Updated : 11/12/2021 05:29 IST

కష్టాల కడలిలో.. స్ఫూర్తి కెరటం

పదకొండేళ్లకే తండ్రి చనిపోయాడు. ఆ కుర్రాడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు! చదువుకునే స్తోమత లేదు.. టాపర్‌ అయితేనే ఫీజుల మాఫీ అంది యూనివర్సిటీ. ర్యాంకుల మోత మోగించాడు! దురదృష్టవశాత్తు కంటిచూపు కోల్పోయాడు. ఎంపికైన ప్రభుత్వోద్యోగాలు చేజారాయి. అయినా కుంగిపోలేదు. పట్టుబట్టి ముందుకెళ్లాడు! సీన్‌ కట్‌ చేస్తే... తను దేశం మెచ్చే ఇంజినీర్‌ అయ్యాడు.. జాతీయస్థాయి గుర్తింపు అందుకుంటున్నాడు. ఆ స్ఫూర్తి కెరటమే పి.ప్రవీణ్‌ వెంకట్‌రావు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతే వేగంగా పైకొస్తుంది. ముప్ఫై ఏళ్ల ప్రవీణ్‌ అదేరకం. చిన్నప్పట్నుంచీ కష్టాల్లోంచి రాటుదేలి మేటి ఇంజినీర్‌గా ఎదిగాడు.

ప్రవీణ్‌ నాన్న ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం పశ్చిమ బంగాలోని ఖరగ్‌పూర్‌లో స్థిరపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాలమరణంతో వాళ్లు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కి చేరారు. రూ.4 వేల పింఛనే జీవనాధారం. పదోతరగతి అయ్యాక ప్రవీణ్‌ పాలిటెక్నిక్‌ కోర్సులో చేరాలనుకున్నాడు. మార్కులు తక్కువ రావడంతో కనాకష్టంగా సీటు దొరికింది. ఆ పరిస్థితి మళ్లీ రావొద్దని కసిగా చదవడం మొదలుపెట్టాడు. నాలుగేళ్లు గడిచేసరికి మహారాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. ముంబయిలోని ప్రముఖ కాలేజీలో బీటెక్‌ చదివే అవకాశం వచ్చినా, హాస్టల్‌ సీటు రాకపోవడంతో మధ్యలోనే చదువాగిపోయింది. ఏడాది ఖాళీగా ఉండి, నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌లో చేరాడు. మూడో ఏడాదికొచ్చేసరికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. ఫీజులు కట్టలేని దైన్యం. ఆ పరిస్థితి వివరిస్తూ వర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశాడు. రెండేళ్లు టాపర్‌గా నిలిచి, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తే.. ఉద్యోగం వచ్చాక ఫీజులు చెల్లించేలా అనుమతినిచ్చింది కాలేజీ. అప్పట్నుంచి క్షణం ఖాళీ దొరికినా పుస్తకానికే అతక్కుపోయేవాడు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇంజినీరింగ్‌లో టాపర్‌గా ఏడు బంగారు పతకాలు సాధించాడు. తర్వాత ప్రాంగణ నియామకాల్లో ఎల్‌ అండ్‌ టీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పని చేస్తూనే వర్సిటీకి బాకీ పడ్డ రూ.1.28లక్షల ఫీజు  చెల్లించాడు.

కంటిచూపు కోల్పోయి..

అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటుండగా మరో ఎదురుదెబ్బ. తను ఏడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కానీ మెడికల్‌ టెస్టుల్లో ఫెయిలై, ఉద్యోగాలకు అనర్హుడయ్యాడు. కారణం.. టీనేజీలోనే ప్రవీణ్‌ ఎడమ కంటి చూపు కోల్పోయాడు. ‘యానిసోమెట్రోపియా యాంబ్లియోపియా’ అనే అరుదైన సమస్య కారణంగా చూపు పోయిందని, తిరిగి రాదని తేల్చారు వైద్యులు. అప్పటికే దీంతో కొంత నిరాశకు గురైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. గేట్‌ రాశాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పుర్‌, ఐఐటీ గువాహటి విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కానీ అమ్మ అనారోగ్యం కారణంగా అంతదూరం వెళ్లడం ఇష్టం లేక నాగ్‌పుర్‌లోని వీఎన్‌ఐటీ కళాశాలలో ఎంటెక్‌లో చేరాడు. కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదువుతూ టాపర్‌గా నిలిచాడు. అప్పుడే ‘స్ట్రక్చరల్‌ డైనమిక్స్‌ అండ్‌ ఎర్త్‌క్వేక్‌ ఇంజినీరింగ్‌’ అంశంపై పరిశోధన చేశాడు. తను రాసిన పరిశోధక వ్యాసానికి ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఐఎన్‌ఏఈ) నుంచి ‘ఇన్నోవేటివ్‌ స్టూడెంట్‌ ప్రాజెక్ట్‌’ అవార్డు అందుకున్నాడు. తర్వాత ఐఐటీ గువాహటిలో పీహెచ్‌డీలో చేరినా, మరోసారి అమ్మ అనారోగ్యం పాలవడంతో వెనక్కి తిరిగొచ్చాడు. మరుసటి ఏడాది ఐఐటీ రూర్కీలో పరిశోధక విద్యార్థిగా ప్రవేశం పొందాడు. ఐదేళ్లలో 16 పరిశోధన పత్రాలు సమర్పించాడు. తర్వాత ఏడాదిపాటు అక్కడే రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పని చేసి గతేడాది హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో భూకంపాల ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాడు.


మమతా బెనర్జీ మూడోసారి సీఎం అయ్యాక కోల్‌కతా టౌన్‌హాలు నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ భవనం 200 ఏళ్ల నాటిది. ఐఐటీ రూర్కీ తరఫున ప్రవీణ్‌  ఆ బంగ్లా భద్రతను పరిశీలించి, భారీ భూకంపాలను సైతం తట్టుకొని నిలిచేలా రెట్రో ఫిట్టింగ్‌ మార్పులు సూచించాడు. అవి పూర్తయ్యాకే మమత అందులోకి మారారు. ఆ కృషికి గుర్తింపుగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్ట్రక్చరల్‌ అసోసియేషన్‌ నుంచి గతేడాది ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ యంగ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌’ అవార్డు అందుకున్నాడు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా నుంచి ఇటీవలే యంగ్‌ ఇంజినీర్‌ అవార్డునూ దక్కించుకున్నాడు.


- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని