బీటెక్‌ చదవని.. టెక్‌ గురూ

మాటలు రాని మిత్రుడి మౌన రోదన తనకి వినిపించింది...- చవగ్గా ఓ వినికిడి యంత్రం తయారు చేశాడుపసిపాపలపై జరుగుతున్న లైంగిక దాడులు బాధించాయి...

Published : 04 Sep 2021 01:02 IST

మాటలు రాని మిత్రుడి మౌన రోదన తనకి వినిపించింది...
- చవగ్గా ఓ వినికిడి యంత్రం తయారు చేశాడు
పసిపాపలపై జరుగుతున్న లైంగిక దాడులు బాధించాయి...
- సంస్కారం చెప్పే బొమ్మకు ప్రాణం పోశాడు  
పొలంలో రైతులు పడే కష్టాలు కదిలించాయి...
- సౌకర్యవంతమైన యూరియా కోటుకు రూపమిచ్చాడు..
వీటన్నింటినీ రూపొందించింది.. కనీసం బీటెక్‌ చదవని ఆవిష్కర్త అంటే మీరు నమ్మగలరా? తనే వరంగల్‌ కుర్రాడు యాకర గణేశ్‌. అతడి సత్సంకల్పానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. తనతో ఈతరం మాట కలిపింది.

ణేశ్‌ ఇంజినీరింగ్‌ చదవలేదు. ఇంగ్లిషు అసలే రాదు. కానీ చిన్నతనం నుంచి ఒకటే తపన. సాటి మనుషుల సమస్యలకు పరిష్కారం చూపించాలనుకునేవాడు. ఆ తపనే ప్రయోగాల వైపు అడుగులు వేయించింది. 25 సరికొత్త ఆవిష్కరణలు చేయించింది. గ్రామీణ ఆవిష్కర్తగా దేశం మెచ్చే పేరు తెచ్చిపెట్టింది. తనది నిరుపేద కుటుంబమైనా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

అయిదో తరగతి నుంచే

హనుమకొండ జిల్లా నందనం గణేశ్‌ సొంతూరు. పదివరకు అక్కడే చదివాడు. అయిదో తరగతి నుంచే ఏదైనా కనిపెట్టాలనే ఆసక్తి మొదలైంది. ఆ సమయంలో వాళ్ల ఊరి వాగులో ఇసుక అక్రమంగా తోడేసే వాళ్లు కొందరు. దీంతో పర్యావరణానికి, ఊరికి కలిగే నష్టాలపై గణేశ్‌ ఓ సైన్స్‌ ప్రాజెక్టు తయారు చేశాడు. అది జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనకి ఎంపికైంది. గణేశ్‌కి ఓ బధిర స్నేహితుడుండేవాడు. ఓసారి వాళ్లమ్మ ‘మావాడికి చెవులు వినిపించవు, చెవిటి యంత్రం కొందామంటే డబ్బుల్లేవు. తక్కువ ఖర్చుతో ఓ పరికరం తయారు చేయొచ్చు కదా బాబూ’ అంటూ ఏడ్చిందట. అప్పుడే తోటి వాళ్ల కష్టాలు, అవసరాలు తీర్చితేనే అది నిజమైన ఆవిష్కరణ అనుకున్నాడు. రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 150 రూపాయల ఖర్చుతో ‘సూపర్‌ డెఫ్‌ మెషిన్‌’ కనిపెట్టి ఫ్రెండ్‌కి కానుకగా ఇచ్చాడు. అప్పుడు తను ఇంటర్‌. ఈ ప్రయోగం బెంగళూరులోని ‘ఏఎస్‌రావు ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌’లో మెరిసింది. కాంస్య దక్కింది.  దీని గురించి ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో ప్రస్తావించి ప్రశంసించారు.

అంకుర భాగస్వామిగా

గణేశ్‌.. తర్వాత ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కరోనా సమయంలో చేసిన చేతితో తాకకుండా వినియోగించే సెన్సర్‌ శానిటైజర్‌ స్థానికంగా మంచి పేరు తెచ్చింది. 2019లో ఓ మిత్రుడి ద్వారా ‘టీ-ఇన్నోవేషన్‌’ ఓఎస్డీ డాక్టర్‌ శాంత పరిచయమయ్యారు. గణేశ్‌ ప్రతిభ చూసి ఆమె వరంగల్‌లోని వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల వారు ఏర్పాటు చేసిన ‘విభా’తో కలిసి పని చేయాలని సూచించారు. అదే సమయంలో చిన్న పిల్లలపై పలు చోట్ల లైంగిక దాడులు జరుగుతున్న వార్తలు చదివి చలించిపోయాడు గణేష్‌. దాన్ని ఆపడానికి, పిల్లలకు చెడు స్పర్శ, మంచి స్పర్శ (గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌) తెలిపేలా ఓ బొమ్మ కనిపెట్టాలనుకున్నాడు. ఆ ఆలోచనను విభా సీఈవో కౌశిక్‌తో పంచుకోగా, ఆయన సూచనతో ఇంజినీరింగ్‌ విద్యార్థి భరద్వాజ్‌ ఈ బొమ్మ పనిచేసేలా కోడింగ్‌ రాశాడు. ఈ బొమ్మకు ‘సంస్కార్‌’ అనే పేరు పెట్టారు. బొమ్మలో బోలెడు ప్రత్యేకతలున్నాయి.  ఇది తాకరాని చోట తాకితే ‘అక్కడ తాకకూడదు’ అని చెబుతుంది. తెలుగు, ఇంగ్లిషు, హిందీ మూడు భాషల్లో మాట్లాడుతుంది. పిల్లలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు చైల్డ్‌లైన్‌ నెంబర్‌ 1098కి ఫోన్‌ చేయమని కూడా చెబుతుంది. ఈ ఆవిష్కరణకి హైదరాబాద్‌లోని సీఐఈఐఐఐటీ నిర్వహించిన ‘నిధి ప్రయాస్‌’ ప్రదర్శనలో రూ.4 లక్షల గ్రాంటు దక్కింది. పోలాండ్‌లో నిర్వహించిన ‘ఈ-ఇన్నోవేషన్‌’ పోటీలో మేటిగా నిలిచి బంగారం పతకం అందుకుంది. ఇందులో 16 దేశాల నుంచి 183 ఆవిష్కరణలు పోటీ పడ్డాయి. ‘చైనా ఎక్స్‌పో’లో వర్చువల్‌గా పాల్గొనమని గణేశ్‌కి ఆహ్వానం అందింది.

- గుండు పాండురంగశర్మ,

ఈనాడు, వరంగల్‌


రైతుల కోసం..

సంస్కార్‌ టాయ్‌ మంచి పేరు తేవడంతో గణేశ్‌ విభాతో కలిసి ‘సంస్కార్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరుతో ఓ అంకుర సంస్థ స్థాపించాడు. ఇటీవలే ఈ సంస్థ నుంచి రైతుల కోసం ‘యూరియా కోటు’ రూపొందించాడు. మామూలుగా అయితే యూరియా చల్లే క్రమంలో సంచి బరువు ఉండటంతో రైతులకు చేయి నొప్పి పెడుతుంది. వాటికి బదులు ఈ కోటు తొడుక్కొని, దానికి ఏర్పాటు చేసిన పెద్ద జేబులో యూరియా పోసుకొని రెండు చేతులతో చల్లవచ్చు. పైగా ఇది రెయిన్‌ కోటులా కూడా పనిచేస్తుంది. దీంతోపాటు పత్తి మొక్కల మొదళ్లకు కర్షకులు వంగుతూ యూరియా వేస్తుంటారు. దాంతో నడుం నొప్పి వస్తుంటుంది. దీనికి పరిష్కారంగా ఓ కోటు, యూరియా వేసే పైపును రూపొందించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని