నాటకమే.. నడక నేర్పింది

సినిమా నేపథ్యం లేదు.. సినిమానే జీవితం అన్నంత ఇష్టం ఉంది. కడుపు మాడినా ఫర్వాలేదు.. తెరపై కనపడితే చాలన్న కసి ఉంది. థియేటర్‌ ఆర్ట్స్‌ దారి చూపింది.. నటనలో రాటు దేల్చింది. సీన్‌ కట్‌ చేస్తే... జార్జ్‌రెడ్డిలో లలన్‌సింగ్‌గా, తాజాగా టక్‌ జగదీశ్‌లో తిరుమలనాయుడిగా జనంతో చప్పట్లు కొట్టించుకున్నాడు...

Updated : 17 Aug 2022 12:59 IST

సినిమా నేపథ్యం లేదు.. సినిమానే జీవితం అన్నంత ఇష్టం ఉంది. కడుపు మాడినా ఫర్వాలేదు.. తెరపై కనపడితే చాలన్న కసి ఉంది. థియేటర్‌ ఆర్ట్స్‌ దారి చూపింది.. నటనలో రాటు దేల్చింది. సీన్‌ కట్‌ చేస్తే... జార్జ్‌రెడ్డిలో లలన్‌సింగ్‌గా, తాజాగా టక్‌ జగదీశ్‌లో తిరుమలనాయుడిగా జనంతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆ సాదాసీదా పోరడే తిరువీర్‌. నటన, నాటకం తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయో అతడి మాటల్లోనే...

కాశంలో విమానం వెళ్తుంటే చూసి చప్పట్లు కొట్టడం తప్ప అందులో ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కలను నిజం చేసింది నాటకమే. ఇంట్లో తలెత్తకుండా భోజనం చేసేంత మొహమాటం నాది. అయినా సీనియర్‌ నటులతో పోటీపడి నటించే అవకాశం ఇచ్చిందీ ఆ నాటకమే. మహబూబ్‌నగర్‌ నుంచి నగరానికి వలస వచ్చిన కుటుంబం మాది. కాటేదాన్‌ పారిశ్రామికవాడలో పని చేస్తూ బతుకు బండి లాగించేవారు కన్నవాళ్లు. నాకు అమ్మంటే ప్రాణం. తర్వాత నటనంటే. ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక పోయినా అమ్మ నా ఆశలకు ఆయువిచ్చేది. నేను పెద్ద నటుడ్ని అవుతానని నమ్మేది. హైదరాబాద్‌ సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాతేంటి? 9 నుంచి 5 దాకా యంత్రంలా పని చేయడం నాకిష్టం లేదు. ఆశ, ఆశయం, సంపాదన.. అన్నీ సినిమాతోనే అనుకున్నా. అక్కడికెళ్తే కొత్తవాళ్లతో కలిసి పని చేయొచ్చు. కొత్తకొత్త ప్రాంతాలు చుట్టి రావొచ్చు. అది నాకిష్టం. కానీ ఎలా? నాకెవరూ గాడ్‌ఫాదర్‌ లేరు. ఇండస్ట్రీకి వెళ్లే మార్గం తెలియదు. పైగా సినీ జనాలకు ఉండకూడని మొహమాటం దండిగా ఉంది. నటనలో శిక్షణ తీసుకునేంత స్తోమత లేదు. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియక ఏడాదిపాటు ఖాళీగానే ఉన్నాను. 

నూటాయాభై ప్రదర్శలు..
ఓసారి ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌ తిరగేస్తున్నా. అందులో ఒక నటుడు మొదట్లో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేశానని చెప్పాడు. నాటకాల ద్వారా సినిమాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్పుడే నాకర్థమైంది. తెలుగు యూనివర్సిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులో చేరిపోయా. అక్కడికెళ్లాక నాటకం కూడా అంత సులభం కాదని తెలిసింది. అందరి ముందు నటించాలంటే భయమేసేది. అయినా ఇది తప్ప నాకు మరో ఛాయిస్‌ లేదు. సీనియర్లను బతిమాలి మెలకువలు నేర్చుకునేవాణ్ని. వాళ్లను విసిగించి చీవాట్లు తినేవాణ్ని. ఎవరైనా చాయ్‌ ఇప్పిస్తానన్నా గంటలకొద్దీ సాగే నాటకంలో పాల్గొనేవాణ్ని. మొత్తానికి చాలామంది ప్రముఖులతో కలిసి పని చేస్తూ దాదాపు 150కిపైగా స్టేజీ ప్రదర్శనలు చేశా. ఎన్ని నాటకాలేసినా నాకు సరిగ్గా నటించడం రాదేమో అనే చిన్న అనుమానం ఉండేది. నాటకాలు ఎక్కడేసినా వెళ్లిచూసేవాడిని, వర్క్‌షాప్‌లకు హాజరయ్యేవాణ్ని. పెద్దలు ప్రశంసిస్తే మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేవాణ్ని. నచ్చలేదంటే లోపాలు వెతుక్కొని సరిదిద్దుకునేవాణ్ని. కొన్ని నాటకాలకి దర్శకత్వం కూడా చేశా. అవి నాకు మంచి పేరు తెచ్చాయి. కొరియాలో జరిగిన థియేటర్‌ ఆర్ట్స్‌ వర్క్‌షాప్‌కి తొలిసారి విమానం ఎక్కిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. 

ఆటుపోట్లు దాటి..
నాటకాలతోపాటు సినిమా ప్రయత్నాలూ జోరుగా సాగుతుండేవి. ‘చేద్దాం’, ‘చూద్దాం’ అనేవాళ్లేగానీ అవకాశం ఇచ్చినవాళ్లు లేరు. ఇలాగైతే లాభం లేదనుకొని ‘డాటర్‌ ఆఫ్‌ వర్మ’ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరిపోయా. సినిమా జనాలతో కొద్దిగా పరిచయాలు ఏర్పడ్డాయి. అలా ‘బొమ్మల రామారం’, ‘ఘాజీ’, ‘ఏమంత్రం వేశావే’, ‘మల్లేశం’ సినిమాల్లో చిన్న పాత్రలు దొరికాయి. అయితే ఎన్ని సినిమాల్లో చేసినా నా నట జీవితం ప్రతిసారీ జీరో నుంచే మొదలయ్యేది. కొత్త అవకాశాల కోసం మళ్లీమళ్లీ వెతుక్కునే పరిస్థితి. మరోవైపు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు. అవి తీరడానికి షార్ట్‌ఫిల్మ్‌లు చేశాను. వాటితో వచ్చే డబ్బులు ఇంటి అద్దెకి, బస్‌పాస్‌కి సరిపోయేవి. నాటకాల్లో నటన పరంగా సంతృప్తి ఉన్నా, పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. ఇరవై రోజులు కష్టపడితే ఓసారి చేతికి 500 రూపాయలు వచ్చిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి ఇక జీవితంలో స్థిరపడనేమో అనిపించేది. అలాంటి సమయంలో రవీంద్రభారతిలో ప్రదర్శించిన షార్ట్‌ఫిల్మ్‌ నా జీవితాన్ని మలుపు తిప్పింది. దాన్ని చూసిన దర్శకుడు జీవన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. జార్జ్‌రెడ్డి సినిమాలో లలన్‌సింగ్‌ పాత్రకు తీసుకున్నారు. అందులో విలన్‌గా మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘పలాస’లోని పాత్ర, ఆహా కోసం చేసిన ‘సిన్‌’, ‘మెట్రో కథలు’తో పరిశ్రమ దృష్టిలో పడ్డా. ఇప్పుడు టక్‌ జగదీష్‌తో మరో మెట్టు ఎక్కాననిపిస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టాలో తెలియని నాకు దారి చూపించి.. సినీ మిత్రులు, ఎంతోమంది ఆత్మీయులను పరిచయం చేసింది నాటకమేనని గర్వంగా చెబుతా.


*  అమ్మ వీరమ్మంటే ప్రాణం. తన పేరులో రెండక్షరాలు కలుపుకొని తిరువీర్‌ అయ్యా.

*  ఆరు నెలలు రేడియో జాకీగా పని చేశా.

*  బాగా నటించావని సీనియర్‌ నటుడు నానీ మెచ్చుకోవడం నాకు మర్చిపోలేని ప్రశంస.

*  గోగ్రహణం, బర్బరీకుడు, రజాకార్‌, దావత్‌ బాగా పేరు తెచ్చిన నాటకాలు.

*  ఖాళీగా ఉంటే కార్టూన్‌ ఫిల్మ్స్‌ చూస్తాను. జానపద కథలు చదువుతా.

*  ఇర్ఫాన్‌ఖాన్‌ నాకిష్టమైన నటుడు. అతడ్ని కలవలేకపోవడం నాకు తీరని లోటు.

*  ప్రియదర్శి, రవివర్మ పరిశ్రమలో నాకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌.

*  ప్రయాణాలంటే చాలా ఇష్టం. పదేళ్ల తర్వాత ప్రపంచాన్ని చుట్టి రావాలని ఉంది.

- సతీష్‌ కామాద్రి, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని