బుల్లెట్టు పాటే ఆడపిల్లైంది!

అమ్మాయి నుంచి అమ్మమ్మల దాకా.. పిల్లాడి నుంచి ముసలివాళ్ల దాకా... పెళ్లి బారాత్‌ నుంచి పార్టీలో డీజేదాకా... ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే తెలుగు నేలని ఊపేస్తోంది... డుగ్గు డుగ్గు డుగ్గంటూ కుర్రకారుని స్టెప్పులేయిస్తోంది... రాసింది షాద్‌నగర్‌ యువకుడు కాటుక లక్ష్మణ్‌....

Updated : 25 Sep 2021 08:34 IST

అమ్మాయి నుంచి అమ్మమ్మల దాకా.. పిల్లాడి నుంచి ముసలివాళ్ల దాకా... పెళ్లి బారాత్‌ నుంచి పార్టీలో డీజేదాకా... ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే తెలుగు నేలని ఊపేస్తోంది... డుగ్గు డుగ్గు డుగ్గంటూ కుర్రకారుని స్టెప్పులేయిస్తోంది... రాసింది షాద్‌నగర్‌ యువకుడు కాటుక లక్ష్మణ్‌. పదేళ్లుగా కలంతో దోస్తీ చేస్తున్న ఈ కళాకారుడిని ఈ ఒక్క గీతం అందలం ఎక్కించేసింది... ఈ సందర్భంగా పదం కోసం తను పడ్డ వెతల్ని వివరిస్తూనే.. ఇక్కడిదాకా సాగిన ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు.

సోషల్‌ మీడియాలో, పెళ్లి వేడుకల్లో, గణేష్‌ మండపాల్లో.. ఎక్కడ చూసినా ఈ బుల్లెట్టు బండి పాటే. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డా ఈ పాటని సొంతం చేసుకుంటోంది. బాహుబలి గాయని మోహన భోగరాజు పాడిన ఈ గీతాన్ని లక్ష్మణ్‌ ఇరవై రెండు రోజులపాటు కష్టపడి రాశాడు. మనసుకి హత్తుకునే పల్లె పదాలు అందర్నీ ఆకట్టుకుంటే.. కొత్త పెళ్లికూతురు సాయిశ్రియ ఈ పాటకి చేసిన డ్యాన్స్‌ వైరల్‌ కావడంతో బుల్లెట్‌ వేగంతో తెరపైకి వచ్చాడు లక్ష్మణ్‌.

స్ఫూర్తి: లక్ష్మణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలంలోని నిడదవెల్లి. నిరుపేద కుటుంబం. చిన్నప్పట్నుంచే పాటలంటే ఇష్టం. తనకి తోచింది రాస్తే, అన్న రామ్‌ పాడేవాడు. డిగ్రీలో ఓసారి గీత రచయిత చంద్రబోస్‌ రాసిన పాటల ఫంక్షన్‌కి వెళ్లాడు. అతిథులంతా పాటల రచయితల్ని పొగడటం చూసి ఎప్పటికైనా లిరిసిస్ట్‌ కావాలనుకున్నాడు. చంద్రబోస్‌, అందెశ్రీ, గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్‌ల స్ఫూర్తితో సినిమా పాటలు రాయడం మొదలుపెట్టాడు. 2010లో పెద్దగా కష్టపడకుండానే ‘లవ్‌ పవర్‌’ సినిమాకి పాటలన్నీ రాశాడు. ‘రాయడం ఇంత తేలికా?’ అనుకున్నాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.

సినిమా కష్టాలు: హైదరాబాద్‌లో ఉంటే మంచి అవకాశాలొస్తాయని సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి చెప్పడంతో అన్నయ్యతో కలిసి సిటీలో అడుగు పెట్టాడు లక్ష్మణ్‌. కానీ తెలిసిన వాళ్లెవరూ లేరు. బోరబండ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానగర్‌ స్టూడియోలకు రోజూ నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. తినడానికి డబ్బులుండేవి కావు. కష్టపడి పని చేసి కన్నవాళ్లను సాకాల్సిన వయసులో అమ్మానాన్నలనే డబ్బులడగడం నామోషీగా అనిపించేది. పరిస్థితి చెబితే వాళ్లు ఇంటికి రమ్మంటారని తిన్నామని అబద్ధం చెప్పేవాళ్లు. తర్వాత కొన్నాళ్లు సినిమా సెట్‌వర్క్‌ పనులకి వెళ్లారు. మరోవైపు ప్రయత్నాలూ కొనసాగేవి. కానీ అన్నీ విఫలమవుతుండేవి. అయినా పట్టు వదలకుండా ఒక్క పాటైనా రికార్డు చేసి ఊరికి వెళ్లిపోవాలనుకున్నారు. అప్పుడే డీఆర్‌ సీ సునీల్‌ ఆదుకున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో ‘ఓ మైనా’ రికార్డు చేయించారు. తొలిపాట హిట్టైంది. తర్వాత ఓ పెద్ద సినిమాకు రాసినా లక్ష్మణ్‌ పేరు వేయలేదు. బాధ అనిపించినా రాయగలననే నమ్మకంతో అక్కడే ఉండిపోవాలనే నిర్ణయానికొచ్చాడు. మెల్లిమెల్లిగా అవకాశాలు రాసాగాయి.

డుగ్గు డుగ్గుమంటూ: గతంలో రాసిన ఓ ఆల్బమ్‌ నచ్చడంతో సింగర్‌ మోహన భోగరాజు లక్ష్మణ్‌ని సంప్రదించింది. తనకోసం మంచి పాట రాయమని కోరింది. అప్పటిదాకా తనపై లవ్‌ ఫెల్యూర్‌ పాటలే రాస్తాడనే ముద్ర ఉండేది. దాన్ని చెరిపేసుకుంటూ స్వచ్ఛమైన జానపదాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. 1980 నాటి ఆడపిల్లలు ఎలా ఉండేవారో, అత్తారింటికి వెళ్తే ఏం కోరుకుంటారో ఈతరం ఆడపిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో 22 రోజులు శ్రమించి బుల్లెట్‌ బండి పాట రాశాడు. డుగ్గు డుగ్గు, వచ్చేస్త పా, దిద్దుకున్నుళ్లో దిద్దుకున్నా లాంటి అచ్చమైన పల్లె వాడుక పదాలు పాటలో చేర్చాడు. అది మోహనకు బాగా నచ్చడంతో రెండు చరణాల పాటను మూడుకు పొడిగించాడు. ఈ పాట వీడియో రూపంలోకి తీసుకురావడంతో యూట్యూబ్‌లో బాగా పాపులరైంది.

పెళ్లికూతురు రంగప్రవేశం: మొదట్లో 5 కోట్ల వ్యూస్‌ వస్తాయనుకున్నారు. నెలలో మూడు కోట్ల మంది చూశారు. తర్వాత కొత్త పెళ్లి కూతురు సాయి శ్రియ మంచిర్యాలలో ఈ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఒరిజినల్‌ వీడియో కంటెంట్‌లో పెళ్లికూతురు పాత్ర లేదు. బయట నిజమైన పెళ్లికూతురు ఆ పాట ఎత్తుకోవడంతో సరిగ్గా సరిపోయింది. తన ప్రపంచాన్ని, జీవనవిధానాన్ని కాబోయే భర్తకు చెప్పుకునే తీరు అందరికీ నచ్చింది. దీంతో ఒకట్రెండు రోజుల్లోనే పాట వైరల్‌ అయింది. దీంతో రచయిత లక్ష్మణ్‌, గాయని మోహన, పెళ్లికూతురికి రాత్రికి రాత్రే చెప్పలేనంత పేరొచ్చింది. లక్ష్మణ్‌ ఇప్పటివరకు 200కుపైగా పాటలు రాశాడు. అందులో వంద వరకూ హిట్‌ అయ్యాయి. కానీ ఈ బుల్లెట్టు బండితో సినిమా అవకాశాలూ వెతుక్కుంటూ వస్తున్నాయంటున్నాడు.


‘ప్రతి ఆడపిల్ల జీవితాన్నీ నా పాటలో రాయాలనుకున్నా. కానీ నా పాటే ఆడపిల్లైంది. ఒక అన్న వింటే నా పాట చెల్లి అవుతుంది. ఒక తండ్రి వింటే నా పాట కూతురవుతుంది. ఒక ఆడబిడ్డ వింటే తన జీవితం అవుతుంది. ఈ పాటకు ఒక మహిళ మాత్రమే సపోర్ట్‌ చేస్తే ఇంత పెద్ద హిట్‌ కాదు. అన్న, తమ్ముడు, చెల్లి ఇలా కుటుంబం మొత్తం ప్రోత్సహించడం వల్లే నా పాటకు ఇంతటి ఆదరణ దక్కుతోంది’.

ప్రతి రచయిత పేరు చెప్పగానే ఓ ట్రేడ్‌మార్క్‌ పాట గుర్తుకొస్తుంది. నాకూ అలాంటిదే ఇది. బుల్లెట్‌ బండికి ముందు నా జీవితం వేరు. ఆర్థికంగా, కుటుంబపరంగా పెద్ద గుర్తింపు లేదు. దీంతో ఒక్కసారిగా నా పరిస్థితి మారిపోయింది. నన్నో పెద్ద రచయితగా భావిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఈ బుల్లెట్టు బండి పాట ఎంత గొప్ప పనిచేసిందంటే.. పదేళ్ల కిందట సినీ పరిశ్రమలో నేను ఫలానా వాళ్లతో కలిసి పని చేస్తే బాగుండు అని కలలు కనేవాణ్ని. ఇప్పుడు ఆ స్టార్‌ దర్శకులు నాకు నేరుగా ఫోన్‌ చేసి పాటలు రాయమంటున్నారు.

- సతీశ్‌ దండవేణి, ఈటీవీ



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు