సంతోషాల పతంగులమవుదాం!

నేడే సంక్రాంతి పర్వదనం... మంచీ చెడులు మననం చేసుకునే సందర్భం! అందుకే.. ఓసారి వర్తమానంలో మునకేసి గతం జ్ఞాపకాల్లో తేలిపోదాం. వర్చువల్‌ స్నేహాలు వదలి.. మట్టి పరిమళాల్ని ఆస్వాదిద్దాం. చేదు అనుభవాల్ని భోగి మంటల్లో వేసి.. జిందగీకి కోటి ఆశల రంగవల్లులద్దుదాం.

Updated : 15 Jan 2022 05:43 IST

నేడే సంక్రాంతి పర్వదినం... మంచీ చెడులు మననం చేసుకునే సందర్భం! అందుకే.. ఓసారి వర్తమానంలో మునకేసి గతం జ్ఞాపకాల్లో తేలిపోదాం. వర్చువల్‌ స్నేహాలు వదలి.. మట్టి పరిమళాల్ని ఆస్వాదిద్దాం. చేదు అనుభవాల్ని భోగి మంటల్లో వేసి.. జిందగీకి కోటి ఆశల రంగవల్లులద్దుదాం. చికాకులు.. చిర్రుబుర్రులు.. వెతల్ని.. పతంగుల్లా గాల్లోకి ఎగరేద్దాం. ఏడాదంతా గుర్తుండేలా గుప్పెడు జ్ఞాపకాల్ని మూట కట్టుకుందాం. పనిలో పనిగా కొందరు తారలు పంచుకున్న పండగ అనుభూతుల్ని చదివేద్దాం.

‘జనరేషన్‌ జడ్‌’లకు పెద్దగా తెలియకపోవచ్చుగానీ.. మిలీనియల్స్‌, పాత తరానికి సంక్రాంతి సంబరాలెంత గొప్పవో ఎరుకే. సంప్రదాయాలకు నెలవైన పల్లెల్లో ఆ సందడి చూసి తీరాల్సిందే. వారం రోజుల ముందే ఆ హడావుడి మొదలయ్యేది. చదువుల కోసం ఊరు విడిచిన పోరగాళ్లు.. కెరీర్‌ కోసం కాంక్రీట్‌ అరణ్యాల్లో స్థిరపడ్డ ఉద్యోగులు.. పోలోమంటూ సొంతూళ్లకు బయల్దేరేవాళ్లు. అడుగు పెట్టీ పెట్టగానే ‘ఏరా.. ఎప్పుడొచ్చావ్‌?.. అంతా కులాసేనా?’ అంటూ బంధువులు, బాల్య స్నేహితుల పలకరింపులు మనసుని కట్టిపడేసేవి. అత్తయ్యలు, మామయ్యలు, బాబాయ్‌లు, పిన్ని, తాతయ్యలు అన్ని వరసల ఇరుగూపొరుగూ మాటలతో ఎక్కడో పారేసుకున్న మమకారాలు మళ్లీ దొరికినంత ఆనందమేసేది. సాయంత్రంవేళ ఫ్రెండ్స్‌తో అలా షికారుకెళ్తుంటే.. పొలం గట్ల వెంబడి తిరుగుతూ, పిల్ల కాలువల్లో మునకలేస్తూ చేసిన అల్లరి మదిలో మెదులుతుండేవి. కుటుంబమంతా ఒకచోట చేరి భోజనాలు చేస్తుంటే.. అమ్మ, అమ్మమ్మ, బామ్మలు కొసరికొసరి తినిపించిన పాత రోజులే గుర్తొచ్చేవి. పండగ స్పెషల్‌ అరిసెలు, బొబ్బట్లు, పులిహోర, పాయసాల్లో ఆప్యాయతలు కలిపి వడ్డిస్తుంటే కడుపు నిండిపోయేది.

మసకవేళ నులక మంచంపై మేను వాల్చి తాతయ్య, బామ్మలు చెప్పే కబుర్లు వింటుంటే మస్తిష్కంలోకి జీవిత పాఠాలు అలవోకగా ఎక్కేసేవి. ఈమధ్యలో కన్నెపిల్లల రంగవల్లులు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. హరిదాసు కీర్తనలు.. పతంగులు ఎగరేయడం.. ప్రతి క్షణం మురిపెమే. ఇవన్నీ అనుభవించే మనసే ఉంటే.. ఈ డిస్కోథెక్‌లు, పబ్‌లు.. పంచే ఆనందం ఏపాటి? సామాజిక మాధ్యమాలు, సెల్‌ఫోన్లు, గ్యాడ్జెట్లలో దొరికే కృత్రిమ ఆనందమైతే రేణువంతే. అందుకే.. ఈ రోజుని మనసారా ఆస్వాదిద్దాం. అన్నట్టు మనలాంటి మామూలు యూతే కాదు.. సెలెబ్రెటీలూ ఆ మమకారాల రుచి తెలిసినవారే.. అనుబంధాల బందీలే. ఈ పండగతో ఉన్న అనుబంధం చెప్పమంటే ఇలా మనసు విప్పారు.


ఈసారి చాలా ప్రత్యేకం

సంక్రాంతి అనగానే పండక్కి ఇచ్చే సెలవులే గుర్తొచ్చేవి. దీనికోసం ఏడాదంతా ఎదురుచూసేవాణ్ని. ఆ సమయంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యేవి. ఒక్కటీ వదలకుండా చూసేవాణ్ని. ఎన్‌ఐటీ వరంగల్‌లో చదువుతున్నప్పుడైతే సెలవులన్నీ అక్కడే గడిపేవాణ్ని. ఫ్రెండ్స్‌తో షికార్లు చేయడం, థియేటర్లన్నీ తిరగడం.. ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి పతంగులు ఎగరేయడం తప్పనిసరి. ఎవరిది ఎంత పైకి వెళ్తే అంత గొప్ప. ఊరెళ్తే బంధువులను కలవడం ఓ పనిగా పెట్టుకునేవాణ్ని. ఈసారి మాత్రం పండగ వెరీ స్పెషల్‌. కొత్త అల్లుడి హోదాలో వెళ్తున్నా. మర్యాదలు ఎలా ఉంటాయో చూడాలి. దీనికోసం రెండ్రోజుల షెడ్యూల్‌ బ్లాక్‌ చేసేశా. ఈ మూడ్రోజులు డైట్‌ ప్లాన్‌ పక్కన పెట్టేయాలని ఇంట్లో నుంచి ఆదేశాలొచ్చాయి. మొదటి సంక్రాంతి సంబరాలు ఘనంగా ఉండబోతున్నాయి.

- కార్తికేయ గుమ్మకొండ, నటుడు


మేం అదృష్టవంతులం

సంక్రాంతి పండగ అనగానే ఓవైపు సంతోషం, మరోవైపు బాధ కలుగుతుంటాయి. చిన్నప్పుడు ఎంజాయ్‌ చేసింది తలచుకుంటే మళ్లీ ఆ రోజులు రావు కదా అని బాధగా ఉంటుంది. పండక్కి మా ఊళ్లో ముగ్గుల పోటీ బాగా ఉండేది. అందరికన్నా నాదే బాగుండాలని చాలారోజుల నుంచి ప్రిపేర్‌ అయ్యేదాన్ని. రంగుల కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగితే తిట్టేవాళ్లు. అయినా వెనక్కి తగ్గేదాన్ని కాదు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి.. పువ్వులు చల్లి.. నాకన్నా ఎవరైనా బాగా వేశారా? అని ఊరంతా తిరిగేదాన్ని. మూడ్రోజులూ పెద్దపెద్ద చెట్లకు ఊయలలు కట్టుకొని ఊగేవాళ్లం. పండ్లు తెంపుకొని తినేవాళ్లం. పాటలు పాడుకునేవాళ్లం. పండగప్పుడు చిన్ననాటి స్నేహితులు, బంధువులంతా ఊరిలో కనిపిస్తుంటే కళ్లకింపుగా ఉండేది. కాలేజీ చదువు కోసం తిరుపతి వెళ్లినప్పట్నుంచి ఆ మురిపెం తగ్గిపోయింది. ఇప్పటివాళ్లకైతే పండగకన్నా సెల్‌ఫోన్‌, గ్యాడ్జెట్లే లోకమైపోతున్నాయి. పెద్దవాళ్లు సంపాదనలో పడి మట్టిపై మమకారం కోల్పోతున్నారు. ఈతరంతో పోల్చి చూసుకుంటే మేం చాలా అదృష్టవంతులం.

- మంగ్లీ, గాయని


అందరం కలుస్తాం

ఇంట్లో మొదటి నుంచీ పండగలకు ప్రాధాన్యం ఎక్కువ. భోగితో సందడి మొదలయ్యేది. పొద్దున నాలుగింటికే లేవడం.. భోగి మంటలు వేసుకోవడం మా కుటుంబానికంతటికీ అలవాటు. కుటుంబం, బంధువులంతా ఒక్కచోటికి చేరడంతో సంబరాలు ఊపందుకుంటాయి. సాయంత్రాలు ఇంట్లో వాళ్లమంతా కలిసి పతంగులు ఎగరవేస్తాం. మాది సినిమా కుటుంబం కావడంతో అందరం కలిసి సినిమాలు చూడటం మామూలే. మేం ఎక్కడున్నా పండక్కి కలవాలనుకోవడం ఓ నియమంగా పెట్టుకున్నాం. మాకైతే ప్రతి ఏడాదీ ఒక మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. వీలైతే నేను రాజమండ్రి వెళ్లిపోతుంటాను. స్నేహితులు, బంధువుల్ని కలిసి వస్తాను. గతేడాది ఇక్కడే గోల్ఫ్‌క్లబ్‌లో నిర్వహించిన కైట్‌ ఫెస్టివల్‌కి వెళ్లాం. చిన్న పిల్లాడిలా ఎంజాయ్‌ చేశాను. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. నా సినిమా ‘అతిథి దేవోభవ’తో మీ ముందుకొస్తున్నాను.

- ఆది సాయికుమార్‌, నటుడు


భోగి మంటలే గుర్తొస్తాయి

నాకు సంక్రాంతి పండగ అంటే ఇప్పటికీ భోగిమంటలే గుర్తొసాయి. చిన్నప్పుడు ఊరి మధ్యలో పెద్ద భోగి మంట వేసి దాని చుట్టూ కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరినప్పటి నుంచి సంక్రాంతి సెలవులు, పండగకి రావడం తక్కువైంది. వస్తే మాత్రం బంధువులు, స్నేహితులు అందరినీ కలుస్తుంటా. గతేడాది పండక్కి తాతయ్య వాళ్ల ఊరు నడింపల్లిలో గెట్‌ టుగెదర్‌ పార్టీలా ఏర్పాటు చేశారు. మా పక్క ఊరు గూడవల్లి వాళ్లతో కలిసి చందాలు వేసుకొని మరీ భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆ సమయంలో ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతూరికి వచ్చారు. అమ్మ పండగకి ప్రతిసారీ అరిసెలు, గారెలు చేస్తారు. వాటిని ఇష్టంగా తింటాను. నాకు ముగ్గులు వేయడం రాదుగానీ ఎవరైనా వేస్తుంటే చూస్తూ కూర్చుంటా. ఆ సమయంలో భలే ముచ్చటగా అనిపిస్తుంటుంది.

- జ్యోతిసురేఖ, విలువిద్యా క్రీడాకారిణి


సహకారం: సతీష్‌ దండవేణి, ఈటీవీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని