బాహుబలి విలుకాడు!

విల్లు వదిలిన బాణం ఒక లక్ష్యాన్ని ఛేదిస్తేనే గొప్ప..! ఒకే సమయంలో మూడు బాణాలు మూడు లక్ష్యాల్ని తాకితే...? దేశమంతా శెభాష్‌ అనకుండా ఉంటుందా?

Published : 19 Feb 2022 01:22 IST

విల్లు వదిలిన బాణం ఒక లక్ష్యాన్ని ఛేదిస్తేనే గొప్ప..! ఒకే సమయంలో మూడు బాణాలు మూడు లక్ష్యాల్ని తాకితే...? దేశమంతా శెభాష్‌ అనకుండా ఉంటుందా?

కడప యువకుడు వర్ది ఉదయ్‌కుమార్‌ అలాంటి అరుదైన ఫీట్‌ చేశాడు. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ న్యాయనిర్ణేతల్ని మెప్పించాడు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌ అయింది. ఇదొక్కటే కాదు.. తన అమ్ములపొదిలో పదుల సంఖ్యలో అంతర్జాతీయ, జాతీయ అవార్డులున్నాయి. ఈ ఆధునిక బాహుబలితో మాట  కలిపింది ఈతరం.

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ విల్లు ఎక్కుపెట్టి ‘నాద్వే మణిబంధం బహిర్ముఖం..ద్వజా’ అంటూ శత్రువులపైకి ఒకేసారి మూడు బాణాలు వరుసగా సంధిస్తాడు. సినిమాల్లోనే కాదు.. ఇలాంటి విన్యాసాలు అలవోకగా చేయడంలో ఉదయ్‌ దిట్ట. ఒకవైపు తన సత్తా చూపిస్తూనే అంతరించిపోతున్న ఈ ప్రాచీన భారతీయ యుద్ధ కళను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

దయ్‌కి సాహస విద్యలంటే మొదట్నుంచీ ఆసక్తి. డిగ్రీ పూర్తవగానే మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత భారతీయ యుద్ధ కళ ధనుర్విద్య గురించి తెలిసింది. అందులో పట్టు సాధించడానికి చెన్నై వెళ్లి మరీ ఆర్చరీలో తర్ఫీదు పొందాడు. స్థిర, చల, చలచల, ద్వయచల అనే నాలుగు విద్యలపై పట్టు సాధించినవాడే పరిపూర్ణమైన విలుకాడని ధనుర్వేదం చెబుతోంది. స్థిర అంటే కదలకుండా బాణం వేయడం. చల అంటే కదులుతూ బాణం సంధించడం. చలచల అంటే వస్తువు కదులుతుంటే బాణం వేయడం. ద]్వయచల అంటే విలుకాడు, వస్తువు రెండూ కదులుతున్నప్పుడు లక్ష్యాలు ఛేదించడం. కఠినంగా సాధన చేసి ఈ నాలుగింట్లో ఆరితేరాడు ఉదయ్‌. ఒకవైపు ఆర్చరీ పోటీల్లో పాల్గొంటూనే 2013లో కడపలో, 2017లో బెంగళూరులో తన తల్లి పేరు మీదుగా ‘విజయ ఆర్చరీ అకాడెమీ’ నెలకొల్పాడు ఉదయ్‌. ఇప్పటివరకు దాదాపు రెండువేలమంది ఔత్సాహికులకు శిక్షణనిచ్చాడు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు 70 వరకు బంగారు పతకాలు సాధించారు.

దుల సంఖ్యలో పతకాలు గెలిచినా.. ఉదయ్‌ ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ అనే రియాలిటీ షోలో మెరిసిన తర్వాతే అతడి ప్రతిభ దేశానికంతటికీ తెలిసింది. ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరుదైన విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఒక వ్యక్తిౖ తలకిరువైపులా బెలూన్లు అమర్చి ఒకేసారి గురి తప్పకుండా కొట్టడం.. కదులుతున్న లక్ష్యాలను రెప్పపాటులో ఛేదించడం.. ఇలాంటివి చూసి న్యాయనిర్ణేతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వీడియోలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. ధనుస్సుతో ఒకేసారి ఒకటి, రెండు, మూడు బాణాలు వేయగల ఉదయ్‌.. ఐదు బాణాలు వేసే విధంగా సాధన చేస్తున్నట్లు చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి లక్ష్యం ఎస్తోనియాలో జరగబోతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం.

- జి.మురళీమోహన్‌ గౌడ్‌, ఈటీవీ, కడప

గురి తప్పలేదు

* 2015లో ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్యం.

* 2018లో 15 నిమిషాల 15 సెకన్లలో 200 బాణాలు వేసి ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకున్నాడు.

* 2019లో న్యూజిలాండ్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం.

* విలువిద్యలో లెవల్‌-1, లెవల్‌-2, లెవల్‌-3 అని మూడు స్థాయిలు ఉంటాయి. లెవల్‌-2 కోచ్‌లు భారత్‌లో నలుగురే ఉండగా.. అందులో ఉదయ్‌ ఒకడు.

* 2021లో ట్రెడిషన్‌ ఆర్చరీ సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ఆర్చరీ పరీక్షలో రెండో స్థానం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని