జంటగా గెలిచారు

ఇలాగే సాగింది నాలుగేళ్లుగా మల్లేశ్వరరావు, శ్రావణిల కాపురం. ఇద్దరూ సబ్జెక్టుపై చర్చించుకుంటూ... ప్రశ్నలు ఒకరేస్తే... సమాధానాలు ఒకరిస్తూ. ఒకరు చదువుకున్న అంశాలను... ఇంకొకరికి వివరిస్తూ పట్టుబట్టి చదివారు. ఎఫ్‌ఆర్‌వో(ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌) పరీక్షలో విజయం సాధించి ఉద్యోగాలు పొందారు.

Published : 13 Oct 2018 13:18 IST

ఏమండీ చూస్తూ కూర్చోకపోతే.. పిల్లలకు స్కూల్‌డ్రెస్‌ వేయొచ్చు కదా. 
- నేనేం ఖాళీగా లేను...

 

కూలర్‌ రిపేర్‌ చేస్తున్నా... అయినా నాకు పనిచెప్పడం తప్ప నీకు వేరే పనే లేదు. 
సాధారణంగా కుటుంబంలో భార్యభర్తల రోజూవారీ గొడవ.

ఏమండి... ఆర్టికల్‌ 48ఎ ప్రకారం రాజ్యం అడవులను, జంతువులను రక్షించాలి కదా! 
- అవును శ్రావణి... అంతే కాదు. ఆర్టికల్‌ 51ఎ జీ ప్రకారం ప్రజలూ అడవులు, జంతువులను సంరక్షించాల్సి ఉంది.

ఈ దంపతుల మధ్య రోజూ ఇలాంటి చర్చలే.

జంటగా గెలిచారు

...ఇలాగే సాగింది నాలుగేళ్లుగా మల్లేశ్వరరావు, శ్రావణిల కాపురం. ఇద్దరూ సబ్జెక్టుపై చర్చించుకుంటూ... ప్రశ్నలు ఒకరేస్తే... సమాధానాలు ఒకరిస్తూ. ఒకరు చదువుకున్న అంశాలను... ఇంకొకరికి వివరిస్తూ పట్టుబట్టి చదివారు. ఎఫ్‌ఆర్‌వో(ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌) పరీక్షలో విజయం సాధించి ఉద్యోగాలు పొందారు.

 

 పోటీ పరీక్షలకు అనుగుణంగా మెటీరియల్‌ సిద్ధం చేసుకొని సాధన మొదలుపెట్టాం. ప్రతి టాపిక్‌ను పూర్తిగా చదువుతూ నోట్స్‌ రాసుకున్నాం. కలిసి చదివితే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఏం చదవాలి? ఎంత చదవాలి? వేటి మీద మాట్లాడుకోవాలి. అని ప్రణాళిక ప్రకారం నడిచాం. ప్రస్తుతం గ్రూప్‌-1లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.

ఉదయాన్నే ఇద్దరం కలిసి వంట చేసేకునే వాళ్లం. చెరికొంచెం బాక్స్‌ల్లో వేసుకొని లైబ్రరీకి వెళ్లేవాళ్లం. అక్కడే సాయంత్రం వరకూ చదివేవాళ్లం. రాత్రి ఇంటికొచ్చి... తను చదివింది నాకు... నేను చదివింది తనకు చెప్పుకొనేవాళ్లం. కొంచెం నెగిటివ్‌ థాట్స్‌ వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉండి ముందుకు సాగిపోయేవాళ్లం.

సాధన సాగిందిలా.. 
ప్రతిరోజూ లైబ్రరీకి వెళ్లి ఎన్నో పోటీపరీక్షల పుస్తకాలు చదివేవారు దంపతులు. రోజుకు 15 గంటలపాటు కష్టపడ్డారు. ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకున్నారు. సబ్జెక్టులపై గంటలు, గంటలు చర్చించుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు రావడం ఆలస్యమైనా ఓపికతో వేచి చూశారు. పట్టు విడవలేదు. 2016లో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-2 పరీక్షలో దంపతులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి 1:3 నిష్పత్తిలో ఇంటర్య్వూకు ఎంపికయ్యారు. వివిధ కారణాలతో అది ఆలస్యమవుతోంది. అయినా ఆ దంపతులిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకొని రెట్టించిన పట్టుదలతో ముందుకు సాగారు. 2017 నవంబర్‌లో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ఎఫ్‌ఆర్‌వో పరీక్షలో సత్తా చాటారు. 2018 అక్టోబరు 6న విడుదలైన ఎఫ్‌ఆర్‌వో ఫలితాల్లో భర్త నాగమల్లేశ్వరరావు 432 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించాడు. భార్య శ్రావణీ 377మార్కులు పొందారు. ఇద్దరూ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు సంపాదించారు.

జంటగా గెలిచారు

మూడుముళ్లతో ఒక్కటైన ఆ దంపతులు జీవితాలనే కాదు.. పుస్తకాలను పంచుకున్నారు. భావాలనే కాదు... జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. కలిసి బతకడమే కాదు... కలిసి చదివారు. కలిసి గెలిచారు. దీనికోసమే పిల్లలనే వద్దనుకున్నారు. ప్రైవేటు ఉద్యోగాలతో, అరకొర జీతాలతో నెట్టుకురావడం కష్టమని, మంచి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాకే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. నాలుగేళ్లు అకుంఠిత దీక్షతో కష్టపడి చదివి... అనుకున్నది సాధించారు. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారు.

మల్లేశ్వరరావుది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం. నిరుపేద కుటుంబం. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమెస్ట్రీ చదివిన మల్లేశ్వరరావు తొలుత హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశాడు. అక్కడిస్తున్న జీతంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఒక రోజు సెలవు కోసం అతను పడిన కష్టం... కళ్లు తెరిపించింది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభించాడు. 2013లో స్వగ్రామానికి చెందిన శ్రావణితో వివాహం అయింది. 2014 వరకూ ప్రైవేటు ఉద్యోగమే చేశాడు. ఇక లాభం లేదనుకొని దానికి రాజీనామా చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కార్యాచరణ మొదలు పెట్టారు. పిల్లలు పుడితే లక్ష్యం సాధించడంలో వెనుకబడే అవకాశం ఉందని భావించి వద్దనుకున్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌లైబ్రరీ దగ్గరలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని భార్యాభర్తలిద్దరూ ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. మల్లేశ్వరరావు అన్నయ్య  రమేష్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తారు. ఆయన నెలకు పంపే రూ.10,000 వేలతో కాలం గడుపుతూ... లక్ష్యంతో చదివారు. కుటుంబసభ్యులూ ఎంతో సహకరించడంతో ఎలాంటి ఆటంకాలు రాలేదు.

- కె.వి.మాధవరావు, అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు