కొత్త బంగారు లోకం.. మనకు కావాలి సొంతం..

కొలువులు కుదేలయ్యాయి.. వ్యాపారం వెలవెలాబోయింది. గతేడాది కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. ఆ పాత బెంగలు కాసేపు పక్కన పెట్టేద్దాం... ఈ కొత్త ఏడాదిలో కొంగొత్త కొలువుల సంగతేందో చూద్దాం... దూసుకుపోయే మార్గాలు వెతుకుదాం.. రండి!

Updated : 01 Jan 2022 05:12 IST

కొలువులు కుదేలయ్యాయి.. వ్యాపారం వెలవెలాబోయింది. గతేడాది కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. ఆ పాత బెంగలు కాసేపు పక్కన పెట్టేద్దాం... ఈ కొత్త ఏడాదిలో కొంగొత్త కొలువుల సంగతేందో చూద్దాం... దూసుకుపోయే మార్గాలు వెతుకుదాం.. రండి!


ఆరోగ్యం.. కొలువు భాగ్యం

కాలాలెన్ని మారినా వన్నె తగ్గని రంగం హెల్త్‌కేర్‌. కరోనా గడ్డుకాలం తర్వాత దీని ప్రాముఖ్యం ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఇది ఎప్పటికీ కొలువుల కాణాచీయే. వైద్య పట్టాలు పుచ్చుకుంటేనే, నిపుణులుగా మారితేనే.. ఇందులో ఉద్యోగాలు అనే అపోహలొద్దు. మామూలు డిగ్రీలు, పీజీలతోనూ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలున్నాయి. కేంద్ర వైద్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో నాలుగులక్షల మంది నర్స్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఆఫీసు సిబ్బంది కొరత ఉంది. చిన్న చిన్న కోర్సులు చేసినా ఈ జాబ్స్‌ దొరకబుచ్చుకోవచ్చు. ఈ రంగానికి అనుబంధంగా ఉండే ఔషధ రంగంలోనూ కొలువులు కోకొల్లలు. ఎమ్మెస్సీ, ఫార్మసీ పూర్తి చేసినా ఆ జాబ్స్‌ మీవే.


బీమాలో ధీమాగా..

జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకున్నవారు ఇప్పటికీ దేశంలో కేవలం 28శాతం మంది మాత్రమే. 140 కోట్ల జన భారతావనిలో ఇంకెన్ని అవకాశాలు ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. బీమా ఆవశ్యకత నొక్కి చెప్పగలిగే మాట నేర్పు మన సొంతమైతే ఇందులో సంపాదనకు ఆకాశమే హద్దు. మామూలు అర్హతలతో మార్కెటింగ్‌, ఆఫీసు అసిస్టెంట్‌, సర్వేయర్‌, బీమా ఏజెంట్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌.. ఇలా రకరకాల పాత్రల్లో చేరిపోవచ్చు. రాబోయే పదేళ్లలో ఈ రంగంలో కనీసం ఐదున్నర లక్షల కొలువులకు అవకాశం ఉందట. ఉత్సాహం, విషయ పరిజ్ఞానం ఉంటే తక్కువ కాలంలోనే పదోన్నతుల నిచ్చెనలు ఎక్కొచ్చు.


సాంకేతికత.. కొలువుల వరం

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ రోజురోజుకీ కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ‘డిజిటల్‌ టాలెంట్‌ ఇన్‌సైట్‌’ నివేదిక ప్రకారం ఐటీ, టెక్నాలజీ రంగంలో ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో 2030 నాటికి ఐదుకోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. ఇందులో మామూలు టెక్నీషియన్‌ నుంచి సైంటిస్ట్‌ దాకా బోలెడన్ని హోదాలున్నాయి. పాలిటెక్నిక్‌, బీటెక్‌, పీహెచ్‌డీ.. ఉద్యోగ అర్హతలకు తగినట్టుగా జాబ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌కి అనుగుణంగా ఉండే కోర్సుల్ని మన అర్హతలకు అదనంగా జోడిస్తే.. ఈ ఉద్యోగాలు తేలిగ్గానే వశమవుతాయి. సామాజిక మాధ్యమాలు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల వాడకం పీక్‌లో ఉన్న నేపథ్యంలో నెటిజన్లను ఆకట్టుకునేలా ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌... కోర్సులు చేసిన వారికి పిలిచిమరీ ఉద్యోగాలిస్తున్నాయి కంపెనీలు.


భద్రతలో భద్రంగా..

గుండుసూది నుంచి నచ్చిన బండి దాకా అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. లక్షల రూపాయల లావాదేవీలు ఫోన్‌లో మునివేళ్లతో చేసేస్తున్నాం. ఇలాంటి వాళ్ల కోసమే హ్యాకర్లు పొంచి ఉంటారు. అదను చూసి సమాచారం, డబ్బులు దొంగిలిస్తున్నారు. వీళ్ల ఆటకట్టించేవారే ఎథికల్‌ హ్యాకర్లు, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌లు. పెద్దపెద్ద సంస్థలు, బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు ఎథికల్‌ హ్యాకర్లను నియమించుకుంటున్నాయి. సమాజానికి కొంచమైనా మేలు చేయాలనే స్పృహకి తోడు ఈ టెక్నాలజీపై పట్టు సాధిస్తే కొలువు కష్టమేం కాదు.


ఫ్యాషన్‌లో మీరే కింగ్‌

కరోనాతో కాస్త తగ్గినా, భవిష్యత్తులో బాగా గిరాకీ ఉండే రంగం ఫ్యాషన్‌. సొగసైన ఆకృతులు రూపొందించే డిజైనర్లకే కాదు.. ఫ్యాబ్రిక్‌ తయారు చేసేవారు, మార్కెటీర్లు, కుట్టుపని వాళ్లు, మోడళ్లు... అందరికీ కొలువులకు స్కోప్‌ ఉంటుంది. ఆభరణాల డిజైనింగ్‌, యాక్సెసరీలు నేర్పుగా డిజైన్‌ చేస్తే చెప్పలేనంత పేరు. ఈ రంగంపై ఆసక్తి ఉండాలే గానీ.. ఏదైనా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసినా ఫర్వాలేదు. డిగ్రీలు, పీజీలు అక్కర్లేదు.


బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో..

దేశంలో పది కోట్లమందికిపైగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం. భవిష్యత్తులో ఇది ఊపందుకునే అవకాశం ఉందంటారు మార్కెట్‌ నిపుణులు. గుప్తంగా సాగే ఈ ఖాతాల నిర్వహణ.. కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు.. ఇవన్నీ చూడటానికి బ్లాక్‌చైన్‌ టెక్నాలజీనే వాడుతున్నారు. ఇందులో పట్టు సాధిస్తే.. బ్లాక్‌చైన్‌ డెవలపర్‌, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌, క్వాలిటీ ఇంజినీర్‌.. అనే ఉద్యోగాల్లో స్థిరపడిపోవచ్చు.
* ఎలక్ట్రిక్‌, ఆటోమొబైల్‌: 2030 నాటికి భారతీయ రోడ్లమీద బ్యాటరీ కార్లే ఉండాలంటోంది ప్రభుత్వం. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో పని చేసేవారికి గిరాకీ.
* ఫిట్‌నెస్‌ రంగం: జనం ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో శిక్షకులు, నిర్వాహకులు, జిమ్‌ పరికరాల ఉత్పత్తిదారులకు బోలెడు అవకాశాలు.
* ఈ-కామర్స్‌: ఇప్పుడు అన్ని వస్తువులూ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇవ్వడం ఎక్కువవుతోంది. తక్కువ విద్యార్హతలున్నా ఈ రంగంలో టెక్నాలజీ నిపుణులు, మార్కెటింగ్‌, కొరియర్‌ సర్వీసుల్లో కుదురుకోవచ్చు.


అవకాశాలు అపారం

జీవితంలో వెలుగు చీకట్లు సహజం. ఈ ఏడాదిన్నరలో కొవిడ్‌ మనకు చాలా పాఠాలు నేర్పింది. ఆ గడ్డుకాలం మన జీవితాలకు అడ్డుగోడ కాదు.. కేవలం స్పీడ్‌బ్రేకర్‌లాంటిది మాత్రమే అని చెప్పింది. ఆ అనుభవాలతో చూస్తే 2022 కచ్చితంగా సానుకూలంగా ఉంటుంది. కొవిడ్‌తో టెక్నాలజీకి దగ్గరయ్యాం. ఈ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాలు ప్రత్యక్షంగా చూశాం. ఆన్‌లైన్‌ రిటైలింగ్‌లో అవకాశాలు అపారం. డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ పెరుగుతోంది. డేటా సైన్స్‌, డేటా ఎనలిటిక్స్‌పై పట్టుంటే ఆకాశమే హద్దు. ‘ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ’ ఈ కాలంలో కొత్తగా పుట్టుకొచ్చింది. ఆన్‌లైన్‌ ట్యూషన్లు పెరిగాయి. హెల్త్‌కేర్‌, ఫార్మా ఇప్పటికీ హాట్‌ సెక్టార్లే. వ్యాయామం, పోషకాహార రంగాలు, ఈ-కామర్స్‌ విస్తరిస్తున్నాయి. ఇవన్నీ కొత్త కొలువులు సృష్టించబోతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని