మట్టి మలిచినమాణిక్యాలు..

మట్టి పిసికితే ఏమొస్తుంది? మహా అయితే పెట్టుబడి వెనక్కి వస్తుంది... పూర్తిగా పొలాన్నే నమ్ముకుంటే ఏమవుతుంది? అప్పులు మిగులుతాయి.. ఆపసోపాలు అదనం... సేద్యం అంటే చాలా చోట్ల ఇదే పరిస్థితి! కానీ కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే సాగు నుంచి సిరులు పండించొచ్చు అని నిరూపిస్తున్నారు ఇద్దరు యువ రైతులు...

Updated : 12 Mar 2022 04:38 IST

‘పట్టు’ వదల్లేదు


 

మట్టి పిసికితే ఏమొస్తుంది? మహా అయితే పెట్టుబడి వెనక్కి వస్తుంది... పూర్తిగా పొలాన్నే నమ్ముకుంటే ఏమవుతుంది? అప్పులు మిగులుతాయి.. ఆపసోపాలు అదనం... సేద్యం అంటే చాలా చోట్ల ఇదే పరిస్థితి! కానీ కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే సాగు నుంచి సిరులు పండించొచ్చు అని నిరూపిస్తున్నారు ఇద్దరు యువ రైతులు...

కుటుంబానికి పదెకరాల పొలం ఉంది. వరి, పత్తి, పసుపు, కంది, మొక్కజొన్న, వేరుశనగ.. ఎన్ని  పంటలు మార్చినా నష్టాలే! వీటికి భిన్నంగా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు మహబూబాబాద్‌ జిల్లా ధన్నసరి యువకుడు వేం పార్థసారథిరెడ్డి. తండ్రితో కలిసి పట్టుపురుగుల పెంపకంలోకి అడుగుపెట్టాడు. కొద్దిరోజుల్లోనే అప్పులు కనుమరుగై ఏడాదికి    రూ.40లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడు.
పార్థసారథి అన్నలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తనూ చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. తండ్రి మాత్రం ఉన్న భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసేవారు. కానీ ప్రతిసారీ నష్టాలే మిగిలేవి. ఇలాగైతే లాభం లేదనుకొని కొత్తదారిలో వెళ్లాలనుకున్నారు. ప్రత్యామ్నాయ సాగు కోసం పట్టుగూళ్ల పెంపకం మొదలుపెట్టారు. దీంట్లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన పార్థసారథి ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి పట్టుపురుగుల ఉత్పత్తి కేంద్రం ప్రారంభించారు.

రెండెకరాలతో మొదలు : 2011లో రెండెకరాలతో మొదలుపెట్టిన మల్బరీ తోట సాగును ప్రస్తుతం ఎనిమిది ఎకరాలకు పెంచారు. మొదటి ఐదేళ్లు బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు నుంచి గుడ్లను తెచ్చి ఇంటి దగ్గరే పురుగుల ఉత్పత్తి చేసేవారు. అవి ఏడెనిమిది రోజుల వయసువి కాగానే రేరింగ్‌  (పెద్ద పురుగుల కేంద్రం)లో పట్టుగూళ్ల పెంపకాన్ని చేపట్టారు. ఈ గూళ్లను జనగామ, హైదరాబాద్‌లతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో  విక్రయించేవారు. పట్టు గూళ్లే కాదు.. పట్టు పురుగుల ఉత్పత్తి కూడా చేసి తోటి రైతులకు విక్రయించాలని భావించాడు పార్థసారథి. దీనికోసం 2016లో కర్ణాటక మైసూర్‌లోని సెంట్రల్‌ సెరీకల్చర్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు నెలల పాటు శిక్షణ పొందాడు. తర్వాత సొంతంగా గుడ్లను కొనుగోలు చేసి, ఇంటి దగ్గరే పట్టు పురుగుల ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభించాడు. చుట్టుపక్కల రైతులు ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ఏడాదికి 24 బ్యాచ్‌ల పిల్లలు ఉత్పత్తి చేస్తున్నాడు. అన్ని ఖర్చులూ పోనూ ఏడాదికి రూ.40 లక్షల వరకు ఆదాయం మిగులుతోందంటున్నాడు పార్థసారధి. సంప్రదాయ పంటల్ని మాత్రమే నమ్ముకోకుండా.. కొంచెం సృజనాత్మకంగా ఆలోచించి పట్టుగూళ్ల పెంపకంలాంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా సంపాదించొచ్చు అంటున్నాడు.

- బొల్లం శేఖర్‌, మహబూబాబాద్‌


మొక్కల బ్రహ్మ

పంపరపనసకు అంటు కట్టి మూడు రకాల కాయలు కాయిస్తుంటాడు.. ఒక మొక్కకు ఐదురకాల పూలు పూయిస్తాడు.. విదేశాలూ తిరుగుతుంటాడు.. తనే తూర్పుగోదావరి జిల్లా కడియం యువకుడు చిలుకూరి నరేశ్‌. పెద్దగా చదువుకోకపోయినా ఉద్యాన శాస్త్రవేత్తలే మెచ్చేలా ప్రయోగాలు చేసే ఔత్సాహికుడు.

పూలమొక్కల నర్సరీ నిర్వహిస్తున్న తండ్రికి సాయం చేయడానికి ఏడో తరగతిలోనే చదువాపేశాడు నరేశ్‌. అప్పట్నుంచి పదహారేళ్లుగా తోటనే ప్రయోగశాలగా మార్చి ప్రయోగాలు చేస్తున్నాడు.  2009లో మొదటిసారి థాయ్‌లాండ్‌ వెళ్లినప్పుడు అక్కడ వైవిధ్యమైన పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు చూసి అచ్చెరువొందాడు. స్థానికంగా వాటిని పెంచాలనే ఆలోచన వచ్చింది. దాంతో కొన్ని మొక్కలు తెచ్చి స్థానిక జాతులతో అంట్లు కట్టడం మొదలుపెట్టాడు. అది విజయవంతమై మొక్క బతికితే పెద్దఎత్తున ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మేవాడు. తర్వాత మరో కొత్త వెరైటీపై దృష్టి పెట్టడం. ఆ ఆసక్తితోనే ఒక మొక్క నుంచి వేల మొక్కలు  తయారు చేశాడు. మొత్తమ్మీద 200 రకాలు విజయవంతం అయ్యాయంటున్నాడు. వీటిని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు దేశం నలుమూలలకు ఎగుమతి చేస్తున్నాడు. తను సేద్యంలోకి దిగినప్పుడు అరెకరం ఉన్న నర్సరీని 10 ఎకరాలకు విస్తరింపజేశాడు. తన దగ్గర రూ.వంద నుంచి రూ.లక్ష వరకు ధర పలికే వివిధ రకాల మొక్కలున్నాయి. దేశవాళీ నిమ్మకు థాయ్‌లాండ్‌ తీపి నారింజ..  దబ్బ చెట్టుకు ఎర్ర నిమ్మ.. మనదగ్గర దొరికే మూడు దళాల మారేడు మొక్కకు ఒకే పత్రముండే ఏకబిల్వం.. 16 ఆకులుండే మహాబిల్వం.. గింజలేని బత్తాయి.. లాంటివెన్నో సృష్టించాడు. ఈ రకం పండ్ల జాతులు వైవిధ్యంగా ఉండడమే కాకుండా.. రుచి, కాపు బాగుంటుంది. ఏడాది పొడవునా ఫలసాయం అందుతుంది. రోగనిరోధకత ఎక్కువగా ఉండే ఈ మొక్కలతో పంటలు పండిస్తే రైతులకు               మేలు జరుగుతుందంటాడు నరేశ్‌. వీటితో పాటు తూర్పు ఆసియా దేశాల్లో దొరికే 20 రకాల మామిడి మొక్కలు అతడి దగ్గరున్నాయి. పెద్దగా చదువుకోకపోయినా ఆసక్తి, పట్టుదలతో పెద్దపెద్ద శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడేలా కొత్త రకాలు సృష్టించాడీ చదువుకోని శాస్త్రవేత్త.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని