శిఖరాలు చిన్నబోయేలా..

పర్వతం అధిరోహించడం ఆషామాషీ కాదు. ఎముకలు కొరికే చలి.. ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం.. పైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంటుంది. తీవ్ర అలసట. ఒక్కోసారి శ్వాస ఆడదు. వికారంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాల పాలవుతారు. ఇదికాక నలభై, యాభై కిలోల బరువు వీపున మోసుకుంటూ ఏటవాలుగా వెళ్లాలి. ఒక పర్వతం ఎక్కి, దిగి రావడానికి పదిహేను నుంచి నెలరోజుల సమయం పడుతుంది. పైగా ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంత...

Updated : 28 May 2022 11:56 IST

జీవితం, పర్వతారోహణ.. రెండూ ఒకలాంటివే!
ఎన్నో కష్టనష్టాలు అధిగమిస్తేనే అందమైన బతుకు...
కఠిన అవాంతరాలు దాటితేగానీ శిఖరం చేరలేం...
ముగ్గురు యువకులు ఆ సవాళ్లు దాటి శిఖరాలు అధిరోహించారు...
జీవితంలో గెలిచి జనమంతా అబ్బురపడే రికార్డులు నెలకొల్పారు...
సాహసోపేతమైన తమ ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు.

ర్వతం అధిరోహించడం ఆషామాషీ కాదు. ఎముకలు కొరికే చలి.. ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం.. పైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంటుంది. తీవ్ర అలసట. ఒక్కోసారి శ్వాస ఆడదు. వికారంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాల పాలవుతారు. ఇదికాక నలభై, యాభై కిలోల బరువు వీపున మోసుకుంటూ ఏటవాలుగా వెళ్లాలి. ఒక పర్వతం ఎక్కి, దిగి రావడానికి పదిహేను నుంచి నెలరోజుల సమయం పడుతుంది. పైగా ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంత చేసినా పెద్దగా గుర్తింపు రాదు. మరి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ, జీవితాన్నే పణంగా పెడుతూ ఎందుకిలా చేస్తారు? వాళ్లకేమైనా పిచ్చా? అంటే ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది.

హైదరాబాదీ నల్లవెల్లి అనురాగ్‌ది హై-ఫై జీవితం. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆరంకెల జీతం. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి యాపిల్‌ ఫోన్‌ తన చేతిలో ఉండాల్సిందే. వార్డ్‌రోబ్‌ నిండా బ్రాండెడ్‌ దుస్తులు. అలాంటి తన జీవితాన్ని ఒక్కసారిగా వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. మానసికంగా కుంగిపోయాడు. తను గడుపుతోంది కృత్రిమ జీవితం అని గ్రహించాడు. ప్రకృతి ఒడిలోనే అసలైన ఆనందం ఉందంటూ పర్వతారోహణ బాట పట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కుర్రాడు కంచడపు లక్ష్మణ్‌ది మరో గాథ. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పేదరికం వేధిస్తుండేది. ఎవరెస్ట్‌ని అధిరోహిస్తే ప్రపంచమంతా తనని గుర్తిస్తుందనుకున్నాడు. కరీంనగర్‌ యువకుడు మాదాసు రోహిత్‌ది ఇంకో కథ. చిన్నప్పట్నుంచీ మంచు అన్నా, తళతళా మెరిసే మంచుకొండలన్నా ఆసక్తి. సరదాగా పర్వతారోహణ ప్రారంభించాడు. అకస్మాత్తుగా తండ్రి కన్ను మూయడంతో.. అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించడమే ఆయనకిచ్చే నివాళిగా భావించి ముందుకెళ్తున్నాడు. ఎవరి కారణాలు వారివైనా.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే పర్వతాల్ని అధిరోహించడం సాధ్యం అన్నది సుస్పష్టం.


ఆక్సిజన్‌ లేకుండానే..

మెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే అనురాగ్‌ వ్యక్తిగత కారణాలతో మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. దీన్నుంచి బయటపడటానికి ఒంటరిగా, ప్రకృతి ఒడిలోకి వెళ్లాలి అనుకున్నాడు. ఇది నాలుగేళ్ల కిందటి సంగతి. కజిన్‌తో వారాంతాల్లో బోటింగ్‌, ట్రెక్కింగ్‌ ఏదో ఒకటి చేస్తూ గడిపేవాడు. ఇలాగే కాలిఫోర్నియాలో ఒక టూర్‌లో ఉన్నప్పుడు కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఎటూ కదల్లేని స్థితి. అక్కడే ఉన్న జంతువుల అభయారణ్యంలో పనిచేస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలోనే అనుభవజ్ఞుడైన ఒక పర్వతారోహకుడి పరిచయంతో అనురాగ్‌ యాత్ర మొదలైంది. ఆరునెలలు కఠిన శిక్షణ తీసుకొని 2021 మేలో ఉత్తర అమెరికాలో ఉన్న ఎత్తైన పర్వతం ‘మౌంట్‌ డెనాలి’ని అధిరోహించాడు. ఆ ఉత్సాహంతో హిమాలయాల్లోని 8,163 మీటర్ల ఎత్తైన ‘మనాస్లు’, 8167 మీటర్ల ‘ధవళగిరి’ని పూర్తి చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆక్సిజన్‌ లేకుండా, షెర్ఫా సాయం తీసుకోకుండానే ఆ పర్వత శిఖరాలు చేరడం అరుదైన రికార్డు. ఈ క్రమంలో సాటి పర్వతారోహకుడు చనిపోవడం కళ్లారా చూసినా మనోధైర్యం కోల్పోలేదు. ధవళగిరి నుంచి తిరిగి వస్తున్నప్పుడు తన బ్యాక్‌ప్యాక్‌, గ్లౌజులు కోల్పోయాడు. దాంతో గడ్డ కట్టించే చలి కారణంగా మూడు చేతి వేళ్లు పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం వాటికి చికిత్స చేయించుకుంటున్నాడు. ‘ఒకప్పుడు పెద్ద ఫ్లాట్‌, ఐఫోన్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. అన్నీ ఉండేవి. అయినా అసంతృప్తి. ఇప్పుడు అవేం లేవు. అయినా ఒక బ్యాక్‌ప్యాక్‌తో వెళ్లి ఒక పర్వతాన్ని ఎక్కినప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతోంది. ఇంతకు మించి ఏం కావాలి? అంటాడు అనురాగ్‌. అన్నట్టు తన ప్రతి యాత్రలో విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలు, పర్వతారోహణ శిక్షణ సంస్థలకు ఇస్తున్నాడు.


నాన్నకి ప్రేమతో..

రోహిత్‌కి నాన్న శ్రీనివాసరావు అంటే ప్రాణం. ఆయన పారాగేమ్స్‌లో దిట్ట, అర్జున అవార్డు గ్రహీత. ‘ఎప్పుడూ నలుగురిలో ఒకడిలా ఉండిపోవద్దు. నిన్ను నువ్వు నిరూపించుకో. కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు’ అనేవారు. ఆ స్ఫూర్తితో ట్రెక్కింగ్‌, మౌంటెనీరింగ్‌లో శిక్షణ పొంది 2018 నుంచి పర్వతారోహణ మొదలుపెట్టాడు. దురదృష్టవశాత్తు 2021లో శ్రీనివాసరావు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూశారు. అది రోహిత్‌కి పెద్ద దెబ్బ. తనని ఉన్నతస్థానంలో చూడాలని కోరుకున్న నాన్నకి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే అసలైన నివాళి అని భావించాడు. ఓ సంస్థలో డిజిటల్‌ మార్కెటింగ్‌లో అనలిస్ట్‌గా పని చేస్తూనే.. సీరియస్‌గా సాధన ప్రారంభించాడు. 2018 డిసెంబర్‌లో 3,810 మీటర్ల ఎత్తైన కేదారికాంత్‌ పర్వతం అధిరోహించాడు. ఆపై ‘పంగరిచుసల్లా’, ‘బ్రహ్మథాల్‌’, లద్దాఖ్‌లోని 6,240 మీటర్ల ఎత్తయిన ‘డీజో జోంగో’ పర్వతాలను జయించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 24న రోహిత్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి శిఖరానికి వెళ్లి రావాలని ప్రయత్నించినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా యాత్ర పూర్తి చేయలేక పోయాడు. అయినా మొక్కవోని లక్ష్యంతో త్వరలోనే మరో ప్రయత్నం చేస్తానంటున్నాడు రోహిత్‌.

- ఈటీవీ సహకారంతో..


కడగండ్లు దాటి..

క్ష్మణ్‌ నాన్న అటెండర్‌. 2014లో అనారోగ్యంతో చనిపోయారు. చిన్నప్పట్నుంచీ అన్నీ ఆర్థిక ఇబ్బందులే. ఈ విసుగులోంచి ప్రపంచమంతా తనని గుర్తించాలనే కసి మొదలైంది. ఆ సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం గురించి తెలిసింది. అప్పట్నుంచే అది లక్ష్మణ్‌ లక్ష్యంగా మారింది. స్థానికంగా ఉండే బయ్యే మునీంద్ర దగ్గర ప్రాథమిక శిక్షణ తీసుకున్నాడు. జిల్లా యువజనశాఖ ద్వారా ప్రయత్నించి డార్జిలింగ్‌లోని ‘హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ శిక్షణ కేంద్రం’ తర్ఫీదుకు ఎంపికయ్యాడు. అక్కడ ఒక నెలయ్యాక జమ్ముకశ్మీర్‌ పహల్గాంలోని ‘జవహర్‌ మౌంటెనింగ్‌ ఇనిస్టిట్యూట్‌’లో రాటు దేలాడు. ఆపై అతడి శిఖరాలు జయించే కార్యక్రమం మొదలైంది. 2017లో సిక్కింలోని రెనాక్‌ పర్వతం, 2018లో ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తైన కిలిమంజారో, 2019లో ఐరోపాలోని ఎత్తైన రష్యాలోని ఎల్‌బ్రస్‌ శిఖరం అధిరోహించాడు. 2021లో నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌క్యాంపు 5,364 మీటర్లు అధిరోహించి జాతీయ జెండా ఎగరేశాడు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎత్తైన పర్వతాలను జయించే లక్ష్యంతో ఉన్న లక్ష్మణ్‌ ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని అకాన్‌కాగువా పర్వత యాత్రకు సిద్ధమవుతున్నాడు. 

- జె.రమేశ్‌, నిడదవోలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని