యువ టెక్‌ విజేతలు!

టెక్కు చూపించడంలోనే కాదు.. టెక్నాలజీని ఒడిసిపట్టడంలోనూ కుర్రాళ్లు ముందే! సరదాల్లో చెలరేగిపోవడమే కాదు.. సృజనాత్మకత ప్రదర్శించడంలోనూ దిట్టలే!! ఆ నైపుణ్యాలే వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆ ప్రతిభకే అవార్డులు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాంటి యువతరంగాల పరిచయం ఈవారం.

Updated : 18 Jun 2022 08:27 IST

టెక్కు చూపించడంలోనే కాదు.. టెక్నాలజీని ఒడిసిపట్టడంలోనూ కుర్రాళ్లు ముందే! సరదాల్లో చెలరేగిపోవడమే కాదు.. సృజనాత్మకత ప్రదర్శించడంలోనూ దిట్టలే!! ఆ నైపుణ్యాలే వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆ ప్రతిభకే అవార్డులు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాంటి యువతరంగాల పరిచయం ఈవారం.

బ్యాటరీలతో రయ్‌రయ్‌

కాలుష్యం పెచ్చరిల్లుతోంది.. ఇంధన ధరలు పైపైకే వెళ్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు, ఆటోమొబైల్‌ కంపెనీలు విద్యుత్తు వాహనాల మంత్రం జపిస్తున్నాయి. దీన్ని ముందే పసిగట్టారు విజయనగరం జిల్లాలోని సెంచూరియన్‌ విశ్వ విద్యాలయ విద్యార్థులు. చదువుతూనే ఈ-వాహనాల తయారీలో భాగస్వాములవుతున్నారు. వాళ్లు రూపొందించిన వాహనాలు ఏకంగా ఇతర రాష్ట్రాలకే సరఫరా చేస్తున్నారు.
బాగా చదివామా.. పాసయ్యామా.. కొలువు కొట్టామా.. ఏ విద్యార్థికైనా ఇలాగే ఉంటుంది. టెక్కలి సెంచూరియన్‌ విద్యార్థులు అలా కాదు. పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యుత్తు వాహనాల తయారీ ప్రాజెక్టుల్లో భాగమవుతారు. కొత్త డిజైన్లు రూపొందిస్తారు. అందుబాటులో ఉన్న సాంకేతికతకి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతారు. దీనికి విశ్వవిద్యాలయం పూర్తి సహకారం ఉంటుంది. అలా వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ-రిక్షాలు, ఈ-వాహనాలు.. మామూలు నమూనా వాహనాలేం కాదు. ‘సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ ఎక్స్‌పర్టైజ్‌’ అనుమతి పొందినవి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందాయని ‘ఐకార్ట్‌’ ధ్రువీకరించినవి. డ్రైవరుతోపాటు నలుగురు కూర్చోగలిగే ఈ రిక్షాలు గంటకు 30కి.మీ.ల వేగంతో దూసుకెళ్తాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే.. డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. మొదటి విడతగా మూడువందల రిక్షాలను టాటా గ్రూపునకు సరఫరా చేశారు. కర్నాటక ప్రభుత్వ ఐటీఐలకు 150, ఒడిశా ‘మిషన్‌ శక్తి’ కార్యక్రమానికి 50 వాహనాలు అందించారు. సరుకు రవాణాకు సైతం ఉపయోగించ వచ్చు. ఐదు టన్నుల బరువు మోయగలుగుతాయి. ఒక్కో వాహనాన్ని రూ.1.70 లక్షలకు అందిస్తున్నారు.  ఈ ఆవిష్కర్తల్లో కంప్యూటర్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ విభాగ విద్యార్థులు భాగస్వాములయ్యారు. యువ అధ్యాపకులు పీఏ సన్నీ దయాల్‌, అరుణ్‌ మనోహర్‌, ఎస్‌.ఎస్‌.రావు, సాదత్‌ అలీలు.. విద్యార్థులకు ముందుండి మార్గదర్శనం చేస్తున్నారు.

- కె.మునీందర్‌, విజయనగరం


వ్యాపారం మీది.. విస్తరణ మాది

బుర్రకి మంచి ఆలోచన తట్టడం కాదు.. దాన్ని ఆచరణలో పెట్టి.. మార్కెటింగ్‌ మాయలు చేసి.. వ్యాపారాన్ని అమాంతం పెంచడం గొప్ప. చిన్న, మధ్యతరహా వ్యాపారస్తులకు ఇలాంటి బ్రాండింగ్‌ యాప్‌లు, విస్తరణ ప్రణాళికలు అందిస్తోంది ‘వజ్రో’. ఈ అంకురసంస్థ వ్యవస్థాపకులు నివిన్‌ సంతోష్‌, భాస్కర్‌ అగ్నీశ్వరన్‌, రఘురామన్‌ రామమూర్తిలు. వాళ్ల పనితీరుకు గుర్తింపు, పలు అవార్డులు సలాం కొట్టాయి.    

సంతోష్‌ తమిళనాడులోని పుదుక్కోట వాసి. ‘మన ఆలోచనలు, ఆచరణ వినూత్నంగా, సృజనాత్మకంగా ఉండాల’ని బీటెక్‌లో ఫ్రొఫెసర్లు చెప్పే మాటలకు బాగా ఆకర్షితుడయ్యాడు. కాలేజీలో ఉండగానే మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ‘స్టూడెంట్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌’కి ఎంపికయ్యాడు. ఈ సమయంలో ‘బ్లాక్‌బెర్రీ’ సహా.. పది కంపెనీలకు యాప్‌లు రూపొందించి ఇచ్చాడు. చదువు పూర్తవగానే భాస్కర్‌, రఘురామన్‌లతో కలిసి ‘వజ్రో’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు.
సాధారణంగా ఏదైనా కంపెనీ లేదా స్టార్టప్‌కి గుర్తింపు రావాలంటే ముందు మంచి ప్రచారం ఉండాలి. తర్వాత జనం నోళ్లలో నానేలా బ్రాండింగ్‌ రావాలి. వజ్రో ఇదే పని చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యాపారులు కోరుకున్న ఫీచర్స్‌తో యాప్స్‌ డిజైన్‌ చేసి ఇస్తుంటుంది. ఈ పనిని మరింత విస్తరించడానికి 2018లో షాపిఫై ఈ-కామర్స్‌ స్టోర్‌తో చేతులు కలిపారు. మొదట్లో వీళ్లు ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ లాంటి ఈ-కామర్స్‌ అప్లికేషన్లు సైతం తయారు చేశారు. ముగ్గురితో మొదలైన సంస్థ ఐదేళ్లలో గణనీయంగా ఎదిగింది. ఇప్పటివరకు 2,500 చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, సంస్థలకు మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ యాప్‌లు తయారు చేశారు. 115 దేశాల్లోని కంపెనీలు వీళ్ల ఉత్పత్తులు వినియోగిస్తుండటం విశేషం. ఈ జోరు, భవిష్యత్తు చూసి ఈమధ్యే ‘ఫైవ్‌ ఎల్మ్స్‌ క్యాపిటల్‌’ అనే సంస్థ రూ.67 కోట్లు పెట్టుబడులు పెట్టింది. సంస్థలో సానుకూలమైన పనితీరు, ఉద్యోగులకు కల్పించే అనువైన సౌకర్యాలకుగానూ తాజాగా ‘ది బ్రాండ్‌ స్టోరీ’ సంస్థ నిర్వహించిన ‘ది ఇండియన్‌ బ్రాండ్‌ అండ్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌-2022’లో ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ వర్క్‌ప్లేస్‌’ అవార్డు దక్కించుకుంది వజ్రో. ఏసియా వన్‌ మ్యాగజైన్‌ 40 ఏళ్లలోపు ప్రతిభావంతులు 40 మంది జాబితాలో భాస్కర్‌, రఘురామన్‌లు చోటు దక్కించుకున్నారు.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై


కాలుష్యానికి చెక్‌

బీటెక్‌ పూర్తైంది. కొలువులు పిలిచాయి. మంచి జీతం. అయినా పదుగురిలో ఒకరిలా కాకుండా.. పదిమందికి దారి చూపించేలా ఉండాలనుకున్నారు టెక్కలి మండలంలోని కె.కొత్తూరు చెందిన బత్తుల సందీప్‌, సంతోష్‌, ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపురకు చెందిన పవన్‌కుమార్‌. ‘క్వాలివన్‌’ స్టార్టప్‌ ప్రారంభించి ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో ఇంక్యుబేషన్‌ కేంద్రంలో శోధన ప్రారంభించారు. సమర్థవంతమైన ‘ఎమిషన్‌ మానిటరింగ్‌ మెషిన్‌’ రూపొందించి దేశం దృష్టిని ఆకర్షించారు.

పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం లెక్కగట్టడానికి, తనిఖీ చేయడానికి సాధారణంగా కొన్ని పరికరాలు ఉంటాయి. కానీ అందులో ఒక్కో పరికరం ఒక్కో వాయువును మాత్రమే గుర్తిస్తుంది. ఒకేసారి ఎక్కువ వాయువులను గుర్తించాలంటే భిన్న యంత్రాలు కావాలి. ఈ సమస్య పరిష్కారం కోసం రెండేళ్లు కష్టపడి నానో టెక్నాలజీ ఉపయోగించి పరికరం తయారు చేశారు ఈ ముగ్గురు.  దీంతో పరిశ్రమలు వెదజల్లే వాయువుల్లో ఒకే సమయంలో 15 రకాలైన వాటిని గుర్తించవచ్చు. ఏది ఎంత మోతాదులో వెలువడుతుందో కచ్చితంగా చెబుతుందీ యంత్రం. అంతర్జాలంతో అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో.. నివేదికలను సంబంధిత అధికారులు, మంత్రిత్వశాఖలకే నేరుగా పంపవచ్చు. దీంతో మధ్యలో జరిగే అవకతవకలు, అవినీతిని అరికట్టవచ్చు అంటోంది మిత్రబృందం. ఇది ‘నాసా’ ప్రశంసలు పొందింది. సూక్ష్మ పరిమాణం కారణంగా వీటిని అంతరిక్ష కేంద్రాల్లో సమర్థంగా ఉపయోగించవచ్చు అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకి ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ రూ.3లక్షలు సీడ్‌ ఫండ్‌గా అందించింది. దీంతోపాటు 2021లో స్విట్జర్లాండ్‌కు చెందిన నానోచిప్స్‌ తయారీ సంస్థ లిజెంటెక్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోటీల్లో మొదటి స్థానం దక్కించుకుంది. 2022 మార్చిలో కోల్‌కతాలో అమెరికా రాయబార కార్యాలయం, భువనేశ్వర్‌ ‘కిట్‌’ సంస్థ నిర్వహించిన ‘ఏరోథాన్‌’ పోటీల్లోనూ ఫస్ట్‌ ప్రైజ్‌ అందుకున్నారు. బిట్స్‌-పిలానీ, ఐఐఎస్‌సీ-బెంగళూరు పోటీల్లోనూ సత్తా చూపించి రూ.లక్షల ప్రోత్సాహకాలు గెల్చుకున్నారు. వీటిని భారీస్థాయిలో ఉత్పత్తి చేయడానికి జర్మనీలోని ‘ఫ్రాన్‌హోపర్‌’ విశ్వవిద్యాలయం.. ఈ విద్యార్థులతో చర్చలు జరుపుతోంది.

- వి.కీర్తికుమార్‌, టెక్కలి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని