యోగాతో సిక్స్‌ప్యాక్‌

యోగా, ధ్యానం అంటే.. ఏవో కొన్ని ఆసనాలు వేయడం.. కళ్లు మూసుకుని కూర్చోవడం.. అంతేగా! అనుకుంటారు కొందరు యువత. కానీ, యోగా ఒక పరిపూర్ణమైన ఫిట్‌నెస్‌ మంత్రా అని.. శ్రద్ధగా సాధన చేస్తే సిక్స్‌ప్యాక్‌ చేయొచ్చని చెబుతున్నాడీ యువ యోగా గురు. చెప్పడమే కాదు..

Published : 17 Aug 2019 00:32 IST

యువ యోగా గురు మయూర్‌ కార్తీక్‌
ఫిట్‌నెట్‌ మంత్రా!

యోగా, ధ్యానం అంటే.. ఏవో కొన్ని ఆసనాలు వేయడం.. కళ్లు మూసుకుని కూర్చోవడం.. అంతేగా! అనుకుంటారు కొందరు యువత. కానీ, యోగా ఒక పరిపూర్ణమైన ఫిట్‌నెస్‌ మంత్రా అని.. శ్రద్ధగా సాధన చేస్తే సిక్స్‌ప్యాక్‌ చేయొచ్చని చెబుతున్నాడీ యువ యోగా గురు. చెప్పడమే కాదు.. తనే చేసి చూపాడు. ఫిట్‌నెస్‌ అంటే కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉండడం మాత్రమే కాదు. మానసికంగానూ ఉల్లాసంగా ఉన్నప్పుడే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్టు అని యువతకి ప్రేరణ కలిగిస్తున్నాడు. శ్రీశ్రీ రవిశంకర్‌ స్థాపించిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’లో యోగా ట్రైనర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ని ‘ఈతరం’ పలకరిస్తే తన ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు.. యోగాతో ఫిట్‌నెస్‌ ఫార్ములాల్ని వివరించాడిలా...
‘మాది తమిళనాడు. మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఫస్టే.. స్కూల్‌లో మొదటి ర్యాంకు, కాలేజీ చదువులోనూ అంతే. ఉన్నత చదువులో మంచి కాలేజీలో సీటు. అక్కడికెళ్లాక తెలిసింది ఇక్కడున్న వారంతా టాపర్లే అని. అప్పుడు అసలైన పోటీ మొదలయ్యింది. గెలుపోటములంటే ఎలా ఉంటాయో తెలిసింది. బీటెక్‌ తర్వాత అందరి కుర్రాళ్ల మాదిరే ఏం చేయాలా? అని ఆలోచిస్తూ... ఫిల్మ్‌ మేకింగ్‌ వైపు వెళ్లా. కొన్ని షార్ట్‌ఫిల్మ్‌లు తీశా. ఆ జర్నీ సాగుతున్నప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఓడినప్పుడు నాతో నాకు పోరాటం. ఏం చేయాలో తోచేది కాదు. బాధ, కోపం ఇలా ఒకదానిపై ఒకటి. ఆ సమయంలో నాకు దొరికిన ఆయుధం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా. సాధనతో నాలో మరో కొత్త వ్యక్తి పుట్టినట్టు అనిపించింది. అప్పటివరకూ చదివిన చదువు.. నేర్చుకున్న కళలు.. అన్నీ యోగాతో పరిపూర్ణమయ్యాయి. నేనేంటి? నాకు కావాల్సిందేంటి?.. ఇలా అన్ని ప్రశ్నలకూ సమాధానం ఆధ్యాత్మిక చింతనలోనే దొరికాయి. అందుకే.. చదువు తర్వాత వచ్చిన ఉన్నతమైన ఉద్యోగాలు నాకు గొప్పగా అనిపించలేదు. యోగానే నా జర్నీగా స్వీకరించా. నేను వెతుక్కున్న కిక్‌ ప్రపంచానికి పంచాలని నిర్ణయించుకున్నా. అప్పటినుంచి గురూజీ స్థాపించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో భాగమయ్యా. శ్రీశ్రీ స్కూల్‌ ఆఫ్‌ యోగాలో యోగా తరగతులు నిర్వహిస్తున్నా. ఇప్పటివరకూ సుమారుగా 1500మందికి పైగా  యోగా టీచర్స్‌ని తయారుచేశా. దేశవిదేశాలు పర్యటిస్తూ యోగాలో శిక్షణనిస్తున్నా. ఇప్పుడూ అదే బాధ్యత నిమిత్తం హైదరాబాద్‌ వచ్చా.
వచ్చినవి ఎప్పటికీ పోవు..
జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తడం ద్వారా మనకి కావాల్సిన ఫిట్‌నెస్‌ని సాధించొచ్చు. అయితే, నిత్యం క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తూనే ఉండాలి. మానేస్తే.. శరీరం అసాధారణంగా గతి తప్పుతుంది. మీరు ఊహించని రీతిలో బరువు పెరుగుతారు. సూర్యనమస్కారాలు, ఆసనాలు చేయటం ద్వారా ఒకసారి సిక్స్‌ప్యాక్‌ వచ్చిందంటే తిరిగిపోదు. ఎందుకంటే.. సాధారణ పద్ధతిలో శరీరం దృఢత్వాన్ని పొందుతుంది. ఆధ్యాత్మిక చింతనతో చేసే సాధన ఏదైనా.. శరీరం వేగంగా స్పందిస్తుంది. మంచి ఫిట్‌నెస్‌నూ సంపాదించొచ్చు. కేవలం ఫిట్‌నెస్‌ మాత్రమే కాకుండా మన శరీరంపై పట్టు సంపాదించగలుగుతాం. ఒక్కొక్కరి శారీరక స్వభావాన్ని బట్టి వారి శరీర ఎదుగుదల ఉంటుంది. ఒకరికి సిక్స్‌ప్యాక్‌ రావటానికి సంవత్సరం పట్టొచ్చు లేదా రెండేళ్లు పట్టొచ్చు. నిజానికి బరువు తగ్గడం కూడా మన శ్వాసపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవడమూ అవసరమే. ఎక్కువ పోషకవిలువలున్న శాకాహారం తీసుకొని కూడా మంచి ఫిట్‌నెస్‌ సాధించొచ్చు. ఆకలేసినపుడు తప్పక ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తగ్గించి పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న కాయగూరలు ఎక్కువగా తీసుకోవటం ఉత్తమం. మైదా, షుగర్‌ తదితర ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

భావోద్వేగాల నియంత్రణలో...
నేటి తరానికి బాధ్యతలు పెరిగిపోయాయి. మల్టీ టాస్కింగ్‌ చేయాలి. నెగ్గుకురావాలి. దీంతో అధిక ఒత్తిడి, కోపం, చిరాకు వంటివి ఒక్కోసారి వారిని డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. దాని పర్యవసానాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నింటినీ జయించాలంటే? యోగా ఓ మంచి ఔషధం. శారీరకంగానే కాకుండా మానసికంగానూ అనేక లాభాలున్నాయి. మీకో విషయం తెలుసా? మన ఒత్తిడిని నియంత్రించేది మన శ్వాసే. మనం ఆనందంగా ఉన్నపుడు, బాధలో ఉన్నప్పుడు మన శ్వాసలో మార్పు ఉంటుంది. మన ఎమోషన్స్‌కి, మన శ్వాసకి అనులోమ సంబంధం ఉంటుంది. కోపం, బాధ వంటివి కంట్రోల్‌ చేయాలంటే శ్వాసని అదుపులో ఉంచుకోగలగాలి. దానికి ధ్యానం, యోగా ప్రధాన మార్గం.

చూస్తుండగానే..
యువతకి యోగాపై ఉన్న దృక్కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. శారీరకంగా ఒనగూడే ప్రయోజనాల్ని ప్రాక్టికల్‌గా తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు నేనూ ఇలా తెలుసుకున్నా. బరువు చాలా ఎక్కువ ఉండేవాడిని. తగ్గాలని చాలా రోజులు జిమ్‌కెళ్లాను. జిమ్‌లో చాలా కసరత్తులు చేశా. సిక్స్‌ప్యాక్‌ చేయాలనుకున్నా. ప్రయత్నించా కానీ, ఏదో తెలియని ఒత్తిడి వెంటాడేది. కాస్తో కూస్తో బరువు తగ్గినా కిక్‌ దొరికేది కాదు. యోగాలోకి వచ్చాక ఫిట్‌నెస్‌పై నాకున్న అభిప్రాయం పూర్తి భిన్నంగా మారింది. నా శరీరాన్ని అర్థం చేసుకోగలిగా. రోజూ సూర్యనమస్కారాలు, యోగాసనాలు (నౌకాసనం, ఉత్థాన పాదాసనం) చేశా. శరీరం, మనసుని ఒకే తాటిపైకి తెచ్చి చేసే సాధన అది. మునుపెన్నడూ లేని విధంగా శరీరాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టా. అనవసర కొవ్వు రోజురోజుకీ కరగడం నాకు తెలిసేది. మజిల్‌ ఫిట్‌నెస్‌ పెరిగింది. చూస్తుండగానే సిక్స్‌ప్యాక్‌ వచ్చేసింది. రోజుకి 108 సూర్యనమస్కారాలు చేశాను. అలా రెండున్నర నెలల్లో జిమ్‌కి వెళ్లి ఎలా అవ్వాలనుకున్నానో అలానే మారా.

- నిఖిల్‌ గెంటిల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని