ఓరుగల్లు నుంచి షాంఘై దాకా

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీ... బరిలో నిలిచింది హేమాహేమీలు, అనుభవజ్ఞులు...  పురస్కారం వరించింది మాత్రం మన తెలుగు కుర్రాడినే... తొలి సినిమాకే ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకున్న ఆ యువకుడే గజ్జల వేణుమాధవ్‌... కష్టాల కడలి దాటి ప్రపంచ వేదికపై మెరిసిన అతడి పయనం స్ఫూర్తిదాయకం...

Published : 20 Jul 2019 00:38 IST

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీ... బరిలో నిలిచింది హేమాహేమీలు, అనుభవజ్ఞులు...  పురస్కారం వరించింది మాత్రం మన తెలుగు కుర్రాడినే... తొలి సినిమాకే ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకున్న ఆ యువకుడే గజ్జల వేణుమాధవ్‌... కష్టాల కడలి దాటి ప్రపంచ వేదికపై మెరిసిన అతడి పయనం స్ఫూర్తిదాయకం.

మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన వేణు అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా, సవాళ్లు అడ్డొచ్చినా ఎంచుకున్న రంగంలో మనసుపెట్టి ముందుకెళ్తే విజయం దానంతట అదే వస్తుందని నిరూపించాడు.

వేణుది వరంగల్‌ జిల్లా రంగయ్యపల్లి. చిన్నప్పుడే నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడింది వాళ్ల కుటుంబం. ఇన్ని ఇబ్బందుల్లోనూ వేణు బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. పదోతరగతిలో ఉండగా ఆ వ్యాపకం సినిమాటోగ్రఫీ పైకి మళ్లింది. దానికీ ఓ కారణముంది. ఓసారి వాళ్ల ఊరి గుడిపై డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు ఒక సినిమా బృందం వచ్చింది. అందులో సినిమాటోగ్రాఫర్‌ పి.జి.విందాతో పరిచయం వేణుని కొత్త బాట పట్టించింది. కెమెరాతో దృశ్యాలు షూట్‌ చేస్తుంటే అబ్బురంగా చూసేవాడు. ఆ ఇష్టానికి తోడు విందా సలహాతో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఫైన్‌ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో చేరాడు. విజయవంతంగా కోర్సు పూర్తయ్యాక కోల్‌కతాలోని ప్రఖ్యాత సినీరంగ బోధనాసంస్థ ‘సత్యజిత్‌రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో మోషన్‌ ఫొటోగ్రఫీలో పీజీ డిప్లొమాలో చేరాడు. అక్కడే ఫొటోగ్రఫీపై పట్టు సంపాదించాడు. కోర్సు ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగంగా అతడు తీసిన డాక్యుమెంటరీలు, లఘుచిత్రాల్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేవాడు. అవి నచ్చి దిల్లీ కేంద్రంగా నడిచే సంస్థ ఇతడికి ఓ ప్రాజెక్టు అప్పగించింది. దాంట్లో భాగంగా ఇరవై రోజుల పాటు గంగా నది జన్మస్థలమైన హిమాలయాల నుంచి బంగాళాఖాతంలో కలిసేదాకా ప్రయాణించి దాన్ని తన కెమెరాలో హృద్యంగా బధించి డాక్యుమెంటరీకి రూపమిచ్చాడు వేణు. అది మంచి పేరు తెచ్చింది.

భలే మంచి అవకాశం
శిక్షణ పూర్తయ్యాక ఆర్థికంగా స్థిరపడేందుకు పలు ఫ్యాషన్‌ షోలు, ఐపీఎల్‌తో పాటు ఇతర సంస్థలకు ప్రచార చిత్రాల చిత్రీకరణ చేసేవాడు. ఈ సమయంలోనే తన పాత మిత్రుడు మేఘాలయా రాష్ట్రానికి చెందిన డామినిక్‌ సంగ్మా ఓ సినిమా తీస్తున్నట్టు చెప్పాడు. వేణుపై నమ్మకంతో దీనికి సినిమాటోగ్రఫీ చేయమని కోరాడు. ఆ చిత్రం ‘మా అమా’ (కలవరింత). ఇదో నిజ జీవిత గాథ. ఓ తండ్రి మనసులోని బాధ, అతడికి భార్యపై ఉన్న ప్రేమను వివరించడం ఈ సినిమా కథాంశం. పూర్తి ఎమోషనల్‌ డ్రామాతో తక్కువ బడ్జెట్‌లో.. మేఘాలయాలోని కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దీంట్లో ప్రతి ఫ్రేమ్‌ని మనసుపెట్టి బంధించాడు వేణు. సినిమాటోగ్రాఫరే అయినా అక్కడి భాష, ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోవడం కోసం ముందే మేఘాలయకి చేరుకొని పదిరోజుల పాటు మకాం వేశాడు. అతడి కష్టం, చేస్తున్న పనిపై అంతులేని ప్రేమ ఊరికే పోలేదు. సినిమాకు ఫొటోగ్రఫీనే హైలైట్‌ కావడంతో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘ఏషియన్‌ న్యూ టాలెంట్‌’ పురస్కారం’ అందుకున్నాడు. దీంతోపాటు తెలుగులో మంచి విజయం సాధించిన జెర్సీ చిత్రానికి రెండో కెమెరామన్‌గా పని చేశాడు.

- ఇట్ట అభిసాయి, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని