Updated : 26 Mar 2022 04:54 IST

మన్నన్‌ ప్రతిభకి మన్ననలు!

వంటగదిలో చెలరేగిన మంటలు ఆ కుర్రాడిలో ఆలోచన రగిలించాయి... తమ ప్రాంతంలో జరిగిన ఓ రైలు అగ్నిప్రమాదం ఏదైనా ఆవిష్కరణ చేయాలనే కసిని పెంచాయి... సీన్‌ కట్‌ చేస్తే.. మూడేళ్ల తర్వాత మనుషుల ప్రమేయం లేకుండానే మంటలార్పే యంత్రం రూపొందించాడు... దాన్ని వందకుపైగా వేదికలపై ప్రదర్శించాడు... పలువురి మెప్పు పొందుతూ పేటెంట్‌ కూడా దక్కించుకున్నాడు. ఆ యువ ఆవిష్కర్తే.. షేక్‌ మన్నన్‌.

న్నన్‌ది ప్రకాశం జిల్లా ఒంగోలు. బీటెక్‌ పూర్తి చేశాడు. ఏడోతరగతిలో ఉండగా ఓసారి ఇంట్లో ఆమ్లెట్‌ వేస్తున్నప్పుడు స్టవ్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ కిచెన్‌ను కమ్మేసింది. తను ఆందోళనకు గురవుతుంటే.. ‘భయమేం లేదు. ఎగ్జాస్ట్‌ గొట్టం ద్వారా పొగ బయటకి వెళ్తుంద’ని చెప్పింది వాళ్లమ్మ. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. అప్పట్నుంచే అగ్నిప్రమాదాల నివారణ చర్యల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలైంది. ప్రమాద సమయంలో నష్టం వాటిల్లకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై దృష్టి పెట్టాడు. ఈలోపు తను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో  అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆవిష్కరణ చేసే సమయం వచ్చిందని భావించాడు. మూడేళ్లు శ్రమించి అగ్ని కీలలు చెలరేగే సమయంలో మనుషుల ప్రమేయం లేకుండానే ఆ కీలల్ని ఆర్పేలా ఒక నమూనా యంత్రం రూపొందించాడు. దీనికి ‘అన్‌మ్యాన్డ్‌ ఫైర్‌ సప్రెషన్‌ సిస్టం’ అని పేరు పెట్టాడు. ఇందులో ఫ్రొఫెసర్‌ బి.మౌలిచంద్ర సహకారం ఉందంటున్నాడు.

పని చేస్తుందిలా..
ఇందులో సెన్సర్‌ సర్క్యూట్లు, రిలే సిస్టం, డెసిషన్‌ మేకింగ్‌, ఆడియో, సిగ్నల్‌ ఇంటిమేషన్‌ సిస్టం, చైన్‌ పుల్లింగ్‌ మెకానిజం, కార్బన్‌ ఫైర్‌ సిస్టం, జీఎస్‌ఎం సిస్టంతో కూడిన మూడు మోటార్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. వీటిని అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉండే చోట.. రైళ్లు, భవనాలు, పరిశ్రమలు, ఏవైనా సంస్థల్లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఈ పరికరాన్ని కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌తో కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ యంత్రం చుట్టుపక్కల ఎక్కడైనా షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా, అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. సెన్సర్లు ఐదు సెకన్లలోనే గుర్తించి ‘డెసిషన్‌ మేకింగ్‌ వ్యవస్థ’కు సమాచారం పంపిస్తాయి. మంటలను నియంత్రించే పౌడర్‌ను 30 సెకన్లలో అంతటా వెదజల్లుతాయి. ఈ నమూనా పరికరాన్ని మన్నన్‌ ఐఐటీ మద్రాసు, ట్రిపుల్‌ ఐటీ నూజివీడు, ఐఐటీ తిరుపతి లాంటి 126 సంస్థలు, వేదికలపై ప్రదర్శించాడు. జాతీయస్థాయి అవార్డులూ అందుకున్నాడు. కొన్నిసార్లు ఆయా వేదికలపై ప్రొఫెసర్లు, న్యాయనిర్ణేతలు లేవనెత్తిన సందేహాలు, సూచనలను స్వీకరించి.. యంత్రానికి మరిన్ని మెరుగులు అద్దేవాడు. 


ఇరవై ఏళ్లపాటు పేటెంట్‌

షేక్‌ మన్నన్‌ మూడేళ్ల కిందట ఈ ఆవిష్కరణపై పేటెంట్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. మూడు ఇంటర్వ్యూలకు హాజరై పనిచేసే విధానం వివరించాడు. దీన్ని ఆమోదించామనీ, ఇరవై ఏళ్ల పాటు పేటెంట్‌ హక్కులు ఉంటాయని చెన్నైలోని కేంద్ర భౌగోళిక గుర్తింపు కార్యాలయంలో నుంచి మన్నన్‌కి సమాచారం అందింది. ఈ నమూనా యంత్రం తయారీకి రూ.60 వేలు ఖర్చు అవుతుందంటున్నాడు. ఎవరైనా ఆర్థికంగా సహకరిస్తే.. పెద్దఎత్తున యంత్రాలు తయారు చేస్తానంటున్నాడు. భవనాలు, పరిశ్రమల్లో వీటిని ఉపయోగిస్తే.. ఆస్తి, ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతుందంటున్నాడు మన్నన్‌.

- టి.ప్రభాకర్‌, ఈనాడు డిజిటల్‌, ఒంగోలు


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని