిచారు. కానీ కొవిడ్‌ కారణంగా సమావేశం వాయిదా పడింది. ఇదే కాదు.. ఈ సంస్థ తరపున ఎలాంటి కార్యక్రమాలు జరిగినా పిలుపు అందిస్తామన్నారు.

- మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని