తెలుగుపై మమకారం.. అవార్డుల సత్కారం!

మాతృభాషపై మమకారం చాలామందికి ఉంటుంది. కానీ దాని దుస్థితి మార్చడానికి కొంతమందే ఆచరణలోకి దిగుతారు. షణ్ముఖ సున్నపురాళ్ల వాళ్లలో ముందుంటాడు. తెలుగును, తెలుగు సాహితీవేత్తల చరిత్రను భావితరాలకు అందించడానికి లక్షల జీతమొచ్చే ఉద్యోగం మానేసి మరీ ఉద్యమం చేస్తున్నాడు. అతడి కృషికి పలు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. తాజాగా ప్రభుత్వ ‘ఉగాది పురస్కార్‌’ దక్కింది. ఈ భాషాభిమానితో ఈతరం మాట కలిపింది.

Updated : 30 Apr 2022 04:54 IST


మాతృభాషపై మమకారం చాలామందికి ఉంటుంది. కానీ దాని దుస్థితి మార్చడానికి కొంతమందే ఆచరణలోకి దిగుతారు. షణ్ముఖ సున్నపురాళ్ల వాళ్లలో ముందుంటాడు. తెలుగును, తెలుగు సాహితీవేత్తల చరిత్రను భావితరాలకు అందించడానికి లక్షల జీతమొచ్చే ఉద్యోగం మానేసి మరీ ఉద్యమం చేస్తున్నాడు. అతడి కృషికి పలు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. తాజాగా ప్రభుత్వ ‘ఉగాది పురస్కార్‌’ దక్కింది. ఈ భాషాభిమానితో ఈతరం మాట కలిపింది.

అనంతపురం జిల్లా కదిరి.. షణ్ముఖ సొంతూరు. తల్లిదండ్రులిద్దరూ తెలుగు ఉపాధ్యాయులే. ఇంట్లో సాహితీవేత్తల గురించి చర్చోపచర్చలు నడిచేవి. దీంతో సహజంగానే అతడికి తెలుగుపై మమకారం పెరిగింది. షణ్ముఖ నాన్న తెలుగు కవులను పిల్లలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కొందరు రచయితల ఫొటోలు డిజిటల్‌ ప్రింట్లు తీయించి తరగతి గదుల్లో పెట్టేవారు. వాళ్ల వివరాలు చెబుతుంటే విద్యార్థులు ఆసక్తిగా వినేవాళ్లు. దీంతో తెలుగులో ఉన్న అందరు కవులు, రచయితలు, సాహితీవేత్తల వివరాలు సేకరించాలనుకున్నారు. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే షణ్ముఖ ఆయనకి సహకరించేవాడు. సెలవుల్లో, ఖాళీగా ఉన్నప్పుడు ఇదే పనిపై ఉండేవాడు.

షణ్ముఖ బెంగళూరులో ఎంబీఏ చదివేటప్పుడు.. ఓసారి తరగతి గదిలో మహనీయుల సరసన ఒక రచయిత ఫొటో ఉండటం గమనించాడు. పక్క రాష్ట్రంలో భాషాభ్యున్నతికి కృషి చేసిన వారికి అంత గౌరవం దక్కుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో పూర్తి భిన్నంగా ఉంది. ఈ పరిస్థితి మారాలనుకునేవాడు. ఎంబీయే పూర్తయ్యాక రూ.లక్షకు పైగా జీతంతో ఓ బ్యాంకులో చేరాడు. కొన్నాళ్లయ్యాక మాతృభాషకి ఏమీ చేయలేకపోతున్నాననే అసంతృప్తి మొదలైంది. వెంటనే ఆ ఉద్యోగం మానేశాడు. సొంతూరు తిరిగొచ్చి జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లి సాహితీవేత్తల సమాచారం సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు. మరుగున పడిపోయిన ఎంతోమంది రచయితల గురించి ఈతరానికి పరిచయం చేసే బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు.

రుణం తీసుకొని మరీ..

సాహితీవేత్తల కుటుంబాలను కలవడం, గ్రంథాలయాలకు వెళ్లడం, విశ్వవిద్యాలయాలు తిరగడం, సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో చర్చించడం.. రచయితల సంఘాలు, ప్రభుత్వ సంస్థల సాయం తీసుకోవడం.. ఇలా అన్ని మార్గాల్లో సమాచారం సేకరించి ఆరువందలకు పైగా కవుల వివరాలు తీసుకున్నాడు. ఈ సమాచారంతో ‘తెలుగు సాహితీ మూర్తుల ముఖ చిత్రాలు రేపటి తరం కోసం’ అంటూ పుస్తకం అచ్చు వేయించాడు. వీరి జయంతి, వర్ధంతి, రచనలతో ‘తెలుగు సాహితీ కాలచక్రం’ అనే క్యాలెండర్‌ వేయించాడు. దీన్ని తరగతి గదిలో వేలాడదీసి, ఆయా రోజుల్లో వాళ్ల గురించి చర్చిస్తే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందంటున్నాడు. పదేళ్ల నుంచి ఈ సత్కార్యంలో ఉన్న ఈ ప్రయాణంలో ఎన్నో ఈసడింపులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. వ్యయప్రయాసలకోర్చాడు. ఖర్చుల కోసం వ్యక్తిగత రుణం తీసుకొని మరీ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు.

‘మాతృభాషలో చదవకుండానే డిగ్రీలు, పీజీలు పూర్తి చేసే దుస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఇదిలాగే కొనసాగితే తెలుగు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. మాతృభాషలో చదవని ఏ విద్యార్థీ భావవ్యక్తీకరణ సరిగా చేయలేడు. ఈ దుస్థితి రాకూడదనే నా ప్రయత్నం. ఇప్పటికి వేల స్కూళ్లు తిరిగా. ఉపాధ్యాయుల సహకారంతో 300పైగా స్కూళ్లలో మేం రూపొందించిన పుస్తకాలు, క్యాలెండర్లు అందజేశాం. ఈ ప్రయత్నంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ముందుకే వెళ్తా. తెలుగు భాష, రచయితల గురించి వివరిస్తూ.. నాలుగు వందల ఎపిసోడ్‌ల డిజిటల్‌ కంటెంట్‌ తయారు చేస్తున్నా. కనీసం ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలో చదువుకునేలా ప్రభుత్వం నిబంధనలు తేవాలి. రేపటి భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులే. వాళ్లే తరగతి గదుల్లో తెలుగు భాషాభిమానులను తయారు చేయాలి’.

గుర్తింపు

* గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం.

* తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ నుంచి ఉగాది పురస్కారం.

* ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ప్రత్యేక ప్రశంసలు.

- జూపూడి శ్రీలక్ష్మి,
ఈనాడు పాత్రికేయ పాఠశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని