కొత్తగూడెం నుంచి.. కెనడా దాకా!

పదేళ్ల కిందట.. కొత్తగూడెం గల్లీల్లో తిరిగిన కుర్రాడు.. ఓరోజు హైదరాబాద్‌ బస్సెక్కాడు. ఇప్పుడు? అంతర్జాతీయ మోడళ్లతో భుజం భుజం రాసుకొని తిరిగే ఫ్యాషనిస్ట్‌.. సినిమా తారలు మెచ్చే దుస్తుల డిజైనర్‌. తనే వాసంశెట్టి గోవిందరాజు. వచ్చే జనవరిలో కెనడాలో జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ షోకి ఆహ్వానం అందుకున్నాడు. ఈమధ్యలో ఏం జరిగింది?ఆ ఆటుపోట్ల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు.

Updated : 18 Dec 2021 03:29 IST

పదేళ్ల కిందట.. కొత్తగూడెం గల్లీల్లో తిరిగిన కుర్రాడు.. ఓరోజు హైదరాబాద్‌ బస్సెక్కాడు. ఇప్పుడు? అంతర్జాతీయ మోడళ్లతో భుజం భుజం రాసుకొని తిరిగే ఫ్యాషనిస్ట్‌.. సినిమా తారలు మెచ్చే దుస్తుల డిజైనర్‌. తనే వాసంశెట్టి గోవిందరాజు. వచ్చే జనవరిలో కెనడాలో జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ షోకి ఆహ్వానం అందుకున్నాడు. ఈమధ్యలో ఏం జరిగింది?ఆ ఆటుపోట్ల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు.

త నెలలో దిల్లీలో ‘ఇండియా రన్‌వే వీక్‌’ ఫ్యాషన్‌ షో జరిగింది. దేశంలోని అగ్ర మోడళ్లతో కలిసి  ఓ యువ డిజైనర్‌ క్యాట్‌వాక్‌ చేస్తున్నాడు. అతడి డిజైన్స్‌ చూసి అక్కడికొచ్చిన ఫ్యాషన్‌ పండితులంతా ఫిదా అయ్యారు.  తన కెరీర్‌లో ఇలాంటి మెచ్చుకోళ్లు చాలానే.
గోవిందరాజు చిన్నప్పట్నుంచి బొమ్మలు బాగా వేసేవాడు. సినిమాలు, ఫ్యాషన్లంటే పిచ్చి. ‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రయత్నించు.. రాణిస్తావ్‌’ సలహా ఇచ్చారెవరో. వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాడు. కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది. అవకాశాలు ఊరికే రావని. పరిచయం ఉన్నవారి చుట్టూ తిరిగాడు. సృజనాత్మకంగా డ్రెస్‌ డిజైన్‌ చేసి చూపించేవాడు. అయినా ప్రయోజనం లేదు. దీంతో తనని తాను అప్‌డేట్‌ చేసుకోవడానికి 2008లో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ (ఐఎన్‌ఐఎఫ్‌డి)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తిరిగొచ్చాడు. మొత్తానికి అతడి ప్రతిభ బయటికొచ్చింది. బుల్లితెర నటులు, యాంకర్లకు డ్రెస్‌ డిజైన్‌ చేసే అవకాశమొచ్చింది. అలా సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు.   దర్శకుడు మారుతి ప్రోత్సాహంతో బస్టాప్‌ సినిమా హీరోహీరోయిన్లకు దుస్తులు రూపొందించాడు. ఆపై వెనుదిరిగి చూసే అవసరమే లేకుండా పోయింది. ప్రేమకథా చిత్రమ్‌, ప్రేమకథా చిత్రమ్‌-2, రోజులు మారాయి, భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌ సహా 25 చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశాడు. ఈనాడు, ఈటీవీల్లో కొన్ని కార్యక్రమాలకు పని చేశాడు. దీంతోపాటు తన టాలెంట్‌ని ఫ్యాషన్‌ షోలలో కూడా ప్రదర్శించాడు. 2015లో దిల్లీలో జరిగిన ఇండియా రన్‌ వే వీక్‌ ‘నెక్ట్స్‌ జనరేషన్‌ కేటగిరీ’ విభాగంలో సత్తా చాటాడు. ఈ పోటీకి దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైంది తనొక్కడే. గోవిందరాజుకి వచ్చే జనవరిలో కెనడాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘వాంకోవర్‌ ఫ్యాషన్‌ వీక్‌’కి ఆహ్వానం అందింది. వీటితోపాటు లాక్మే, విల్స్‌లాంటి దేశంలోని టాప్‌ షోలతోపాటు.. అంతర్జాతీయంగా మిలన్‌, ప్యారిస్‌ ఫ్యాషన్‌ షోలకు డిజైన్స్‌ చేయడం లక్ష్యమంటున్నాడు తను.

‘మన దేశ చారిత్రక సంపద, సంప్రదాయాలే నా దుస్తుల రూపకల్పనకు ప్రేరణ. వాటిని లోతుగా అధ్యయనం చేయడానికి నిత్యం పర్యటనలు చేస్తుంటా. ఖజురహో శిల్పాల స్ఫూర్తితో రూపొందించిన డిజైన్లు మంచి పేరు తెచ్చాయి. దాంతోపాటు కొత్త పుంతలు తొక్కే పాశ్చాత్య సంస్కృతి, దానికనుగుణంగా మారుతున్న యువత అభిరుచులనూ పరిగణనలోకి తీసుకుంటా. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ స్వయంగా స్కెచ్‌లు వేస్తా. కొలతలు పక్కాగా ఉండేలా చూసుకుంటా. ఆకృతులకు అందమైన రంగులు జోడించడానికి నెలలకొద్దీ కష్టపడుతుంటా. మన శైలి నిలుపుకుంటూనే అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు, వాణిజ్య సంస్థలకు అనుగుణంగా డిజైన్లు చేస్తా. ఆ కష్టం ఫలితంగానే హైదరాబాద్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగా.

- తిప్పర్తి వెంకట నాగాచారి, కొత్తగూడెం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు